పొలిటీషియన్ల దగ్గర ఫెలోషిప్స్.. 'స్వనీతి' కొత్త మంత్రం

పొలిటీషియన్ల దగ్గర ఫెలోషిప్స్.. 'స్వనీతి' కొత్త మంత్రం

Wednesday August 26, 2015,

4 min Read

ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో టెక్నాలజీ వినియోగం ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. టెక్నాలజీతో లైఫ్ స్టైల్ మారిపోయింది. ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రపంచంలో ఎంతో మంది యువకులు తమ ప్రభుత్వాల్లో చురుగ్గా భాగస్వాములయ్యారు. భారత్ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. అభివృద్ధి కార్యక్రమాల్లో 30 ఏళ్లలోపు యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాళ్లే ఇప్పుడు భవిష్యత్తు. పాతతరంలాగా రాజకీయ నాయకులు మాత్రమే ప్రజాసేవ చేయాలి అని నేటి తరం అనుకోవట్లేదు. ప్రజాసేవ చేయడానికి, ప్రజలతో మమేకం కావడానికి నేటి యువత ఎంతో ఉత్సాహం చూపిస్తోంది. అన్నాహజారే ఉద్యమంలో ఎంతోమంది పెద్దవాళ్లు పాల్గొన్నప్పటికీ.. దాన్ని వెనుకనుంచి నడిపించింది మాత్రమే యువకులే..! ఫేస్ బుక్, ట్విట్టర్‌ల ద్వారా అన్నా ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లిందీ వాళ్లే.. ! ప్రస్తుతం యువకులు కూడా రాజకీయరంగంలో చురుగ్గా పాల్గొంటున్నారు. రాజకీయ రంగంలో వీళ్ల రాక ఎలాంటి మార్పు తీసుకొస్తుందో చూడాల్సి ఉంది. ఇక రాజకీయాలతో స్టార్టప్‌ల భాగస్వామ్యమూ కొత్తకాదు. అలాంటిదే ర్విత్విక భట్టాచార్య స్టార్టప్ స్వనీతి (Swaniti).

స్వనీతి బృందం

స్వనీతి బృందం


“ స్వనీతి (Swaniti) 2009లో హార్వర్డ్‌లో పురుడుపోసుకుంది. భారత రాజకీయ రంగంలోకి ప్రవేశించాలనుకునే యువకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని నాతో పాటు ఇద్దరు సహ విద్యార్థులు గమనించాం. కొంతమంది విద్యార్థులు ఇక్కడ చదువులు అయిపోగానే ఇండియా వెళ్లి రాజకీయాలు, అభివృద్ధిలో భాగస్వాములైనవాళ్లు ఉన్నారు. అయితే.. రాజకీయ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేక సమతమతమవుతూ ఉన్నారు. ఇందుకు కారణం వాళ్లకు తగిన నెట్వర్క్ లేకపోవడమే” అంటారు ర్విత్విక. 

ర్విత్వికతో పాటు మరో ఇద్దరు స్వయంగా ఓ పార్లమెంట్ మెంబర్‌తో కలిసి పనిచేశారు. టాలెంట్ ఉన్న యువకులతో కలిసి ఎలా పనిచేయాలనేదానిపై వాళ్లు పరిశోధన చేశారు. “ కొంతమంది ఎంపీలు తమ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాలకు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లే వారికోసం చూస్తున్నారు. అయితే వారితో కలిసి పనిచేసేవారు కరువయ్యారు. ఇక్కడ డిమాండ్ – సప్లై సూత్రాన్ని అన్వయించవచ్చు. దీని ఆధారంగానే స్వనీతి పుట్టుకొచ్చింది. అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లగలగడం ద్వారా యువతను నాయకత్వంతో అనుసంధానం చేయవచ్చు అనే కాన్సెప్ట్‌తో ఇది తయారైంది ” అని చెప్పారు ర్విత్విక.

వాళ్లు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకున్నారు. ముఖ్యంగా రాజకీయ నేతృత్వంలో..! ఆమె ప్రపంచ బ్యాంకుతో కలిసి పనిచేసినప్పుడు ఎంత సమర్థంగా.. స్థిరంగా ప్రాజెక్టులను అమలు చేయవచ్చో ప్రత్యక్షంగా చూసింది. దీంతో ఆమె పార్లమెంటు మెంబర్లను ఎంచుకుంది. ఎందుకంటే ప్రాజెక్టులను అమలు చేసేందుకు, అభివృద్ధికి వాళ్లను సాధకులుగా భావించింది. కొన్ని ఆచరణాత్మకమైన ప్రాజెక్టులను ఆమె గుర్తించింది. నియోజకవర్గ అభివృద్ధికి తమ టీమ్ ఎంత మేర పనిచేయగలదో ప్రణాళిక రూపొందించింది. అలా స్వనీతి(Swaniti) ఆరంభమైంది.

ర్విత్విక వెనుక మంచి టీమ్ ఉంది. ముఖ్యమంత్రులు, ఎంపీల వెనుక ఉండి పనిచేయగల సత్తా ఉన్న వ్యక్తులున్నారు. కోర్ టీంలో హరిహరన్ శ్రీరాం ముఖ్యమైన వ్యక్తి. IIM-C నుంచి ఈయన పట్టా పుచ్చుకున్నారు. ప్రస్తుతం FMCG రంగంలో హరిహరన్ పనిచేస్తున్నారు. గతంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో కలిసి పనిచేశారు. స్వనీతిలో వ్యూహాలు, భాగస్వామ్యులపై హరిహరన్ పనిచేస్తారు. ఇక స్వనీతిలో గవర్నెన్స్ ల్యాబ్‌కు వరుణ్ సంతోష్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రజలతో భాగస్వాములయ్యేందుకు ఆయన ప్రైవేటు ఉద్యోగాన్ని వదిలి వచ్చేశారు. పర్యావరణం, మానవ వనరుల అభివృద్ధి అంశాలపై వరుణ్ సంతోష్‌కు అపారమైన అనుభవం ఉంది. ఓ ముఖ్యమంత్రితో పాటు ఓ ఎంపీతో ఇదే అంశాలపై పనిచేశారు కూడా.. ! ప్రస్తుతం ఈయన సిక్కిం సీఎం ఆఫీసుతో కలిసి పనిచేస్తున్నారు. స్వనీతి మార్కెటింగ్ డైరెక్టర్‌గా అన్షుమన్ దిద్వానియా పనిచేస్తున్నారు. సంస్థ ప్రారంభం నుంచి ఈయన కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎంపీ సుల్తాన్ అహ్మద్‌తో భాగస్వాములై ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉలుబేరియా ప్రాంతంలో మైక్రోఫైనాన్స్‌లో 20 లక్షల మంది మహిళలను భాగస్వాములను చేశారు. స్వనీతిలో ప్రత్యేక కార్యక్రమాలకు గీతా రామకృష్ణన్ నేతృత్వం వహిస్తున్నారు. ఎంపీ అనురాగ్ ఠాకూర్‌తో కలిసి పనిచేస్తున్న గీతా.. స్వనీతిలో ఆరంభం నుంచి ఉన్నారు. అనురాగ్ నియోజకవర్గం అభివృద్ధి ప్రణాళికను గీత రూపొందిస్తున్నారు. ఇక స్వనీతిలో అత్యంత యువకుడు సౌరవ్ కుందూ.. స్వనీతిలో ఇంటర్నెట్ విప్లవాన్ని తీసుకొచ్చారు. వెబ్ సైట్, బ్లాగులు, లింకులు.. ఇలా అన్ని అంశాలను ఈయన చూసుకుంటున్నారు.

స్వనీతి కార్యక్షేత్రం

స్వనీతి కార్యక్షేత్రం


ప్రస్తుతం వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం.. ఇలా మూడు కాలాల్లో ఫెలోషిప్స్ అందిస్తున్నారు. IIT, IIM, స్టాన్‌ఫోర్డ్, హార్వర్డ్ .. తదితర సంస్థల విద్యార్థులు ఫెలోషిప్‌ల కోసం అప్లై చేసుకుంటున్నారు. ఫెలోషిప్ సమయంలో వసతి, భోజన సౌకర్యంతో పాటు కొంత స్టైఫండ్ అందిస్తున్నారు. ఈ సమయంలో వారి నిబద్ధత చాలా ఆశ్చర్యం కలుగుతోంది. 

“ ప్రజల సహకారంతో ప్రభుత్వాలు ఏర్పాటవ్వాలని ఎంతో మంది యువకులు కోరుకుంటున్నారు. ఇందుకు వారు దోహదపడాలనుకుంటున్నారు. భారత్‌లో సుస్థిరమైన అభివృద్ధిని తీసుకురాగలిగితే ప్రజలను, ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయొచ్చు. వనరులు లేకపోవడం వల్ల ఇప్పుడు మనం సమస్యలను ఎదుర్కోవట్లేదు. వ్యవస్థను గాడిలో పెట్టే సరైన వ్యక్తులు లేకపోవడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి ” అంటారు ర్విత్విక.

ఎంపీ దినేష్ త్రివేదితో స్వనీతి బృందం

ఎంపీ దినేష్ త్రివేదితో స్వనీతి బృందం


హరిహరన్ తన ప్రణాళికలను ఇలా వివరించారు.. “సంఖ్యా పరంగా చూసినప్పుడు రాబోయే రెండేళ్లలో అభివృద్దే లక్ష్యంగా పనిచేసే 10శాతం ఎంపీ, ఎమ్మెల్యేలను అనుసంధానించాలని అనుకుంటున్నాం. నిర్దిష్టమైన అభివృద్ధి ప్రాజెక్టులపై పనిచేయబోతున్నాం. సమాజంలో 3 రకాల అంశాలను ప్రజలకు చేరువ చేయాలనేది మా లక్ష్యం. 1. అట్టడుగున ఉన్నవారికి అభివృద్ధి అంశాలను చేర్చడం 2. యువకులను రాజకీయాల్లోకి తీసుకురావడం, క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలపై వారికి అవగాహన కల్పించడం 3. సమర్థవంతమైన మానవ వనరులను అందించడం ద్వారా నాయకత్వాన్ని పెంపొందించడం..”

స్వనీతి వివిధ అంశాలపై పనిచేస్తోంది. కేరళలో నీటి శుద్ధిపైన, హిమాచల్ ప్రదేశ్ లో విద్యా ప్రమాణాల మీద.. పశ్చిమ బెంగాల్ లో మైక్రోఫైనాన్స్ మీద దృష్టి కేంద్రీకరించింది. పనిచేసిన 6 ప్రాజెక్టులపై స్పష్టమైన అభివృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం ఎంపీలు కమల్ నాథ్, శ్రీకాంత్ జెనా, జయపాండా, అజోయ్ కుమార్‌లతో స్వనీతి అవగాహనను కుదుర్చుకుంది.

ఫెలోషిప్ లతో పాటు ప్రస్తుతం కాలేజీ క్యాంపస్‌లకు కూడా చేరువయ్యేందుకు స్వనీతి కృషి చేస్తోంది.

స్వనీతి టీంతో డా.అజోయ్

స్వనీతి టీంతో డా.అజోయ్


తన గవర్నెన్స్ ల్యాబ్ ద్వారా నిపుణులైన రాయబారులను అందిస్తోంది స్వనీతి. “నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడమే మా ముందున్న అతి పెద్ద సవాల్. అది పూర్తిచేయడమే పెద్ద వరం. నిబద్దత కలిగిన యువకుల ద్వారా గుర్తించిన సమస్యను పరిష్కరించవచ్చు. రాజకీయ నాయకులు ఇలాంటి మార్పునే చూడాలనుకుంటున్నారు. ఈ రంగంలో విస్తృతమైన అవకాశాలున్నాయని మేం గుర్తించాం. సమయం వృధా చేయకుండా సమర్థంగా, సున్నితంగా దీన్ని పూర్తి చేయడమే మా ముందున్న అతి పెద్ద ఛాలెంజ్..” అంటారు ర్విత్విక.