తేడా వస్తే జైలుకి వెళ్లేది వాట్సప్ గ్రూప్ అడ్మిన్సే..  

0

మీరు వాట్సప్ గ్రూప్ అడ్మినా? అయితే కంటెంట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. తేడా వచ్చిందంటే జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు. ఆ గ్రూపులో నేరపూరిత కంటెంట్ ఉంటే దానికి పరోక్షంగా అడ్మినే బాధ్యుడవుతాడని వారణాసి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇచ్చింది. నిజానిజాలకు సంబంధం లేకుండా సందేశంలో ఆరోపణలున్నా, తప్పుదోవ పట్టించే సమాచారం పోస్టు చేసినా, గ్రూప్ అడ్మిన్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

ఈ మధ్య వాట్సప్ లో వ్యక్తిగతంగా కంటే గ్రూపుల ద్వారానే సమాచారం ఎక్కువ వ్యాపిచెందుతోంది. కంటెంట్ వచ్చిందంటే చాలు, క్రాస్ చెక్ చేయకుండా గుడ్డిగా ఫార్వర్‌ చేయడం అందరికీ అలవాటైంది. నిమిషాల్లోనే వైరల్ గా మారి కొన్ని వేల గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. ఇలాంటి గాలివార్తలు పోగేసే గ్రూపులపై కోర్టు సీరియస్ అయింది. సదరు వార్తను పంపిన వ్యక్తి ఎవరన్నది ముఖ్యం కాదు.. ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరన్నదే పాయింట్ అదే కోణంలో కోర్టు ఎఫ్‌ఐఆర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండాల్సిందే కానీ, దానికీ కొన్ని బాధ్యతలు, పరిమితులు ఉండాలని కోర్టు పేర్కొంది. షేర్ చేసే సమాచారం మనోభావాలను గాయపరిస్తే దాని పర్యావసానం మరోలా ఉంటుందనేది న్యాయస్థానం వాదన.

ఇండియాలో 200 మిలియన్ వాట్సప్ గ్రూపు అడ్మిన్స్ ఉన్నారు. వాళ్లంతా జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ఫలితం అనుభవించక తప్పదు. ఒకవేళ గ్రూపులో ఎవరైనా అలాంటి గాలివార్తలలను పోగేసివాళ్లు, పదేపదే రూమర్లను, ఇతర సెన్సిటివ్ సమాచారాన్ని షేర్ చేసేవాళ్లుంటే, అడ్మిన్ మొహమాట పడకుండా డిలీట్ చేయాలని కోర్టు సలహా ఇచ్చింది.

ఒకవేళ తప్పుడు సమాచారం, ఆరోపణలు, మనోభావాలను దెబ్బతీసే సమాచారం ఉన్న పోస్టు చక్కర్లు కొడుతుంటే- అది ఆటోమేటిగ్గా సమీప పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయబడుతుంది. అది ఏ ఫోన్ నుంచి వచ్చిందో ఆ వ్యక్తి మీద సైబర్ క్రైం చట్టం కింద, ఐటీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదవుతుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల అనుసారం చర్యలు తీసుకుంటారు.

కాబట్టి, వచ్చిన మెసేజ్ వచ్చినట్టే గుడ్డిగా ఫార్వర్డ్ చేయకండి. ఆరోపణల్లో నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతే వేరేవారికి పంపించండి. అలాంటి సందేశాలను పంపేవారిని అర్జెంటుగా గ్రూపులోంచి తొలగించండి. లేకుండా అడ్మిన్లకు ఎసరొస్తుంది.