సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి.. మహిళా స్వావలంబన వైపు పయనం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి.. మహిళా స్వావలంబన వైపు పయనం

Saturday October 24, 2015,

5 min Read

“మార్పు కోసం భారత్‌లోని అక్షరాస్యులు ఏం చేయగలరు ? దేశంలో ఏదీ సరిగా లేదనే వారు.. అందుకోసం ఏం చేస్తున్నారు ? " షాలిని దత్తా.. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమం నుంచి పుట్టుకొచ్చిందే 'ఆఫ్టర్ టేస్ట్'.

image


ఆఫ్టర్‌ టేస్ట్ ప్రారంభానికి ఏళ్ల పాటు ఆమె పడ్డ శ్రమే.. పై ప్రశ్నలన్నింటికీ షాలిని ఇచ్చే సమాధానం. పట్టణాల్లోని అల్పాదాయ వర్గాల పేద మహిళలకు.. కళలపై శిక్షణ ఇచ్చి జీవనోపాధి కల్పిస్తుంది ఆఫ్టర్‌ టేస్ట్.

"బాగా చదువుకోవడంతో ఓ మంచి జీవనం సాగించగల జనాభాలో నేను కూడా ఒక భాగం. అదే సమయంలో రోజూ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే పిల్లలను చాలామందిని రోజూ చూస్తుంటాను. బతుకు తెరువు కోసం ఆఫీసుల బయట టీస్టాల్స్, కాకా హోటల్స్‌లో పని చేసే బడి మానేసిన చిన్నారులు కూడా కనిపిస్తుంటారు. వీరికి ఎప్పటికీ నా మాదిరి మంచి అవకాశం లభించబోదు. పెరిగిపోతున్న అసమానతలు చూసి తట్టుకోలేకపోయేదాన్ని" - షాలినీ

మొదటి అడుగులు

ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత.. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగంతో తన కెరీర్ ప్రారంభించారు షాలిని. ఆరేళ్ల పాటు విధులు నిర్వహించాక, తను చేసే పనిని ప్రశ్నించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇదే ఆమెను మరో కోణంలోకి నడిపించింది. రెండేళ్లపాటు బడివేళలు పూర్తయ్యాక నిర్వహించే శిక్షణా కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం ద్వారా.. సామాజిక కార్యక్రమాల్లో భాగమయ్యారు షాలిని. దీనిని మరింత ప్రభావవంతంగా చేసేందుకు గాను ఇంకొంత కష్టపడాలని, అది వైవిధ్యభరితంగా ఉండాలని షాలిని తలచారు. “మంచి జీతం ఇచ్చే ఉద్యోగం, అది అందించే సౌకర్యాలు.. క్రమంగా అడ్డుగా కనిపించాయి. అందుకే దాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నా”నంటారు షాలిని.

టీచ్ ఫర్ ఇండియా కార్యక్రమం కోస ముంబైలోని మలాద్ వెస్ట్, మల్వాని ప్రాంతంలో 80మంది రెండో తరగతి విద్యార్ధులు గల ఓ పేద వర్గానికి చెందిన క్లాస్‌రూంలో పాఠం చెబుతున్నపుడు.. తనేం చేయాలో అర్ధమైంది అంటారు షాలిని.

"ప్రతీ రోజూ ఓ ప్రయోజనం కోసం జీవించేందుకు ప్రయత్నించడంతో.. మార్పు సాధించగలననే నమ్మకాన్ని పెంపొందించుకున్నాను. ఓ సోమరి అయిన చిన్నారి రోజూ స్కూల్‌కి వచ్చేవాడు. ఆ కమ్యూనిటీలో జరిగిన హింస కారణంగా విపరీతంగా భయపడ్డ మరో చిన్నారి బాలిక.. పాఠశాలలో అయితే భద్రత ఉంటుందనే భావనతో వచ్చేది. ఇలాంటి పిల్లలు చేసే ప్రయత్నాలు, నేర్చుకునే పాఠాలు, వారికి చదువుపై ఉన్న ప్రేమ, ఇక్కడ జరుగుతున్నవి మరొకరితో పంచుకోవడం చూస్తే.. నేను సరైన దారిలోనే ఉన్నాననే విషయం నాకు అర్ధమైంది"అని చెబ్తున్నపుడు షాలిని గొంతులో ధ్వనించిన సంతృప్తి స్పష్టంగా వినిపిస్తుంది.

ఇంటిలోనే మొదలైన ఔదార్యం

సానుభూతి, సేవా గుణం.. వీటితో పెరిగిన బాల్యం షాలినిది. చిన్న విషయాలతో సంతృప్తిగా బతకగలమనే భావన జీవితంలో చాలా ముఖ్యమని.. చిన్నప్పటి నుంచే తెలుసుకోవడంతో.. మార్పు కోసం ఆమె ప్రయత్నానికి పునాది అప్పుడే పడిందని చెప్పాలి.

త్రిపుర రాజధాని అయిన చిన్న పట్టణం అగర్తలలో జన్మించారు షాలిని. ఈ టౌన్‌తోపాటు జార్ఖండ్‌లోని మరో పట్టణం ధన్‌బాద్‌లో బాల్యం గడిపారు. చిన్న సిటీలు కావడంతో ప్రకృతి అందించే చిన్నచిన్నవాటిలోనే ఆమెకు అమితమైన ఆనందం కనిపించేంది.

“ఇతరులు సంతోషపడేలా మనం మెలగడం ముఖ్యం అనే వాతావరణంలో పెరిగాను. సాయంత్రం వేళల్లో ఆహ్లాదమైన నడక, చెట్లు-మొక్కలను గుర్తించడం, వాటి పేర్లను తెలుసుకోవడంలో చాలా సంతోషం వేసేది. అక్కడ రోజులో గంటల పాటు విద్యుత్ కోతలు, అధిక లోడ్ కారణంగా నిలిపివేతలు ఉండేవి. దీంతో రాత్రి పూట పచ్చగడ్డిపై కూర్చుని ఆకాశం వైపు చూస్తూ నక్షత్రాల వెలుగులను ఎంజాయ్ చేస్తుంటే.. నక్షత్ర మండలాల గురించి మా నాన్న వివరించేవారు”

image


ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎముకల విభాగంలో షాలిని తండ్రి పనిచేసేవారు. బయట ఊళ్ల నుంచి కూడా రోగులు వచ్చి చికిత్స పొందేవారు. “ ఆ సమయంలో ఇంటితో పాటు మనసు తలుపులు తెరిచి, నా తల్లిదండ్రులు వారికి ఆహ్వానం పలకడం నాకు గుర్తుంది. బయట ఎక్కడైనా ఉండి ట్రీట్మెంట్ తీసుకునేంత సొమ్ము వారి దగ్గర ఉండేది కాదు. దీంతో.. నాన్న వారికి చికిత్స అందిస్తుంటే.. అమ్మవసతి సౌకర్యాలు కల్పించేది. కరుణ, సేవ, సానుభూతిలు మా ఇంట్లో ఎప్పుడూ కనిపించేవి. ఇప్పుడు నేను ఎంచుకున్న బాటకు అవే పునాదులు వేశాయి” అని చెప్పారు షాలిని.

విద్య- మార్పునకు దూత

ఉపాధ్యాయురాలిగా గడిపిన జీవితం షాలిని ఎన్నో జీవిత సత్యాలను నేర్పింది. ఏ చిన్నారికైనా ప్రాథమిక రక్షణ కల్పించాల్సిన బాధ్యత తల్లిదే అని, పిల్లల ఎదుగుదల తల్లి నేర్పే అంశాలపైనే ఆధారపడి ఉంటుందని గ్రహించారు షాలిని.

తన వెంట ఉండేవారిలో తల్లులతో మాట్లాడుతున్నపుడు తమ పిల్లలకు చదువు చెప్పడాన్ని వారు ఎంతో సీరియస్‌గా తీసుకుంటున్నారని, జీవితాల్లో మార్పు తీసుకురాగల విషయం చదువు ఒక్కటేనని ఆ తల్లులు గ్రహించారు.

“విద్య ఎన్నో అవకాశాలను అందిస్తుంది. అందుకే వారి పిల్లలు మంచి జీవితాలను అందుకునేదుకు ఎలాగైనా చదివించాలనే పట్టుదల వారిలో చూసాను. వీరంతా కనీస అవసరాలకు కూడా ఇబ్బందులు పడుతున్న మహిళలే. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నో బాధలు అనుభవించినవారే. అయినా సరే ఈ మహిళలకు రేపటిపై ఎంతో నమ్మకం ఉంది. రేపటి కోసం మార్పునకు ప్రయత్నించే తత్వం కనిపించింది. అలాంటి ఇద్దరు మహిళలతో 'ఆఫ్టర్‌టేస్ట్' ప్రారంభించాను.”

ఆఫ్టర్‌టేస్ట్ ఏర్పాటు చేసిన ఓ ప్రదర్శన

ఆఫ్టర్‌టేస్ట్ ఏర్పాటు చేసిన ఓ ప్రదర్శన


కళలపై షాలిని ఎలాంటి శిక్షణా తీసుకోలేదు. వాటిలో ఆమె నిపుణురాలు కూడా కాదు. అయినా సరే మార్పు కోసం చేసే ప్రయత్నాలే ఆమెను నడిపించాయి. సృజనాత్మకతపై ఆమెకున్న ఇష్టం.. కళలను దగ్గర చేసిందని చెప్పాలి. ఇద్దరు మహిళలు, రెండు ప్రొడక్టులతో కొత్త వాటికి ఆలోచనలు చేయడంప్రారంభించారామె.

“ ఓ సమస్యను పరిష్కరించడానికి నాకు నేనే ఓ ఇంజినీర్‌లా భావిస్తాను. దీంతో ఓ ప్రొడక్ట్ ఎలా ఉండాలి ? దాని డిజైన్ ఎలా ఉండాలని నిర్ణయించుకోగలుగుతాను. రెండేళ్లపాటు పేదవారికి పాఠాలు చెప్పడంతో.. ఆయా ఉత్పత్తులను సాధారణ మహిళలు తయారు చేసేందుకు వీలుగా డిజైన్ చేయగలుగుతున్నాను ”

ఆఫ్టర్‌ టేస్ట్‌లో పనిచేస్తున్న మహిళల్లో ఒకరు ఫాతిమా. ఈమె నలుగురు బిడ్డల తల్లి. తల్లిదండ్రులు చిన్నపుడే మరణించడంతో.. ఫాతిమా బంధువుల ఇంట్లో పెరిగింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. ఐదో తరగతి తర్వాత చదువుకోవడం ఆమెకు సాధ్యపడలేదు. “ గతంలో ఈమె పని చేయడాన్ని వ్యతిరేకించిన ఫాతిమా భర్త.. ఇప్పుడామెకు పూర్తి మద్దతు అందిస్తున్నాడ”ని చెప్పారు షాలిని.

కమ్‌రున్నీసా.. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో పుట్టి పెరిగిన మహిళ. విద్య, జ్ఞానంపై ఈమెకు ఎనలేని అభిమానం, నమ్మకం ఉ్నాయి. అవి ఎంతో శక్తివంతమైనవని నమ్ముతుంది కమ్‌రున్నీసా. అయితే స్కూల్‌కి వెళ్లి చదువుకునేందుకు ఈమెకు ఎప్పుడూ అవకాశం దక్కలేదు.

“ పెళ్లి తర్వాత కమ్‌రున్నీసా ముంబై వచ్చేసింది. ఒక సమాజంలో అంతర్భాగంగానే జీవించింది తప్ప.. మరెలాంటి ప్రత్యేకతలు లేకుండా గడపాల్సి వచ్చింది. అయితే జీవితం నిలబడిపోవడాన్ని ప్రశ్నించేంతటి మనోదైర్యం ఆమెకు ఉంది. ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారామెకు. అయితే.. కొడుకుతో సమానంగా కూతుళ్లకు కూడా చదువుకునే హక్కు సమానంగా ఉందని అంటుంది కమ్‌రున్నీసా. ఈ విషయంలో కుటుంబంలోని ఇతరుల నుంచి వచ్చిన వ్యతిరేకతపై పోరాడింది. ప్రాథమిక విద్యతోనే పెద్ద కూతురు చదువు ఆగిపోకుండా కొనసాగించగలిగింది” అని చెప్పారు షాలిని.

సవాళ్లు

ఒకరిపై ఒకరు పరస్పరంనమ్మకం ఉంచి, మహిళలు కలిసి పనిచేసే వ్యవస్థను సృష్టించడం అంత తేలికైన విషయం కాదు.

ఓ ఆఫ్టర్‌టేస్ట్ ప్రొడక్ట్ కోసం కలిసి పని చేస్తున్న మహిళలు

ఓ ఆఫ్టర్‌టేస్ట్ ప్రొడక్ట్ కోసం కలిసి పని చేస్తున్న మహిళలు


“మహిళలు పరస్పరం నమ్మేలా చేయడం సవాలే అయినా.. ఇదే మా అసలు బలం. ఒకరికి ఒకరు వారి వ్యక్తిగత కథలను పంచుకుని.. మద్దతుగా నిలిచేందుకు దక్కిన అవకాశం కావడంతో.. అందరూ కష్టపడుతున్నార”ని చెప్పారు షాలిని.

మొదటగా ఆఫ్టర్‌ఫస్ట్‌లో చేరిన ఇద్దరూ తమ నమ్మకాన్ని, అనుభవాన్ని జోడించి.. ఎంతో సంతోషంతో తమ నైపుణ్యాన్ని ఉపయోగించి ప్రదర్శనలు నిర్వహించారు. వీరి ప్రతిభను ఎంతోమంది కళాకారుల ప్రశంసలు దక్కడం విశేషం. ఆర్థికంగా నిలదొక్కుకోవడం, ఇతరులపై ఆధారపడకుండా జీవించగలగడం వారికి సంతోషాన్నిచ్చింది. దీంతో మరింతమంది మహిళలు కూడా వీరికి జతయ్యారు.

చేతులతో డ్రాయింగ్ వేసిన పేపర్‌తో ఉత్పత్తులను వీరు తయారు చేస్తారు. సంస్థ సొంతగా నిలబడేలా కార్యకలాపాలు నిర్వహించడంపై సంతోషంగా ఉన్నారు షాలిని. అయితే.. హస్తకళా ఉత్పత్తులు మార్కెట్లోకి విరివిగా వస్తుడడం ఒక సవాల్‌గా చెబ్తున్నారామె.

ప్రేరణనిచ్చే ప్రయాణం

"నిజాయితీగా చెప్పాలంటే.. ఈ ప్రయాణంపై అనుమానాలు తలెత్తిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఆలోచనలు వచ్చినపుడల్లా నాతో నేను పోరాటం చేసేదాన్ని. నా శక్తియుక్తులను గుర్తు చేసుకుని.. మార్పు కోసం చేసే ఈ ప్రయాణం ఎంతో విలువైనదని సర్ది చెప్పుకునేదాన్ని. కూతురుగా, భార్యగా, తల్లిగా వారి జీవనం సాగించి.. ఇప్పుడా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడం నాకు ప్రేరణనిచ్చే అంశం. అదే సమయంలో కుటుంబం, స్నేహితులు, మార్గదర్శకుల నుంచి ఎలాంటి ఆంక్షలు లేని మద్దతు లభించడం నిజంగా నా అదృష్టం. నన్ను నమ్మడమే కాకుండా.. నాపై నాకు నమ్మకం తగ్గినపుడు.. నన్ను ప్రోత్సహించి నా ప్రయాణాన్ని ముందుకు నడిపించారు."

అత్యంత విలువైన క్షణం

“మా సంస్థలోని స్త్రీలు.. గ్రామీణ గుజరాత్‌లోని 2 పల్లెలకు చెందిన 80మంది మహిళలను శిక్షణనిచ్చారు. ఓ గ్రామంలో కొంతసేపు చర్చలు నిర్వహించాక.. తిరిగొస్తున్న సమయంలో జరిగిన ఓ సంఘటన అమూల్యమైనదిగా భావిస్తాను. ఆ పాఠశాలకు ఇలాంటి ఆలోచనలతో ఎవరూ ఇప్పటివరకూ రాలేదని, అసలు ఇలాంటి పనులు చేసేవారు ఉంటారని ఎపుడూ ఊహించలేదని చెప్పింది ఓ మహిళ. ఇప్పుడా స్త్రీ.. తనను తనే స్వయంశక్తితో శక్తివంతురాలిగా మారింది. మరింతమంది మహిళలకు శిక్షణనిచ్చి, ఆంక్షలను ఛేదించి ఎదిగేలా సహకరిస్తోంది. తన పిల్లలకు ఉన్నత విద్యాబుద్ధులు చెప్పించగలననే నమ్మకం ఇప్పుడామెలో ఏర్పడింది.”- షాలిని

గెలుపే లక్ష్యం.. స్వయం శక్తే మార్గం

షాలిని సాగిస్తున్న ఈ ప్రయాణానికి ఆమె భర్త నుంచి కూడా ఎంతో మద్దతు లభిస్తోంది. తను నిర్వహిస్తున్న ఆఫ్టర్‌టేస్ట్‌పై ఆయనెంతో గర్వంగా ఫీలవుతుండడం విశేషం. మిగిలిన విషయాల కంటే.. ఈ సంస్థకోసం ఎక్కువగా పాటుపడడాన్ని కుటుంబం మొత్తం సపోర్ట్ చేస్తోంది.

“ప్యాషన్‌ ప్రొఫెషన్‌గా మార్చుకుంటే.. వ్యక్తిగతం, ఉద్యోగ జీవితాల మధ్య గీత చెరిగిపోతుంది. అయితే.. ఈ రెండూ ఎప్పటికీ సమానం కావు. ఓ సారి ఒకవైపు మొగ్గితే.. మరోసారి మరొకవైపు మొగ్గు చూపాల్సిందే ”