స్టార్టప్ వ్యవస్థలో కనిపించని కేన్సర్ లక్షణాలు

స్టార్టప్ వ్యవస్థలో కనిపించని కేన్సర్ లక్షణాలు

Saturday March 05, 2016,

5 min Read


మనిషి శరీరం ఎదిగేకొద్దీ రుగ్మతలు పెరుగుతూ ఉంటాయి. లైఫ్ స్టైల్ నుంచి ఆహారపుటలవాట్ల వరకు ఎన్నో అంశాలు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తూంటాయి. వీటిని ఎంత వరకు ఎదుర్కోని నిలవాలనేది ఆ శరీరాన్ని అస్వాదిస్తున్న మనిషి ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. తాత్కాలిక ఆనందాల కోసం లైట్ తీసుకుంటే మొత్తానికే మోసం వచ్చేస్తుంది. 

అచ్చంగా స్టార్టప్ వ్యవస్థ లో కూడా ఇప్పుడు అలాంటి సైకిలే నడుస్తోంది. ఇప్పుడిప్పుడే పరుగందుకుంటున్న భారతీయ స్టార్టప్ వ్యవస్థలోకి కొన్ని రుగ్మతలు ప్రవేశిస్తున్నాయి. షార్ట్ కట్ సక్సెస్ కోసం, తాత్కాలిక లాభాల కోసం, అప్పనంగా వచ్చిపడే పెట్టుబడుల కోసం కొంత మంది చేస్తున్న మాల్ ప్రాక్టీస్.. స్టార్టప్ వ్యవస్థను మహమ్మారిలా కబళిస్తోంది. ఇంకా విధ్వంసకరమైన విషయమేమిటంటే, స్టార్టప్స్ కి పిల్లర్స్ గా నిలవాల్సిన పెట్టుబడిదారులు కొందరు వీటిని ప్రొత్సహిస్తున్నారు. ఇటీవలి కాలంలో బయటపడుతున్న ఇలాంటి ధోరణులు కొన్నింటిని యువర్ స్టోరీ మీకు తెలియజేస్తోంది. ఇవన్నీ ఇప్పటికే స్టార్టప్ వ్యవస్థలో భాగంగా మారిన ఆంట్రపెన్యూర్స్, ఉద్యోగులు, పెట్టుబడిదారులు తెలియజేసిన వివరాలే....!

image


వ్యాపార రహస్యాలు, మేథో సంపత్తి చోరీ

స్టార్టప్ వ్యవస్థకు ఇప్పుడు ప్రధాన సమస్యగా పరిణమించినది వ్యాపార రహస్యాలు, మేథో సంపత్తి చోరీ. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్టార్టప్ లలో ఎన్నో ఉనికి కోసం వెంపర్లాడుతున్నాయి. సక్సెస్ సాధించేందుకు క్రియేటివిటీని, కష్టాన్ని నమ్ముకోకుండా అడ్డదారుల్లో వెళ్లేందుకు ఇలాంటి స్టార్టప్స్ కొన్ని ప్రయత్నిస్తున్నాయి. ః

అదెలా అంటే.... ఇలాంటి స్టార్టప్ లలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు... అదే తరహా వ్యాపారం చేస్తున్న, కొద్దిగా విజయవంతంగా నడుస్తున్న స్టార్టప్ లలో ఉద్యోగులుగా చేరుతారు. అక్కడి వ్యాపార రహస్యాలు, కస్టమర్ డేటాబేస్, కోడ్ లాంటివి సేకరించి రెండు నెలల్లోనే మళ్లీ పాత స్టార్టప్ కంపెనీకి చేరుకుంటారు. వాటి సాయంతో కొత్త పెట్టుబడికి ప్రయత్నిస్తారు. మోసపోయిన స్టార్టప్ న్యాయపరంగా పోరాడినా ఫలితం ఉండదు. ఫలితం ఒకే వ్యాపార విధానం, వినియోగదారులు, కోడ్ తో రెండు స్టార్టప్ లు పోరాటం ప్రారంభిస్తాయి. చివరికి రెండు కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయి.

మనీ లాండరింగ్ వ్యవహారాలు

స్టార్టప్ వ్యవస్థను కొద్దికొద్దిగా తినేస్తున్న మరో రుగ్మత అధికారుల మనీ లాండరింగ్ వ్యవహారాలు. దీని కోసం సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న స్టార్టప్ కంపెనీల సీనియర్ అధికారులు కొందరు కొత్త స్టార్టప్స్ ను ప్రారంభిస్తారు. వీటి పని. మొదటి కంపెనీకి సర్వీసు అందించడం. సర్వీస్ ప్రొవైడర్ భారీ మార్జిన్లను తీసుకోవడంతో స్టార్టప్ భారీ నష్టాల్లో కూరుకుపోతోంది. నష్టాన్ని భరించే నెపంతో షేర్ హోల్డర్లకు డివిడెండ్లు, వ్యక్తిగత పెట్టుబడిదారులకు ఫీజులు చెల్లిస్తారు. అలాగే ఈ కామర్స్ స్టార్టప్ లలో వ్యవహారం మరోలా సాగుతోంది. ఈ-కామర్స్ వ్యవస్థాపకుని బంధువులే ఓ కొత్త కంపెనీని సృష్టిస్తారు. ఆ కంపెనీ చీప్ గా వస్తువులు కొని ఈ-కామర్స్ సంస్థకు బారీ ధరకు అమ్ముతుంది. ఈ విధంగా స్టార్టప్ ల ఉన్నతాధికారులే మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నారు.

మాయ పెట్టుబడులు, అసత్యాల ప్రచారం

ఓ వెంచర్ క్యాపిటల్ సంస్థ ఓ స్టార్టప్ కి విలువ మదింపు చేసి ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిందనుకుందాం. కానీ ఆ కంపెనీ తన స్టార్టప్ విలువను మరో యాభై శాతం ఎక్కువ వేసుకుని... పెట్టుబడిని రెండింతలుగా ప్రకటించుకుంటుంది. మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటుంది. పోటీదారులపై పైచేయి సాధించామని భ్రమింపచేయడానికి, స్టార్టప్ విలువ పెరిగిందని చెప్పుకోవడానికి ఆంట్రెపెన్యూర్ ఇలా చేస్తారు. పెట్టుబడి పెట్టిన వెంచర్ క్యాపిటల్ సంస్థ కూడా దీన్ని వ్యతిరేకించదు. ఎందుకంటే వారు కూడా అధిక విలువ ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టామని మార్కెట్ నుంచి మరిన్ని నిధులు సేకరించడానికి ఈ ప్రచారం ఉపయోగపడుతుంది మరి. ఈ మాయ పెట్టుబడులు, ప్రచారం వల్ల మొదటికే మోసం వచ్చే పరిస్థితి.

పరస్పర విరుద్ధ ప్రయోజనాలు

ఓ గ్లోబల్ ఫండెడ్ కంపెనీ ఓ స్టార్టప్ లో భారీగా పెట్టుబడులు పెట్టింది. కానీ కొన్నాళ్లే ఆ పెట్టుబడి నిరర్థకంగా మారుతోందని అర్థమవుతోంది. కానీ ఆ గ్లోబల్ ఫండ్ తన పెట్టుబడిని వెనక్కు తీసుకోదు. అలా తీసుకుంటే మొత్తానికే నష్టం వస్తుందని అలాంటి పరిస్థితిలోనే ఉన్న మరో ఎంజిల్ ఫండెడ్ కంపెనీలో విలీనం చేస్తారు. దీంతో కొత్త కంపెనీ విలువను ఎక్కువగా మదింపు చేసి స్టాక్స్ ను బదిలీ చేసుకుంటారు. ఎంజెల్, గ్లోబల్ ఫండ్ రెండూ విలీన కంపెనీలో వాటాలు పొందుతాయి. తమ పెట్టుబడిని సురక్షితంగా తెచ్చుకునేందుకు అన్ని అడ్డదారులూ తొక్కుతాయి. కానీ మొత్తంగా ఈ రెండు కంపెనీల్లో ఇతర వాటాదారులు తీవ్రంగా నష్టపోతారు. ఈ వ్యవహారంలో బయటకు కనిపించే అందమైన అబద్దం ఏమిటంటే... అటు మెర్జ్ అయిన కంపెనీ చేస్తున్న వ్యాపారానికి ఇటు మెర్జ్ చేసుకున్న కంపెనీ చేస్తున్న వ్యాపారానికి అసలు సంబంధం లేకపోవడం. రెండుపెట్టుబడుల సంస్థలు ఆడుతున్న నాటకం అని అంతా తెలిసినా ఏం చేయలేనితనం స్టార్టప్ వ్యవస్థకు మరో రుగ్మత.

ఐడియాలు తస్కరించేందుకు పెట్టుబడిదారుని అవతారం

విభిన్న ఐడియాలతో ఇప్పుడు యువత స్టార్టప్ లు ప్రారంభించేందుకు పెట్టుబడుల కోసం వెతుకుతూ ఉంటుంది. ఇలాంటి వారిని పట్టుకుని కొంత మంది మంది పెట్టుబడిదారుల తరహాలో వారి ఐడియాలు, కార్యచరణ, ఆ రంగంలో ఉన్న పోటీ, వాటిని ఎదుర్కొనేందుకు ఔత్సాహికుడి ప్రణాళికలు అన్నీ తెలుసుకుంటారు. తర్వాత మొహం చాటేస్తారు. కొన్నాళ్ల తర్వాత ఔత్సాహికుడికి షాక్ తగులుతుంది. ఎందుకంటే అతని ఐడియాలతోనే పెట్టుబడి పెడతానని వివరాలు తీసుకున్న వారే కొత్త కంపెనీ పెట్టేసి ఉంటారు. వెంచర్ క్యాపిటల్ ఫండ్ కంపెనీలు కూడా ఈ తరహా వ్యవహారాలకు పాల్పడుతూంటాయి. కొన్ని స్టార్టప్ లకు పెట్టుబడులు పెడతామంటూ పూర్తి వివరాలు తీసుకుంటాయి. కానీ వేరే విధంగా వాటిని ఉపయోగించుకుంటాయి. పెట్టుబడిదారులకు, ఆంట్రపెన్యూర్స్ మధ్య నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్లు ఉన్నా నిరర్థకమే. ఎందుకంటే వాటి చెల్లుబాటు ఇప్పటికీ ఇక్కడ ఒక జోక్ గానే ఉంది.

కంపెనీ క్లోజ్.. విలీనం ప్రచారం

నడవలేక మూత పడిన స్టార్టప్ ను వేరే కంపెనీలో విలీనం చేసినట్లు ప్రచారం చేస్తూ ఇన్వెస్టర్లను మోసం చేయడం స్టార్టప్ వ్యవస్థలో వేగంగా విస్తరిస్తున్న మరో రుగ్మత. ఇటీవల ఓ లాజిస్టిక్స్ స్టార్టప్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారీగా పెట్టుబడులు పెట్టింది. కానీ రెండు నెలల్లోనే ఆ కంపెనీ దగ్గర ఉన్న సొమ్మంతా హరించుకుపోయింది. కార్యకలాపాలు ఆగిపోవడంతో డెలివరీ బాయ్స్ ఆఫీసును ధ్వంసం చేసి దొరికింది పట్టుకుపోయారు. ఉన్నకొద్దిపాటి సొమ్మును వ్యవస్థపాపకులు తమ వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లకు మళ్లించుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ లాజిస్టిక్స్ కంపెనీ మరో దాంట్లో విలీనమైనట్లు పత్రికల్లో వచ్చింది. అయితే ఇందులో వాటాదారులకు విలీన కంపెనీలో ఒక్కటంటే ఒక్క షేరూ కానీ నగదు కానీ దక్కలేదు. అయితే మూతపడిన కంపెనీ వ్యవస్థాపకులు మాత్రం ఉన్నత ఉద్యోగాలు పొందారు. ఈ మొత్తం వ్యవహారంలో బలైంది నమ్మి పెట్టుబడి పెట్టినవారే.

"స్టాక్ ఆప్షన్ల" పేరుతో హామీల మోసాలు

ఆంట్రపెన్యూర్స్ ప్రతిభావంతుల్ని ఆకర్షించడానికి సంస్థలో స్టాక్ ఆప్షన్స్ ను ఆఫర్ చేస్తుంటారు. ఇలా స్టాక్ ఆప్షన్స్ ఆశతో రేయింబవళ్లు కష్టపడి పనిచేసి స్టార్టప్ వృద్ధికి పాటుపడతారు. కానీ చివరికి స్టార్టప్ జూమింగ్ కి వెళ్లి వాల్యూ పెరిగినప్పుడు స్టాక్ ఆప్షన్స్ ను ఇచ్చే విషయంలో ఆంట్రపెన్యూర్లు ఆసక్తి చూపించరు. పైగా అలాంటి అవకాశం ఉన్నవారిని డీమోరలైజ్ చేసి సంస్థ నుంచి వెళ్లిపోయేలా చేస్తారు. మొత్తం వ్యవహారం జరిగిపోయేటప్పటికి.. అతని చేదు అనుభవం మాత్రమే మిగులుతుంది. యువ ప్రతిభావంతుల్ని స్టార్టప్ లు ఇలాగే వాడుకునే ఈ రుగ్మత వేగంగా పాకుతోంది. ఎందుకంటే ఇలా మోసపోయిన వారు.. ఇతరుల్ని ఇలానే మోసం చేసేందుకు ప్రయత్నిస్తూండటమే దీనికి కారణం.

ఇవన్నీ చదివిన తర్వాత స్టార్టప్ వ్యవస్థలో భాగంగా ఉన్నవారు... ఇది ఫలానా కంపెనీలో జరిగింది...! మా మిత్రుని స్టార్టప్ కంపెనీలో జరిగిన వ్యవహారమే ఇది...! ఆ స్టార్టప్ నన్ను స్టాక్ఆప్షన్ల విషయంలో మోసం చేసింది. ..! అని ఉదాహరణలు వెతుక్కోవడం చాలా సహజం. ఎందుకంటే స్టార్టప్ వ్యవస్థలో ఇవి నిత్యకృత్యంగా మారాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది స్టార్టప్ వ్యవస్థకు కేన్సర్ గా మారుతున్నాయి. ప్రపంచంలో మరణించే ప్రతి ఆరుగురిలో ఒకరు కేన్సర్ కారణంగా మరణిస్తున్నాంటే.. ఇది ఎంతటి ప్రాణాంతక వ్యాధో అర్థం అవుతోంది. స్టార్టప్ వ్యవస్థకూ ఈ అవలక్షణాల క్యాన్సర్ మహమ్మారిగా మారేలా ఉంది. దీన్ని పెంచేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్లు కూడా వెనుకాడటం లేదు. తాత్కాలిక ప్రయోజనాలతో వారు బయటపడతారు. కానీ మొత్తానికి ఇక్కడి స్టార్టప్ వ్యవస్థే బలయ్యే ప్రమాదం ఉంది.

ఇండియాలో ఐడియాలతో ఉన్న యువతరానికి, సుదీర్ఘకాలం నడిచే స్టార్టప్ ల ఆవిర్భావానికి కొదవే లేదు. అయితే ఈ ప్రయాణాన్ని సక్రమంగా నడిపే న్యాయవిధానం లేకపోవడమే ప్రధాన లోపం. ప్రతి ఒక్కరూ తమ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అంతే కానీ, తప్పుడు విధానాలతో మన ఇల్లును మనమే గుల్లు చేసుకోకూడదు. భారతదేశంలో టెక్నాలజీ బిజినెస్ కొన్నాళ్లకు నెంబర్ వన్ అవుతుంది. అవినీతిరహితంగా, ప్రతిభ, విజ్ఞానం మీద ఈ వ్యవస్థ నిలబడుతుంది. స్టార్టప్ వ్యవస్థలో భాగంగా ఉన్న వారు తమను కబళించేందుకు ప్రయత్నిస్తున్న రుగ్మతలను అంతమొందించినప్పుడే ఇది సాధ్యం.

స్టార్టప్ నిలబడాలంటే చిత్తశుద్ధి, నిజాయితీ ఆయుధాలుగా యుద్ధం చేయాల్సిందే... ! అదొక్కటే సక్సెస్ కు షార్ట్ కట్