ఏడాదిలో ప్రపంచాన్ని చుట్టెయ్యండిలా..!

ఏడాదిలో ప్రపంచాన్ని చుట్టెయ్యండిలా..!

Wednesday January 13, 2016,

4 min Read

బిజీబిజీ లైఫ్ లో ఒక్కోసారి అనిపిస్తుంది. ఈ రొటీన్ ప్రపంచానికి దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోయి ఓ వారంపది రోజులు సరదాగా గడిపొస్తే బాగుంటుందని. నిజమే. ప్రతీ ఒక్కరికీ వెకేషన్ అవసరం. అది టానిక్ లాంటిది. బ్యాటరీ అయిపోతే రీఛార్జ్ చేసినట్టు అన్నమాట. ఈ వారంపది రోజుల టూర్ల సంగతి సరే. ఓ సంవత్సరం సెలవు తీసుకొని ప్రపంచమంతా చుట్టెయ్యాలని మీకెప్పుడైనా అనిపించిందా? అమ్మో... అన్ని రోజులా అని షాకవకండి. ఇలా ప్రపంచమంతా టూరేస్తున్న ఓ జంట ఉంది. అంతే కాదు... వాళ్లలాగా టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలో వివరిస్తామంటోంది ఆ జంట.

image


రయ్యిరయ్యిమంటూ...

చూడచక్కని బైకు... వెనుక సీట్లో జీవిత భాగస్వామి... మేఘాలలో తేలిపొమ్మన్నది... తుఫానులా రేగిపొమ్మన్నది... అమ్మాయితో.. అంటూ ఓ పాటపాడుకుంటూ ప్రపంచమంతా చుట్టేస్తే... ఆ జీవితానికి అంతకంటే ఇంకేం కావాలి. సరిగ్గా ఇలాగే చేస్తోంది మోనిగా మోఘె, షరీక్ వర్మ అనే జంట. ట్రయంఫ్ టైగర్ 800 ఎక్స్ సీ బైకుపై ప్రపంచమంతా చక్కర్లుకొడుతోంది. తమ ప్రయాణంలోని ఒడిదుడుకులను వివరించడమే కాదు... మీరు కూడా ఇలాగే ప్రపంచమంతా చక్కర్లు కొట్టేందుకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇస్తున్నారీ దంపతులు. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లైన మోనిగా మోఘె, షరీక్ వర్మలు ప్రస్తుతం వారి డ్రీమ్ వెకేషన్ లో ఉన్నారు. ఇది ఒక వెకేషన్ అని చెప్పడం కంటే చాలా వెకేషన్ల సమాహారం అనే చెప్పుకోవాలి. బైక్ పై ప్రపంచాన్ని అన్వేషిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

"మేము ఈ టూర్ ను ఐదేళ్ల నుంచి ప్లాన్ చేస్తున్నాం. చాలామంది, ముఖ్యంగా ఇండియాలో వారివారి ఉద్యోగాలకు, రెగ్యులర్ టైమ్ టేబుల్ కు అతుక్కుపోతారు. వాళ్లు ఇలాంటి ప్రయాణాలను కేవలం అడ్వెంచర్ ట్రావెల్ షోలల్లో మాత్రమే చూస్తారు. తాము కూడా ఇలా వెళ్లాలని అస్సలెప్పుడూ అనుకోరు" అంటారు మోనికా.

ప్లానింగ్ ఇలా...

ఒకే ట్రిప్పులో ప్రపంచమంతా చుట్టెయ్యడమంటే వినడానికే ఆశ్చర్యమేస్తుంది. కొంచెం లోతుగా చూస్తే ఇది చాలా గొప్ప ఆలోచనగా అనిపిస్తుంది. కానీ ఇలాంటి టూర్ ప్లాన్ చేసుకోవడం అంత ఆషామాషీ కాదు. వారికి కూడా అంత సులువు కాలేదు. ఐదేళ్ల ఖచ్చితమైన ప్రణాళిక, పొదుపుతోనే టూర్ సాధ్యమైంది. మీరు కూడా ఇలాగే చక్కర్లు కొట్టాలనుకుంటే మాత్రం ఓసారి సీరియస్ గా ఆలోచించి ఇప్పట్నుంచే ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టండి. పూటకోసారి వేర్వేరు ప్లేసెస్ లో మీ స్టేటస్ అప్ డేట్ చేస్తుంటే ఎంత గొప్పగా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. కానీ ఇలా చేయాలంటే జేబుకు చిల్లు పడటం ఖాయమే. అయితే ఆర్థికంగా భారం కాకుండా ఓ సంవత్సరం పాటు సెలవు తీసుకొని చక్కర్లు కొట్టడానికి సలహాలిస్తోందీ జంట.

రెడీ టూ గో...

image


ప్రపంచాన్ని చుట్టిరావడానికి ఎంతో కష్టపడాలి. ముఖ్యంగా మోటార్ బైకుపై వేల మైళ్ల ప్రయాణం అంటే మామూలు విషయం కాదు. మోనికా, షరీక్ లు ట్రయంఫ్ టైగర్ 800ఎక్స్ సీ బైక్ పై ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. వారి ప్రయాణానికి తగ్గట్టుగా వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. లగేజీ, ఇతర పరికరాలు తీసుకెళ్లేందుకు బైకుకు ఇరువైపులా సాఫ్ట్ సాడిల్ బ్యాగ్స్ ఉపయోగించడం మేలన్నది వీరి సలహా. వెనుక వైపు లగేజీకోసం పెలికాన్ కేసు తీసుకోవాలి. సాధారణంగా ఇది పరికరాలు పెట్టుకునేందుకు ఫోటోగ్రాఫర్లు, మ్యుజీషియన్లు ఉపయోగించే బ్యాగ్ లాంటిది. మిగతా వస్తువులు, క్యాంపింగ్ గేర్ లాంటివన్నీ డఫుల్ స్టైల్ బ్యాగ్ లో ఉంచి దాన్ని పెలికాన్ కేసుకు బంగీ తీగల సాయంతో కట్టుకోవాలి. ఇది జీవితాంతం గుర్తుండిపోయే సాహసయాత్ర కాబట్టి... సేఫ్టీ విషయంలో రాజీ పడొద్దన్నది వీరి సలహా. సురక్షితమైన హెల్మెట్స్, ఇతర రక్షణకవచాలు తప్పనిసరి.

ఇక ఈ టూర్ లో పెద్ద సవాల్ ఏంటంటే బైక్ ను ఖండాలు దాటించడమే. ముఖ్యంగా ఎయిర్ కార్గో లో బైకును తీసుకెళ్లాలంటే... చాలా దేశాల్లో 'కార్నెట్ డి పాసేజ్' అనే డాక్యుమెంట్ అవసరం. ఇది ఉంటేనే మీ వాహనాన్ని ప్రయాణం కోసం దేశం దాటించొచ్చు. తిరిగి తీసుకురావచ్చు. ఇదంతా సరే... అసలు ఇంత భారీ టూర్ కు వీరికి డబ్బులెక్కడ్నుంచి వచ్చాయన్న సందేహం వచ్చిందా? సమాధానమేంటో చూడండి.

"ఈ యాత్ర ఖర్చులన్నీ మేమే భరిస్తున్నాం. ఒకటి కాదు... రెండు కాదు... గత ఐదేళ్లుగా పొదుపు చేస్తున్నాం. ఇందుకోసం పెద్దపెద్ద త్యాగాలేమీ చేయక్కర్లేదు. దుబారా ఖర్చులు తగ్గించడం ద్వారా పొదుపు చేయొచ్చు. ఐదేళ్లపాటు ఖరీదైన రెస్టారెంట్ లో భోజనాన్ని త్యాగం చేయగలిగితే టూర్ కు కావాల్సిన డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఇలా ప్రతీ విషయంలో పొదుపు అవసరం. పొదుపు చేయాలన్న ఆలోచన ఉంటే చాలు" అంటారు మోనికా.

టూర్ లో హోటల్ ఖర్చులు తగ్గించుకోవడానికి కౌచ్ సర్ఫింగ్ లో ఉన్నవారి ఇళ్లల్లో బస చేయడం మంచిదంటోందీ జంట. ఇప్పటి వరకు ఈ జంట 33 వేల కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేసింది. మరో నాలుగైదేళ్లు ఇలా ప్రయాణిస్తూనే ఉండాలనుకుంటున్నారు. ప్రతీ సంవత్సరం కొన్నికొన్ని దేశాలను కవర్ చేయాలన్నది వీరి ఆలోచన. వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న ఈ జంట... పర్యావరణానికి ఎక్కడా హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం.

image


"మా మోటార్ సైకిల్ ను తరచూ పొల్యూషన్ చెక్ చేయిస్తుంటాం. మేం మంచి స్పీడ్ తో మైలేజ్ పెంచుతాం. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. ఇంధనం తక్కువగా వాడటం వల్ల వాయు కాలుష్యాన్ని తగ్గిస్తున్నాం. మేం యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ ప్లేట్లు, బాటిల్స్, బౌల్స్ ఉపయోగించం. దాని బదులు మా వాటర్ బాటిళ్లను రీఫిల్ చేస్తాం. రీసీలబుల్ ఫుడ్ ప్యాకెట్లు తీసుకుంటాం. రీఛార్జబుల్ బ్యాటరీలు వాడతాం. వీలైనంత తక్కువ సామాన్లను తీసుకెళ్తున్నాం" అంటూ గర్వంగా చెబుతారు మోనికా.

వీళ్లిద్దరూ ఒకేసారి వీలైనంత ఎక్కువ సమయం గడపడం రిలేషన్ షిప్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనిపిస్తుంది. నిజమే... వీరిద్దరి ప్రయాణంలో రకరకాల సంఘటనలుంటాయి. రకరకాల భావాలను పంచుకుంటారు. చాలామంది జంటలు ఒకరితో ఒకరు ఒక రోజులో 24 గంటలు, వారానికి ఏడు రోజులు కలిసుండే సందర్భాలు చాలా చాలా తక్కువ. కానీ ఆ అదృష్టం వీరికి దక్కిందనుకోవాలి.

"ప్రతీ రోజూ మేం పొద్దున్నే నిద్రలేస్తాం. చిన్న టెంట్ లో పడుకున్నా, నేలపై పడుకున్నా, వేరెవరి ఇంట్లో బస చేసినా, ఖరీదైన మంచంపై పడుకున్నా... ఇద్దరం చిరునవ్వుతో నిద్రలేవడం అలవాటు. ఆహ్లాదకరంగా పలకరించుకుంటాం. ముందురోజు రాత్రి ఏదైనా విషయంపై గొడవపడ్డాసరే మరుసటి రోజు ఉదయానికి అన్నీ మర్చిపోయి హ్యాపీగా నిద్రలేస్తాం."అంటారు షరీక్.
image


ఓసారి నార్వేలో ఓ ఆఫీసులోని వెయిటింగ్ హాల్ లో పడుకోవాల్సి వచ్చింది. రాత్రి హ్యాపీగా నిద్రపోయిన వీళ్లిద్దరూ ఉదయం లేచేసరికి కళ్లముందు అద్భుత దృశ్యాలు కనిపించాయంటూ వారి మధురానుభవాలను గుర్తు చేసుకుంటున్నారు మోనికా. ఇవీ మోనికా, షరీక్ ల వాల్డ్ టూర్ విశేషాలు. మరి మీరు కూడా ఇలాగే ప్రపంచమంతా చక్కర్లు కొట్టాలనుకుంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి మరి. అయితే వీరిచ్చే సలహా ఏంటంటే... ఉద్యోగాన్ని విస్మరించొద్దు. కష్టపడండి. ప్రతీది ప్లాన్ చేసుకోండి. లైఫ్ టైమ్ అడ్వెంచర్స్ కి కూడా ప్లానింగ్, హార్డ్ వర్క్ అవసరం అన్నది వీరి మాట.