7500 మంది డాక్టర్లు, 2000 ల్యాబ్స్.. వినూత్న ఆన్‌లైన్ సేవలతో దూసుకుపోతున్న 'హెల్ప్‌మిడాక్'

ఢిల్లీ సంస్థ వినూత్న ఆలోచనడాక్టర్లు,రోగులు, ల్యాబ్స్ అన్నింటినీ ఒకే గొడుగు కిందికిఅందరికీ ఉపయుక్తంగా సేవలుఐదు రాష్ట్రాల్లో కాలుమోపిన హెల్ప్‌మిడాక్

7500 మంది డాక్టర్లు, 2000 ల్యాబ్స్..  వినూత్న ఆన్‌లైన్ సేవలతో దూసుకుపోతున్న 'హెల్ప్‌మిడాక్'

Tuesday July 14, 2015,

4 min Read

ఏదైనా అనారోగ్య సమస్య వస్తే డాక్టర్ దగ్గరికెళ్లాలి. దగ్గరో దూరమో తప్పదు. ఇంతకీ అదీ ఏదైనా సమస్యా.. లేక మనం దాన్ని సమస్యగా అనుకుంటున్నామో అర్థం కాదు. తీరా డాక్టర్ దగ్గరికి వెళ్లాక.. అవసరం కొద్దీ వాళ్లేదైనా ల్యాబ్ టెస్టులు రాస్తారు. అక్కడికి వెళ్లి బ్లడ్ శాంపిలో.. ఏదో ఒకటి ఇవ్వాలి. మళ్లీ ఆ రిపోర్టులను తీసుకుని డాక్టర్ దగ్గరిక వెళ్లడం, ఆయన అందుకు తగ్గట్టు మందులు రాసివ్వడం.. ! అబ్బో ఇదో పెద్ద తతంగం. అసలే క్షణం కూడా తీరికలేని ఈ రోజుల్లో ఇన్నింటికి సమయం వెచ్చించడం కష్టసాధ్యం. అందుకే అటు డాక్టర్లు, పేషెంట్లు, ల్యాబ్స్ అన్నింటినీ ఒకే వేదికపై తెచ్చింది ఓ సంస్థ. జనాల సమస్యకు పరిష్కారం చూపించింది.

image


2013-14లో కొన్ని రీసెర్చ్ కంపెనీల లెక్కల ప్రకారం భారత హెల్త్ కేర్ మార్కెట్ విలువ దాదాపు 80 బిలియన్ డాలర్లు, మన కరెన్సీలో అయితే దాదాపు రూ.5 లక్షల కోట్లు. 2017 నాటికి ఇది 170 బిలియన్ డాలర్లు.. అంటే రూ.10,71,000 కోట్లకు చేరుతుందని ఓ అంచనా. ఇందులో సుమారు 25 శాతం వాటా ఈ-హెల్త్‌కేర్ రంగానిది ఉండొచ్చు. ప్రస్తుతానికి పావు శాతమే ఉన్నా ఇది గణనీయంగా పెరగొచ్చని, మరిన్ని వైద్య సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి రావొచ్చని విశ్లేషిస్తున్నారు సువ్రో ఘోష్. తన స్టార్టప్ మార్కెట్ సైజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమయ్యేందుకు సువ్రో చెప్తున్న లెక్కలివి.

'హెల్ప్‌మీడాక్' డాక్టర్లు, పేషెంట్లు, ల్యాబ్ వాళ్లందరినీ ఒకే చోటికి తెచ్చే వేదిక. ఒకరితో ఒకరు సంభాషించుకునేందుకు వీలుగా రూపొందించిన వ్యవస్థ. వైద్యులు, ల్యాబ్స్ సెంటర్లు ఒకసారి వీళ్ల దగ్గరి నమోదు చేసుకున్న తర్వాత పేషెంట్లను నేరుగా చేరుకోవచ్చు. తమ అవసరాల కోసం రోగులు.. వైద్యులను ఎంచుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే వాళ్ల అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా డాక్టర్, అపాయింట్‌మెంట్ వివరాలు సదరు కస్టమర్‌కి వచ్చేస్తాయి. ఆన్‌లైన్ పేమెంట్ వెసులుబాటు కూడా ఉన్నప్పటికీ నేరుగా డాక్టర్, ల్యాబ్‌కు వెళ్లి కూడా నగదు చెల్లించవచ్చు. ప్రస్తుతానికి ఈ సేవలు ఢిల్లీ, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఎందుకొచ్చిందీ ఆలోచన ?

హెల్ప్‌మీడాక్‌ అనే ఈ స్టార్టప్‌ను 2009లో సువ్రో, మనిషా సక్సేనా ప్రారంభించారు. 2013 నుంచి పైలెట్ పద్ధతిన సైట్‌ను పరీక్షిస్తూ వస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు సువ్రో. 18ఏళ్లకే హౌరాలో తన సొంత ఎస్ఎస్ఐ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించారు ఆయన. కొన్ని కారణాల రీత్యా ఆయన ఢిల్లీకి మారాల్సి వచ్చింది. అనుకోకుండా అనారోగ్య సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఢిల్లీలో వైద్యం పొందడం ఆయనకు కష్టంగా ఉండేది. వైద్యుల వివరాలు తెలిసేవి కావు. ఎవరు ఎందులో నిపుణులో అర్థమయ్యేది కాదు. ఇక్ ఆన్‌లైన్‌ వేదికలేవీ లేనేలేవు. దీంతో అనేక సందర్భాల్లో బాగా ఇబ్బందులు పడేవారు. ఢిల్లీ చేరిన తర్వాత సువ్రో ఒక ఏజెన్సీలో సేల్స్, మార్కెటింగ్ విభాగంలో పనిచేశారు. ఇదే సమయంలో కొంతమంది విఐపి క్లైంట్లతో తరచూ మంతనాలు జరిపేవారు. కొన్ని రోజుల పాటు ఓ పెట్రోకెమికల్ కంపెనీలో హెచ్.ఆర్, అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని కూడా చూసుకున్న అనుభవం ఉంది. ఇదే తనని హెల్ప్‌మీడాక్‌ వైపు అడుగులు వేయించింది. తనకు ఆరోగ్య రంగంపై ఎలాంటి అనుభవం లేకపోయినా ఓ ఛాన్స్ తీసుకున్నారు సువ్రో.

సువ్రో ఘోష్, హెల్ప్ మి డాక్ వ్యవస్థాపకులు

సువ్రో ఘోష్, హెల్ప్ మి డాక్ వ్యవస్థాపకులు


సువ్రో, మనీషా ఇద్దరూ పదేళ్ల పాటు కలిసి పనిచేశారు. ఇద్దరి ఆలోచనలూ కలవడంతో ఈ-హెల్త్‌కేర్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముందుకు కదిలారు.

''మనీషా బలమంతా టెక్నాలజీ వైపు. కొన్ని బి2బి,బి2సి వెబ్‌సైట్ల ఆర్కిటెక్ట్‌గా, ఓనర్‌గా ఆమెకు అనుభవం ఉంది. నాకున్న బిజినెస్ ప్లాన్స్, నిర్వాహణా అనుభవానికి ఆమె ముందుకు తీసుకెళ్లగలదు. డాక్టర్లు, ల్యాబ్స్, వెంచర్ క్యాపిటలిస్టులు, యూజర్లు అంతా మమల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అన్ని సేవలనూ ఒకే వేదిక పైకి తీసుకురావడాన్ని స్వాగతించారు'' - సువ్రో ఘోష్.

మొదట్లో వీళ్లు కూడా చాలా ఇబ్బందులే పడాల్సి వచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా ఇన్ని సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడం సాధ్యమేనా అని పదేపదే ప్రశ్నించేవారు. చాలాసార్లు తెలిసినవాళ్లు, బంధువులే నిరుత్సాహపరిచేవారు. కానీ వెనక్కితగ్గకూడదనే మేం నిర్ణయించుకున్నాం. కంపెనీ ఏర్పాటు చేసిన మొదటి రోజుల్లో చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మేం కాస్త నిలదొక్కుకున్నాం. అయినా సరే ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త సమస్య వస్తూనే ఉంటుంది.

హెల్త్‌కేర్ రంగం ఈ మధ్య టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారి అందరినీ ఆకర్షిస్తోంది. తాజాగా అహ్మదాబాద్‌కు చెందిన లారెనాన్ సంస్థ సెకోయా క్యాపిటల్ నుంచి రూ.100 కోట్ల నిధులను సమీకరించింది. క్యాపిటల్ మ్యాట్రిక్స్, సెకోయా క్యాపిటల్ అండగా ఉన్న ప్రాక్టో సంస్థ 2015లోనే వెయ్యి మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని చూస్తోంది. పోర్టియా మెడికల్‌ను నడుపుతున్న మీనా గణేష్, క్రిష్ణన్ గణేష్‌లు గతేడాది క్వాల్‌కాం నుంచి పెట్టుబడులను ఆకర్షించారు. ఇదే రంగంలో ఉన్న ప్లెక్సస్ఎండి, నౌక్రీ డాట్ కామ్ ఫర్ డాక్టర్స్, జైవీ కూడా దూకుడుమీద ఉన్నాయి.

బిజినెస్ మోడల్

హెల్ప్‌మిడాక్ సేవలన్నీ పేషెంట్లకు ఉచితంగానే లభిస్తాయి. డాక్టర్లకూ కొన్ని సర్వీసులే ఉచితంగా ఇచ్చినప్పటికీ, డాక్ ప్రాక్టీస్ వంటి ప్రీమియం సేవలకు డబ్బులు తీసుకుంటాం. డాక్ ప్రాక్టీస్ అనేది ప్రాక్టీస్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్, దీన్ని డాక్టర్లు ఏడాది చొప్పున సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో తీసుకోవచ్చు.

ఇందులో పేషెంట్ల వివరాలు, ప్రిస్క్రిప్షన్, బిల్స్, అపాయింట్‌మెంట్స్ వంటి వాటిని ఎప్పటికప్పుడు చూసుకునే వెసులుబాటు ఉంటుంది.

లిస్ట్ అయిన ఎంపానెల్డ్ ల్యాబ్స్, ఇమేజింగ్ సెంటర్లతో కస్టమర్ జరిపే ఒక్కో లావాదేవీకి హెల్ప్‌మీడాక్ అడ్మిన్ ఫీజ్ వసూలు చేస్తుంది. వివిధ వయస్సులు వారు, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాలుగు రకాలైన హెల్త్ కార్డులను ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి పూర్తిగా డిజిటల్ మార్కెటింగ్‌పైనే ఆధారపడిన సంస్థ, వర్డ్ ఆఫ్ మౌత్‌పైనా దృష్టిసారించింది. డాక్టర్లు, ల్యాబ్స్‌ను వ్యక్తిగతంగా కలిసి నెట్వర్క్ పెంచుకుంటోంది. ఈ సైట్ ద్వారా పరీక్షలు చేయించుకున్నవారికి 25 శాతం డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు.

హెల్ప్ మి డాక్ పేజ్

హెల్ప్ మి డాక్ పేజ్


భవిష్యత్ ప్రణాళికలు

గత ఐదు నెలల కాలంలో హెల్ప్‌మిడాక్‌ దగ్గర 7500 మంది డాక్టర్లు రిజిస్టర్ అయ్యారు. వీళ్లలో కొంతమంది ప్రీమియం సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. 2000లకుపైగా ల్యాబ్స్‌తో కూడా ఒప్పందం కుదిరింది. గత నాలుగైదు నెలల్లో 2.5 లక్షల పేజ్ వ్యూస్ ఉండగా వారిలో 50 శాతం మంది వరకూ కొత్తవారు ఉంటున్నారు. దేశవ్యాప్త విస్తరణతో పాటు మిగిలిన వైద్య సేవలు కూడా అందించేందుకు కొంత మంది ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నారు.

ఆరోగ్య రంగాన్ని అందరికీ సులువుగా అందుబాటులోకి తీసుకురావడం, తమ నెట్వర్క్‌ను విస్తృత పరుచుకోవడమే ప్రస్తుతం వీళ్ల ముందు ఉన్న లక్ష్యం. ఐదేళ్లలో భారత్, విదేశాల్లో హెల్ప్‌మీడాక్‌ను అందరికీ సుపరిచితమైన వ్యవస్థగా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం వెబ్‌కే పరిమితమైన సేవలను త్వరలో మొబైల్ యాప్ ద్వారా కూడా విస్తృతం చేయాలని చూస్తున్నారు.

ఇమేజ్ క్రెడిట్ - షట్టర్ స్టాక్