15 వేలమందితో సైక్లింగ్.. ఇండోర్‌వాసుల ప్రపంచ రికార్డు

0

దేశంలో రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతున్నది. కాలుష్యం కారణంగా పిల్లలు, పెద్దలు అందరి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. పొల్యూషన్ సమస్య అరికట్టేందుకు ఇండోర్ వాసులు వినూత్నంగా ఆలోచన చేశారు. తమ నగరాన్ని కార్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు 15వేల మందితో ఇండోర్ సైక్లథాన్ నిర్వహించి, పర్యావరణాన్ని ప్రమోట్ చేయడంతోపాటు వరల్డ్ రికార్డును కొట్టేశారు.

ఇండోర్ సైక్లథాన్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం. ఎందుకంటే తొలి ఎడిషన్‌లోనే ఇండోర్ సైక్లథాన్ వరల్డ్ రికార్డును సృష్టించింది. మధ్యప్రదేశ్‌లో పెద్ద పట్టణమైన ఇండోర్‌లో ఇటీవలే ఓ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. పర్యావరణాన్ని ప్రమోట్ చేసేందుకు ఏకంగా 15 వేలమందితో సైక్లింగ్ చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం ర్యాలీ నిర్వహించినప్పటికీ అది గోల్డన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు (జీబీడబ్ల్యూఆర్)లో చోటు దక్కించుకుంది. గతంలో సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో 8500 మంది ఒకేసారి సైక్లింగ్ చేశారు. ఇప్పటివరకు అదే వరల్డ్ రికార్డుగా ఉండేది. ఇప్పుడు దాన్ని ఇండోర్ సైక్లింగ్ బ్రేక్ చేసింది. ఇండోర్ సైక్లింగ్ అసొసియేషన్ (ఐసీఏ) నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గోల్డన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ (జీబీఢబ్ల్యూఆర్) గుర్తించింది.

‘‘ఐసీఏ చేసిన కృషిని మేం గుర్తించాం. సర్టిఫికెట్ కూడా అందజేశాం. పెద్ద సంఖ్యలో ప్రజలు సైక్లింగ్ చేసిన ఘనతగా ఈ కార్యక్రమం ప్రపంచంలోనే రికార్డు సృష్టించింది’’ జీబీడబ్ల్యూఆర్ ఇండియా చీఫ్ మనీశ్ వైష్ణోయ్

సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో 2012లో 8500 మంది సౌతాఫ్రికన్స్ సైక్లింగ్‌లో పాల్గొన్నారు. అదే ఇప్పటివరకు వరల్డ్ రికార్డుగా ఉండేది. ఈ వరల్డ్ రికార్డ్ సైక్లింగ్ ఈవెంట్‌లో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్, బీజేపీ ప్రధాన కార్యదర్వి కైలాష్ విజయవర్గీయ కూడా పాల్గొన్నారు. కైలాష్ భారత సైక్లింగ్ ఫెడరేషన్ చైర్మన్‌.. అలాగే ఐసీఏ ప్రెసిడెంట్ కూడా. తాము నిర్వహించిన కార్యక్రమంతోపాటు మరో వినూత్న కార్యక్రామానికి కూడా ఆయన శ్రీకారం చుడుతున్నారు. కొన్ని రూట్లను కేవలం సైక్లింగ్‌కే అనుమతి ఇచ్చేలా జిల్లా అధికారులతో మాట్లాడుతున్నారు. ఒకవేళ అది సక్సెస్ అయితే ఆ రూట్లు కార్ ఫ్రీ మార్గాలుగా మారిపోతాయి. కాలుష్యం కారణంగా ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారని, ఈ విషయంపై చైతన్యం కలిగించేందుకే 15 వేల మందితో సైక్లింగ్ నిర్వహించామని కైలాష్ చెప్పారు.

పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న కైలాష్‌ను ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది ముందుకు రావాలని యువర్‌స్టోరీ ఆశిస్తున్నది.

Related Stories

Stories by GOPAL