చాయ్‌వాలా, రిక్షావాలా సేవలు కూడా యాప్‌ లోనే దొరకాలి- కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

ఐటీ రంగంలో ప్రపంచానికి మన సత్తా చాటాలని పిలుపు

చాయ్‌వాలా, రిక్షావాలా సేవలు కూడా యాప్‌ లోనే దొరకాలి- కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

Saturday November 05, 2016,

2 min Read

టీ హబ్‌ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ టీ హబ్‌ ను సందర్శించారు. మంత్రి కేటీఆర్‌ తో కలిసి ఇంక్యుబేషన్ సెంటర్లను పరిశీలించారు. స్టార్టప్ కంపెనీల గురించి ఆరా తీశారు. యువ ఆంట్రప్రెన్యూర్లతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు యువకులు తమ ఆవిష్కరణలను కేంద్రమంత్రికి వివరించారు. 

హైదరాబాద్‌ ను స్టార్టప్ రాజధానిగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం 200లకు పైగా స్టార్టప్ కంపెనీలు టీ హబ్ లో పనిచేస్తున్నాయని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్-2ను త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. ఇప్పుడున్న టీ హబ్ కు 5 రెట్లు పెద్దదిగా టీ హబ్-2 ఉంటుందని కేటీఆర్ చెప్పారు. స్టార్టప్ ఇండియా కోసం కేంద్రం పదివేల కోట్లు కేటాయించిందని అన్నారు. వాస్తవానికి దానికంటే ముందే టీ హబ్ ను తెలంగాణలో ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్ టీ హబ్ 2కు శంకుస్థాపన చేస్తారని అంతకుముందే ఆయన ట్విటర్‌ లో ప్రకటించారు. దానికి సంబంధించిన నమూనా చిత్రాలను ట్విటర్ ద్వారా విడుదల చేశారు.

image


ఏ రంగానికైనా టెక్నాలజీ కచ్చితంగా అవసరమే అని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్ అన్నారు. స్టార్టప్‌ కంపెనీల నుంచి వచ్చిన ఉత్పత్తులు సామాన్య ప్రజలకు ఉపయోగపడాలని ఆయన అభిప్రాయ పడ్డారు. సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని ఉత్పత్తి రంగంలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ ద్వారా యువ ఆంట్రప్రెన్యూర్లను ప్రోత్సహిస్తోందని అభినందించారు. స్టార్టప్ కంపెనీలకు కేంద్రం కావల్సినన్ని ప్రోత్సాహకాలు అందిస్తోందని రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. సామాన్యులను ఆధారంగా చేసుకొని సాకేతికంగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. స్టార్టప్‌ ఇండియాకు రూ.10 వేల కోట్ల నిధులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీని ఉపయోగించుకుని స్వయం సహాయక శక్తిగా ఎదిగిన తెలంగాణకు చెందిన బీడీ కార్మికురాలు సత్తెమ్మను ఉదహరించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందన్న రవిశంకర్ ప్రసాద్.. ఇన్ఫమేషన్ టెక్నాలజీలో మనదేశం సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.

image


చివరగా కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్‌ ని మినిస్టర్ కేటీఆర్‌ ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి మెమెంటో అందజేశారు.