వైఫల్యానికి, తప్పుకోవడానికి మధ్య తేడా ఏంటి?

Wednesday March 09, 2016,

3 min Read



ఏ పని చేసినా నువ్వెప్పుడూ ఓడిపోవు. గెలుస్తావు. లేదా నేర్చుకుంటావు. స్టార్టప్ జర్నీ కూడా అంతే. నేను చాలా సార్లు ఓడిపోయాను. కానీ ఎప్పుడూ తప్పుకోలేదు. నన్ను చాలామంది అడిగేవారు. నువ్వెందుకు నీ స్టార్టప్ ని మూసేశావు అని. నిలకడగా ఉంటే విజయాలు వరిస్తాయన్నారు. కొన్నాళ్లు వేచి చూడాల్సిందన్నారు. మా స్టార్టప్ ని తొలి ఏడాదిలోనే మూసేద్దామని నిర్ణయించుకున్నప్పుడు ఇంత త్వరగా తప్పుకోవద్దని సలహా ఇచ్చారు. నేను తప్పుకోవట్లేదని నాకు తెలుసు. ఎదురుదెబ్బలు తగిలినంత మాత్రానా యుద్ధం నుంచి తప్పుకున్నట్టు కాదు. నేను నా ఆంట్రప్రెన్యూరియల్ జర్నీ నుంచి తప్పుకోలేదు. నేను రాంగ్ టైమ్ లో రాంగ్ టీమ్ తో రాంగ్ బిజినెస్ లో అడుగుపెట్టానన్న విషయాన్ని గ్రహించాను. కాబట్టి స్టార్టప్ వైఫల్యంతో వచ్చే సాదకబాధకాలన్నీ ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాను. అదో చారిత్రక తప్పిదం. యువర్ స్టోరీ, క్వార్ట్జ్ లో కేస్ స్టడీగా పబ్లిష్ అయింది. 

నా స్టార్టప్ కెరీర్ లో గొప్ప విషయం ఏంటంటే నా మొదటి బిజినెస్ లో వైఫల్యమే. ఆ వైఫల్యమే నన్ను దృఢంగా చేసింది. మరింత చైతన్యవంతంగా వ్యాపారం చేసేలా మేల్కొల్పింది. ఐదేళ్లు పొదుపు చేసిన డబ్బుల్ని ఒక్క ఏడాదిలో కోల్పోవడం పట్ల ఎంతో బాధపడ్డాను. ఓ రెండు నెలలు ఒత్తిడికి లోనయ్యాను. నా ఆరునెలల బిడ్డ భవిష్యత్తు గురించి బెంగపెట్టుకున్నాను. రాత్రనక, పగలనక కష్టపడ్డాం. కొత్త కస్టమర్లను ఎన్ రోల్ చేయించేందుకు కుస్తీపట్టాం. కానీ ఏదీ ఉపయోగపడలేదు. నన్ను నమ్మండి... చీకటి తర్వాత వెలుగు తప్పక ఉంటుంది. అదృష్టవశాత్తు నేను నాలా ఆలోచించేవారిని కలిశాను. ఆంట్రప్రెన్యూర్ షిప్ లో తర్వాత లెవెల్ కి తీసుకెళ్లేలా వాళ్లు నాకు మార్గదర్శకంగా నిలిచారు. మొదట్లో వచ్చిన వైఫల్యాలన్నీ చిన్నచిన్న మరకలే. నాలుగ్గోడల మధ్య స్కూల్ లో, కాలేజీలో మనం ఏమీ నేర్చుకోం. నిజమైన శతృవుతో పోరాడినప్పుడే నేర్చుకుంటాం. ఎంబీఏ చదవడానికి, స్టార్టప్ నడపడానికి ఉన్న తేడా అదే.

ఆటుపోట్ల ప్రయాణం

స్టార్టప్ మాత్రమే నా జీవితంలో మొదటి వైఫల్యం కాదు. స్కూల్లో హిందీ మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మారినప్పుడే నా మొదటి వైఫల్యాన్ని ఎదుర్కొన్నాను. నేను సైన్స్, మ్యాథ్స్ బాగా చదివేవాడిని. కానీ అకస్మాత్తుగా మీడియం మార్చుకోవడంతో కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడంలో చాలా ఇబ్బందిపడ్డాను. నాకు హిందీలో అర్థమైన కాన్సెప్ట్ లను ఇంగ్లీష్ లో వ్యక్తీకరించలేకపోయాను. కానీ నేను దీన్ని సవాల్ గా తీసుకున్నాను. ఎందుకంటే నేను ఇంజనీర్ కావాలనుకున్నాను. నాకు ఇంగ్లీష్ ప్రాథమిక అవసరం కూడా. నేను కొన్ని పరీక్షలు ఫెయిల్ అయ్యాను. తోటి విద్యార్థులు నేను తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. మళ్లీ పుంజుకోవడానికి నాకు రెండేళ్లు పట్టింది. చివరకు మంచి మార్కులతో బోర్డ్ ఎగ్జామ్ పాసయ్యాను. సైన్స్, మ్యాథ్స్ లో 90 శాతం మార్కులొచ్చాయి. అలా నా జీవితంలోని ప్రతీ దశలో వైఫల్యాలు నా స్నేహితులయ్యాయి. నేను స్కూల్ లో, ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో, కాలేజీలో, ప్లేస్ మెంట్స్ లో, చివరకు నా ప్రేమలో కూడా విఫలమయ్యాను. కానీ నేనెప్పుడూ బరిలోంచి తప్పుకోలేదు. నేలకు కొట్టిన బంతిలా ఎగిరిపడ్డాను. నా శక్తినంతా కూడదీసుకొని మళ్లీ ఆట మొదలుపెట్టాను. నేను ఆశించినదానికంటే ఎక్కువగా పొందాను. బెస్ట్ స్టేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ దక్కింది. మంచి క్యాంపస్ జాబ్ దొరికింది. నన్ను ప్రేమించే జీవిత భాగస్వామి దొరికింది.

వైఫల్యానికి, తప్పుకోవడానికి తేడా ఏంటి?

ఎదురయ్యే వైఫల్యాలు, ఓటములన్నీ పునాదిరాళ్లుగా మల్చుకోవాలి. జీవితంలో వైఫల్యాలెన్నో ఉంటాయి. వాటిపై మన నియంత్రణేమీ ఉండదు. వాటికి భయపడి తప్పుకుంటే... అద్భుతమైన ప్రయాణాన్ని వదులుకున్నట్టే. తిరిగి మీ కంఫర్ట్ జోన్ లోకి వెళ్లడం పెద్ద విషయమేమీ కాదు. కానీ మీకు అక్కడ ఓటమి భయం ఉండదు, ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు ఉండవు. ఒక్కసారి మీరు ఓడిపోతే... అసలు ఎందుకలా ఓడిపోయామని కారణాలు వెతకండి. మళ్లీ అలాంటి తప్పులు చేయనని మీకు మీరు ప్రమాణం చేసుకోండి. మీరు విఫలమైన చోట కొత్తగా మొదలు పెట్టండి. కొత్తగా ప్రయత్నించండి. కానీ గేమ్ లోంచి మాత్రం తప్పుకోవద్దు. చాలామంది భయంతోనే తప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ భయమే మరో వైఫల్యం అన్న విషయం గుర్తుంచుకోండి.

మీరు స్టార్టప్ ఎందుకు మొదలుపెట్టారు... ఎక్కడ విఫలం చెందారు... ప్రధాన కారణాలేంటని ఆలోచించండి. మీ లక్ష్యాన్ని గుర్తుతెచ్చుకొని తర్వాత ఏం చేయాలన్నదానిపై తెలివిగా నిర్ణయం తీసుకోండి. ఒక బస్సు మిస్సైందని ప్రయాణాన్ని ఆపేస్తామా? ఇది కూడా అంతే. ఒక బస్సు పోతే మరో బస్సు. ఒక అవకాశం పోతే మరో అవకాశం. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కచ్చితంగా మరో మార్గం సిద్ధంగా ఉంటుంది. కానీ దాన్ని మీరు గుర్తించడంలోనే ఉంది అసలు కిటుకంతా.

రచయిత గురించి: 

ప్రదీప్ గోయల్. ఎక్కువగా రాయడం, చదవడం, స్టార్టప్స్ కి మార్కెటింగ్ ప్లాన్లు తయారు చేయడంలో సమయాన్ని గడుపుతుంటారు. స్టార్టప్ లకు సాయం చేయడమంటే అతనికి ఇష్టం. అందుకే తన ఆంట్రప్రెన్యూరియల్ ప్రయాణాన్ని www.startupkarma.coలో పంచుకుంటూ ఉంటారు. ఇదే ఈ మెయిల్ ఐడీ- [email protected]