కార్పొరేట్ ఉద్యోగులకు కెలొరీ కాన్షియస్ ఆహారం అందిస్తున్న ’గ్రాబిట్’

0

2015 జూన్‌లో ప్రారంభమైన హెల్తీ ఫుడ్ సర్వీస్ స్టార్టప్ గ్రాబిట్. అందుబాటులో ధరల్లో ప్రతీరోజూ వినియోగదారులు వివిధ రకాలైన వంటకాలని రుచిచూపిస్తోంది ఈ స్టార్టప్. అంతే కాదు.. ఆహారాన్ని నియంత్రితంగా తీసుకునే బాధ్యతనూ భుజానికి ఎత్తుకుంది. ప్రతీరోజూ వ్యక్తిగత డైట్ ప్లాన్స్ , కెలొరీ కౌంట్ చూస్తూనే.. కొత్త మెనూతో ఆకట్టుకుంటోంది. కెలొరీ కాన్షియస్ డైట్ అందించడం ద్వారా.. సమతుల్య ఆహారాన్ని అందిస్తూనే.. ఆరోగ్యాన్ని కూడా కాపాడాలనేది వీళ్ల ఆలోచన.

ముంబై ప్రాంతంలో ఉన్న గ్రాబిట్‌ని నలుగురు ఐఐటి పూర్వ విద్యార్ధులు ప్రారంభించారు. జతిన్ ఝకారియా ఐఐటి బాంబే పూర్వ విద్యార్థి కాగా.. మాన్వితా జనగామ్, హర్షవర్ధన్ యాదవ్, ఆయుషి సింగ్ రాథోడ్‌లు ఖరగ్‌పూర్ ఐఐటి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.

“ ప్రజలు తమ ఆహార విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. వృత్తిపరమైన ఒత్తిడితో ఇంటివద్దే ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేసుకోవడానికి సమయం చిక్కడం లేదు. అదే విధంగా రోజూ వ్యాయామం చెయ్యాలనే ఉత్సాహం కూడా ఉండటం లేదు. అందుకే ఆరోగ్యకరమైన ఆహారాన్ని మితంగా తినే సౌకర్యాన్ని మేము అందిస్తున్నాం ” - జతిన్

గ్రాబిట్ వివిధ రకాల డైట్ తీసుకునే ప్రజలకి ఆహారాన్ని అందిస్తోంది. స్ట్రిక్ట్‌గా డైట్ ఫాలో అయ్యేవాళ్లకి (రోజుకి 300 కెలొరీల కంటే తక్కువ తీసుకునేవారు), వివిధ రకాల వంటకాలు ప్రయత్నించాలని అనుకునేవారికి (రోజుకి 500 కెలొరీలు తీసుకునేవారు) మరియు మధ్యస్థంగా యాక్టివ్‌గా ఉండే వాళ్లకి (700 కెలొరీలు తీసుకునేవారు) తమదైన శైలిలో ఫుడ్ తయారు చేసి అందిస్తోంది.

గ్రాబిట్ ప్రారంభం

కార్పొరేట్ ఫైనాన్స్ డివిజన్‌లో ప్రొఫెషనల్‌గా వర్క్ చేస్తున్నప్పుడు, ఆయుషికి ఆరోగ్యకరమైన లంచ్ అవసరం తెలిసొచ్చింది. “ నాకు ఆహారం అంటే చాలా ఇష్టం కానీ ఇంటి నుండి దాదాపు ఎనిమిదేళ్ల వరకూ బయటే ఉండటం, టైంకి తినకపోవడం మంచి ఫుడ్ తీసుకోకపోవడంతో నా ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపాయి. అందుకనే పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అవసరానికి తగినట్టు అందించాలని ఈ వెంచర్ ని మొదలుపెట్టాం ” అంటూ ఆమె గుర్తు చేసుకుంటారు. గ్రాబిట్‌కి ఒక ప్రత్యేకమైన కెలొరీ కౌంటెడ్ మెనూ ఉంది. వ్యక్తి తీసుకోవాలనుకునే కెలొరీలని బట్టి అసాధారణ కాంటినెంటల్ ఫుడ్ నుంచి సంప్రదాయక భారతీయ ఇంటి భోజనం వరకూ అన్నీ అందులో ఉంటాయి.

ముఖ్యంగా ఇంటి వద్ద వండుకునే తీరిక లేని కార్పొరేట్ కస్టమర్లకి, కెలొరీ కాన్షియస్ బాపతు జనాలను టార్గెట్‌ చేసుకుని సేవలు అందిస్తోంది. ముంబైలో.. వీళ్ల కస్టమర్లలో చాలా మంది పొవాయ్, దిగువ ప్యారెల్ మరియు వర్లీలో నివసించే ఉద్యోగులే.

గ్రాబిట్‌లో ఒక ఇన్-హౌస్ న్యూట్రిషనిస్ట్ ఉన్నారు. కస్టమర్లు కోరుకున్న మీల్స్‌లో నిర్దిష్ట కెలొరీల సంఖ్య తక్కువగా ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఆయిల్ లెస్, అన్ ప్రాసెస్డ్.. వంటలు కూడా ఉండడం మరో ప్రత్యేకత.

ప్రజలు స్నాక్ టైంలో జంక్ ఫుడ్ తినడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి వారి కోసమే గ్రాబిట్ కోల్డ్-కంప్రెస్డ్ జ్యూసెస్‌ని ప్రవేశపెట్టింది. ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటిదాకా గ్రాబిట్ 500 కంటే ఎక్కువ లంచ్ బాక్సులని సరఫరా చేసింది. ఇప్పుడిప్పుడే స్వంతంగా ఎదుగుతున్న గ్రాబిట్ మరింత విస్తరించడానికి నిధుల కోసం చూస్తోంది.

భారతీయ ఆహార సరఫరా మార్కెట్

నగరీకరణ పెరుగుతున్నకొద్దీ, ఖర్చు చేస్తున్నవాళఅలూ ఎక్కువవుతున్నారు. అదే సమయంలో పనిచేసే మహిళల సంఖ్యా పెరుగుతోంది. ఇవన్నీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. హెక్టిక్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉండే ప్రొఫెషనల్స్‌కి వ్యాయామాలు చేసి కెలొరీలని కరిగించాలని ఉంటుంది కానీ సమయం లేదనో లేదంటే ఆసక్తి లేకో చెయ్యలేకపోతుంటారు.

భారతీయ ఆహార సర్వీస్ 11 శాతం చొప్పున వార్షిక వృద్ధితో 50 బిలియన్ యుఎస్ డాలర్ల మార్కెట్‌గా ఉంది. గత 12 నెలల్లో ఆన్‌లైన్ ఆహార సరఫరా 40 శాతం చొప్పున పెరిగి 15 బిలియన్ యుఎస్ డాలర్ల మార్కెట్ అయింది. పోషహాకారం, ఆరోగ్య ఉత్పత్తుల విభాగపు వాటా ప్రస్తుతం ఫుడ్ మార్కెట్లో 20 శాతంగా నమోదైంది. 2020 వ సంవత్సరానికి ఇది మరింత ఎక్కువ వాటాని ఆక్రమిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ రంగంలో ఉన్న పోటీదారులు

కెలొరీకేర్, యమిస్ట్, డైల్-ఎ-డైట్, ఫూడిజ్మ్ అనేవి గ్రాబిట్‌కి పోటీ ఇస్తున్న కంపెనీల్లో కొన్ని. తన పోటీదారులకి భిన్నంగా, గ్రాబిట్ ఒక సమగ్రమైన ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించేలా ప్రణాళికలు వేసింది. “ ఒకే రకమైన ఆహారాన్ని అందించే సంప్రదాయాన్ని మేము బ్రేక్ చేసాము. ప్రతీరోజూ, ప్రపంచవ్యాప్తంగా ఉండే వివిధ రకాల వంటకాలని మేము అందిస్తున్నాం. ఆహారాన్ని తప్పనిసరిగా ఆలివ్ ఆయిల్‌తోనే వండిస్తాం. మా న్యూట్రిషనిస్ట్ కేవలం మెనూని ఆమోదించడమే కాకుండా మేము వాగ్ధానం చేసిన రుచి, పోషక విలువలు, కెలొరీలు సరిగ్గా ఉండేలా చూసుకుంటారు.” అంటూ వివరిస్తారు జతిన్.

భవిష్యత్తు ప్రణాళికలు

డైట్ మరియు పోషణ గురించి కన్సల్టింగ్ చేసేలా స్వంత కిచెన్‌ని అతి త్వరలోనే ఆరంభించాలని గ్రాబిట్ ప్లాన్ చేస్తోంది. 2015 చివరికల్లా ముంబై మొత్తం ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని సరఫరా చెయ్యాలనే లక్ష్యంతో ఉంది. కస్టమైజ్ చేసే డైట్ ప్లాన్స్‌ని, ఆరోగ్యకరమైన ప్రొఫెషనల్ సేవలని కూడా ప్రారంభించాలని భావిస్తోంది.