ఒక్క పాస్ తీసుకో.. ఎక్కడైనా జిమ్ చేసుకో ! హోబియక్స్ వినూత్న ఆలోచన

హైదరాబాద్ లో వినూత్న ప్రయోగంబోరింగ్ వ్యాయామశాలలకు భిన్నంగా ఫిట్ నెస్ అవకాశాలువ్యాయామంతో పాటు స్విమింగ్, యోగా, డ్యాన్స్.... నేర్చుకునే అవకాశంఒకే పాస్ తో 1000 ఫిట్ నెస్ సెంటర్లకు వెళ్లే అవకాశం

ఒక్క పాస్ తీసుకో.. ఎక్కడైనా జిమ్ చేసుకో ! హోబియక్స్ వినూత్న ఆలోచన

Wednesday September 02, 2015,

4 min Read

హైదరాబాద్‌కి చెందిన రజిత్ జైన్ అనే యువకుడికి జిమ్‌లో వార్షిక సభ్యత్వం పూర్తయిపోయింది. కాని మరో ఏడాదికి అదే జిమ్ లో కొనసాగడం అతడికి ఇష్టం లేదు. ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకున్నాడు.

‘‘నాకు అక్కడ సాధన అంతగా నచ్చలేదు. ఏడాది మొత్తానికి మెంబర్‌షిప్ ఉన్నప్పటికీ నేను మహా అయితే మొత్తం రెండు నెలలు మాత్రమే జిమ్‌ను ఉపయోగించుకున్నాను. అక్కడ ట్రైనర్స్ శిక్షణ కొద్ది వారాలు మాత్రమే బాగున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత వాళ్లు నన్ను వ్యక్తిగత ట్రైనర్లుగా నియమించుకోమని ఒత్తిడి చేశారు. అప్పటి నుంచి నేను ఒక విషయం గమనించాను, వాళ్లు మనల్ని పట్టించుకోవడం మానేస్తారు. మనకి కూడా వర్కవుట్స్ మీద ఆసక్తి పోతుంది.’’ అంటూ తన అనుభవాన్ని వెల్లడించారు రజిత్.

image


తనకు ప్రేరణ కలిగించేది, తనకు అందుబాటు ధరలో ఏమైనా లభిస్తుందేమోనని రజిత్ వెతకడం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని కొండాపూర్ పరిసర ప్రాంతాల్లోని జిమ్స్‌కి సంబంధించిన విచారణ పత్రాలను జస్ట్ డయిల్ ద్వారా నింపడం మొదలుపెట్టారు. కొన్ని గంటల తర్వాత ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. హోబియక్స్ ఫౌండర్ జతిన్ బన్సాల్ చేసిన కాల్ అది. నెలవారీ ఫిట్‌నెస్ పాస్ గురించి వివరించారు. దాని ద్వారా నగరంలోని 120 ఫిట్ నెస్ సెంటర్లలో ప్రవేశించవచ్చని తెలియజేశారు. కొని నిమిషాలు మాట్లాడి రజిత్‌ను ఒప్పించగలిగారు.

‘‘కేవలం 2,000 రూపాయలకే నేను చాలా పరికరాల మీద సాధన చేసే అవకాశం పొందాను. నాకు నిజంగానే చాలా సంతోషమనిపించింది, నేను ఈ పాస్ వినియోగించుకుని చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాను. జుంబా, స్విమింగ్ లాంటివి కూడా.’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు రజిత్.

యురేకా క్షణాలు

రెండేళ్ల క్రితం జతిన్ కూడా రజిత్ లాగే ఇబ్బంది పడ్డారు. పెద్ద మొత్తంలో డబ్బును జిమ్ వార్షిక సభ్యత్వం కోసం ఖర్చుపెట్టడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే ఆ ఒప్పందం వల్ల న్యాయం జరగదని అతడికి తెలుసు.

‘‘యూఎస్‌లో క్లాస్ పాస్ గురించి నేను విన్నాను, కానీ అక్కడ కూడా కొన్ని నిబంధలు ఉన్నాయి. ఒక వినియోగదారుడు ఒక ఫిట్నెస్ సెంటర్‌కి వెళ్లగలిగే సంఖ్య పరిమితంగా ఉంటుంది. అటువంటి విధానాలు మన దేశంలో ఫిట్‌నెస్ సమస్యలకి పనికిరావని నాకు అనిపించింది, దాంతో నేను దీనినో ప్రాజెక్టుగా తీసుకోవాలని భావించాను’’ అంటున్నారు జతిన్.

ఈ స్టార్టప్ పుట్టింది ఇలా...

2014 వరకు జతిన్ ఐఐటి-ఢిల్లీ పట్టభద్రుడు, అతడి స్నేహితుడు అభిషేక్ భక్తియా, ఎన్ ఐటి కురుక్షేత్ర పట్టభద్రుడు. ఈ ఇద్దరూ కలిసి పార్ట్ టైమ్‌గా హోబియక్స్ మీద పనిచేయడం మొదలుపెట్టారు. తమ ముందున్న అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తాము పూర్తి స్థాయిలో పనిచేయక తప్పదని ఆ ఇద్దరూ నిర్ణయించుకున్నారు.

వాళ్లద్దరూ జిమ్ డైనమిక్స్ మీద పరిశోధనలు చేశారు. వాళ్లు ఒక సంఖ్యను లక్ష్యంగా నిర్దేశించుకుని, దానిని చేరుకోగలిగితే తమకు మరింత నమ్మకం కలగుతుందని భావించారు. కేవలం 25 నుంచి 30 శాతం మెంబర్లు వార్షిక సభ్యత్వం తీసుకునే సయమంలో తమ రెగ్యులర్ క్లాస్‌ల నుంచి ఇతర మార్గాలవైపు చూస్తున్నారు. ఒక జిమ్ ఫ్లోర్‌లో 1,000 మందికి సరిపడా చోటు ఉంటే అక్కడ దాదాపు 4,000 మందికి సభ్యత్వాలు అమ్మేస్తున్నారు. బహుశా అందుకే చాలా మంది ఇతర మార్గాల కోసం వెతుకుతున్నారు.

‘‘ సభ్యత్వం తీసుకన్న ఒక వ్యక్తి ఏ మార్పులేని ఒకే రకమైన సాధనను మళ్లీ మళ్లీ చేయాలంటే విసుగు పుడుతుంది. ఫలితంగా అతడిలో ఆసక్తి తగ్గిపోతుంది. ఇక్కడే సమస్య అంతా మొదలవుతోంది. కాబట్టి ఈ అనుభవాలన్నింటినీ సరదాగా మార్చాలని మేం అలోచించాం. ప్రతి రోజూ కొత్త కొత్త అంశాలను సాధన చేస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపుకునేలా చేయాలని భావించాం’’ అంటూ తన మనస్సులో ఆలోచనల్ని బయటపెట్టారు జతిన్.

కొన్ని నెలల గడిచాకా ఆ ఇద్దరూ తమ తమ ఉద్యోగాలను వదిలేసి హోబియక్స్ ను జూన్ 19 న ప్రారంభించారు.

హోబియక్స్ ప్రత్యేకత ఏంటి ?

సభ్యత్వం పొందిన తర్వాత, వినియోగదారులు తమకు నచ్చిన క్లాసుల్ని ఆన్ లైన్ లో బుక్ చేసుకోగలరు. బుకింగ్ కన్ఫర్మ కాగానే ఆ క్లాసులు నిర్వహించే ఇన్‌స్ట్రక్టర్‌కి, అతడి తరగతికి హాజరుకాబోతున్న వ్యక్తుల వివరాలు టెస్ట్ మెసేజ్ రూపంలో చేరుతుంది. తరగతులు ప్రారంభించే ఐదు నిమిషాల ముందు వరకు కూడా బుకింగ్ చేసుకోవచ్చు. సభ్యులు తమ పాస్‌లు ఉపయోగించుకుని యోగా, జిమ్ తదితర అంశాల నుంచి స్విమ్మింగ్, డ్యాన్స్, బాక్సింగ్ వంటి అనేక అంశాలను ఎంపిక చేసుకోవచ్చు.

‘‘ ప్రతిరోజు ఒకే రకమైన వ్యాయమాలను చేయడం విసుగుపుట్టిస్తుంది. దాంతో చాలా మంది వ్యాయామం చేయడం మానేస్తున్నారు. ఇటువంటి వారి కోసం ఇదో మంచి అవకాశం, ప్రతి రోజు ఉత్సాహభరితమైన సరికొత్త వ్యాయామాలు చేయవచ్చు ’’ అంటున్నారు జతిన్. తమ దగ్గర ఒక్కరోజు పాస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు.

మార్కెట్ మరియు పోటీ

2015 నాటి లెక్కల ప్రకారం భారతీయ ఫిట్ నెస్ మార్కట్ విలువ 100 బిలియన్ రూపాయలు. ఇది ఏటేటా 20 నుంచి 25 శాతం మేరకు పెరుగుతుందని అంచనా. ఈ మార్కెట్ లో చాలా ఎక్కువ భాగం వ్యవస్థీకృతం కాకపోవడం, టర్నవుట్ రేట్ బాగా తక్కువగా ఉండటం, వినియోగదారులను నిలుపుకోవడంలో విఫలమవ్వడం వంటి సమస్యలు ఈ రంగాన్ని వేధిస్తున్నాయి .

ఈ విభాగంలో చాలా తక్కువ స్టార్టప్ లు ప్రవేశిస్తున్నాయ. ఫిట్‌నెస్ పాపా, జిమ్మర్, జిమ్ పిక్ వంటి వాళ్లు నెలలో చాలా పరిమితంగా అంటే మూడు లేదా నలుగు సార్లు మాత్రమే ఫిట్ నెస్ స్టూడియోలకు వెళ్లే అవకాశం కలిపిస్తూ పాస్ లు అమ్ముతున్నారు.

నేడు.. రేపు

కేవలం ఒక్క నెలలోనే హైదరాబాద్లో హోబియక్స్ ద్వారా 700 క్లాసులు బుక్ అయ్యాయి. ‘‘ భవిష్యత్తు చాలా అద్భుతంగా కనిపిస్తోంది, ఎందుకంటే మేం హైదారాబాద్ లో అతిపెద్ద, అత్యుత్తమమైన నెట్ వర్క్ ను ఏర్పాటు చేయబోతున్నాం, వచ్చే మూడు నెలల్లో మేం ఇతర మెట్రోలకు కూడా విస్తరిస్తాం. మేం జీవన శైలి సభ్యత్వ పాస్ లను కూడా అందిచనున్నాం. పోర్టల్ ద్వారా మ్యూజిక్, ఫొటోగ్రఫీ, కుకింగ్, డ్యాన్స్ వంటి వాటికి కూడా తరగతుల్ని బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తాం’’ అంటున్నారు జతిన్.