ద గ్రేట్ ఖలీ.. బాహుబలిని మళ్లీ యుద్ధం పిలుస్తోంది..!!  

0

ద గ్రేట్ ఖలీ.. పరిచయం అక్కర్లేని బాహుబలి. భారతదేశ భుజబలాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గండరగండడు. సింహాన్నయినా ఒక్క పిడిగుద్దుతో మట్టికరిపించగల సమర్ధుడు. మహామహా మల్లయోధులను పాదం కింద అణచివేసిన బలశాలి. వేయి వోల్టుల ట్రాన్స్ ఫార్మర్ మల్లే కనిపిస్తాడు. ముట్టుకుంటే మాడి మసైపోయేంత ఆవేశంతో కనిపిస్తాడు. పిడికిలి బిగించి ఒక్క పంచ్ విసిరితే ప్రత్యర్ధికి విద్యుదఘాతమే. రింగులో ఒక్క ఉరుము ఉరిమితే చూసేవాళ్ల గుండెలే జల్లుమంటాయి.

ఖలీ జీవితం వడ్డించిన విస్తరేం కాదు. ఆకలి, అవమానం, పేదరికం, చదువులేని తనం, బాల్యాన్నంతా వెక్కిరించాయి. కన్నీళ్లు దిగమింగుకున్నాడు. కష్టాలను వెంటేసుకుని తిరిగాడు. అవమానాలను భరించాడు. అవహేళనను ఎదుర్కొన్నాడు. గుండె రాయి చేసుకుని బతికాడు. పిడికెడు మెతుకుల్లేక ఆకలితో నకనకలాడాడు. రెండున్నర రూపాయల స్కూల్ ఫీజు కట్టలేని దుర్భర జీవితాన్ని అనుభవించాడు. డబ్బుల్లేక నెల రోజులు బడికి ఆలస్యంగా పోతే, ఏదైనా లేబర్ పని చేసుకోవచ్చుగా అని స్కూల్ టీచర్ అన్న మాటలు ఇప్పటకీ మరిచిపోలేదు. ఆ మాటలకు తోటి పిల్లలు నవ్విన తీరు మనసులోంచి చెరిగిపోలేదు.

ఆనాడు రూపం శాపమైంది. ఆరోజు ఎత్తు అపహాస్యం చేసింది. శరీర బరువు గుండె బరువును పెంచింది. చుట్టూ పిల్లలు చేరి గేలి చేస్తుంటే ఏడుపొచ్చేది. టీచర్లు చెప్పేది ఏమీ అర్ధమయ్యేది కాదు. వాళ్ల వెక్కిరింతలు నిత్యం మనసుని గాయపరిచేవి. ఏమీ చేయలేని నిస్సహాయత. అన్నీ మౌనంగా భరించాడు. ఆవేశాన్నంతా ఆకలి అణచివేసింది. కోపాన్నంతా పేదరికం తొక్కిపెట్టింది.

అందుకే, బతకడానికి ఏ దారీ లేక ఎనిమిదేళ్ల వయసులో పెద్ద కొండలూ గుట్టలూ ఎక్కుతూ దిగుతూ మొక్కలు సరఫరా చేసే ఉద్యోగంలో చేరాడు. అప్పడతని జీతం రోజుకి ఐదు రూపాయలు. ఇది 1979నాటి సంగతి.

రెండున్నర రూపాయల బడి ఫీజు కట్టలేని ఆ స్థితిలో రోజుకి ఐదు రూపాయల వేతనం అంటే మాటలా. ఖలీ ఎగిరి గంతేశాడు. తెలియని ఎగ్జయిట్మెంట్ ఉక్కిరిబిక్కిరి చేసింది. రోజుకి ఐదు రూపాయలా అని ఆశ్చర్యపోయాడు. జాక్ పాట్ కొట్టేసినంత సంబరపడ్డాడు.

కానీ వయసు చూస్తే 8 ఏళ్లు. చేయాల్సిన పనేమో పాతికేళ్ల వాళ్లది. నీ వల్లకాదు వదిలేయ్ అన్నాడు తండ్రి. చిన్నవయసులో రాళ్లూ రప్పలూ ఎక్కుతూ నాలుగు కిలోమీటర్లు నడిచి మొక్కలు తేవడం చేతకాదు అన్నాడు. కానీ ఖలీ వినలేదు. ఎంత కష్టమైనా భరించి, రోజుకి ఐదు రూపాయలు సంపాదించి, ఇంటికి ఆసరాగా నిలవాలనుకున్నాడు.

అలా రోజుకి ఒక రౌండ్ కాదు.. ఏకంగా మూడు సార్లు కొండ ఎక్కి దిగి మొత్తం 12 కిలోమీటర్లు మొక్కలు భుజాన వేసుకుని నడిచాడు. సాయంత్రానికి ఐదు రూపాయల నోటు జేబులో వేసుకుని నవ్వుతూ ఇంటిమొహం పట్టేవాడు. ఇప్పటికీ ఆ సందర్భం తలుచుకున్నప్పుడల్లా ఒళ్లు గగుర్పొడుస్తుంది ఖలీకి. అదంతా గతమే కావొచ్చు. కానీ మూలాలు మాత్రం అవే అంటాడు.

మొక్కలు తీసుకురావడం మొదటి సంపాదనే అయినా, మొదటి ఉద్యోగం మాత్రం వేరే. సిమ్లాలో ఒక బడా వ్యాపారికి బాడీగార్డుగా కుదరాడు. అప్పుడు అతని వేతనం నెలకు రూ.1,500. తిండిపెట్టి, ఉండటానికి గది ఇచ్చేవాడు.

అప్పుడు అణచివేసుకున్న ఆవేశం, అప్పుడు దిగమింగుకున్న కోపం ఇప్పుడు రెజ్లింగ్ రింగులో పనిచేసింది. అప్పుడు కురిపించాలనుకున్న ముష్టిఘాతాలు.. ఇప్పుడు ప్రత్యర్ధుల మీద కురుస్తున్నాయి. అప్పుడు అరవాలనుకున్న అరుపులు.. ఇప్పుడు ప్రపంచం మార్మోగే గర్జనలయ్యాయి. హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ ఒక్కటే కాదు అంతర్ బహిర్ వేదలను గెలిచిన దిలీప్ సింగ్ రాణా.. ద గ్రేట్ ఖలీ అయ్యాడు.2007లో ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న మొట్టమొదటి ఇండియన్ అయ్యాడు.

ఆ తర్వాత గెలుపు ఓటమి మామూలే అయ్యాయి. గాయపడటం.. మళ్లీ లేచి నిలబడటం.. రక్తమోడేలా దెబ్బలు తిన్నా, మళ్లీ దెబ్బతిన్న బెబ్బులిలా లేచి తిరగబడ్డాడు. వాదాలు.. వివాదాలు.. అంత:కలహాలు.. జీవితమంతా ఒడిదొడుకులు. చివరికి డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి వైదొలిగాడు.

ఇప్పుడదంతా గతం. ద గ్రేట్ ఖలీ మళ్లీ రింగుకి దగ్గరకాబోతున్నాడు. ఫిబ్రవరి 10, 11న అమెరికాలో జరగబోయే బిగ్ ఈవెంట్ ప్రమోషన్ కోసం ఒప్పుకున్నాడు. టెంప్ట్ అయితే మళ్లీ ఓపెన్ ఛాలెంజ్ విసిరే అవకాశమూ లేకపోలేదు.


Related Stories

Stories by team ys telugu