స్టార్టప్ ఇండియా స్ఫూర్తితో వీళ్లూ సీఈఓలయ్యారు..!

పదేళ్లకే సీఈఓ, సీటీఓలయ్యారు ఈ గడుగ్గాయిలు

0

పై ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు.. అన్నాదమ్ములు. పేర్లు అభిజిత్ ప్రేమ్‌జీఅమర్‌జిత్ ప్రేమ్‌జీ. అభిజిత్ పదేళ్లుంటాడు. అమర్‌జిత్ వయసు పన్నెండు. ఐదు,ఆరు తరగతుల్లో చదువులు. ఇలాంటి పిల్లల ఆలోచన సాధారణంగా ఎలా ఉంటుంది? ఆటలు, పాటలు, షికార్లు, స్నేహితులతో కబుర్లు. కానీ ఈ ఇద్దరు గడుగ్గాయిలు ఏం చేశారో తెలుసా..? ఏకంగా పారిశ్రామికవేత్తలు అయిపోయేందుకు సిద్ధమవుతున్నారు. మీరు చదివింది నిజమే..! కేరళకు చెందిన ఇద్దరు అన్నాదమ్ములు ఆంట్రప్రెన్యూరల్ జర్నీకి రెడీ అవుతున్నారు. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. వీళ్లిద్దరినీ ఢిల్లీలో కొద్దికాలం క్రితం జరిగిన స్టార్టప్ ఇండియా కార్యక్రమానికి రావాలని ఆహ్వానం కూడా అందింది.

వీళ్లిద్దరి ఆలోచన 2015లో ప్రాణం పోసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాల్లో పదే పదే వినిపిస్తున్న స్టార్టప్ ఇండియాపై వీళ్లద్దరికీ ఎందుకనో ఆసక్తి కలిగింది. ఇంతకీ ఏంటీ స్టార్టప్ ఇండియా? అంటూ తండ్రిని పదే పదే అడగడం మొదలుపెట్టారు. అప్పటికప్పుడు నాన్న ప్రేమ్‌జిత్ ప్రభాకరన్‌ ఏదో ఒకటి చెబుతూ వచ్చాడు. కానీ తర్వాత్తర్వాత అర్ధమైంది తనయులు ఎందుకంత ఆసక్తిగా అడుగుతున్నారో. అప్పుడు చెప్పాడు.. స్టార్టప్ అంటే.. ఒక వినూత్నమైన ఆలోచనను వ్యాపారంలా అభివృద్ధి చేయడం.. ఆ వ్యాపారం మనుగడ సాధించేందుకు కొంతమంది ఇన్వెస్టర్లకు అర్థమయ్యేలా చెప్పి నిధులు సేకరించడం. ఇలా రెండు ముక్కల్లో తండ్రి వివరించిన తీరు పిల్లల మనసుల్లో బలంగా నాటుకుపోయింది.

అన్నదమ్ములిద్దరూ కలిసి కొద్దికాలంలోనే ఓ బిజినెస్ ఐడియాను, ప్లాన్‌ను రూపొందించారు. అది కూడా వాళ్లకు ఇష్టమైన బొమ్మలతో ముడిపడిన స్టార్టప్. తల్లిదండ్రులను ఒప్పించి ఇండియన్ హోంమేడ్ టాయ్స్ (IHT)పేరుతో ఓ సంస్థకు శ్రీకారం చుట్టారు. చైనా బొమ్మలను అమ్మబోమని, కొనబోమని చెబుతూనే.. మేడిన్ ఇండియా వాటికి ప్రాధాన్యమిస్తామంటున్నారు.

2022 నాటికి భారత దేశంలోని 40 కోట్ల మంది నిపుణులుగా మారాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. స్కూల్ పిల్లల స్థాయినుంచే నైపుణ్యం పెంచాలని అనుకుంటోంది. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, గ్లోబల్ ఇండియా, క్లీన్ ఇండియా, స్కిల్ ఇండియా, డ్రీమ్ ఇండియా, డిజైన్ ఇండియా వంటివన్నీ ఒకే గొడుగు కిందికి తెచ్చి స్మార్టప్ ఇండియాగా మార్చాలని మోడీ సర్కార్ సంకల్పించింది. ఈ నేపధ్యంలో ఈ పిల్లలు కూడా తమవంతు సాయాన్ని అందించాలని కష్టపడ్తున్నారు.

పిల్లల ఆలోచనను కొట్టిపారేయకుండా తల్లిదండ్రులు కూడా ఓకె చెప్పారు. ఇండియన్ హోం మేడ్ టాయ్స్ వల్ల ఏటా కేంద్రానికి 2 బిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ మిగులుతుందని పిల్లల తండ్రి ప్రేమ్‌జిత్ చెబ్తున్నారు. చైనా నుంచి వచ్చే బొమ్మల్లో నాణ్యత లోపించడంతో పాటు అవి ప్రమాదకరమనే విషయాన్ని ఆయన వివరించారు. స్వతహాగా మెకానికల్ ఇంజనీర్ అయిన ప్రేమ్‌జిత్.. డిజిటల్ ఇండియా క్యాంపెయిన్‌లో చురుకైన పాత్ర పోషించారు.

రెండేళ్ల క్రితం తన కొడుకు అమర్‌జిత్ తన పాడైపోయిన టాయ్ ప్లేన్ కోసం ఏకంగా మోటార్‌నే తయారుచేసుకున్న ఘటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నేటి టాయ్ మేకర్స్ రేపటి టెక్నాలజీ మేకర్స్ అవుతారనేది ఆయన బలమైన నమ్మకం.

పదేళ్ల అభిజిత్ ఈ సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్నాడు. ఏదో నాలుగు బొమ్మలు తయారు చేసి, వాటిని ఆన్ లైన్లో పెట్టి అమ్మడం తమ ఆలోచన కాదంటున్నాడు అభిజిత్. ఇన్నోవేటర్స్‌ను తయారుచేసే తమది స్టార్టప్ కాదని, స్మార్టప్ అని చెబ్తున్నాడు.

పిల్లల్లో సృజనాత్మకతను నింపేందుకు, వాళ్లను కూడా ఇందులో భాగస్వామ్యం చేసేందుకు చూస్తున్నట్టు వివరించాడు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో తమ బొమ్మలు అమ్మకానికి లేవని, అవసరం అనుకుంటే అప్పుడు తప్పకుండా వాటి గురించి ఆలోచిస్తామంటున్నాడు.

ప్లాస్టిక్ వీల్స్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, గేర్ బాక్సులు, కనెక్టర్లకు రాబోయే రోజుల్లో మంచి డిమాండ్ ఉంటుందని, వాటిల్లోనే బిజినెస్ ఆపర్చునిటీ వెతుక్కునేలా పిల్లలను ప్రోత్సహిస్తామని తండ్రి ప్రేమ్‌జిత్ వివరిస్తున్నారు.

బొమ్మల తయారీని స్కూళ్లలో ఓ పాఠ్యాంశంగా మార్చాలనేది ఈ ఇద్దరి అన్నాదమ్ముల డిమాండ్. అప్పుడు వాళ్లలోని సృజన బయటకు రావడమే కాకుండా విదేశీ బొమ్ములపై ఆధారపడడం తగ్గుతుందని వివరిస్తున్నారు. ఈ వయస్సులోనే వీళ్లకు ఇన్ని విషయాలపై స్పష్టత ఉండడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మొత్తమ్మీద కొత్తతరం కూడా స్టార్టప్ మంత్రం జపించడం ఒక రకంగా ఆహ్వానించదగిన పరిణామమే. లెట్స్ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. 

Related Stories

Stories by Chanukya