దేశ అత్యున్నత పదవికి వన్నె తెస్తా- రాష్ట్రపతిగా రామ్ నాథ్ ప్రమాణ స్వీకారం

0

భారత 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్‌ కోవింద్ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఖేహర్ ఆయన చేత ప్రమాణం చేయించారు. తనపై నమ్మకముంచి, రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కోవింద్. ఈ పదవిని వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లోజరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్, ఉపరాష్ట్రపతి అన్సారీ, స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.

భారత 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఖేహర్....రామ్ నాథ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కోవింద్‌ ను తన సీట్లో కూర్చొబెట్టిన ప్రణబ్‌ .. రాష్ట్రపతి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

భిన్నత్వంలో ఏకత్వమే భారత్ ప్రత్యేకత అన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. అత్యున్నత పదవికి తనను ఎంపిక చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. వినమ్రంగా రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నానని, పదవీ ఔన్నత్యాన్ని మరింత పెంచేలా పని చేస్తానని చెప్పారు. శాంతి స్థాపన కోసం అందరూ కలిసి కట్టుగా ముందుకెళ్లాలన్న రాష్ట్రపతి కోవింద్.. సమానత్వం, స్వేచ్ఛ, సహోదరభావం భారత్ సొంతమన్నారు.

రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్రపతి భవన్ లో త్రివిధ దళాలు ఆయనకు వందనం సమర్పించాయి. ఆ తర్వాత కోవింద్ ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్ లోకి తోడ్కొని వెళ్లారు. అక్కడ పరిసరాలను పరిచయం చేశారు ప్రణబ్.

ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, మాజీ ప్రధానులు మన్మోహన్, దేవగౌడ, బీజేపీ చీఫ్ అమిత్ షా, సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు పలు రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారానికి ముందు రామ్ నాథ్ కోవింద్ తన సతీమణితో కలిసి రాజ్‌ ఘాట్‌ ను సందర్శించి నివాళులర్పించారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన రామ్ నాథ్... సైనిక కవాతు మధ్య పార్లమెంట్ హాల్‌ కు చేరుకున్నారు. ఒకే కారులో వచ్చిన ప్రణబ్‌, కోవింద్‌ లకు లోక్ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ సాదర స్వాగతం పలికారు.

రాష్ట్రపతిగా రామ్ నాథ్ ప్రమాణ స్వీకారం చేయగానే గౌరవ సూచకంగా 21 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రమాణ స్వీకారోత్సవ వేడుక ముగిసిన తర్వాత రాష్ట్రపతి కోవింద్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఒకే కారులో రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ గురించి కోవింత్ కు ప్రణబ్ వివరించారు. అనంతరం ప్రణబ్ కొత్త నివాసం టెన్ రాజాజీ మార్గ్ దగ్గర ఆయన్ని దిగబెట్టారు కోవింద్.