ఢిల్లీ కాలుష్యానికి మా దగ్గర పరిష్కారం ఉందంటున్న స్టార్టప్స్


ఢిల్లీ కాలుష్యానికి మా దగ్గర పరిష్కారం ఉందంటున్న స్టార్టప్స్

Saturday January 16, 2016,

3 min Read

దేశ రాజధానిలో కాలుష్యం నానాటికీ దిగజారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం ఢిల్లీ 'మోస్ట్ పొల్యూటెడ్ సిటీ - 2014'గా అవతరించింది. తక్షణం చర్యలు చేపట్టకపోతే అక్కడ జీవనం దుర్భరం కావడం ఖాయమని నేషనల్ గ్రీన్ కౌన్సిల్ కూడా తేల్చిచెప్పేసింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాన్నే తీసుకుంది. జనాలకు తాత్కాలికంగా ఇబ్బంది కలిగించినా భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని 15 రోజుల పాటు సరి-బేసి వాహనాల పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అది ప్రస్తుతానికి ముగిసినా ఓ కొత్త రూపంలో మళ్లీ అమలు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.

ఈ నేపధ్యంలో వాయుకాలుష్యమనే అంశం ఢిల్లీలో హాట్ టాపిక్‌గా మారింది. దీన్ని తగ్గించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు యూనివర్సిటీ ఆఫ్ షికాగో, ఢిల్లీ ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. 'అర్బన్ ల్యాండ్స్ - ఇన్నోవేషన్ ఛాలెంజ్', ఢిల్లీ పేరుతో రెండు నెలల పాటు ఓ ఛాలెంజ్ నడుస్తుంది. గాలి, నీరు నాణ్యతను మెరుగుపర్చేందుకు వినూత్నమైన ఆలోచనలను స్వీకరించబోతున్నారు. అలాంటి ఐడియాతో ముందుకొచ్చిన సంస్థకు రెండో కోట్ల రూపాయల సీడ్ ఫండింగ్‌ను అందించనున్నారు.

image


దీంతో ఇప్పుడు కొన్ని స్టార్టప్స్‌ ఈ ఛాలెంజ్‌లో తమ సత్తాను చాటేందుకు సిద్ధమయ్యాయి.

"ఢిల్లీ డైలాగ్ కమిటీ సభ్యులతో మేం ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం. గాలి నాణ్యతను పరిశీలించే బృందంలో వీళ్లు కీలక సభ్యులు. అందుకే మా దగ్గరున్న సమాచారాన్నంతా వీళ్లతో పంచుకుంటున్నాం. ఔట్‌డోర్‌లో గాలి నాణ్యతను పెంచేందుకు అవకాశం ఉన్న మార్గాలను, అందుకు తగ్గట్టు రూపొందించాల్సిన విధానాలను మేం వాళ్లకు వివరించాం అంటున్నారు'' జే కన్నయన్, స్మార్ట్ ఎయిర్ ఫిల్టర్స్ - ఇండియా హెడ్.

ఇంట్లోని గాలిని శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ఢిల్లీకి చెందిన స్మార్ట్ ఎయిర్ ఫిల్టర్స్ అనే సంస్థ ప్రారంభమైంది. నగరాల్లోని గాలిని కాలుష్యం చేసే PM 2.5ని సాధ్యమైనంత వరకూ శుద్ధి చేసి మంచి గాలిని పంప్ చేసే పరికరాలను రూపొందిస్తుంది స్మార్ట్ ఎయిర్ ఫిల్టర్స్. కార్ల నుంచి వచ్చే పొగ, బొగ్గు ఉత్పత్తి సమయం, బయోమాస్ కాలేటప్పుడు వచ్చే పొగ కలయిక ద్వారా పుట్టేదే ఈ PM 2.5 అనే విషవాయువు.

ఇది మనిషి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఊపిరితిత్తులతో పాటు రక్తంలోకి వెళ్లి ఇతర అవయవాలను కూడా నాశనం చేస్తుంది.

తాము రూపొందించిన H13 HEPA అనే ఫిల్టర్ గాలిలో ఉన్న PM2.5ని 99.97 శాతం వరకూ అడ్డుకుంటుంది ఈ స్టార్టప్ క్లెయిం చేసుకుంటోంది. బయటి ప్రదేశాల్లో కాలుష్యం నుంచి రక్షణ పొందేందుకు N95 అనే పొల్యూషన్ మాస్కులను కూడా ఈ సంస్థ తయారు చేస్తోంది. ప్రస్తుతం చైనా, మంగోలియా దేశాల్లో స్మార్ట్ ఎయిర్ ఫిల్టర్స్ సేవలందిస్తోంది.

image


గాలికాలుష్యం నుంచి ఊరటనిచ్చేందుకు తమ స్టార్టప్ రూపొందిస్తున్న మాస్కులు సమర్థవంతంగా ఉపయోగపడ్తాయని అంటున్నారు ఆన్‌మాస్క్ లైఫ్ సైన్సెస్ సిఈఓ షెఫాలీ శ్రీమలి.

''గాలిలో ఉన్న చాలా కాలుష్యం వల్ల ఎవరైనా ఎక్కువ సేపు పీలిస్తే.. ఊపిరితిత్తులతో పాటు శ్వాస సంబంధ సమస్యలు.. చివరకు గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కాలుష్యం బారిన పడిన నగరాలను ఎంపిక చేసుకుని అక్కడున్న రిటైల్ కస్టమర్లకు మా సేవలు అందించాలని అనుకుంటున్నాం'' అంటారు శ్రీమలి.

హైదరాబాద్‌కు చెందిన ఈ స్టార్టప్ రీయూజబుల్ మాస్కులను తయారు చేస్తోంది. వాడిన తర్వాత వీటిని శుభ్రం చేసుకుని మళ్లీ ఉపయోగించుకునే వీలుంది. మార్కెట్లో లభిస్తున్న సర్జికల్ మాస్క్స్, కర్చీఫులు, స్కార్ఫ్‌ల కంటే తమ యాంటీ పొల్యూషన్ మాస్కులు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయని శ్రీమలి అంటున్నారు.

గుర్గావ్‌కు చెందిన సోలార్ హిప్పో సోలార్ ఉత్పత్తులను తయారు చేసే సంస్థ. తాజాగా వీళ్లు ఎయిర్ ప్యూరిఫయర్లను మార్కెట్లోకి విడుదల చేశారు. ''అంతకంతకూ మించిపోతున్న కాలుష్య స్థాయిల వల్ల ఇప్పుడు ఇలాంటి ఫిల్టర్ల అవసరం ఎంతో కనిపిస్తోంది. మా లాంటి కంపెనీలు ఉత్పత్తిచేసే ప్రొడక్టుల వల్ల జనాలు కనీసం ఇంట్లో అయినా పరిశుభ్రమైన గాలిని పీల్చే అవకాశం దక్కుతుంది అంటున్నారు'' హిప్పో సొల్యూషన్స్ సిఈఓ రాజీవ్ కమార్.

హై ఎఫిషియన్సీ పర్టిక్యులేట్ ఎయిర్ - HEPA అనే ఆధునిక పరిజ్ఞానంతో ఈ వాయుశుద్ధి యంత్రాలు రూపొందాయి. ఒక గంటలో స్వచ్ఛమైన గాలిని ఎంత వరకూ పంప్ చేసింది అనే వివరాలను కూడా ఈ మెషీన్ చెబ్తుంది. ఒక రూములో ఒక గంటలో ఎన్ని సార్లు గాలి మార్పిడిని చేసిందో కూడా చెప్పేస్తుంది.

హెల్ప్‌చాట్ అనే కొత్త యాప్‌ను బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రూపొందించింది. వాళ్లు ఉన్న వాతావరణాన్ని పరిశీలిస్తూ.. ఎప్పటికప్పుడు వివరాలు చెప్పడం ఈ మొబైల్ యాప్ ప్రత్యేకత.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సున్నా నుంచి 500 మధ్య ఉండే ఈ సూచీలో 500కు మించి రేటింగ్ వస్తే అక్కడ గాలి నాణ్యత ఘోరంగా ఉందని అర్థం చేసుకోవాలి. గాల్లో ఉన్న కాలుష్యాన్ని బట్టి ఎప్పటికప్పుడు యూజర్‌కు సమాచారం పంపడం ఈ యాప్ ప్రత్యేకత. నగరంలోని ఏఏ ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదో కూడా ఈ యాప్ చెబ్తుంది.

'' ఏ వాతావరణంలో ఉన్నారు, ఎలాంటి గాలి పీలుస్తున్నారో మా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మేం పొల్యూషన్ మాస్కులు కొనే వెసులుబాటును కల్పిస్తాం. చిల్డ్రన్ ఫ్రెండ్లీ ఔట్‌డోర్ జోన్స్ కూడా సూచించబోతున్నాం. అవసరాన్ని బట్టి హెల్త్ చెకప్స్ సౌకర్యాన్ని కల్పిస్తాం '' అంటున్నారు హెల్ప్ చాట్ సీఈఓ అంకుర్ సింగ్లా.

కాలుష్యంపై ఎలాంటి పోరాటం అవసరం

ప్రస్తుతం ఢిల్లీలో 20 మానిటరింగ్ స్టేషన్స్ ఉన్నాయి. వీటిని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటిరియాలజీ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.