భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూర్చే కార్టోశాట్ 2E

0

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. పీఎస్ఎల్వీ సీ-38 ద్వారా ఒకేసారి 31 ఉపగ్రహాలను కక్ష్యలోని ప్రవేశపెట్టి మరోసారి సత్తా చాటింది. ఇందులో భారత్ కు చెందిన కార్టోశాట్ 2E ఉప గ్రహంతోపాటూ 14 దేశాలకు చెందిన 29 నానో శాటిలైట్లున్నాయి. ఇస్రో విజయంపై రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందనలు తెలిపారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అరుదైన ఘనత సాధించింది. పీఎస్ఎల్వీ-సీ38 విజయవంతంగా ప్రయోగించింది. సక్సెస్ ఫుల్ సిరీస్ అయిన పీఎస్ఎల్వీ శాటిలైట్ ద్వారా ఒకేసారి 31 ఉప గ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇందులో భారత్ కు చెందిన కార్టోశాట్ 2E శాటిలైట్ తో పాటూ, 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలు, తమిళనాడు యూనివర్సిటీ విద్యార్ధులు తయారు చేసిన మరో నానో శాటిలైట్ ఉన్నాయి.

పీఎస్ఎల్వీ సీ-38 ప్రయోగం విజయవంతంపై శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్. ఈ విజయం భవిష్యత్ విజయాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు కిరణ్ కుమార్. పీఎస్ఎల్వీ వాహకనౌక ద్వారా ప్రయోగం నిర్వహించిన ప్రతీ సారి తాము మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు.

ఈ ప్రయోగం ద్వారా రిమోట్ సెన్సింగ్, మ్యాపింగ్ లకు సంబంధించి మరింత శక్తివంతమైన భూపరిశీలక ఉపగ్రహ కార్టొశాట్- 2E ఇస్రో అమ్ములపొదిలో చేరింది. భారత రక్షణ అవసరాల నిమిత్తం కీలకమైన ఈ ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్ గా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. గతేడాది భారత సైన్యం నిర్వహించిన సర్జికల్‌ స్ట్రైక్స్ కు కార్టోశాట్ ఉపగ్రహం పంపిన ఫొటోలే ఆధారంగా చేసుకున్నారు. ఇప్పుడు అంతకన్నా శక్తివంతమైన కెమెరాలు కలిగిన కార్టొశాట్ -2Eని విజయవంతంగా ప్రయోగించడం ద్వారా భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూరింది.

పీఎస్ఎల్వీ-సీ38 ద్వారా ప్రయోగించిన శాటిలైట్లలో 29 విదేశీ ఉపగ్రహాలున్నాయి. ఇవి ఆస్ట్రియా, బెల్జియం, చెక్ రిపబ్లిక్, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, లాట్వియా, లిథునియా, స్లొవేకియా, బ్రిటన్, అమెరికా దేశాలకు చెందిన నానో శాటిలైట్లు. మరొకటి తమిళనాడులోని నూర్-ఉల్ ఇస్లాం యూనివర్సిటీ విద్యార్ధులు రూపొందించిన నానో శాటిలైట్. ఈ ప్రయోగానికి 160 కోట్ల రూపాయల వ్యయం అయింది.

కార్టొశాట్-2E ఉప గ్రహం బరువు 712 కిలోలు కాగా, మిగిలిన అన్ని నానో శాటిలైట్ల బరువు 243 కిలోలు. కార్టోశాట్‌–2 E ఉపగ్రహం ఐదు సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇది 40వ ప్రయోగం కాగా, ఎక్సెల్‌ స్ట్రాపాన్‌ బూస్టర్ల ప్రయోగంలో 17వ ప్రయోగం కావడం విశేషం. దేశీయ అవసరాల కోసం ఇస్రో కార్టోశాట్‌ సిరీస్‌ ప్రయోగాలను వరుసగా నిర్వహిస్తోంది. భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్‌ ఉపగ్రహాల సిరీస్‌ను 2005లోనే రూపొందించారు.

పీఎస్‌ఎల్వీ సీ-38 ప్రయోగం విజయవంతం అవ్వడంపై రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ తో పాటూ పలువురు అభినందనలు తెలిపారు.