ప్రపంచాన్ని మార్చే ఆలోచనలు చేయండి !

ప్రపంచాన్ని మార్చే ఆలోచనలు చేయండి !

Saturday November 28, 2015,

5 min Read

''నేను చాలా మంది కళ్లలోకి చూసినప్పుడు.. వాళ్ల మనసు అర్థమవుంది. కానీ నీ కళ్లు చూసినప్పుడు అందులో ఓ అగాధం, మృత్యు కుహురం కనిపిస్తుంది''. ఈ మాటలు ఎవరు.. ఎవరిని.. ఉద్దేశించి అన్నారో వింటే.. నోరెళ్లబెట్టినంత పనిచేస్తారు. యాపిల్ మాజీ బాస్ జాన్ స్కూలీ భార్య.. స్టీవ్ జాబ్స్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని తెలిస్తే.. మరింత ఆశ్చర్యపోతాం.

ఎన్నో అంచనాలతో జాన్ స్కూలీని.. స్టీవ్ జాబ్సే ఉద్యోగంలోకి తీసుకున్నారు. కానీ మేనేజ్‌మెంట్ నిర్ణయాలు, సేల్స్, వృద్ధి, కొత్త ప్రోడక్టుల ఆలోచనల నేపధ్యంలో ఇద్దరి మధ్యా అనేక పట్టింపులు మొదలయ్యాయి. స్నేహితుల్లా ఉన్న వాళ్ల ఇద్దరు కాస్తా.. విరోధుల్లా మారిపోయారు. స్టీవ్ జాబ్స్ కంపెనీలో ఉంటే.. సంస్థ మనుగడ ప్రశ్నార్థకమేనని జాన్ స్కూలీ.. యాపిల్ బోర్డును ఒప్పించారు. దీంతో తప్పని పరిస్థితుల్లో స్టీవ్ జాబ్స్.. తాను స్థాపించిన సొంత కంపెనీ నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. (ఆ తర్వాత ఆయన మళ్లీ కంపెనీలోకి మరో మార్గం ద్వారా వచ్చి.. సంచనలం సృష్టించారనుకోండి. అది వేరే సంగతి)

image


బోర్డు మీటింగ్ తర్వాత స్కూలీతో పాటు స్టీవ్ జాబ్స్ కూడా చాలా మనస్థాపానికి లోనయ్యారు. ఇద్దరూ ఏడ్చినంత పనిచేశారు. స్టీవ్‌ను ఉద్యోగం నుంచి పక్కకు తప్పించి నైతికంగా విజయం సాధించినప్పటికీ.. స్కూలీ కూడా రాజీనామా చేసేశారు. ఈ వివాదమంతా తెలిసిన స్కూలీ భార్య... జాబ్స్‌ను కడిగిపారేయాలని నిర్ణయించుకున్నారు. తన భర్తను ప్రవర్తించిన తీరును ప్రశ్నించాలని నిర్ణయించుకున్నారు. కార్ పార్కింగ్‌ లాట్‌లో స్టీవ్ జాబ్స్‌ను కలుసుకుని.. పై మాటలు అనేశారు.

అంత ఉన్నత స్థాయికి చేరినప్పటికీ జాబ్స్ మరీ కఠువుగా, ఒక్కోసారి మూర్ఖంగా, జాలి, మానవత్వం అనే పదాలకు అర్థం కూడా తెలియని వాడని చాలా మంది చెపుతారు. ఇవన్నీ నిజమే కావొచ్చు. అతని కలిసి పనిచేయడం అంత సులువైనది ఎంత మాత్రం కాదు. ఆచితూచి మాట్లాడుతాడు. ప్రోడక్టుల రివ్యూల విషయంలోనూ అంతే కఠువుగా ఉంటారు. ఉద్యోగులతో ఏ మాత్రం కలిసేవాడు కూడా కాదు.

టీనా రీడ్స్ అనే అమ్మాయిని మొట్టమొదటగా ఆయన ప్రేమించిన వ్యక్తి. కానీ ఆమె మాత్రం తనని నిరాకరించింది. 'నేను స్టీవ్ జాబ్స్‌ లాంటి ఐకాన్‌కు మంచి భార్యగా ఉండలేకపోయేదాన్ని. ఏదో ఒక స్థాయిలో ఇబ్బందిపడక తప్పదని నాకు తెలుసు. అతని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. అదే సమయంలో జాబ్స్ ఇతరుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటే కూడా చూస్తూ ఊరుకోవడం కష్టం. అది చాలా బాధాకరమైన విషయం'. జాబ్స్‌కు 'నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్' ఉందని తాను నమ్ముతున్నట్టు చెప్తారు టీనా.

ఎవరు ఎన్ని చెప్పినా.. అతడో మేధావి. సాధారణంగా అలాంటి వాళ్లు ఓ లైఫ్ స్టైల్ ఫాలో కాలేరు. చెప్పుల్లేకుండా రోడ్లపై తిరగడం, తిండీ తిప్పలు లేకుండా అలా రోజుల తరబడి గడపడం మామూలు మనుషులకు సాధ్యమేనా. కేవలం పండ్లు, కూరగాయలతోనే వారాలకు వారాలు అతడు గడిపేవాడు. వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన పార్కింగ్ లాట్‌లో కారును ఉంచేవాడు. మీకో ఆశ్చర్యమైన విషయం తెలుసా.. ? అతడు పనిచేసిన మొదటి ఉద్యోగంలో జాబ్స్‌ను ఉదయం షిఫ్ట్‌ నుంచి రాత్రి షిఫ్ట్‌కు బలవంతంగా మార్చారు. కారణం ఏంటంటే.. వారాల తరబడి స్నానం చేయకపోవడం, డియోడరెంట్ కూడా వాడకపోవడంతో కంపు కొడ్తున్నాడని ఇతర ఉద్యోగులంతా ఫిర్యాదు చేశారు. దీన్ని బట్టే అర్థమవుతోంది..పనిలో పడితే.. స్టీవ్స్ ఎంత కఠువుగా తనని తాను బాధించుకుంటాడోనని.

మానసిక శాంతి కోసం భారత్‌లోని వీధుల వెంట అతడు తిరిగాడు. స్టీవ్స్ బయోగ్రఫీ రాసిన వాల్టర్ ఐసాక్సన్ మాటల్లో చెప్పాలంటే.. 'దేవుడు, భక్తి అనేవి తనకు పట్టవు. అతడు ఎప్పుడూ చర్చికి కూడా వెళ్లలేదు' అంటారు వాల్టర్. అంతే కాదు అతని ఆఖరి రోజుల్లో కూడా.. 'నేను దేవుడిని 50-50 మాత్రమే నమ్ముతాను' అని చెప్పారు అని గుర్తుచేశారు వాల్టర్.

ఈ విషయాలన్నీ పక్కనబెడితే.. ఒక్కటి మాత్రం నిజం. తాను ప్రపంచాన్ని మార్చడానికే పుట్టినట్టు బలంగా నమ్ముతారు. బిల్ గేట్స్ మాదిరి లాభాలను పెంచుకోవడం, సంపదను సృష్టించడం వంటి విషయాలకు దూరంగా ఉన్న ఏకైక సీఈవో స్టీవ్ జాబ్స్. అలా అని స్టీవ్ ఓ బికారి అని చెప్పడం లేదు. అతడిది కూడా ఆస్తుల్లో సమాన స్థాయే. కానీ అతని వ్యాపార ఆలోచలు ఓ సంచలనం. స్టీవ్స్ సృష్టించిన ఉత్పత్తులు ప్రపంచాన్నే మార్చేశాయి. బాబ్ డిలాన్.. స్టీవ్స్‌కు స్ఫూర్తి.. అతడి మాటలనే పూర్తిగా నమ్మి ఆచరించారు కూడా. 'నిత్యం నూతనంగా బతకలేకపోతే.. నిత్యం.. పాత వాసనల్లోకి మగ్గి చనిపోతూ ఉండడంతో బిజీగా ఉండిపోతాం' అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు స్టీవ్స్.

తాము తయారు చేసే కొత్త ఉత్పత్తులు పాత వాటిని, సొంత ఉత్పత్తులనే చంపేస్తున్నాయని ఉద్యోగులంతా ఓ సారి స్టీవ్స్‌తో చెప్పారు. ''పాత వాటిని మనకు మనమే వదిలించుకుని కొత్త వాటిని మారకపోతే.. మరెవరో వచ్చి ఆ పని చేసేస్తారు'' అంటారు జాబ్స్. పాత వాటిని వదిలించుకోవడానికి ఎప్పుడూ భయపడొద్దు అనేది ఉద్యోగులకు అతను ఎప్పుడూ బోధించే సూత్రం.

మ్యూజిక్ పరిశ్రమనే మార్చేసేలా అతను ఐపాడ్, ఇంటర్నెట్ ప్రపంచాన్ని శాసించేలా ఆ తర్వాత ఐఫోన్స్, ఐప్యాడ్స్‌ను జాబ్స్ సృష్టించారు. 1997లో యాపిల్ అప్పుల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు.. స్టీవ్స్ దాన్ని అధిరోహించాడు. 2010 వచ్చే నాటికి యాపిల్.. మైక్రోసాఫ్ట్‌తో ఆదాయపరంగా పోటీపడే స్థాయికి చేరింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా చరిత్రలో నిలిచిపోయింది యాపిల్. ఐసాక్సన్ మాటల్లో చెప్పాలంటే..ఓ వందేళ్ల తర్వాత ఎడిసన్, ఫోర్డ్ వంటి వాళ్ల సరసన జాబ్స్ కూడా నిలిచి ఉంటారు. ఈ దశాబ్దం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు జాబ్స్ లేకుండా చరిత్ర చెప్పడం కష్టం. కొత్త ఉత్పత్తులను సృష్టించడం జాబ్స్ కల. అందరి కంటే ముందుగా ఆలోచించడం అతడిలోని నేర్పు. ఇన్నోవేషన్, ఇన్నోవేషన్, ఇన్నోవేషన్.. అనే ఏకైక మంత్రాన్ని అతడు నిత్యం జపిస్తూ.. తపిస్తూ ఉండేవారు.

అప్పట్లో పరిశ్రమ అంతా ఓపెన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు.. మైక్రోసాఫ్ట్ అప్పటికే.. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను లైసెన్సింగ్ అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ ఉంది. అప్పుడు హార్ట్‌వేర్ నుంచి సాఫ్ట్‌వేర్.. ఆ తర్వాత కంటెంట్ వరకూ.. అన్నీ ఎండ్ టు ఎండ్ వ్యవస్థకు మార్చడం ముఖ్యమని జాబ్స్ నమ్మారు. జాబ్స్ ఓ హార్డ్ కోర్ 'ప్రొడక్ట్ గయ్'. అతనికి ఓ ప్రోడక్ట్ సృష్టించడం అంటే ఓ సైన్స్, ఓ కళ. వ్యాపారమనేది ఆఖరి అంశం. ఓ ప్రోడక్ట్ రూపొందించడం అంటే.. పాబ్లో పికాసో.. బొమ్ము గీసినట్టు చూస్తారు.

ఐఫోన్, ఐ ప్యాడ్ కూడా.. అత్యంత సింపుల్ టెక్నాలజీతో సులువుగా వాడేలా డిజైన్ చేశారు. ఆ ఫోన్లకు వాటి అందమే ప్రాణం. తాను అనుకున్న ప్రోడక్ట్ రానప్పుడు.. ఉద్యోగులతో జాబ్స్.. అంతే కఠినంగా, అంతే మొండిగా కూడా ఉండేవారు.

ఈ రోజుల్లో సేల్స్ పర్సన్స్.. కింగ్స్ అండ్ క్వీన్స్ లాంటివాళ్లు. వాళ్లే పరిశ్రమను ఏలుతున్నారు. కానీ జాబ్స్.. వాళ్లందరినీ.. అసహ్యించుకునేవారు. 'సేల్స్ పీపుల్.. కంపెనీని నడుపుతున్నప్పుడు, ప్రొడక్ట్ తయారు చేసేవాళ్లకు పెద్దగా విలువుండదు. వాళ్లకే ఆఫ్ మోడ్‌లో ఉంటారని.. ' స్టీవ్స్ అనేవారు. మైక్రోసాఫ్ట్, ఐబిఎంను ఉద్దేశించి అప్పుడపప్పుడూ ఈ మాటలను అనేవారు.

యధాతధంగా ఉండడం, మార్పును తీసుకురాలేకపోవడాన్ని స్టీవ్స్ జీర్ణించుకునేవారు కాదు. 'కస్టమర్లకు ఏం కావాలో వాళ్లకు అదే ఇవ్వాలి'.. అనే ఫార్ములాకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించేవారు. 'మనం చెప్పేంత వరకూ వాళ్లకు ఏం కావాలో కస్టమర్లకు తెలియదు' అని హెన్రీ ఫోర్డ్ చెప్పేవారు. స్టీవ్స్ కూడా ఇదే మాటను నమ్ముతారు.

కానీ వాస్తవం ఏంటంటే.. అతడే ఓ పెద్ద సేల్స్ మెన్. మెకింతోష్ నుంచి ఐ ప్యాడ్ వరకూ.. ప్రతీ ప్రొడక్ట్‌ను ఓ మెజీషియన్‌లా అమ్మారు. అంతవరకూ అలాంటి ఉత్పత్తే లేదని నమ్మించి మరీ అమ్మేవారు. ఆ మాటలు మార్కెట్లో సంచలనాన్ని తీసుకువచ్చేవి.

కానీ ఈ సేల్స్ మెన్ మాత్రం విభిన్నం. అతడే స్టీవ్స్ జాబ్స్. ఎక్కడా పొసగని, క్రేజీ వ్యక్తి ఇతడు. ప్రపంచాన్ని తామే మారుస్తామని నమ్మేవాళ్లే, ఏదో ఒకటి చేస్తారు.. చేయగలరు. అందుకే నేను స్కూలీ భార్య మాటలతో విబేధిస్తాను. ఎందుకంటే ఇతగాడో ఓ విభిన్నమైన వ్యక్తి. తనకు కావాల్సిన ఉత్పత్తిని తయారు చేసేంత వరకూ ఉద్యోగులవైపు కళ్లార్పకుండా కఠినంగా చూడడమే కాదు.. పరిపూర్ణత, స్వచ్ఛత కోసం కూడా.. అంతే తాపత్రయపడే వ్యక్తి.

గెస్ట్ రచయిత - అశుతోష్.

ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి. గతంలో జర్నలిస్ట్‌గా కూడా సుదీర్ఘ అనుభవం పొందారు అశుతోష్.

గెస్ట్ ఆలోచనలు.. యువర్ స్టోరీ వ్యాఖ్యలుగా భావించాల్సిన అవసరం లేదు.