ఆడపిల్లను కన్నందుకు కోడలికి హోండాసిటీ కారు బహుమతిగా ఇచ్చిన అత్త

ఆడపిల్లను కన్నందుకు కోడలికి హోండాసిటీ కారు బహుమతిగా ఇచ్చిన అత్త

Monday November 07, 2016,

2 min Read


ఆడపిల్లకు జన్మనిచ్చిందని కోడలిని తన్ని తరిమేసే రోజులివి. వారసుడిని కనివ్వలేదని కనికరం లేకుండా రాచిరంపాన పెడుతున్న పాపిష్టి లోకమిది. మగపిల్లాడే పుట్టాలని ఆకుపసర్లను బలవంతంగా తాగిస్తున్న ఘటనలనూ విన్నాం. కడుపులో పెరిగేది ఆడశిశువని తెలియగానే నిర్దాక్షిణ్యంగా కత్తిరించి పారేసిన వార్తలనీ చూశాం. కొడుకు పుట్టలేదని కట్టుకున్న భార్యని వదిలేసిన మగానుభావులకు లోకంలో కొదవలేదు. చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన ఆడశిశువు.. ముళ్లపొదల్లో ఆడపసికందు.. అనే వార్త శీర్షికలు చదివీ చూసీ మనసు మొద్దుబారిపోయింది.

ఆడపిల్ల ఇన్ని రకాలుగా అన్యాయమైపోతోంది. వారసుడి మాయలో పడి, మగపిల్లాడు కావాలనే దురాశ పెరిగి, కూతురు ఎందుకూ కొరగానిదైంది. ఎవరు పుడితే ఏంటీ అన్న భావన అతికొద్ది మందిలో ఉంది. అమ్మాయే కావాలనే వారు నూటికో కోటికో ఒక్కరుంటారు. ఆ ఒక్కరి గురించే మనం ఇప్పుడు చదవబోతున్నాం.

ప్రేమాదేవి. నిజంగా ఆమె ప్రేమలో దేవతే. కాకపోతే మరేంటి? కోడలు పిల్ల మనవరాలిని గిఫ్టుగా ఇచ్చిందన్న సంతోషంలో ఏం బహుమతిగా ఇచ్చిందో తెలుసా? హోండా సిటీ కారు. ఎంత పుణ్యం చేసుకుంటే అలాంటి మంచి అత్త దొరుకుతుంది చెప్పండి.

image


ప్రేమాదేవి స్వస్థలం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హమిర్ పూర్. హెల్త్ డిపార్టుమెంటులో ఇన్ స్పెక్టర్ గా చేసి రిటైరయ్యారు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడే దేవతలు పూజలందుకుంటారు అని చెప్పుకునే భారతదేశంలో ఆడబతుకే అన్యాయమైపోతున్నది. మొదట్నుంచీ ఈ వివక్షను ప్రేమాదేవి తట్టుకునేవారు కాదు. ఆడపిల్ల ఇంటికి దీపం అంటారు. అలాంటి దీపమే లేకుంటే ఈ లోకానికి వెలుగేది అని ప్రశ్నించేవారు. పున్నామ నరకాలు దాటించే పుత్రుల గురించి వెంపర్లాడే పిచ్చి జనాలు.. ఆ పుత్రుడు కావాలంటే ఒక ఆడది కూడా కావాలని విషయాన్ని ఎందుకు మరిచిపోతున్నారని ఆవేదన చెందేవారు.

అందుకే అందరికీ ఆదర్శంగా నిలవాలని, తనని ఒక నలుగురైనా స్ఫూర్తిగా తీసుకోవాలని కోడలు ఆడపిల్లకు జన్మనిచ్చిందని హోండాసిటీ కారు బహుమతిగా ఇచ్చారు. అదేమంత గొప్ప కానుకా.. నలుగురికీ చెప్పి డబ్బా కొట్టుకోడానికి.. అంటూ పనికిమాలిన విమర్శలు చేసేవాళ్లకేం తక్కువ లేదు. వాళ్లను కాసేపు సైడుకు తోసేద్దాం.

నిజమే ప్రేమాదేవి ఇచ్చింది బ్రహ్మాండమైన బహుమతేం కాకపోవచ్చు. కానీ ఇచ్చిన నేపథ్యం, సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనుకున్న ఆశయం గొప్పది. వారసుడే కావాలని వరాలు పట్టి, గుళ్లూ గోపురాలు తిరిగి, ఆకుపసర్లు, నాటువైద్యాలతో కోడళ్లను నానా చిత్రహింసలు పెట్టేవాళ్లకు ఒక కనువిప్పు కావాలనేదే ప్రేమాదేవి ఉద్దేశం.

ఇప్పుడు కుష్బూ పిచ్చ ఖుషీగా ఉంది. ఒక మంచి అత్త దొరికినందుకు ఆమె గుండె గర్వంతో ఉప్పొంగుతోంది. పట్టరాని సంతోషంతో ఆమెను మనసారా కౌగిలించుకుంది. చేతిలో కూతురిని ఆప్యాయంగా తడిమి చూసుకుని, తనివీరా స్తన్యమిచ్చి కన్నీళ్లతో గుండె బరువు దించుకుంది.

కుష్బూకి వచ్చిన కన్నీళ్లు సంతోషంతో రాలేదు. కోపంతో వచ్చాయి. ఆ కోపం ఆడపిల్లలను వద్దనుకునేవారి మీద. ఆడపిల్లలను కడుపులోని నలిపేసే వాళ్లమీద. ఆడపిల్లను బతనీయొద్దనే దుర్మార్గుల మీద.

ఆడపిల్లలు బతకాలి..

ఆడపిల్లలు వర్ధిల్లాలి...

ఆడపిల్లల కోసం బతుకునంతా ధారపోసే

ప్రేమాదేవిలాంటి వాళ్లంతా వర్ధిల్లాలి..