నోట్ బుక్ ధరను 5 రూపాయలకు దించిన ఇద్దరు ఐఐటియన్ల ఆలోచన

అడిస్టర్ సంస్థ వినూత్న ఆలోచనస్కూలు పిల్లల పుస్తకాల్లో యాడ్స్అనూహ్యంగా తగ్గిన ధరలుఈ చౌక పుస్తకాల కోసం ఎగబడ్తున్న జనాలుక్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధుల సమీకరణ

0

భారత్‌లో వ్యాపారం చేసేందుకు భారీ అవకాశాలే ఉన్నాయి. ఇందుకు కారణం 60 శాతంపైగా జనాభా 25 ఏళ్లలోపు వారే. ఇక ఈ జనాభాలో అత్యధికులు పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. చదువుకునే అవకాశాలు ఉండడం ఒక ఎత్తైతే విద్యార్థులకు చవక స్టేషనరీని అందించే విషయాన్ని సమాజం విస్మరిస్తూనే ఉంది. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా శుభమ్ అగర్వాల్, అనుభవ్ గోయల్‌లు ఐఐటీ రూర్కీలో చదువుతున్న సమయంలో ‘అడిస్టర్’ను ప్రారంభించారు.

అడిస్టర్ టీమ్
అడిస్టర్ టీమ్

ఏమిటీ అడిస్టర్ ప్రత్యేకత..

ప్రకటనలను ముద్రించడం ద్వారా నోట్‌బుక్స్‌ను తక్కువ ధరలో లభించేలా చేయడమే రూర్కైట్స్ ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్‌ లక్ష్యం. అడిస్టర్ బ్రాండ్‌తో ఈ కంపెనీ నోట్‌బుక్స్‌ను విక్రయిస్తోంది. ఇక్కడ ముఖ్యమైన విషయమేమంటే పత్రికల్లో వందలాది ప్రకటనలు ఉంటాయి. వాటిలో ఎన్ని గుర్తు పెట్టుకుంటాం? సహజంగా అతి కొద్ది మాత్రమే గుర్తుండిపోతాయి. చదివాక పేపర్‌ను పక్కన పెట్టేస్తాం. అదే నోట్‌బుక్స్‌పై ప్రకటన ఉన్నట్టయితే నెలల తరబడి ఉండిపోతుంది. అంతేనా యువ కస్టమర్ల చేతుల్లో ఈ నోట్‌ బుక్స్ ఉంటే అంతకంటే ఇంకేముంటుంది. ఈ ప్రయోజనం ఉండడంతో కొత్త ప్రకటన వేదిక దొరికిందంటూ కంపెనీలు ఓకే చెబుతున్నాయి. దీనికితోడు 300 జీఎస్‌ఎం ఆర్ట్‌ పేపర్‌ను అడిస్టర్ వినియోగిస్తోంది. అంటే ప్రకటన లుక్ అదిరిపోతుందన్నమాట. అందమైన డిజైన్‌లో నోట్‌బుక్స్‌ను రూపొందిస్తోంది అడిస్టర్. ప్రకటనదారులకు కూపన్లు, డిస్కౌంట్లను సైతం అందిస్తోంది.

సగం ధరకే నోట్‌బుక్స్..

మార్కెట్ ధరతో పోలిస్తే నోట్‌బుక్స్ 50 శాతానికే దొరికేలా రూర్కైట్స్ ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్ చేయగలిగింది. 50 శాతం కంటే తక్కువకు కూడా ధర దిగొచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఈ విధానం లాభసాటిగా ఉందని కంపెనీ చెబుతోంది. తొలిసారిగా ముద్రించిన నోట్‌బుక్స్‌ను కస్టమర్లకు ఫ్రీగా ఇవ్వడంతో పాటు ఒక్కోదానిపై మూడు రూపాయలను కస్టమర్లకే తిరిగి ఇచ్చినా కూడా మాకు లాభం మిగిలేది అని అడిస్టర్ సహ వ్యవస్థాపకులు శుభమ్ అగర్వాల్ తెలిపారు. కార్యకలాపాలు సాగించేందుకు 2013 జూలైలో నుపుర్ పంజాబి నుంచి సీడ్ ఫండ్‌ను అడిస్టర్ స్వీకరించింది. 125 పేజీలు కలిగిన స్పైరల్ బైండింగ్ నోట్‌బుక్ ధర వీరివద్ద ప్రస్తుతం రూ.18 ఉంది. ఇటువంటి నోట్‌బుక్స్ ధర మార్కెట్లో రూ.30-50 మధ్య పలుకుతోంది. ప్రతీసారి తొలి వర్షన్ నోట్‌బుక్స్‌ను విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడాన్ని కొనసాగిస్తున్నారు.

సవాళ్ల నుంచి..

ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని వ్యూహాత్మకంగా అడిస్టర్ బృందం అధిగమించింది. మొదట్లో నోట్‌బుక్స్ ధరను తయారీదారులు అధికంగా చెప్పేవారని శుభమ్ చెబుతున్నారు. తక్కువ ధరలో లభిస్తాయన్న ఆలోచనతో పేపర్ మిల్స్ ఉన్న ప్రాంతానికి వెళ్లాం. మా ఆలోచన కార్యరూపంలోకి వచ్చింది. అనుకున్నట్టుగానే సరఫరాదారును ఎంచుకున్నాం. ఇప్పుడు తక్కువ ధరకే నోట్‌బుక్స్‌ను తీసుకుంటున్నాం’ అని అన్నారు. మొదట్లో కస్టమర్లు తమ ప్రాజెక్టును అంతగా సీరియస్‌గా తీసుకోలేదని చెప్పారు. ఉద్యోగంలో భాగమని, తమకు ఆఫీసులో బిగ్‌బాస్ ఉన్నారని కస్టమర్లకు అబద్ధం చెప్పామని వివరించారు. తాము చేస్తున్న పనిని ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఈ స్నేహితుల ద్వయం జాగ్రత్త వ్యవహరించింది. అయితే డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్(డీవోఎస్‌డబ్ల్యు) నుంచి సంజాయిషీ లేఖ రావడంతో తల్లిదండ్రులకు చెప్పాల్సి వచ్చిందన్నారు. అది కూడా తమ కోర్సులో భాగంగా చేపట్టిన ప్రాజెక్టు అని చెప్పామని వివరించారు. ఐఐటీ రూర్కీలో విద్యాభ్యాసం పూర్తి అయ్యాక అడిస్టర్ కార్యకలాపాలను హైదరాబాద్‌కు మార్చారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో 2013 డిసెంబరులో ఢిల్లీకి తరలివెళ్లారు.

నెలకు 1 లక్షలకుపైగా..

కంపెనీ ఇప్పుడు అహ్మదాబాద్, ముంబైలోనూ కార్యాలయాలను విస్తరించింది. నెలకు 1 లక్షలకుపైగా నోట్‌బుక్స్ విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా 200లకుపైగా రిటైలర్లతో కంపెనీ చేతులు కలిపింది. అడిస్టర్ రెండు రకాలుగా ఆదాయాన్ని పొందుతోంది. మొదటిది నోట్‌బుక్స్ పంపిణీ చేయడం ద్వారా. రెండోది ప్రకటనదారుల నుంచి ప్రకటనల ఆదాయం పొందడం ద్వారా. సరుకు వచ్చిన రెండు మూడు రోజుల్లోనే నోట్‌బుక్స్‌ను విక్రయిస్తున్నామని శుభమ్ తెలిపారు. ఆ స్థాయిలో అడిస్టర్ నోట్‌బుక్స్ డిమాండ్‌తోపాటు పేరొచ్చిందని అంటున్నారు. హెచ్‌సీఎల్, లెవిస్, థామస్‌కుక్ వంటి కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. షాప్‌క్లూస్.కామ్ ద్వారా కూడా నోట్‌బుక్స్‌ను కంపెనీ పంపిణీ చేస్తోంది.

అందుబాటు ధరలో స్టేషనరీని తీసుకు వచ్చే విషయంలో అడిస్టర్ పనితీరు అభినందనీయం. వారి ప్రయత్నాలను ప్రోత్సహిస్తూ తోడ్పాటునిద్దాం.

WEBSITE