ఫిట్‌నెస్ ప్రేమికుల జిమ్ కష్టాలు తీర్చే 'జిమర్'

అడ్వాన్సులతో పనిలేదుఆ రోజే బుక్ చేసుకునే అవకాశంఫిట్ నెస్ ప్రేమికులకు వరం

ఫిట్‌నెస్ ప్రేమికుల జిమ్ కష్టాలు తీర్చే 'జిమర్'

Thursday September 03, 2015,

5 min Read

ఒకప్పటితో పోలిస్తే...ఇటీవలి కాలంలో ఆరోగ్యంపైనా...ఫిట్‌నెస్ పైనా ప్రజల్లో శ్రద్ధ బాగా పెరిగింది. చాలా మంది కాలరీ కౌంటర్లు, మొబైల్ యాప్‌లతో పాటు...ఇతర విధానాల్లో తాము తీసుకునే ఆహారాన్ని, ఫిట్‌నెస్ ను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటున్నారు. ఆడా, మగా, చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ జిమ్‌లకు పరుగులు తీస్తున్నారు. తమది జిమ్ బాడీ అని చెప్పుకోవటం గొప్పగా భావిస్తున్నారు. అలా నగర సంస్కృతిలో జిమ్ ఓ భాగమైపోయింది.

జిమ్ లో చేరిన కొత్తల్లో అందరూ ఎంతో ఆసక్తిగా, శ్రద్ధగా వ్యాయామాలు చేస్తారు. ముందు అనుకున్నట్టుగా రోజులో ఓ సమయం కేటాయించుకుని కొన్ని రోజులు క్రమం తప్పకుండా వెళ్తారు. తర్వాతే మొదలవుతుంది అసలు కథ. షెడ్యూల్ కుదరకపోవటమో, తీరిక లేని పనుల మధ్య సమయం చిక్కకపోవటమో, బద్దకమో...ఇలా కారణం ఏదైతేనేం...కొన్నిరోజులకు వెళ్లటం ఆపేస్తారు. ఫిట్ నెస్ తో ఉండాలన్న ధ్యాస ఉన్నప్పటికీ....సమయం సర్దుబాటు చేసుకోలేక ఎగనామం పెడతారు. అన్ని నగరాలు, పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. జిమ్ లో చేరిన వారిలో చివరిదాకా వ్యాయామాలు కొనసాగించేవాళ్లు 30శాతం మించి ఉండరని నిర్వాహకులు చెబుతున్నారు.

రోజు వారీ కార్యకలాపాల్లో నిరంతరం చోటు చేసుకునే మార్పులే సభ్యులు జిమ్ కు సమయం కేటాయించలేకపోవటానికి ప్రధాన కారణం. అందుకే అడ్వాన్సులు చెల్లించి, పేరు నమోదు చేసుకుని, కొన్నాళ్లు వ్యాయామం చేసిన తరువాత కూడా మధ్యలోనే వదిలేస్తుంటారు. దీంతో నెలకో, రెండు నెలలకో కలిపి చెల్లించిన అడ్వాన్సు వృథా అయిపోతుంది. దీనివల్ల జిమ్ నిర్వాహకులకు ఆ నెలకు లాభం కలిగినా....దీర్ఘకాలికంగా వాళ్లకూ నష్టమే. చెల్లించిన అడ్వాన్సు మేరకు సభ్యులు వచ్చి కసరత్తులు పూర్తిచేస్తే...ఆసక్తి కొద్దీ తరువాత కూడా వ్యాయామాల్ని కొనసాగిస్తారు. కానీ ఇలా మధ్యలోనే వదిలేస్తే....జిమ్ నిర్వాహకులు మళ్లీ కొత్త సభ్యుల కోసం ఎదురుచూడాల్సిందే.

తమకు అనుకూలంగా ఉంటుందో లేదో తెలియనప్పుడు జిమ్‌కు అంతంత పెద్ద మొత్తం అడ్వాన్సుగా చెల్లించటం ఎందుకు ? నెల రోజుల గురించి ఒకేసారి ఆలోచించే ముందు ఏ రోజుకారోజు వీలు కుదిరినప్పుడు జిమ్ కు వెళ్లే పరిస్థితి ఉంటే... ? అలాగే అడ్వాన్సుతో పనిలేకుండా...ఏ రోజు కారోజో లేదా ముందు రోజో జిమ్లో సమయాన్ని బుక్ చేసుకుని గంట ప్రాతిపదికన చెల్లించే వీలుంటే.....? మధ్యలో వదిలేయటం అనేది ఉండకపోవచ్చు . కానీ మన దగ్గర ఇలాంటి అవకాశం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకే జిమర్ అనే స్టార్టప్ బెంగళూరులో ప్రారంభమయింది.

యాప్ ద్వారా జిమ్

జిమర్ అనేది మొబైల్ అప్లికేషన్. ఈ యాప్ మొబైల్స్ తో పాటు కంప్యూటర్ లోనూ ఉపయోగించుకోవచ్చు. మొబైల్, కంప్యూటర్లలో బ్రౌజింగ్ ద్వారా యాప్‌ను వాడుకోవచ్చు. దీని ద్వారా మనం కోరుకున్నప్పుడు, మనకు వీలు కుదిరినప్పుడు జిమ్‌లో సమయాన్ని బుక్ చేసుకోవచ్చు. అనేక జిమ్ లు పరిశీలించిన తరువాత జిమర్ కొన్ని జిమ్ లతో ఒప్పందం కుదుర్చుకుంది. వాటి వివరాలు యాప్‌లో ఉంటాయి. యూజర్లు ఆ రోజు కానీ, తర్వాత రోజు కానీ దగ్గరగా ఉన్న సెంటర్లో తమకు వీలుకుదిరే సమయాన్ని గంటల ప్రాతిపదికన బుక్ చేసుకోవచ్చు. ఈ బుకింగ్ లన్నీ జిమర్ ద్వారానే జరుగుతాయి. ఇందుకోసం జిమర్ కొంత డబ్బు తీసుకుంటుంది. జిమ్‌లు గంటకు తీసుకునే మొత్తాన్ని, కల్పించే సౌకర్యాలను బట్టి వాటిని వర్గీకరిస్తారు. ప్రస్తుతం గంటకు రూ. 140, రూ.180, రూ. 220 తీసుకునే జిమ్ లను మూడు రకాలుగా వర్గీకరించారు.

జిమ‌ర్‌

జిమ‌ర్‌


జిమర్‌ను శ్రీకాంత్ బాలకుమార్, కుషాల్ కుమార్ ప్రారంభించారు. కుషాల్ లండన్ కు చెందిన ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ కాగా, 27 ఏళ్ల శ్రీకాంత్ ది సాంకేతిక నేపథ్యం. ప్రస్తుతం వారి బృందంలో 8మంది సభ్యులున్నారు. కార్యకలాపాల విభాగానికి మెజ్ షేక్ నేతృత్వం వహిస్తుంటే... వ్యాపారాభివృద్ధి విభాగం వ్యవహారాలకు సురే్ష్ గోపాలకృష్ణన్, వరప్రసాద్ చూస్తున్నారు. ప్రజాసంబంధాల విభాగాన్ని మునీరా మిత్ర పర్యవేక్షిస్తున్నారు. ఈ బృందానికి మరో ఇద్దరి భాగస్వాముల మద్దతు, ఎగ్జిక్యూటివ్‌లతో ఒప్పందం కూడా ఉంది.

రోజూ ఒకే సమయానికి జిమ్‌కు వెళ్లటంలో ఎదురవుతున్న సమస్యలు, అనుభవాల గురించి శ్రీకాంత్, ఆయన స్నేహితులు పిచ్చాపాటీగా మాట్లాడుకుంటున్న సమయంలో జిమర్ ఆలోచన వచ్చింది. అడ్వాన్సులు చెల్లించి మెంబర్ షిప్ తీసుకునే పనిలేకుండా...గంటల ప్రాతిపదికన జిమ్ సౌకర్యం కల్పించాలనే దిశగా వారి ఆలోచనలు సాగటం... జిమర్ ఏర్పాటుకు దారితీసింది.

జిమ‌ర్ వ్య‌వ‌స్థాప‌కులు

జిమ‌ర్ వ్య‌వ‌స్థాప‌కులు


180 ఫిట్నెస్ సెంటర్లతో ఒప్పందం

బెంగళూరు వ్యాప్తంగా 180 జిమ్ లతో జిమర్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకోవటం చాలా తేలిగ్గా జరిగిపోయిందని మెజ్ చెప్పారు. జిమ్‌లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య డ్రాప్ అవుట్లు. చేరేందుకు ప్రజలు బాగానే ఆసక్తి చూపిస్తారు. కానీ చేరిన వారిలో 60 నుంచి 70 శాతం తిరిగి రారు. జిమర్ వల్ల ఈ సమస్య పరిష్కారమవుతుంది కాబట్టి.... తమతో ఒప్పందం కుదుర్చుకోవటంపై సంతోషంగా ఉన్నాయని మెజ్ తెలిపారు.

మొబైల్ యాప్, కంప్యూటర్లు, మొబైల్ బ్రౌజర్ల ద్వారా సేవలందిస్తున్న జిమర్ మూడింటికి సమాన ప్రాధాన్యం కల్పిస్తోంది. మొబైల్ ఫోన్లలో యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకోలేని వారితో పాటు...కంప్యూటర్లు ఉపయోగించేవారికి , యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న వారితో సమానంగా తన సేవలందించాలన్నది జిమర్ లక్ష్యం.

జిమ్‌లు తమ బుకింగ్లను నిర్వహించుకోటానికి , లావాదేవీలు నియంత్రించుకోటానికి పార్ట్‌నర్ ఫేసింగ్ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. అనుకోకుండా జిమ్‌ను ఒకరోజు మూయాల్సివచ్చిన సందర్భాల్లోనూ, కొన్ని అత్యవసర పరిస్థితుల్లోనూ....జిమ్ సమాచారం ఈ యాప్ ద్వారా యూజర్లకు తెలియజేయవచ్చు. వినియోగదారులు జిమ్ సెషన్లు ప్రారంభించటానికి కూడా పార్ట్ నర్ ఫేసింగ్ యాప్ ను ఉపయోగించుకుంటున్నారు. యూజర్ కు ఇచ్చిన వెరిఫికేషన్ కోడ్ ను యాప్ లో ఎంటర్ చేస్తే...సెషన్ ప్రారంభమయినట్టు.

జిమర్ వ్యవస్థీకృత అభివృద్ధిపై దృష్టిపెడుతోంది. మౌత్ పబ్లిసిటీ, యాప్ రిఫరల్స్ ద్వారా విస్తరించాలని భావిస్తోంది. చిన్న స్థాయిలో పెట్టుబడులు పెట్టటం మొదలుపెట్టి, అనుకున్న లక్ష్యాలు చేరుకున్న తరువాత...భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులతో విస్తరించాలని జిమర్ నిర్వాహకులు భావిస్తున్నారు. యూజర్లు చెల్లించే డబ్బులు ప్రస్తుతం పేటీఎమ్, పే యు మనీ ద్వారా జిమర్ ఖాతాలోకి వెళ్తున్నాయి. త్వరలో ఇందుకోసం ఓ సొంత యాప్ ను డెవలప్ చేసుకోవాలని జిమర్ ప్రణాళికలు వేస్తోంది.

జిమ్ ల స‌మాచారం

జిమ్ ల స‌మాచారం


జిమర్ ద్వారా ప్రస్తుతం యూజర్లు జిమ్ సమయాన్ని.. ఆ రోజు కానీ, ఓ రోజు ముందు కానీ మాత్రమే బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. బుకింగ్ లను క్యాన్సిల్ చేసుకోటానికి, ఆ సమయాన్ని ఇతరులకు కేటాయించటానికి అవకాశం లేదు. జిమ్ నిర్వాహకులతో నేరుగా మాట్లాడుకుని ఇద్దరికీ ఇష్టమైతే సమయాన్ని మార్చుకోవచ్చు.

జిమర్ భావన, దాని కార్యకలాపాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మొబైల్ అప్లికేషన్ లోనూ, మొబైల్, కంప్యూటర్ బ్రౌజర్ల లోనూ జిమర్ ఏకరూపత పాటిస్తోంది. మొబైల్ యాప్ ద్వారా పరిపూర్ణమైన సేవలు అందుతున్నప్పటికీ...అన్ని రకాల అవకాశాలను యూజర్లకు అందుబాటులో ఉంచటం జిమర్ ప్రత్యేకత.

టైం బుక్ చేసుకోవ‌టం

టైం బుక్ చేసుకోవ‌టం


జిమర్ సేవలను అనేక నగరాలకు విస్తరిస్తే...మరింత లాభదాయకంగా ఉంటుంది. యూజర్లు ఇతర నగరాలలో కూడా ఫిట్ నెస్ సేవలు ఉపయోగించుకోవచ్చు. జిమ్ లను సంప్రదించాల్సిన నంబర్లు, గూగుల్ మ్యాప్ ద్వారా అడ్రస్, జిమ్ తెరిచి ఉంచే వేళలు, కల్పించే సౌకర్యాలు వంటి సమాచారాన్ని కూడా జిమర్ అందిస్తోంది.

మరిన్ని మెరుగైన సేవలు

ప్రస్తుతం వినియోగదారులు ఒక రోజు ముందు లేదా ఆ రోజు జిమ్ సమయాన్ని బుక్ చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. ముందుగా ప్రణాళిక చేసుకోలేని వారి కోసం ఉద్దేశించి ఏర్పాటు చేసిన స్టార్టప్ కావటంతో నిర్వాహకులు ఈ విధానాన్ని అనుసరించారు. భవిష్యత్తులో మూడు రోజుల ముందుగా, అంతకంటే ఎక్కువగా బుక్ చేసుకునే అవకాశం కల్పించాలని జిమర్ భావిస్తోంది.

యూజర్లు జిమ్ ను ఎంచుకోటానికి ప్రస్తుతం ఈ యాప్ ఎలాంటి ఇమేజ్ లు కానీ, దృశ్యాలు కానీ అందుబాటులో ఉంచటం లేదు. అయితే త్వరలో జిమ్ చిత్రాలు ఉంచేందుకు జిమర్ ఏర్పాట్లు చేస్తోంది. జిమర్ తో ఒప్పందం కుదుర్చుకున్న ప్రతి జిమ్ కు సంబంధించి మూడు చిత్రాలను యాప్ లో ఉంచనుంది.

కార్యరూపం దాల్చిన మంచి ఆలోచన జిమర్. వినియోగదారుల నిజమైన సమస్యను ఈ యాప్ తీరుస్తోంది. తీరిక లేని పనుల మధ్య ఫిట్ నెస్ తో ఉండటం చాలా కష్టమైన విషయం. ఫిట్ నెస్ పై అంతకంతకూ శ్రద్ధ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సభ్యత్వం బాధ లేకుండా జిమ్ కు వెళ్లే వీలు కలగటం చాలా అనుకూలమైన విషయం. జిమర్ తమ యాప్ కు ఇంకెన్ని మెరుగులు దిద్దుతుందో...మరెంత ఆకర్షణీయంగామారుస్తుందో చూడాలి.