కూతురికి ప్రేమతో..!!

జీవిత పాఠాలతో లేఖ రాసిన చందా కొచ్చార్

కూతురికి ప్రేమతో..!!

Sunday April 17, 2016,

3 min Read


చందా కొచ్చార్! ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఐసీఐసీఐ బ్యాంకు ఓ వెలుగు వెల‌గ‌డానికి ఆమే క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌! ఫోర్బ్స్ ఆసియా శ‌క్తివంత‌మైన మ‌హిళా వ్యాపార‌వేత్త‌ల జాబితాలో చందా కొచ్చార్ కూడా ఒక‌రు! స‌క్సెస్ ఫుల్ ఉమెన్ గా ఆమె పేరు ఇప్పటికే ఖండాలు దాటింది. ఇక ఇప్పుడు త‌ల్లిగా కూడా ఆమె త‌న పాత్ర‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించాల‌ని అనుకుంటున్నారు. కెరీర్ గుమ్మం ముందు నిల‌బడి ఉన్న కూతురు ఆర్తి కొచ్చార్ కు మంచేదో, చెడేదో చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. త‌న జీవిత అనుభ‌వాలు, పాఠాల‌ను గుదిగుచ్చి కూతురికి స్ఫూర్తి రగిలించే అక్షరాలతో ఇలా లేఖ రాశారు..

చందా కొచ్చార్

చందా కొచ్చార్


1. పిల్ల‌ల‌ను బాగా పెంచు..!!

త‌ల్లిదండ్రుల‌కు పిల్లలంద‌రూ స‌మాన‌మే! ఒక‌రు ఎక్కువా, ఇంకొక‌రు త‌క్కువా కాదు! మేం ఇద్ద‌రు అమ్మాయిలం, ఒక అబ్బాయి. మా పేరెంట్స్ ఎప్పుడూ ఆడ‌పిల్లా, మ‌గ పిల్లాడు అని లెక్క‌లు వేయలేదు. మా ముగ్గురినీ స‌మానంగా పెంచారు. మా నిర్ణయాల్ని గౌరవించారు. మా లక్ష్యాల్ని సొంతంగా నిర్దేశించుకునేలా తీర్చిదిద్దారు. అలా చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రుల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. మా పేరెంట్స్ ఆద‌ర్శాలు, న‌డ‌వ‌డిక‌, విలువ‌లు నాకు జీవిత పాఠాలు నేర్పాయి. నా కోరిక‌ల్లా ఒక‌టే. నువ్వు కూడా నీ పిల్ల‌ల‌ను అలాగే పెంచాలి. అంద‌రినీ స‌మానంగా చూడాలి. స‌మానంగా చ‌దువు చెప్పించాలి. ప‌రిస్థితుల‌ను త‌ట్టుకొని నిల‌బ‌డేలా ప్ర‌యోజ‌కుల్ని చేయాలి.

2. రిలేషన్ వేరు, ఉద్యోగం వేరు.!!

ఎంత ప‌ని ఉన్నా అది ఆఫీసు వ‌ర‌కే! దాన్ని ఇంటి దాకా మోసుకురావొద్దు. ఇది నాకు మా అమ్మ ద‌గ్గ‌ర్నుంచి అలవాటైంది. గుర్తుందా బేబీ..? నువ్వు అమెరికాలో చ‌దువుతున్న‌ప్పుడు నా గురించి ప‌త్రిక‌ల్లో ఒక వార్త వ‌చ్చింది. న‌న్ను ఐసీఐసీఐ ఎండీ, సీఈవోగా నియ‌మిస్తున్నార‌ని వాటి సారాంశం. అది చూసి నువ్వు షాకయ్యావు. రెండు రోజుల త‌ర్వాత నాకో మెయిల్ పెట్టావు. ఇంట్లో ఒక మామూలు త‌ల్లిలా క‌నిపించే మా అమ్మ ఐసీఐసీఐకి సీఈవో అవుతుందంటే న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని అందులో రాశావు. ఎంతో ఒత్తిడి ఉండే కెరీర్ ను విజ‌య‌వంతంగా తీర్చిదిద్దుకున్నావ‌ని ప్ర‌శంసిస్తూ ఆ రోజు నువ్వు పంపిన సందేశం ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను. నాదొక‌టే కోరిక! నువ్వు కూడా నాలాంటి గొప్ప లైఫ్‌ లీడ్ చేయాలి డార్లింగ్! ఒక్క విష‌యం గుర్తు పెట్టుకో. ఏ మ‌నిషికైనా అనుబంధాలు ముఖ్యం. అవి అలా వ‌ర్థిల్లుతూనే ఉండాలి. రిలేష‌న్ షిప్ అనేది టూ వే లాంటిది! నువ్వు ఇత‌రుల నుంచి ఆశించిన‌ట్టే, అవ‌తలి వారికీ నువ్వు అనుబంధాల‌ను పంచాలి.

ఆ మాట‌కొస్తే ప్ర‌తీ త‌ల్లీదండ్రికీ ఇది వ‌ర్తిస్తుంది. మీ ప్రాధాన్య‌త‌ల‌ను డ‌బ్బు మీద కాకుండా సంతోషాల మీద పెట్టండి. అలాగ‌ని బిజినెస్ ను త‌క్కువ చేయాల‌ని కాదు. వ్యాపారాన్ని వృద్ధి చేసుకోండి. ఎవ‌రూ కాద‌న‌రు. కానీ అదే స‌మ‌యంలో పిల్ల‌లకూ కొంత‌ స‌మ‌యం కేటాయించండి. పిల్ల‌ల‌ వేలు ప‌ట్టుకొని న‌డిపించండి, వారిని స‌న్మార్గంలో పెట్టండి. పిల్ల‌ల‌ ప్రేమాభిమానాల్లో దొరికే ఆనందం అమూల్యం!

3. సైలెంట్ గా ప‌ని చేసుకెళ్లు..

మా అమ్మ ద‌గ్గ‌ర్నుంచి ఇంకో మంచి విష‌యం నేర్చుకున్నా. క‌ష్ట‌కాలంలో ఎలా నెగ్గుకు రావాలో మీ అమ్మ‌మ్మే నాకు నేర్పింది. మా నాన్న చ‌నిపోయిన త‌ర్వాత కుటుంబ భారం అమ్మ మీద ప‌డింది. మా ముగ్గురిని పెంచి పెద్ద చేయ‌డానికి అమ్మ ఎన్ని క‌ష్టాలు ప‌డిందో నాకింకా గుర్తుంది. ఆప‌ద స‌మ‌యాల్లో ఆమె స్పందించిన తీరు మాకో జీవిత పాఠం!

అది 2008. ప్ర‌పంచ ఆర్థిక మాంద్యం దెబ్బ‌కు ఐసీఐసీఐ బ్యాంకు సంక్షోభంలో ప‌డిపోయింది. ఆ స‌మ‌యంలో ఓ రోజు రెండు గంట‌లు లీవ్ తీసుకొని మీ తమ్ముడి టోర్నమెంట్ చూడ్డానికి వెళ్లాను. అక్కడ ఒక సంఘ‌ట‌న జ‌రిగింది. కొంద‌రు మ‌హిళ‌లు న‌న్ను గుర్తుప‌ట్టి ద‌గ్గ‌రికొచ్చారు. మీరు చందా కొచ్చారే కదా అని అడిగారు. ఆర్థిక సంక్షోభంలోనూ మీరు తీరిక చేసుకొని ఉత్సాహంగా టోర్న‌మెంట్ కు వ‌చ్చారంటే, బ్యాంక్ సేఫ్ హ్యాండ్స్ లోనే ఉంద‌న్న న‌మ్మ‌కం క‌లిగింద‌ని సంతోషంగా చెప్పారు. ఆ మాట‌లు నాలో అంతులేని న‌మ్మ‌కాన్ని పెంచాయి. వారిచ్చిన స్ఫూర్తితోనే కష్టాల నుంచి గ‌ట్టెక్కాం.

నిజ‌మే. క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడే మ‌నిషి స‌త్తా ఏంటో తెలుస్తుంది. స‌మ‌స్య‌ల‌ను సైనికుడిలా ఎదుర్కొంటాడో, లేదా వెన్ను చూపించి పారిపోతాడో తేలిపోతుంది!

4. తగిన వాడిని ఎంచుకో...

ఎవ‌రిదాకానో ఎందుకు? కెరీర్ లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ నేనూ, మీ నాన్న క‌లిసే ఉండ‌లేదా? ఒక‌రినొక‌రు అర్థం చేసుకొని మ‌స‌లుకోలేదా? పెళ్ల‌య్యాక నువ్వు కూడా నీ భ‌ర్త‌తో ఇలాగే ఉంటావ‌ని ఆశిస్తున్నా. ఆడ‌వాళ్ల‌కు ఏం త‌క్కువ ఇప్పుడు? మ‌న‌కు స్వేచ్ఛ ఉంది. స్వాతంత్ర్యం ఉంది. పుష్క‌లంగా అవ‌కాశాలు ఉన్నాయి. స‌మ‌స్యంటూ వ‌స్తే అది లైఫ్ పార్ట్ న‌ర్ నుంచే ఎదురు కావొచ్చు. కాబ‌ట్టి త‌గిన వాడిని సెల‌క్ట్ చేసుకోవ‌డం ప్ర‌తీ అమ్మాయికీ ముఖ్యమే.

5. నిజాయితీని నమ్ముకో..

కెరీర్ అంటే రాళ్లూ, ముళ్లూ రెండూ ఉంటాయి. ఒక్కోసారి క‌ష్టాలు కలిసికట్టుగా చుట్టుముట్టొచ్చు! క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునే టైం రావొచ్చు. అయినా అధైర్య‌ప‌డ‌కు! ధైర్యాన్ని కూడ‌దీసుకో. న‌మ్మిన దాన్నే ఆచ‌రించు. సరైన నిర్ణ‌య‌మే తీసుకున్నాన‌ని ధీమాగా ఉండు. ఒక్క‌ అడుగు వెన‌క్కి ప‌డినా.. ఇక ముందుకెళ్ల‌డం క‌ష్టం! అన్నింటికీ మించి నీతి నిజాయితీల విష‌యంలో రాజీ ప‌డొద్దు. నీ చుట్టూ సున్నిత మ‌న‌స్కులు ఉంటారు జాగ్ర‌త్త‌! వారిని కేర్ ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. ఒక‌సారి ఒత్తిడిని జ‌యిస్తే .. ఇక జ‌న్మ‌లో అది నీ ద‌రికి రాదు! ఆకాశ‌మే హ‌ద్దుగా సాగిపో. కానీ త‌ప్ప‌ట‌డుగులు మాత్రం వేయొద్దు. జాగ్ర‌త్త‌గా ఒక్కో మెట్టూ అధిరోహిస్తూ వెళితే విజ‌యం నీదే డియర్!

నిజానికి ఒక్క చందా కొచ్చారే కాదు! ప్ర‌తీ త‌ల్లి ఇలాగే అనుకుంటుంది! త‌న బిడ్డ ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాల‌ని క‌ల‌లుగంటుంది! ఇప్పుడు ఆర్తి! రేపు అలాంటి ఇంకెంద‌రో యువ వ్యాపార‌వేత్త‌లు! వాళ్లంద‌రికీ ఆల్ ది బెస్ట్!