గుడ్డివాడని హేళన చేసిన సమాజానికి కళ్లు తెరిపించాడు

గుడ్డివాడని హేళన చేసిన సమాజానికి కళ్లు తెరిపించాడు

Sunday December 27, 2015,

6 min Read

శ్రీకాంత్ బొల్లా.. పుట్టు గుడ్డి. అతను పుట్టినప్పుడు చూడ్డానికి వచ్చినవారు జాలిపడ్డారు. కొందరు సానుభూతి చూపిస్తే మరికొందరు హేళన చేశారు. ఇలాంటి బిడ్డ భారమని, వదిలేయమని తల్లిదండ్రులకు సూచించారు. చుట్టూ మనుషులు, సమాజం ఎంత హేళన చేసినా, ఆ తల్లిదండ్రులు పట్టించుకోలేదు. వారి ప్రేమాభిమానాలే ఆ చిన్నారికి ఆశీస్సులయ్యాయి. ఆ అబ్బాయి ఇప్పుడు ఓ కంపెనీకి సీఈఓ. మూడు రాష్ట్రాల్లో నాలుగు ప్లాంట్లను నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. అన్ని అవయవాలు సరిగ్గా ఉండి కూడా .. జీవితంలో ఏమీ సాధించలేకపోయామని కృంగిపోయే వారికి అతను ఆదర్శం.

శ్రీకాంత్ బొల్లా (పిక్చర్ కర్టసీ ఐఎన్‌కే టాక్స్)

శ్రీకాంత్ బొల్లా (పిక్చర్ కర్టసీ ఐఎన్‌కే టాక్స్)


23 ఏళ్ల తర్వాత శ్రీకాంత్ బొల్లా తనేంటో నిరూపించుకున్నాడు. ఏమీ చేయలేవు అని హేళన చేసిన సమాజానికి తాను ఏదైనా సాధించగలనని తన చేతలతో నిరూపించాడు. ‘’23 ఏళ్ల క్రితం కొంతమంది నన్ను ఏమీ చేయలేవని హేళన చేశారు. ఇప్పుడు నా కాళ్ల మీద నేను నిలబడి ఉన్నాను. నేను ఏదైనా చేయగలనని నిరూపించాను’’ అని శ్రీకాంత్ బొల్లా ధీమాగా చెప్తున్నారు.

హైదరాబాద్ బేస్డ్ ఇండస్ట్రీ బొల్లాంట్ ఇండస్ట్రీ సీఈవో శ్రీకాంత్. చదువుకోని వారిని, వికలాంగులను ఉద్యోగులుగా నియమించుకున్న ఈ కంపెనీ పర్యావరణ హిత డిస్పోజబుల్ కన్జూమర్ ప్యాకేజింగ్ సొల్యూషన్స్ అందిస్తున్నది. ప్రస్తుతం ఈ కంపెనీ టర్నోవర్ 50 కోట్లకు పైమాటే.

ప్రపంచంలోకెళ్లా అదృష్టవంతుడిని తానేనని శ్రీకాంత్ ఇప్పుడు నమ్ముతున్నారు. కోట్ల రూపాయలు సంపాదించినందుకు కాదు.. తన తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. ఏడాదికి కేవలం 20 వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తారు. అయినా కొడుకు ఇష్టాలను కనిపెట్టి.. అతను కోరుకున్నది సాధించేందుకు సహకరించారు. అందుకే ప్రపంచంలోనే తాను అదృష్టవంతుడినని శ్రీకాంత్ భావిస్తుంటారు.

అనుకోకుండా విజయపథానికి..

శ్రీకాంత్‌లాంటి కథలు సాధారణ ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు ఏముంటుంది? డాలర్ సైన్ బిజినెస్సా ఇది? అని చాలామంది అనుకుంటుంటారు. కానీ శ్రీకాంత్‌లాంటి పారిశ్రామికవేత్తల స్టోరీలు మనసును ఉత్తేజ పరుస్తాయి. ప్రతి ఒక్కరికి ఒక వైవిధ్యం ఉంటుంది. ఒక కల ఉంటుంది. వాటిని సాధించేందుకు కష్టపడతారు. కానీ సమాజం పెట్టిన పరిధులను కొంతమంది మాత్రమే అధిగమిస్తారు. వారే హీరోలుగా మిగిలిపోతారు.

శ్రీకాంత్ స్టోరీ అలాంటిదే. మబ్బుల మయంగా ఉన్న జీవితాన్ని వెలుగు మయం చేసుకున్నారు. దురదృష్టాన్ని అదృష్టంగా మార్చేసుకున్నారు. అంధుడుగా పుట్టడం అతని జీవితంలో ఒక వైపు నాణెం మాత్రమే. నాణానికి రెండో వైపు అతడు నిరుపేద కుటుంబం వచ్చారు. మన సమాజంలో పేదలను ఎలా చూస్తారో చెప్పాల్సిన అవసరం లేదు.

లాస్ట్ బెంచ్‌కే పరిమితం..

అంధత్వం, పేదరికం కారణంగా చిన్నప్పుడు బడిలో శ్రీకాంత్‌కు బాల్యం సరిగా గడవలేదు. ముందు బెంచ్‌లో కూర్చోనిచ్చేవారు కాదు. తమతో కలిసి ఆడుకునేందుకు కూడా సహ విద్యార్థులు అంగీకరించేవారు కాదు. ఆ చిన్న గ్రామం, అందులోని బడిలో సంయోజితం అంటే ఏంటో ఎవరికీ తెలియదు.. అందరూ కలిసి మెలిసి ఉండాలన్నంత జ్ఞానం ఎవరికీ లేదు. ఇక టెన్త్ పూర్తయిన తర్వాత ఇంటర్‌లో సైన్స్ గ్రూప్‌ను తీసుకోవాలనుకున్నారు శ్రీకాంత్. అంధత్వం కారణంగా అతడిని సైన్స్ గ్రూప్‌లో చేర్చుకునేందుకు కాలేజీ యాజమాన్యం అంగీకరించలేదు. అయితే శ్రీకాంత్ పట్టువిడవలేదు. సమాజంతో పోరాడి తాను అనుకున్నది సాదించారు. అంతేకాదు. అమెరికాలోని ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో సీటు సంపాదించిన తొలి అంధుడుగా కూడా శ్రీకాంత్ రికార్డు సృష్టించారు.

ప్రఖ్యాత రచయిత పాల్ కొల్హో ఇలా చెప్తారు. ‘‘కష్ట సమయాల్లో పోరాట యోధులు ఓపికగా ఉండాలి. అప్పుడే ప్రపంచం మనకు అనుకూలంగా మారుతుంది. అదెలానో మనకు అర్థం కాకపోయినా సరే’’ అని వివరించారు.

మూడు రాష్ట్రాలు.. నాలుగు ప్లాంట్లు

ప్రస్తుతం శ్రీకాంత్‌కు నాలుగు ప్రొడక్షన్ ప్లాంట్స్ ఉన్నాయి. కర్ణాటకలోని హుబ్లీ, తెలంగాణలోని నిజామాబాద్‌లో ఒక్కోటి, హైదరాబాద్‌లో రెండు ప్లాంట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో త్వరలోనే పూర్తిస్తాయి సోలార్ ప్లాంట్‌ను శ్రీకాంత్ ప్రారంభిచబోతున్నారు.

ఏంజెల్ ఇన్వెస్టర్ రవి మంతా రెండేళ్ల క్రితం శ్రీకాంత్‌ గురించి తెలుసుకుని ముగ్ధుడయ్యారు. అతని వ్యాపార నైపుణ్యాన్ని చూసి మక్కువ చెంది, శ్రీకాంత్ కంపెనీలకు మెంటర్‌గా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు పెట్టుబడులు కూడా పెట్టాలని నిర్ణయించారు రవి.

‘‘హైదరాబాద్ పారిశ్రామికవాడలో ఓ చిన్న షెడ్డు. అందులో ఎనిమిది మంది ఉద్యోగులు. ముడూ మెషిన్లు. ఇంత చిన్న పరిసరాలతో ఏం సాధిస్తావని అడగాలనిపించింది. అయితే చిన్నవయసులోనే వ్యాపారంపై శ్రీకాంత్‌కు ఉన్న క్లారిటీ, టెక్నికల్ నాల్జెడ్ ఆశ్చర్యపరిచింది’’ అని రవి చెప్పారు.

పెట్టుబడుల వర్షం..

వ్యాపారం కోసం దాదాపు 13 కోట్ల రూపాయలను పెట్టుబడులు సమీకరించాలని శ్రీకాంత్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే తొమ్మిది కోట్ల రూపాయలు సమకూరాయి. కంపెనీని ఐపీఓ స్థాయికి తీసుకెళ్లాలన్నది శ్రీకాంత్ లక్ష్యం. 70 శాతం మంది ఉద్యోగులు వికలాంగులే. అలాంటి వారితో కంపెనీని విజయవంతంగా నడిపించడం అంత సులభం కాదు. ‘‘ కానీ శ్రీకాంత్ విజనే కంపెనీకి బలం’’ అంటారు రవి.

‘‘ప్రత్యేకమే’’ పెద్ద సమస్య..

‘‘పుట్టినప్పటి నుంచే వికలాంగులను ప్రత్యేకంగా చూడటం ప్రారంభవుతుంది’’ అని అంటారు శ్రీకాంత్. ఐఎన్‌కే టాక్స్‌ నవంబర్‌లో నిర్వహించిన ఓ వేదికపై ఆయన మాట్లాడుతూ వికలాంగులను చిన్నప్పటి నుంచి వేరుగానే చూస్తారన్నారు.

‘‘మరొకరు జీవించేందుకు దారి చూపడం దయాగుణం అవసరం. అవకాశాలను అందిపుచ్చుకుని అభివృద్ధి చెందేందుకు అవకాశమివ్వాలి. గొప్పవారుగా అభివృద్ధి చెందడం అంటే డబ్బు సంపాదించడం కాదు. అది సంతోషంతో వచ్చేది’’ అని శ్రీకాంత్ వివరించారు.

చిన్నప్పుడు తండ్రితో కలిసి శ్రీకాంత్ పొలానికి వెళ్లేవారు. తన వైకల్యం కారణంగా ఎలాంటి సాయం చేయలేకపోయేవారు. దీంతో కొడుకును స్కూల్‌కు పంపడమే ఉత్తమమని శ్రీకాంత్ తండ్రి భావించారు. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌లో శ్రీకాంత్ చేరారు. మరో అవకావం లేకపోవడంతో ప్రతి రోజు నడుచుకుంటూనే స్కూల్‌కు వెళ్లేవారు. అలా రెండేళ్లు నడుచుకుంటూ స్కూల్‌కు వెళ్లాడు చిన్నారి శ్రీకాంత్. ‘‘స్కూల్‌లో ఎవరూ నన్ను పట్టించుకునేవారు కాదు. లాస్ట్ బెంచ్‌లో కూర్చోబెట్టేవారు. పీటీ క్లాసుల్లో పాల్గొననిచ్చేవారు కాదు. అప్పుడనిపించేది ప్రపంచంలో కెల్లా అత్యంత నిరుపేదని నేనేనని. డబ్బులేకపోవడం వల్ల కాదు... ఒంటరితనం కారణంగా అలా ఫీలయ్యేవాడిని’’ అని శ్రీకాంత్ చిన్నప్పటి విషయాలు గుర్తుచేసుకున్నారు.

శ్రీకాంత్ కంపెనీలో పర్యావరణానికి పెద్ద పీట

శ్రీకాంత్ కంపెనీలో పర్యావరణానికి పెద్ద పీట


గ్రామంలోని స్కూల్‌లో కొడుకు ఏం నేర్చుకోవడం లేదని శ్రీకాంత్ తండ్రి గుర్తించారు. దీంతో హైదరాబాద్‌లోని ప్రత్యేక వసతులున్న స్కూల్‌లో చేర్పించారు. తనలోని కోరికలను, ఆశలను శ్రీకాంత్ అక్కడ తీర్చుకున్నారు. చెస్, క్రికెట్‌ ఆడటమే కాదు.. అందులో నిష్ణాతుడిగా మారిపోయాడు. క్లాస్‌లో టాపర్‌గా నిలిచి, అప్పటి రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాంతో కలిసి లీడ్ ఇండియా ప్రాజెక్ట్‌లో పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

ప్రభుత్వంతో పోరాటం..

ఇవన్నీ శ్రీకాంత్‌పై పెద్ద ప్రభావం చూపలేకపోయాయి. కానీ టెన్త్ తర్వాత ఇంటర్‌లో సైన్స్ గ్రూప్ తీసుకోవడానికి ఎదురైన సమస్యలు అతడిని ఆలోచనలో పడేశాయి. ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎస్‌సీ బోర్డు ఎగ్జామ్స్’లో 90%పైగా మార్కులతో శ్రీకాంత్ ఉత్తీర్ణఉడయ్యాడు. కానీ ఇంటర్ బోర్డు మాత్రం శ్రీకాంత్ సైన్స్ గ్రూప్‌లో చేరేందుకు ఒప్పుకోలేదు. ‘‘అంధత్వం కారణంగా నన్ను సైన్స్ గ్రూప్‌ తీసుకోకుండా అడ్డుకున్నారా? కానే కాదు కేవలం ప్రజల చూపు కారణంగానే నేను అంధుడినయ్యాను’’ అని శ్రీకాంత్ ఆవేదన చెందారు. బోర్డు కాదనడంతో శ్రీకాంత్ ఆగిపోలేదు. సైన్స్ గ్రూప్‌లో చేరేందుకు ఆరునెలలు పోరాడి విజయం సాధించారు. ‘‘ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేశాను. చివరకి సొంత రిస్క్‌తో ఇంటర్లో చేరేందుకు ప్రభుత్వం అంగీకరించింది’’ అని శ్రీకాంత్ వివరించారు.

అయితే వచ్చిన అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు శ్రీకాంత్. తనను సైన్స్ గ్రూప్‌లో చేరకుండా అడ్డుకున్నవారందరికీ పాఠం నేర్పించాలనుకున్నారు. అందుకే టెక్ట్స్ బుక్స్‌ను ఆడియో బుక్స్‌గా మార్చుకుని డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్‌లో 98% మార్కులు తెచ్చుకున్నారు.

ధైర్యే సాహసే లక్ష్మీ..

కొన్నిసార్లు జీవితంలో కష్టాలు ఎదురవుతాయి. అందునా ఏదో సాధించాలన్న తపన ఉన్నవారిని మరింతగా పరీక్షిస్తాయి. ఇంటర్‌లో సాధించిన విజయాన్ని ఎక్కువ ఆస్వాదించనివ్వలేదు పరిస్థితులు. బిట్స్ పిలానీ ఐఐటీలో సీటు దక్కించుకునేందుకు ఎంట్రన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు శ్రీకాంత్. హాల్ టికెట్‌ కోసం ఎదురుచూస్తుంటే మరో లెటర్ వచ్చింది.

‘‘మీరు అంధులు. పోటీ పరీక్షలకు మీరు అర్హులు కారు అంటూ బిట్స్ పిలానీ యాజమాన్యం నుంచి లేఖ వచ్చింది. దీంతో ఐఐటీ నన్ను వద్దనుకుంటే.. నాకు కూడా ఐఐటీ వద్దు. ఎంతకాలమని పోరాడాలి?’’ అని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాంత్.

టాఫ్ ఫోర్ కాలేజీల్లో సీటు..

ఈసారి పోరాటాన్ని మార్చారు శ్రీకాంత్. తనలాంటివారికి ప్రపంచంలో అత్యుత్తమ ఇంజినీరింగ్ ప్రొగ్రామ్స్ ఏ కాలేజీ అందిస్తాయో ఇంటర్నెట్‌లో వెతికారు. అమెరికాలోని కొన్ని కాలేజీలకు దరఖాస్తు చేసుకున్నారు. అదృష్టవశాత్తూ అమెరికాలో టాప్ ఫోర్ కాలేజీలు ఎంఐటీ, స్టాన్‌ఫోర్డ్, బెర్కలే, కార్నెగ్గి మెలన్ యూనివర్సిటీల్లో సీటు దక్కింది. దీంతో ఎంఐటీని ఎంచుకున్నారు శ్రీకాంత్. ఆ యూనివర్సిటీలో చదివేందుకు స్కాలర్‌షిప్ కూడా లభించింది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎంఐటీ ఓ అంధుడికి సీటు ఇవ్వడం అదే తొలిసారి. ఆ కాలేజీ చరిత్రలో అదో రికార్డు.

సీటైతే సాధించాడు కానీ.. అక్కడి జీవితంతో ఆరంభంలో అడ్జెస్ట్ కాలేకపోయాడు. అయితే రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు కూడా అలవాటయ్యాయి. అయితే డిగ్రీ చివరి దశకు వచ్చేసరికి ‘‘తర్వాత ఏంటీ’’ అన్న ఆలోచనలు శ్రీకాంత్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆ ఆలోచనలే అతడిని మళ్లీ మూలాలకు వెళ్లేలా చేశాయి.

‘‘ఎన్నో ఆలోచనలు బాధించాయి. తరగతి గదిలో వికలాంగులను ఎందుకు బ్యాక్ బెంచ్‌కు పరిమితం చేస్తారు? జనాభాలో పది శాతం కూడా లేని వికలాంగులకు భారత ఆర్థిక వ్యవస్థలో ఎందుకు చోటు కల్పించరు. మిగతావారిలా గౌరవంగా బతికేందుకు ఎందుకు అవకాశమివ్వరు?’’ ఇవే ప్రశ్నలు తనను వెంటాడేవని శ్రీకాంత్ చెప్పారు.

బంగారు అవకాశాలను వదులుకుని..

డిగ్రీ పూర్తయిన తర్వాత అమెరికా కార్పొరేట్ కంపెనీల్లో గొప్ప అవకాశాలను వదులుకుని ఇండియాకు తిరిగొచ్చారు. తనను వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానాల కోసం వెతకడం ఆరంభించారు. సమాజంలో తనలాగే వైకల్యంతో బాధపడుతున్నవారిని ఆదుకునేందుకు, పునరావాసం కల్పించేందుకు ఓ సర్వీస్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశారు. ‘‘మూడువేల మంది విద్యార్థులు చదువుకునేందుకు, వృత్తి సంబంధిత నైపుణ్యం గడించేందుకు సాయం చేశాం. అప్పుడనిపించింది చదువైతే చదివారు కానీ వారికి ఉపాధి ఎవరు కల్పిస్తారు అని. ఈ ప్రశ్నలే నన్ను కంపెనీని ప్రారంభించేలా చేశాయి. ప్రస్తుతం 150 మంది వికలాంగులకు ఉపాధి కల్పిస్తున్నాను’’ అని శ్రీకాంత్ వివరించారు.

మంచికెప్పుడూ మంచే..

ధైర్యస్థులకు, పోరాట యోధులకు ఎప్పటికైనా మంచే జరుగుతుందని ప్రముఖ రచయిత పాల్ కొల్హో చెప్పినట్టుగా, శ్రీకాంత్ విషయంలోనూ ఓ మంచి మద్దతు లభించింది. ఆ వ్యక్తే స్వర్ణలత. శ్రీకాంత్ స్థాపించిన కంపెనీల కో ఫౌండర్. ‘‘శ్రీకాంత్ చదివిన పాఠశాలలో టీచర్‌ కూడా. శ్రీకాంత్ విద్యార్థిగా ఉన్నంత కాలం అతడిని ప్రోత్సహిస్తూ వచ్చారు స్వర్ణలత. శ్రీకాంత్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన తర్వాత, ఆయన కంపెనీలో పనిచేస్తున్న వికలాంగులు నిపుణులుగా మారేందుకు శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు శ్రీకాంత్ కంపెనీలకు ఆ ఉద్యోగులే పెద్ద ఆస్తి’’ అంటారు రవి. 

‘‘శ్రీకాంత్‌ది నిజమైన విజయగాఏ. ఎందరికో స్ఫూర్తి కలిగించే కఏ. ఆయన నాకు మంచి మిత్రుడే కాదు.. గురువు కూడా. మనం నాం అనుకుంటే ఎంతటి కష్టసాధ్యమైనదైనా సాధించొచ్చని నాకు నేర్పించారాయన’’ అని అంటారు రవి.

అంధత్వంతో పుట్టిన ఓ కుర్రాడు ఇప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్‌లో ఇప్పుడో సంచలనం. ఎందరికో ఆదర్శనీయుడు. అంతేకాదు ఎంతోమంది జీవితాలను ఆనందమయంగా మార్చారు.

‘‘ప్రజలను గొప్పవారిగా చేసేందుకు సహకరించాలి. మన జీవితంలో ఇతరులకు కూడా చోటు కల్పించాలి. ఒంటరితనాన్ని తొలగించాలి. చివరగా ఏదైనా మంచి చేయండి.. అది తిరిగి మనకు మంచినే ఇస్తుంది’’ అని శ్రీకాంత్ చెప్పారు.

అన్ని అవయవాలు సరిగా ఉండి, తల్లిదండ్రుల సహకారమున్నా విధిని తిట్టుకుంటూ జీవితాన్ని వెళ్లదీసేవారెంతోమంది ఉన్నారు ఈ సమాజంలో. అలాంటిది చూపు లేకపోయినా, విధి అవరోధాలు సృష్టించినా తట్టుకుని 50 కోట్ల టర్నవర్ కలిగిన కంపెనీలకు అధిపతిగా మారారు శ్రీకాంత్. తనలాంటి వికలాంగులు ఎంతోమందికి ఉపాధి కల్పించిన శ్రీకాంత్ ఎందరికో స్ఫూర్తి ప్రదాత. అతడు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.