ఆస్ట్రేలియాలో లక్షల జీతం వదిలేసి రైతుగా మారాడు

0

ఆస్ట్రేలియాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. నెలకు ఏడంకెల జీతం. సిటిజన్ షిప్ కూడా వుంది. హాయిగా, దర్జాగా బతికేయొచ్చు. ఆ పొజిషన్లో ఉన్నవాళ్లు ఎవరైనా అలాగే అనుకుంటారు. అంతకు మించి కూడా అనుకుంటారు. కానీ సురేశ్ అలా ఆలోచించలేదు. పొల్లుపోకుండా ఇంగ్లిష్ మాట్లాడినా, నెలతిరిగే సరకి లక్షల జీతం బ్యాంకులో పడ్డా, కడుపులో చల్ల కదలని ఉద్యోగం ఉన్నా, మట్టి మీద మమకారం చావలేదు.

కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ ఎప్పుడైనా చేయొచ్చు. కానీ వ్యవసాయం ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ చేయలేం. పిజాలు, బర్గర్లు, వీకెంట్ సరదాలు ఇవన్నీ తాత్కాలికం. ఎద్దు, వ్యవసాయం, వరిచేలు, మోటారుపంపు ఇవే శాశ్వతం. అలా అనుకునే ఉన్నపళంగా ఫ్లయిట్ ఎక్కి ఇండియాలో వాలాడు. తల్లిదండ్రులు లబోదిబోమని మొత్తుకున్నారు. ఆస్ట్రేలియాలో అంతమంచి జాబ్ వదులుకుని, బురదలో దిగుతానంటావేంటని కొట్టినంత పనిచేశారు. కానీ సురేష్ వినలేదు.

తమిళనాడు కోయంబత్తూరుకి చెందిన సురేష్ ది వ్యవసాయ కుటుంబం. తాతల కాలం నుంచి వ్యవసాయమే జీవనాధారం. సురేష్ మాత్రం ఇంజినీరింగ్ చేశాడు. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేశాడు. అక్కడే ఉద్యోగం. నెలకు ఏడంకెల జీతం. అవేవీ తృప్తినివ్వక పొలం జాడ పట్టుకుని విమానం ఎక్కేశాడు.

ఆహార్యంలో తేడాలేదు. జీన్సూ టీ షర్టూ. మనసు నిండా మాత్రం మట్టి అలుముకుంది. అందుకే మాడ్రన్ రైతు అంటారు అతణ్ని. వ్యవసాయం అనగానే మాటలు కాదు. పొలంలోకి దిగితే తెలుస్తుంది.. పంటతీయడంలో సాధకబాధకాలేంటో. వ్యవసాయంలో కనీసం ఓనమాలు తెలియవు. బేసిక్స్ అర్ధం కాలేదు. ఇదంతా ముందే ఊహించాడు. కనుక పశ్చాత్తాప పడలేదు. సరైన కరెంటు లేదు. అనుకున్నంత దిగుబడి లేదు. 15 లక్షల దాకా పెట్టుబడి పెట్టాడు. 

అలా పదేళ్లపాటు మట్టితో పెద్ద యుద్ధమే చేశాడు. ప్రతీదీ ప్రశ్న రూపంలోనే ఎదురయ్యేది. వాటన్నిటికీ సమాధానాలు రాబట్టుకున్నాడు. కనపడ్డ రైతునల్లా అడిగేవాడు. తన సందేహాలన్నీ తీర్చుకునేవాడు. తనకున్న భూమిలో సుమారు ఐదువేల దాకా పోకల చెట్లు, కొబ్బరి చెట్లు నాటాడు. నాలుగేళ్లలో అవి కాపుకొచ్చాయి. కరెంటు లేకపోతే సోలార్ ఎనర్జీని నమ్ముకున్నాడు.

సేంద్రియ వ్యవసాయం చేయాలనేది సురేష్ మొదట అనకున్న లక్ష్యం. కానీ అక్కడిదాకా పోవడానికి చాలా టైం పట్టింది. పురుగు మందుల్లేకుండా వందశాతం పంట తీయాలన్నది అతడి ముందున్న కర్తవ్యం. అతని నిబద్ధత, పట్టుదల, అవిశ్రాంత కృషి చూసి చాలామంది రైతులు ఆశ్చర్యపోయారు. ఏళ్ల తరబడి వ్యవసాయం చేసీ చేసీ విసిగిపోయన వాళ్లు కూడా సురేష్ ని చూసి స్ఫూర్తిపొందుతున్నారు. వ్యవసాయం చేయడం నమాషీ కాదు.... నలుగురికి ఆదర్శం అనేలా పేరు తెచ్చుకున్న సురేశ్ ఈ మధ్యనే యంగ్ అచీవర్, యంగ్ ప్రొగ్రెసివ్ ఫార్మర్ అవార్డు తీసుకున్నాడు.  

Related Stories