మూతబడ్తున్న సైబర్ కెఫేలకు మరో లైఫ్ లైన్

మూతబడ్తున్న సైబర్ కెఫేలకు మరో లైఫ్ లైన్

Sunday April 26, 2015,

3 min Read

ఇంటర్నెట్... ఇదో విలాసవంతమైన ప్రపంచం. బాగా డబ్బున్నవాళ్లు మాత్రమే ఉపయోగించేవారు. సైబర్ కేఫ్‌లలో అందుబాటులో ఉన్నా... ఒక్కొక్కరి నుంచి గంటకు రూ.40 నుంచి రూ.60 వరకూ వసూలు చేసేవారు. ఇంటర్నెట్ బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న రోజుల్లో సంగతులివి ! సైబర్ కెఫేలు ఎప్పుడూ జనంతో నిండి ఉండేవి. ఈ జనంలో పిల్లలూ ఉండేవారు. ఎందుకంటే... వీడియో గేమ్స్ ఒక్కటే కారణం. ఆ కాలంలో ఏర్పాటైన సైబర్ కేఫ్‌లు అన్నీ వీడియో గేమ్‌ల ద్వారా పిల్లలను ఆకర్షించి ఎంత సంపాదించాలో అంతకంటే ఎక్కువే వెనకేశారు. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సిఫీలాంటి కొందరు సర్వీస్ ప్రొవైడర్లైతే... మరి కొంత ముందుకెళ్లి ప్రత్యేక అప్లికేషన్లను కూడా రూపొందించారు. వీటి సాయంతో ఇంటర్నెట్ కేఫ్‌లో ఎవరు ఎంత డబ్బు చెల్లిస్తే దానికి తగ్గట్లుగా సమయం కేటాయించేవారు. ఆ సమయం ముగిసిన వెంటనే నెట్ డిస్‌కనెక్ట్ అయ్యేది. ఒక్క సెకను కూడా అదనంగా బ్రౌజ్ చేయడానికి అవకాశం ఇచ్చేవారు కాదు. ఇదంతా సుమారు పదిహేనేళ్ల క్రితం మాట.

ఫ్యునిజెన్ భారత టీమ్

ఫ్యునిజెన్ భారత టీమ్


మరి ఇప్పుడో... ఇంటర్నెట్ అంటే తెలియని వారు లేరు. మాటలు కూడా నేర్వని పసివాడి నుంచి పండు ముసలి వరకూ అందరికీ అదో తప్పనిసరి అవసరంగా మారిందంటే ఆశ్చర్యం లేదు. కాలంతో పాటే టెక్నాలజీ పెరిగింది. ధనికులకే పరిమితమైన ఇంటర్నెట్ బాగా చీప్‌గా మారింది. అందరికీ అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే మన జీవితాల్లోకి ప్రవేశించిందో... ఇంటర్నెట్ కూడా దానితోపాటే చొచ్చుకువచ్చింది. ఈ వృద్ధి కారణంగా... ఒకప్పుడు అద్భుత వ్యాపారంగా ఉన్న సైబర్ కేఫ్‌లన్నీ మూతపడ్డాయి. పెద్ద పెద్ద నగరాల్లో వీటి జాడ కూడా ఇప్పుడు లేదు. కొన్ని చిన్నా చితకా నగరాల్లో మాత్రం అక్కడక్కడా ఇవి ఇంకా దర్శనమిస్తూ ఉంటాయి. ఈ మార్పునంతటినీ నిశితంగా పరిశీలించిన క్రిస్‌లీ కి ఓ అద్భుత ఆలోచన మదిలో మెదిలింది. మూతపడిన సైబర్ కేఫ్‌లను మళ్లీ పునః ప్రారంభించాలనుకున్నాడు. అలా పుట్టిందే ఫ్యునిజెన్.

కొరియా దేశస్థుడైన క్రిస్ లీ... దక్షిణ కొరియాలోని ఓ అమెరికన్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా తన కెరియర్ ప్రారంభించాడు. కానీ కొన్ని రోజుల్లోనే ఆ కంపెనీని వదిలేసి... తన మనసుకెంతో ఇష్టమైన గేమింగ్ ఇండస్ట్రీలో చేరారు. నాకో ఇంటరాక్టివ్ అనే ఓ కంపెనీలో మార్కెటింగ్ డైరెక్టర్‌గా చేరిన క్రిస్ లీకి... చైనా, థాయ్ లాండ్, ఇండోనేషియా, తైవాన్ వంటి దేశాల్లో అక్కడి యువతకి అవసరమైన, ఆసక్తికరమైన గేమ్‌లను రూపొందించే బాధ్యతను అప్పగించింది మేనేజ్‌మెంట్. అయితే క్రిస్ కి భారత్‌ను కూడా ఈ జాబితాలో చేర్చాలని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఎందుకంటే అత్యధిక యువ జనాభా ఉన్న దేశం, గేమింగ్ మార్కెట్ ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందని మార్కెట్ భారత్ మాత్రమే.

“జనాభా పరంగా ఇండియా చైనాను త్వరలోనే అధిగమిస్తుంది అని ఎన్నో సర్వేలు, సంస్థలు చెబుతున్నాయి. చైనాలో మా గేమ్స్ కి ఎంత ఆదరణ ఉంటుందో నిశితంగా పరిశీలిస్తే... భారత్‌లో అవకాశాలను స్పష్టంగా అంచనా వేయవచ్చు. ఈ రెండు దేశాల్లో యువత చాలా యాక్టివ్‌గా ఉంది. వారు ఆధునిక ప్రపంచంలో వస్తున్న మార్పులను ఒడిసి పట్టడానికి, ట్రెండ్‌కి అనుగుణంగా తమను తాము మార్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటున్నారు. ఇది చాలు ఏ వ్యాపారాన్నైనా ముందుకు తీసుకెళ్లడానికి”... అంటారు క్రిస్ లీ.

భారత్ లో గేమింగ్ రంగం ఇంకా పూర్తిగా పుంజుకోలేదు. దీన్నే ఓ సవాలుగా తీసుకుని అవకాశంగా మార్చుకుంది ఫ్యునిజెన్. రెండు రకాల ప్రణాళికలతో సిద్ధమైంది. అందులో మొదటిది... సైబర్ కేఫ్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్. దీని సహాయంతో కేఫ్‌లోని కంప్యూటర్లను వైరసుల బారినుంచి కాపాడుకోవచ్చు. యూజర్లు వారికిష్టమొచ్చిన సాఫ్ట్‌వేర్లను డౌన్ లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయకుండా అడ్డుకోవచ్చు. రెండోది... ఎలాంటి గేములు, ఏ తరహాలో ఆడుతున్నారో పర్యవేక్షించవచ్చు. ఫ్యునిజెన్ చిన్న నగరాలు, పట్టణాల్లోని సైబర్ కేఫ్‌లకు మొదట ఈ సాఫ్ట్‌వేర్‌ని ఉచితంగా అందచేసింది. దీని సహాయంతో కేఫ్‌ను సమర్థంగా ఎలా మేనేజ్ చేయవచ్చో యజమానులకు అవగాహన కలిగించింది. తర్వాత వారికి ఈ-పిన్ ఉపయోగించే విధానంపై శిక్షణనిచ్చింది.

ఈ-పిన్... ఇది మల్టీప్లేయర్ గేమ్స్ ఆడటానికి ఉపయోగించే ఆన్ లైన్ కరెన్సీ. దీని ద్వారా గేమ్ ఆడేందుకు కావలసిన సమయాన్ని కొనుక్కోవచ్చు. ఇదే ఫ్యునిజెన్ రెవెన్యూ మోడల్.

గేమింగ్‌కి మరింత విస్తృత ప్రచారం కల్పించడానికి ఫ్యునిజెన్ ఎల్స్ వర్డ్ అనే ఓ కొత్త గేమ్‌ను రూపొదించి విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా గేమింగ్ టోర్నమెంట్లను కూడా నిర్వహించవచ్చు. అంతేకాకుండా ఆదాయం కూడా గణనీయంగా పెంచుకోవడానికి ఇది తోడ్పడుతుంది. ప్రస్తుతం ఎల్స్ వర్డ్‌లో రిజిస్టర్ చేసుకున్న వారు సంఖ్య దాదాపు 1 లక్ష పైమాటే. ఈ స్పందనను గమనించి ఎంతోమంది వెంచర్ కేపిటలిస్టులు దీనిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకూ సుమారు 2 మిలియన్ల అమెరికన్ డాలర్లు వరకూ నిధులు సమకూరాయి.

ఇంతకు ముందే అనుకున్నట్లు... భారత్‌లో ఇంటర్నెట్ మన నిత్యజీవితంలో విడదీయరాని అవసరంగా మారినప్పటికీ గేమింగ్ ఇంకా ఆ స్థాయిలో వృద్ధి చెందలేదు. దీనికి తగిన కారణాలపై ఇంతవరకూ ఎలాంటి అధ్యయనం కానీ, సర్వేలుగానీ చేసిన దాఖలాలు కూడా లేదు. స్మార్ట్ ఫోన్ లోనే అన్ని రకాల గేమ్స్ ఆడేందుకు అవకాశం వస్తున్న ఈ రోజుల్లో గేమింగ్ కేఫ్ (సైబర్ కేఫ్)ల తో సక్సెస్ కోసం ప్రయత్నాలు చేయడం నిజంగా సాహసమే. అందువల్ల ఇంత భారీస్థాయిలో ప్రారంభంకానున్న ఫ్యునిజెన్ ఎంత వరకూ విజయ తీరాలకు చేరుతుందనేది ఆసక్తికరమైన అంశమే