సర్వీస్ యాప్స్‌లో హాప్టిక్ విప్లవం

కస్టమర్ సర్వీస్‌లో కొత్త విప్లవంఅన్ని సర్వీస్ స్టేషన్ల నెంబర్లను ఒక్క చోటకి తెచ్చిన హాప్టిక్తొలి ఏడాదే లక్షల కొద్దీ యాప్ డౌన్‌లోడ్స్టాప్ 25 యాండ్రాయిడ్ యాప్స్ జాబితాలో చోటుఐఓఎస్‌లో టాప్ 50లో స్థానం

సర్వీస్ యాప్స్‌లో హాప్టిక్ విప్లవం

Sunday April 12, 2015,

4 min Read

మార్చి 31, 2014 యాప్టిక్ లాంఛ్ డేట్. విడుదలైన ఏడాదిలోనే లక్షల కొద్దీ అప్లికేషన్లను తోసిపుచ్చి టాప్-25 జాబితాలో చేరిపోయింది హాప్టిక్. ఇంత వేగంగా పాపులర్ అయిన ఆప్‌ని మరిన్ని మెట్లు ఎక్కించేందుకు సహవ్యవస్థాపకుడు, సీఈఓ ఆక్రిత్ వైష్ ప్రణాళికలు రచించడంలో నిమగ్నమయ్యారు. కస్టమర్ సర్వీస్, యూజర్ టూ బిజినెస్ మెసేజింగ్ సేవలు భవిష్యత్తులో శరవేగంగా అభివృద్ధి చెందుతాయనే అంచనాలున్నాయి. ఈ రంగంలో లీడర్‌గా హ్యాప్టిక్‌ స్థానాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఆక్రిత్ వైష్ కృషి చేస్తున్నారు. గత 18 నెలల్లో ఆండ్రాయిడ్ యాప్స్‌లో టాప్-25లోకి, ఐఓఎస్‌లో టాప్-50లోకి చేరిపోయింది. ప్రతీ నెలా 4 కోట్లకుపైగా యాక్టివ్ యూజర్స్ హాప్టిక్ సైట్ సొంతం.

ఇదీ ప్రారంభం

రాబోయే పదేళ్లలో మొబైల్ మెసేజింగ్ సమాచార రంగంలో నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంటుందన్న నమ్మకమే పునాదిగా... హాప్టిక్ జీవం పోసుకుంది. ఫ్లర్రీ.కాంలో విధులు నిర్వహిస్తున్నపుడు వాట్సాప్, టెక్స్ట్ ఫ్రీ, టెక్స్ట్ ప్లస్ వంటి కంపెనీలతో అనుబంధం ఉండేది. ఈ సమయంలోనే స్మార్ట్ ఫోన్ మెసేజింగ్ సర్వీస్‌కి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని నమ్మేవారు ఆక్రిత్. ఈ రంగంలోనే మరిన్ని ప్రయోగాలు చేసేవారు. స్మార్ట్ ఫోన్లలో సమాచార విప్లవం ప్రారంభం కానుందనే అంశాన్ని గుర్తించిన వెంటనే ఆ దిశగా అడుగులు పడ్డాయి. కంప్యూటర్‌లో సెర్చ్ బార్ ద్వారా సమాచారాన్ని వెతుక్కుంటున్నాం. కానీ స్మార్ట్ ఫోన్‌లో సెర్చ్ బార్‌కి కంటే సులువుగా సమాచారాన్ని చేరవేసే ఛాన్సుందనే విషయం ఈ-ఇంజనీర్లు ఎప్పుడో గుర్తించారు. దాన్ని ఆచరణలో పెట్టే దిశగా వడివడిగా అడుగులు వేశారు. దానిలో భాగంగానే మెసేజింగ్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌పై పట్టాలెక్కిందే హాప్టిక్.

ఆక్రిత్, మరో సహ వ్యవస్థాపకుడు స్వపన్ 2012లో ఈ ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభించగా... ఆగస్టు 2013లో పూర్తిస్థాయి కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం 19మంది నిపుణులైన టీం, 80 మంది చాట్ ఎక్స్‌పర్ట్స్ స్థాయికి చేరుకుంది. వీరంతా కస్టమర్ల ఎంక్వైరీలకు నిరంతరం సమాధానాలిస్తూ ఉంటారు.


ఆక్రిత్ వైశ్, స్వపన్ రాజ్ దేవ్ - వ్యవస్థాపకులు

ఆక్రిత్ వైశ్, స్వపన్ రాజ్ దేవ్ - వ్యవస్థాపకులు


ప్రారంభానికి ముందేం జరిగింది ?

ముంబైలో నివసిస్తున్న ఆక్రిత్.. 19 ఏళ్ల వయసులో చికాగోలోని యూనివర్సిటీ ఇల్లినాయ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లారు. మొదటి ఏడాదంతా ఏం జరుగుతుందో అర్ధంకాని భయాందోళలనతోనే గడిచిపోయింది. "చిన్నప్పటి నుంచి కుటుంబ వాతావారణం మధ్యే ఉండడంతోపాటు మంచీచెడూ అంతా పెద్దవారే నిర్ణయించే సంస్కృతిలో పెరిగాను. తోడబుట్టినవాళ్లెవరూ లేకపోవడంతో అల్లారుముద్దుగా పెంచింది మా ఫ్యామిలీ. ఎప్పుడూ హాస్టల్ కానీ, బోర్డింగ్ స్కూల్ కానీ చూసి ఎరగను. అలాంటిది ఒకేసారి అమెరికా యూనివర్సిటీలో విద్యాభ్యాసమంటే భూతాల సామ్రాజ్యంలో ఒక్కడినే ఉన్నట్టుగా ఫీలయ్యానం"టారు ఆక్రిత్. కానీ మనసుంటే మార్గం ఖచ్చితంగా ఉంటుంది. తనను తాను నిలబెట్టుకోవడం కోసం కొన్ని నెలలపాటు చాలా ఇబ్బందులు పడ్డానని చెబ్తారు.

చలికాలంలో చాలా ఇబ్బంది పడేవాడిని, అన్నీ వదిలేసి ఇండియా పారిపోయి వచ్చేద్దామనే భావన కలిగేది. అయితే ఏ పనినైనా మధ్యలోనే వదిలివేయడం సమంజసం కాదనే ఉద్దేశ్యంతో ఎంత కష్టమైనా సరే కోర్స్ పూర్తి చేయాలని భావించారు ఆక్రిత్. అయితే రెండో సెమెస్టర్ నాటికి పరిస్థితులకు అలవాటు పడ్డంతో కొంత ఊరట కలిగింది. "జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో, ఏ రకంగా లీడ్ చేసుకుంటే బావుంటుందో అనే అంశాలపై మరింతగా అవగాహన ఈ సమయంలోనే కలిగింద"న్నది ఆక్రిత్ మాట.

పదిమందీ నడిచే బాటలో కాకుండా... జీవితానికి సొంతదారి నిర్మించుకోవాలని ముందునుంచే అనుకునే ఆక్రిత్. అయితే అప్పుడు అతనికి తండ్రి రూపంలో ప్రారంభంలోనే వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే అవకాశమొచ్చింది. ముంబైలో టెక్స్‌టైల్ వ్యాపారంలో చేరేందుకు ఒప్పుకుంటే చాలు.. అతని జీవితం మరో మలుపు తిరిగేదే.


హ్యాప్టిక్ వెబ్ పేజ్

హ్యాప్టిక్ వెబ్ పేజ్


కుటుంబ వ్యాపారానికి మించి ఏదైనా చేయగలమా ?

“ కుటుంబంలోనే వ్యాపార అవకాశముంది. తన ఆలోచనల్లో ఓ ప్రత్యేక వాణిజ్య సామ్రాజ్యముంది.. రెండింటిలో ఏది ఎంచుకోవాలనే సుదీర్ఘ అంతర్మథనం" తర్వాత... ఓ సమస్యకు పరిష్కారం చూపించే తన దారినే ఎంచుకునేందుకు రెడీ అయ్యారు ఆక్రిత్. కుటుంబ వ్యాపారంలో తన అవసరం అంతగా ఏం లేదని భావించారాయన. అప్పుడే స్మార్ట్ రంగంలోని నిపుణులతో పరిచయాలు, అనుబంధం పెంచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించగా... మోటరోలాలో చేసిన ఇంటర్న్‌షిప్ తన లక్ష్య సాధనకు మరింత సాధనకు సహాయపడిందని చెప్తారాయన. తర్వాత కొన్నాళ్లపాటు డెలాయిట్‌లోనూ కీలక పదవిలో విధులు నిర్వహించడం విశేషం.

2008-09 కాలంలో మొదటిసారిగా యాప్ స్టోర్ లాంఛ్ అయింది. అప్పుడందరూ మొబైల్ అప్లికేషన్లు తెచ్చే విప్లవాత్మక మార్పులగురించే మాట్లాడుకునే వారు. "ఫ్లర్రీ ఆ సమయంలోనే రిక్రూట్‌మెంట్స్ ప్రారంభించింది. అయితే నేను అపాయింట్మెంట్ కూడా సాధించలేకపోయాను. ఆ తర్వాత ఫ్లర్రీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరై... సంస్థ ప్రతినిధులతో మాట్లాడాను. తర్వాత అంతా కొత్త చరిత్ర రాసేంత స్థాయిలో అభివృద్ధి సాధించామంటారు ఆక్రిత్.

బ్యాట్‌మ్యాన్ నుంచి హ్యాప్టిక్ వరకూ

అదే సమయంలో ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ వంటి స్టార్టప్ సంస్థలు వేగంగా వృద్ధి చెందుతున్న వైనాన్ని, వాటికంటూ మార్కెట్‌లో పెంచుకుంటున్న సామర్ధ్యాని గుర్తించారు ఆక్రిత్. అంతే భారత్‌కి తరలివచ్చి, ఫ్లర్రీ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇక్కడ కూడా ఫ్లర్రీ సేవలు మొదలుపెట్టారు. అదే సమయంలో పలు రకాల స్టార్టప్ కంపెనీలను పరిశీలించడం, కొన్నింటిలో పెట్టుబడుల వరకూ కూడా వెళ్లారాయన. స్నేహితులు స్వపన్ రాజ్‌దేవ్, హరీష్ ఆనంద్ తిలకన్, గురువు మితేన్ సంపత్‌లతో కలిసి మొబైల్ మెసేజింగ్‌లోకి అడుగుపెట్టి.. ఫుల్‌టైంగా కష్టపడ్డం ప్రారంభించారు. 2013లో బ్యాట్‌మ్యాన్ పేరుతో ఒక యాప్ లాంచ్ చేశారు ఈ ఔత్సాహిక వ్యాపారవేత్తలు. అంతకుముందు ఏడాది రిలీజైన ది డార్క్ నైట్ రైజెస్‌కు అప్పటికీ క్రేజ్ ఉండడంతోనే ఆ పేరు ఎంచుకున్నామని చెప్తారు.

ఆ తర్వాత మరో బ్రాండ్ నేమ్ కోసం విపరీతంగా కృషి చేసింది ఈ టీం. “ఒక్కొక్కరూ 100పేర్ల చొప్పున సజెషన్ ఇవ్వగా... చివరకూ అందరూ హ్యాప్టిక్ దగ్గర ఆగిపోయారు. హ్యాప్టిక్ అంటే నోటి ద్వారా చెప్పాల్సిన అవసరం లేని ఫీడ్ బ్యాక్ అని అర్ధం. ఈ పదం జర్మన్ పదం హాపిక్ నుంచి పుట్టింద"ని చెప్పారు ఆక్రిత్.


హ్యాప్టిక్ టీమ్

హ్యాప్టిక్ టీమ్


ఏడాదిలో ఎనలేని ప్రగతి

“గతేడాది తమ సంస్థలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నిధుల సమీకరణ, ఆదాయం పెరిగాక.. పెద్ద ఆఫీస్ క్యాంపస్ లోకి మారాం. కస్టమర్లనుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్‌ని పరిశీలిస్తూ, విమర్శలన్నింటికీ సమాధానమిస్తూ... అభివృద్ధికి అడుగులు పడేలా చేశామం"టున్నారు ఆక్రిత్. గత ఆర్నెలలుగా మాత్రం పరిస్థితిలో మార్పు శరవేగంగా వచ్చింది. పోటీ విపరీతంగా పెరుగుతోంది. లుకప్ మెసెంజర్, యెల్లో మెసెంజర్, లోకలోయే వంటి యాప్స్ గట్టి పోటీనిస్తున్నాయి. ఈ సమయంలో హాప్టిక్‌ని ఎలా ముందుకు తీసుకెళ్తారు ? ఇప్పుడొస్తున్న పోటీని ఎలా తట్టుకుంటారు ? మరికొన్ని నెలల్లోనే మార్కెట్ లీడర్‌గా ఎదగాలన్న లక్ష్నాన్ని ఎలా అందుకుంటారు ? ఇప్పటికే మొదటి యానివర్సరీ పూర్తికావడం, క్రేజ్ పెరగడంతో మరిన్ని విప్లవాత్మక మార్పులకు, పెట్టుబడులకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే వీటన్నిటినీ హాప్టిక్ టీం ఎలా ఎదుర్కోనుందన్న అంశంపై ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది.