హరిత తెలంగాణ కోసం సీడ్ బాంబింగ్ చేయబోతున్న వరంగల్ పోలీసులు  

0

సామాజిక బాధ్యతలో వరంగల్ పోలీసుల తర్వాతే ఎవరైనా! ఇప్పటికే హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటిన వరంగల్ పోలీసులు.. ఇప్పుడు మరో రికార్డు సృష్టించబోతున్నారు. మూడో విడత హరితహారంలో సీడ్ బాంబింగ్ పద్ధతిలో మొక్కలు పెంచబోతున్నారు. ఇందుకోసం పది లక్షల సీడ్ బాల్స్ ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడానికి ఈసారి సీడ్బాంబింగ్ అనే కొత్త విధానాన్ని అనుసరించబోతున్నారు. జూన్ నుంచి మొదలయ్యే మూడో విడత హరితహారంలో ఈ పద్ధతిని అమలు చేయనున్నారు. దాదాపు కోటికిపైగా సీడ్బాల్స్ను తయారు చేయాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రతీ డివిజన్ లో అటవీశాఖ అధికారులకు, సిబ్బందికి శిక్షణనిస్తున్నారు.

మామూలుగా అయితే చిన్న గొయ్యి తవ్వి మొక్కలు నాటుతుంటారు. కానీ సీడ్ బాల్ బాంబింగ్ పద్ధతిలో రకరకాల విత్తనాలను బంతులుగా తయారు చేసి కొండలు, పొదలు, బంజరు నేలలు, అటవీ ప్రాంతాలలో జల్లుతారు. మట్టి లేదా పేడతో బంతుల మాదిరిగా ముద్దలను తయారుచేసి వాటి మధ్యలో విత్తనాలను ఉంచుతారు. వర్షాలు పడే సమయానికి వీటిని బాంబుల మాదిరిగా పలుచోట్ల విసిరేస్తారు. వర్షం పడగానే సీడ్ బాల్ కరిగిపోయి మధ్యలో ఉంచిన విత్తనాలు మొలకెత్తుతాయి. 

మనుషులు మొక్కలు నాటడానికి వీలుకాని గుట్టలు, పొదలు, ఎత్తయిన ప్రాంతాలలో ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కర్ణాటకలో వివిధ సంస్థలు చేపట్టిన సీడ్ బాంబింగ్ విధానం విజయవంతమైంది. ఈ విధానం తెలంగాణలో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు.

క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 10 లక్షల మొక్కలు నాటి హ‌రితహారంలో రాష్ట్రంలోనే మొద‌టి స్థానంలో నిలిచిన వ‌రంగ‌ల్ పోలీసులు.. తాజాగా సీడ్ బాంబింగ్ విధానంలోనూ రికార్డు సృష్టించడానికి రెడీ అవుతున్నారు. కొండ‌లు, ఎత్తయిన ప్రాంతాల్లో పది లక్షల సీడ్ బాల్స్ వేసేందుకు స‌మాయత్తం అవుతున్నారు. ఇందుకోసం మడికొండ పోలీసు ట్రైనింగ్ సెంట‌ర్ లో సుమారు 50 వేల సీడ్ బాంబులను సిద్ధం చేశారు. మూడో విడత హ‌రితహారం ప్రారంభమయ్యే నాటికి 10 ల‌క్షల సీడ్ బాల్స్ ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఒక వైపు శాంతి భద్రతలను ప‌రిర‌క్షిస్తూనే.. సామాజిక బాధ్యతను కూడా భుజానికెత్తుకున్న వరంగల్ పోలీసులను అట‌వీ శాఖ అభినందించింది. ఆకుపచ్చ తెలంగాణ కోసం వరంగల్ పోలీసులు చేస్తున్న కృషి అమోఘమని కొనియాడింది.

Related Stories