నాకేమీ తెలియదు..! అయినా నాకేం బాధ లేదు..!

Wednesday April 06, 2016,

5 min Read


ఈ మధ్య బెంగళూరులోని షాంగ్రీ లా హోటల్‌లో జరిగిన CXO సెమికండక్టర్‌ మీట్‌కు అటెండ్‌ అయ్యాను. హాల్‌లోకి అడుగుపెట్టేసరికి అదొక చిన్న రూం. జనం నిండిపోయి ఉంది. కానీ అదృష్టవశాత్తూ ఆర్గనైజర్లు నన్ను స్టేజ్‌కు దగ్గరగా మొదటి వరసలోని సీట్లో కూర్చొబెట్టారు. సాధారణంగా ఏ ప్రోగ్రాంకైనా లేటుగా వెళితే చివరి వరుసలో కూర్చొవాల్సి వస్తుంది. కానీ నాకు మాత్రం ముందువరుసలో సీటు దక్కింది. ఆర్గనైజర్లు చూపించిన కుర్చీలో కూర్చున్నాను. అప్పటికే ప్యానెల్‌ డిస్కషన్‌ ప్రారంభమైంది. వింటున్నాను. సెమికండక్టర్‌ ఇండస్ట్రీలో వచ్చిన కొత్త ట్రెండ్స్‌, భారత్‌లో ఈ రంగంలోఉన్న అవకాశాల గురించి చర్చిస్తున్నారు. సెమికండక్టర్‌ ఎక్స్‌పర్ట్స్‌ అయిన ఐఐటీ ప్రొఫెసర్‌, కొందరు NRI ఇండస్ట్రియలిస్ట్‌లు, కార్పొరేట్‌ ఇన్వెస్టర్లు చెబుతున్న విషయాలన్నీ శ్రద్ధగా వింటున్నాను. ఆకళింపు చేసుకుంటున్నాను. 

సెమికండక్టర్‌ ఇండస్ట్రీలో సరికొత్త ఆవిష్కరణల గురించి అర్థం చేసుకునేందుకు చాలా ప్రయత్నించా. కానీ నా వల్ల కాలేదు. స్టేజ్‌పై ప్రసంగిస్తున్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో బుర్రకెక్కలేదు. నిజం చెప్పాలంటే వాళ్లు చెబుతున్న మాటలన్నీ ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తున్నాను. నా చుట్టుపక్కల వాళ్లంతా ప్రశ్నలు అడుగుతూ, తలలూపుతూ, మధ్యమధ్యలో నవ్వుతూ వింటున్నారు. వీళ్లందరినీ గమనిస్తూ కూర్చునే బదులు.. స్టేజ్‌పై ఉన్న ప్యానలిస్టు వైపు చూడటం మంచిదని నిర్ణయించుకున్నా. చిన్న హాల్‌. అందులోనూ మొదటి వరుసలో కూర్చున్నా. స్టేజ్‌పైనున్న వాళ్లు చెబుతున్నది వినడం, అర్థంచేసుకునే ప్రయత్నం చేయడం మినహా వేరే దారిలేదు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ప్యానెలిస్టులు కీలక విషయాలు చెబుతూ పదేపదే నావైపు చూశారు. దాన్నే ఐ టు ఐ కాంటాక్ట్ అంటారు. స్టేజ్ పైన ఉన్నప్పుడు నేను కూడా అదే చేస్తాను. అందుకే దాని ప్రాధాన్యత ఏంటో తెలుసు. అందుకే నేను కూడా నవ్వుతూ తలాడించాను. ఆ తర్వాత నా పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మాట్లాడే ప్యానెలిస్టులందరూ నావైపు చూడటం.. నేనేమో నవ్వడం. నేను నా తెలివితక్కువతనాన్ని అంచనా వేసుకోవడం. ద్యావుడా..!! అనుకున్నాను. వాళ్లు చెబుతున్న విషయాల్లో కొన్నింటినైనా అర్థం చేసుకునేంత తెలివి ఎందుకు లేదని నన్ను నేను తిట్టుకున్నాను. షేమ్ ఫీలయ్యాను. మనసులో ఒకరకమైన వాగ్వాదం మొదలైంది. నేనేమో సెమికండక్టర్ల గురించి నాలెడ్జ్ పెంచుకుందామని వస్తే.. తీరా ఇక్కడ ప్యానెల్ మీద కూచున్నవాళ్లేమో.. నా వైపే చూస్తూ మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్లు ఇక్కడికి ఎందుకు వస్తారో అన్న ఎక్స్ ప్రెషన్ తో నావైపు చూస్తున్నారా..? ఈమెకు ఏమైనా అర్థం అవుతోందా అనుకుంటున్నారా..? నా గురించి వాళ్ల అభిప్రాయం ఏంటో..? ఈ ప్రశ్నలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తన తెలివితేటలపై తనకు నమ్మకం లేని వ్యక్తి.. గొప్పవ్యక్తుల మధ్య కూర్చున్నప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయి.

ఎట్టకేలకూ ప్యానెల్‌ డిస్కషన్‌ ముగిసింది. వెంటనే ఓట్‌ ఆఫ్‌ థ్యాంక్స్‌. కొంచెం రిలాక్స్ అయ్యాను. అందరూ లేచి నిలబడ్డారు. నేను కూడా. రూంలో ఓ మూలకు వెళ్లి నిలబడ్డాను. తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో నాకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు వచ్చారు. హాల్‌లో ఉన్న ఆంట్రప్రెన్యూర్స్‌కు నన్ను పరిచయం చేస్తామని అన్నారు. సెమికండక్టర్ల గురించి ఏం తెలుసుకోలేకపోయినా, ఆంట్రప్రెన్యూర్లుయినా పరిచయం చేసుకోవచ్చని ముందుకు కదిలాను. సెమికండక్టర్‌ ఆంట్రప్రెన్యూర్స్‌తో మాట్లాడుతున్న కొద్దీ.. నేను కోల్పోయిన కాన్ఫిడెన్స్‌ తిరిగి రావడం మొదలైంది. ఆంట్రప్రెన్యూర్స్‌ వాళ్ల కథలు చెప్పాలనుకుంటున్నారు. నా కథ జనానికి ఎందుకు చెప్పరు? బిజినెస్‌ 2 కస్టమర్‌/ ఈ కామర్స్‌ స్టోరీస్‌పై మాత్రమే ఎందుకు ఆసక్తి చూపుతారు? ఈ ప్రశ్నలకు వాళ్లు ఆన్సర్ అడుగుతున్నారు. జనం ఒక్కొక్కరుగా నా చుట్టూ చేరడం మొదలుపెట్టారు. జస్ట్ వారు చెప్పేది నేను వింటున్నాను.

ఈవెంట్‌ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటనతో పాటు ఉమెన్స్‌ డే రోజు జరిగిన ఇన్సిడెంట్‌.. నిత్యం ఏదో ఒక ఈవెంట్‌లోనో మీటింగ్‌లోనో ఎదుర్కొంటున్న ఇబ్బంది.. ఇలా ఒక్కొక్కటి గుర్తుకొచ్చాయి.

ఢిల్లీలో జరిగిన ఉమెన్స్‌ డే కాన్ఫరెన్స్‌కు అపారమైన తెలివితేటలు, అద్భుతమైన నైపుణ్యం ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలతో పాటు, వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలను ఎలా అధిరోహించాలో తెలుసుకోవాలన్న తపన ఉన్న మహిళలు హాజరయ్యారు. ఈవెంట్‌లో స్టేజ్‌పై మాట్లాడిన వారంతా ఫండింగ్‌, వాల్యూయేషన్‌, స్ట్రక్చరింగ్, ఫైనాన్షియల్‌ మోడలింగ్‌, ఇలా ఇంకా ఎన్నో అంశాల గురించి మాట్లాడారు. అయితే ఇవేవీ ఈవెంట్‌కు హాజరైన వారికి పనికొస్తాయని అనిపించలేదు. వారిలో చాలామంది నాకు ఫైనాన్స్‌ గురించి తెలియదు. నేను వ్యాపారం చేయగలనా? టెక్నాలజీలో ఎక్స్‌పర్ట్‌ను కాను.. అయినా టెక్ బిజినెస్‌ స్టార్ట్‌ చేయగలనా? వాల్యుయేషన్‌, ఫండ్‌ రైజింగ్‌ ప్రాసెస్‌ గురించి తెలియదు... అయినా నిధులు సమీకరించుకోగలనా? ఇలాంటి ప్రశ్నలే అడిగారు.

ఇలాంటి వాళ్లందరికీ నేనిచ్చే జవాబు ఒకటే. నేను ఫండింగ్‌ గురించి కథనాలు రాస్తున్నాను. రకరకాల ఫండ్‌ రైజింగ్‌ స్టోరీస్‌ వింటున్నాను. అయితే గత ఆగస్టులో ఫస్ట్‌ రౌండ్‌ ఫండ్‌ రైజింగ్‌ చేసే వరకు కూడా ఫండింగ్‌ అంటే ఏమిటో నాకు తెలియదు. నేను కథల ప్రపంచంలో బతుకుతున్నాను. ప్రతి అంశంపై అద్భుతమైన సూత్రీకరణలు చేయగలను. చేశాను కూడా. టర్మ్‌ షీట్‌, క్లాజులు ఇలా ప్రతి విషయాన్నింటినీ ఓ క్రాష్‌ కోర్సులా అనుభవాల ద్వారా నేర్చుకున్నాను. మీ వంతు వచ్చినప్పుడు మీరూ నేర్చుకుంటారు. అప్పుడు నేర్చుకోవడం మినహా మరో ప్రత్యామ్నాయం ఉండదు. అర్థం చేసుకోవాల్సినవన్నీ అర్థం చేసుకోవాలి మిగతా వాటిని లాయర్లు, అకౌంటెంట్లకు వదిలిపెట్టాలి. ముఖ్యమైన విషయాలేంటో నాకు అర్థమైంది. నేను ఏం కోరుకుంటున్నాను.. ప్రాథమిక దశలో ఏం వద్దనుకుంటున్నాను అనే విషయాలు తప్పించి, బేరసారాలు, చర్చలు సుదీర్ఘంగా సాగే సమావేశాలు, ఫోన్‌కాల్స్‌ లాంటివన్నీ లాయర్లకు వదిలేశాను.

నేను అన్ని విషయాలు తెలుసుకోవాలా? 

దీనికి సమాధానం- అవసరం లేదు..!! 

పని బాగా చేస్తారన్న నమ్మకంతో (నా స్థాయికి తగ్గట్లు జీతం ఇచ్చేందుకు సిద్ధమై) 

ఎంపిక చేసుకున్న ఎక్స్‌పర్ట్‌ టీంపై ఆధారపడాలా? 

దీనికి సమాధానం- అవును!!

ప్రతి విషయం గురించి తెలిసిన వ్యక్తులున్న ఈ ప్రపంచంలో.. సక్సెస్‌ఫుల్‌ ఆంట్రప్రెన్యూర్‌ లేదా ప్రొఫెషనల్‌గా ఎదగడానికి అన్ని విషయాలు తెలుసుకోవాలా? అంటే నేను మాత్రం కాదనే అంటాను. నిజానికి ఏమీ తెలియకపోవడం, తెలుసుకోవడం అనేవి మంచి గుణాలు అవునో కాదో నాకు తెలియదు. సాధారణంగా ప్రతి పనీ చేయాలనుకున్నప్పుడు, ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాలనుకున్నప్పుడు మనిషి తడబడతాడు. అలాంటి సమయంలో నాకు తెలియదు, మీరు దాని గురించి వివరిస్తారా? అని అడగడంలో ఎలాంటి తప్పులేదు. తెలియని విషయాన్ని తెలియదు అని చెప్పినంత మాత్రాన కొంపలేమీ మునిగిపోవు.

స్టార్టప్‌లకు నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. ఎక్స్‌పర్ట్‌ను నియమించుకుని వారి పనిని వారు సజావుగా చేసుకునేందుకు సహకరించండి. ఈ ఏడాది మా కంపెనీలో నేను ఇదే చేస్తాను. బెస్ట్‌ టీం లీడ్స్‌ను ఎంపిక చేసుకున్నాను. ఇక ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయి ఎక్స్‌పర్ట్‌ నైపుణ్యాన్ని అనుభవపూర్వకంగా చూస్తాను.

నైపుణ్యం విషయానికొస్తే.. నేను పనిచేసిన CNBC ఛానెల్‌ బాస్‌ గురించి కొంత చెప్పుకోవాలి. ఆయన నేనూ కలిసి ఏ మీటింగ్‌ అటెండ్‌ అవ్వాల్సివచ్చినా.. మీట్‌ అవబోయే కంపెనీకి సంబంధించిన మెటీరియల్‌ ప్రిపేర్‌ చేయమని నన్ను పురమాయించేవారు. మీటింగ్‌లో ఆయన ఎప్పుడూ ఒక ప్రశ్న అడిగేవారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో వివరంగా చెప్తారా అని!! సమాధానం చెప్తుండగానే.. అలా కాదు అంటూ మరికొన్ని ప్రశ్నలు వేసి, కంపెనీ వర్కింగ్‌ మోడల్‌ గురించి పక్కాగా తెలుసుకునేవారు. ఒక్కోసారి ఆయన అడిగే ప్రశ్నలు చెత్త క్వశ్చన్స్ అనిపించేవి. ఇంకొన్నిసార్లు కంపెనీకి సంబంధించి నేను కలెక్ట్ చేసిన మెటీరియల్ పనికిరాదా అని కలత చెందేదాన్ని. కంపెనీ గురించి ఆయనకు అన్ని విషయాలు తెలిసినా.. చిన్న చిన్న విషయాల గురించి ఓ స్టూడెంటును అడిగినట్లు అడుగుతారెందుకు అనిపించేంది. కానీ ఇదంతా ఆయన గతంలో కంపెనీ ఏం సాధించిందో సరళంగా తెలుసుకునేందుకు చేస్తున్నారని ఆ తర్వాత అర్థమైంది. సమస్యలకు బెస్ట్ సొల్యూషన్ చూపే వ్యక్తుల నుంచి ఆయన ఈ విషయం నేర్చుకున్నారు. ఆయన మీటింగ్‌లకు ఎండీ అనే ట్యాగ్‌తో కాకుండా, తనకేమీ తెలియదని.. తెలుసుకోవాలన్న కుతూహలంతో వెళ్లేవారు.

అది మీడియా అయినా, ఎక్స్‌పర్ట్స్‌, ఇన్వెస్టర్స్, లేదా కొలీగ్స్‌ అయినా.. జనం మీ గురించి కొన్ని అంచనాలు వేస్తారు. ప్రతిరోజు మీ గురించి చాలా తెలుసుకోవాలనుకుంటారు. నిజానికిది కామెడీగా ఉంటుంది. ఏమీ తెలియకుండానే, అన్ని ప్రశ్నలకు జవాబులు దొరకకుండానే, ఎదుటి వారికి వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వకుండా.. ఒక అభిప్రాయానికి రావొద్దని కోరుతున్నా. దీన్ని మీరు ఆచరిస్తే కత్తిలాంటి రిలేషన్స్ ఏర్పరచుకోగలరు. సరికొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అన్ని వర్గాల నుంచి ఊహించని విధంగా మద్దతు పొందుతారు.

“కొన్నిసార్లు ఓటమిలోనే గెలుపు ఉంటుందని అంటారు. అలాగే, ఏమీ తెలియకపోవడమే ఒక్కోసారి అన్నింటి గురించి తెలుసుకునేలా దారి చూపిస్తుంది”

రచయిత: శ్రద్ధా శర్మ, యువర్‌ స్టోరీ ఫౌండర్‌, చీఫ్‌ ఎడిటర్‌

అనువాదం: ఉదయ్ కిరణ్