రాజస్థాన్ ఎడారిలో జలసిరులు కురిపించిన శ్రీరామ్ 

0

రాజస్థాన్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది చిక్కటి ఎడారి. ఎటు చూసినా ఇసుక మేటలే తప్ప నీటి జాడ లేని శతాబ్దాల దుర్భిక్షం రాజస్థాన్‌ది. తలాపున 32 నదులు ప్రవహిస్తున్నా గుక్కెడు నీటికోసం అక్కడి జనం అల్లాడిపోతారు. వాన నీటిని ఒడిసిపట్టే నిర్మాణాలు లేకపోవటమే రాజస్థాన్‌లో కరువుకు కారణం. అలాంటి రాష్ట్రం తెలంగాణకు చెందిన వెదిరె శ్రీరామ్ నేతృత్వంలో కొత్త చరిత్ర లిఖించింది. కాకతీయుల స్ఫూర్తితో వాన నీటిని ఒడిసిపట్టే కార్యక్రమానికి విజయవంతంగా అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఫలితంగా రాజస్థాన్‌లో ఇప్పుడు కరువు లేదు. గుక్కెడు నీటి కోసం తండ్లాట లేదు. సెగలు గక్కే ఎడారుల్లో కూడా మూడు అడుగుల లోతులోనే స్వచ్ఛమైన నీరు లభిస్తున్నది. 

రాజస్థాన్ నదీ పరివాహక సంస్థ చైర్మన్ వెదిరె శ్రీరాం తీసుకొచ్చిన ఫోర్ వాటర్ పథకం అద్భుత ఫలితాలినిస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో మొదలైన ఈ పథకం తొలిదశను పూర్తిచేసుకుని విజయవంతంగా రెండో స్టేజ్ లోకి అడుగుపెట్టింది.

ఒకప్పుడు కనుచూపు మేర నీటి చుక్క జాడ లేని రాజస్థాన్ ఇప్పుడు జల స్వావలంబన సాధించింది. ఫోర్ వాటర్ పథకం ఎడారి ప్రజల తలరాతను మార్చింది. 33 జిల్లాల్లోని 295 బ్లాకుల్లో ఈ స్కీం విజయవంతంగా అమలవుతున్నది. రాజస్థాన్ లోని బాన్సువార జిల్లాలో వర్షపాతం ఎక్కువే అయినప్పటికీ.. అక్కడ మైనర్ స్టోరేజీ నిర్మాణాలు లేవు. చెరువులు అసలే కనిపించవు. మొత్తం రాజస్థాన్ లో ఉన్న చెరువులు 2 వేలు మాత్రమే. రెయిన్ వాటర్ ని ఒడిసిపట్టే ఏర్పాట్లు లేకపోవడంతో వాన నీరంతా వృథాగా పోయేది.

ఈ పరిస్థితిని గమనించిన వెదిరె శ్రీరామ్ ఫోర్ వాటర్ కాన్సెప్టుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి జల స్వావలంబన అభియాన్ ద్వారా వేలాదిగా చెరువులు నిర్మించారు. సైంటిఫిక్ పద్ధతిలో వాటర్ స్టోరేజీ నిర్మాణాలు చేపట్టారు. క్యాచ్ మెంట్ ఏరియాలో వాటర్ షెడ్ ట్రీట్ మెంట్ చేసి వేలాదిగా మినీ పర్క్యులేషన్ ట్యాంకులు కట్టారు. వాటితో వాన నీటిని ఒడిసి పట్టి భూగర్భంలోకి పంపారు. దాంతో గ్రౌండ్ వాటర్ పెరిగిపోయింది. కేవలం బాన్సువార బ్లాక్ లోనే 56 చెరువులు కట్టి ఆ ప్రాంతాన్ని తీవ్ర దుర్భిక్షం నుంచి బయట పడేశారు.

ఫోర్ వాటర్ పథకం కింద గత ఏడాది 3,500 గ్రామాలు, ఈ సంవత్సరం 4,200 గ్రామాల్లో లక్షలాదిగా వాటర్ కన్జర్వేషన్ నిర్మాణాలు, వేలాదిగా వాటర్ స్టోరేజీ ట్యాంకులు కడుతున్నారు. గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్, వాటర్ షెడ్, వాటర్ రిసోర్సెస్, ఫారెస్ట్ డిపార్టుమెంట్ల సమన్వయంతో జల స్వావలంబన సాధించారు. అలా ఒడిసిపట్టిన జలరాశులను అగ్రికల్చర్, హార్టికల్చర్ కోసం ఉపయోగిస్తున్నారు. రైతులు చెరువుల్లో నీటితో హాయిగా మూడు పంటలు పండించుకుంటున్నారు. ప్రజల తాగునీటి అవసరాలు కూడా తీరాయి. 20 కిలోమీటర్లు నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఇప్పుడు రాజస్థాన్ లో లేదు.

ఇటు తెలంగాణ ప్రభుత్వం చెరువులను అద్భుతంగా అభివృద్ధి చేస్తోందని వెదిరె శ్రీరాం ప్రశంసించారు. మిషన్ కాకతీయ మంచి పథకమని కితాబిచ్చారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో చెరువులు ఉండటం అదృష్టమన్న ఆయన..మిషన్ కాకతీయకు ఫోర్ వాటర్ లాంటి కాన్సెప్టు తోడైతే మరిన్ని అద్భుతాలు చేయవచ్చని చెప్పారు.

Related Stories