ఒక స్టార్టప్... రూ.20 లక్షల నష్టం... ఐదు పాఠాలు

ఒక స్టార్టప్... రూ.20 లక్షల నష్టం... ఐదు పాఠాలు

Sunday January 10, 2016,

3 min Read

2015 ఆరంభంలో మా తొలి స్టార్టప్ 100మార్క్స్ ని embibe.com సొంతం చేసుకున్న తర్వాత మేము(నేను, 100 మార్క్స్ కో-ఫౌండర్ అనుశ్రీ) ఆన్ డిమాండ్ సర్వీసెస్ లో అడుగుపెట్టాలని ఎంతో ఉత్సాహపడ్డాం. బ్యూటీ సెక్టార్ ఎంతో ఆకర్షణీయమమైన రంగంలా మాకు అనిపించడానికి రెండు కారణాలున్నాయి.

*ప్రతీ లావాదేవీ టికెట్ సైజ్

* ఆ సమయానికి ఎక్కువ మంది పోటీదారులు లేకపోవడం

బ్యూటీ సెక్టార్ లో స్టార్టప్ గురించి ప్రణాళికలు రూపొందిస్తున్నప్పుడు మరో ఇద్దరు కో-ఫౌండర్లు జతకలిశారు. వారిలో ఒకరు హిమాన్షు మాలిక్. సొంతగా ఆటో పార్ట్స్ తయారీ యూనిట్ నెలకొల్పి పదేళ్లు నడిపిన అనుభవం ఉన్న హిమాన్షు మా దగ్గర ఆపరేషన్స్ హెడ్ గా చేరారు. మరొకరు అమెజాన్ నుంచి వచ్చారు. వీరితో కలిసి ముందుకు నడిచాం. వెంటనే బ్యూటీ సర్వీసెస్ కన్సల్టెంట్ ని, బ్యుటీషియన్లను నియమించుకున్నాం. ఐదు నెలల తర్వాత మూడు కోట్ల సీడ్ రౌండ్ ఫండింగ్ కోసం చర్చలు సగంలో ఉండగా మా బిజినెస్ ఆపేద్దామని నిర్ణయించుకున్నాం. అప్పటికే రూ.60 లక్షల పెట్టుబడులు పెట్టేందుకు ఏంజిల్స్ మాట ఇచ్చారు.

image


ఈ మొత్తం ఎపిసోడ్ నేర్పిన ఐదు పాఠాలు

1. వ్యాపారంలో పోటీని గుర్తించాలి: 

ఇలాంటి సర్వీసుల్లో అడుగుపెట్టేందుకు ఎవరికీ ఎలాంటి అడ్డంకుల్లేవు. బెంగళూరు నుంచి చండీగఢ్ వరకు ప్రతీ నగరంలో ఐదు కంటే ఎక్కువ బ్యూటీ స్టార్టప్స్ ఉన్నాయి. అయినా ఇదేమీ అంత ముఖ్యమైన విషయం కాదనుకొని మా స్టార్టప్ ప్రారంభించేప్పుడు ఈ కాంపిటీషన్ పై మేం సరిగ్గా దృష్టి పెట్టలేదు. మా సీడ్ రౌండ్ ను వేగంగా పూర్తి చేయకపోవడానికి ఇదే ప్రధాన కారణం.

2. డిస్కౌంట్లపైన కాదు ఒక యూనిట్ ఖర్చుపై దృష్టిపెట్టాలి: 

మా దగ్గరున్న డబ్బంతా మంచినీళ్లలా ఖర్చయిపోవడానికి ఇదీ ఓ కారణం. హోం సర్వీసెస్ బిజినెస్ లో మేము మా ప్రత్యేకత చూపలేకపోయాం. మిగతా కాంపిటీటర్లలానే సేవలు అందించాం. సేల్స్ ఇంప్రూవ్ చేసుకునేందుకు డిస్కౌంట్స్ బాగా ఇచ్చాం. మేం వ్యాపారంలో ముందుండాలని అనుకున్నప్పుడల్లా భారీ డిస్కౌంట్లు ప్రకటించాం. సేల్స్ పెంచుకునేందుకు ఒక్కోసారి యాభై శాతం డిస్కౌంట్లు కూడా ఇచ్చాం. అది మా యూనిట్ ఖర్చులను తీవ్రంగా దెబ్బతీసింది. మిగతా కాంపిటీటర్లలా మంచి క్వాలిటీ ఇచ్చేందుకు మేం కస్టమర్ల దగ్గరకు బ్యుటీషియన్లను క్యాబ్స్ లో పంపించేవాళ్లం. డిస్కౌంట్ పోగా మా టికెట్ సైజ్ రూ.900. బ్యుటీషియన్లను కస్టమర్ల దగ్గరకు తీసుకెళ్లి, తీసుకొచ్చేందుకు రూ.600 ఖర్చయ్యేవి. మెటీరియల్ కాస్ట్ రూ.400. దీనికి తోడు... క్వాలిటీ మెయింటైన్ చేసేందుకు బ్యుటీషియన్లకు ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్లం. ప్రతీ ఫైవ్ స్టార్ రేటింగ్ కు రూ.200 ఇచ్చేవాళ్లం. ఇతర ఖర్చులు రూ.500 వరకు అయ్యేవి. ఈ లెక్కలు చాలు మా అంచనాలు ఎలా తప్పాయో తెలుసుకోవడానికి.

3. టైమింగ్ కూడా ముఖ్యమే: 

ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అన్న డైలాగ్ ప్రతీసారీ వర్కవుట్ కాదు. ఒక్కోసారి టైమింగ్ కూడా చాలా ముఖ్యం. బ్యుటీషియన్లను నియమించుకొని, సర్వీసెస్ ప్రారంభించిన మేము మా యాప్ ప్రారంభించే వరకు మార్కెటింగ్ పై దృష్టిపెట్టలేదు, ఇన్వెస్టర్ల కోసం ఆలోచించలేదు. మా కాంపిటీటర్ తో పోలిస్తే మా దగ్గర పెట్టుబడులు పెట్టగల హై ప్రొఫైల్ ఏంజిల్ ను కలుసుకోవడంలో చాలా ఆలస్యం చేశాం. అది బాగా దెబ్బతీసింది. సమయానికి ఇన్వెస్టర్లు దొరకలేదు.

image


4. వృద్ధి కూడా ముఖ్యం: 

ఏ స్టార్టప్ అయినా పూర్తిగా వృద్ధిపైనే దృష్టి పెట్టాలి. ప్రారంభ దశలోనే వృద్ధిపై దృష్టి పెట్టి తర్వాతి లెవెల్ కు సులువుగా చేరుకోవాలి. పలు స్టార్టప్స్ అర్బన్ క్లాప్, హెల్ప్ చాట్ లాంటి వాటిని ఉపయోగించుకుని ఉచితంగా కస్టమర్లను సంపాదిస్తున్నారని మాకు తర్వాత తెలిసింది. కానీ అప్పటికే మేం ప్రతీ కస్టమర్ పొందేందుకు రూ.500 పైగా ఖర్చు చేశాం.

5. డబ్బు బ్యాంకులోకి వచ్చేంత వరకు అది మీది కాదు: 

సీడ్ రౌండ్ కోసం ప్రయత్నించడానికి ముందు ఏంజిల్ రౌండ్ కోసం ప్రయత్నించాం. మా స్టార్టప్ లో పెట్టుబడులు పెడ్తామని మాటిచ్చారు కూడా. వాళ్లు మాటిచ్చారన్న దీమాతో మా దగ్గరున్న డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేశాం. మొబైల్ యాప్ ను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఖరీదైన డిజైన్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ప్రొఫెషనల్ మోడల్స్, ఫోటోగ్రాఫర్స్ తో ప్రొఫెషనల్ ఫోటో షూట్స్ చేశాం. భారీ ప్యాకేజీలతో ఉద్యోగులను నియమించుకున్నాం. ప్రారంభ దశలోనే మా డబ్బులన్నీ ఖర్చవడానికి ఇవే కారణాలు. మాటిచ్చారు కదా అని పూర్తిగా నమ్మొద్దు. డబ్బులు బ్యాంకులోకి చేరే వరకు అవి మీవి కాదన్న విషయం గుర్తుంచుకోండి.

రచయిత గురించి:

ప్రదీప్ కుమార్, ప్రస్తుతం కొత్త స్టార్టప్ జోప్ చాట్ కోసం పనిచేస్తున్నాడు. ఇది చాట్ బేస్డ్ పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్. సరసమైన ధరలు, డిస్కౌంట్లు, కూపన్ కోడ్స్ వివరాలను ఛాటింగ్ ద్వారా అందించే సర్వీసు ఇది.

గమనిక: 

ఈ వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయితవి మాత్రమే. వాటితో యువర్‌ స్టోరీకి ఎలాంటి సంబంధంలేదు. యువర్‌ స్టోరీ ఏ విధంగా బాధ్యత వహించదు.