కార్పొరేట్ ఉద్యోగం వదిలి కూరగాయల వ్యాపారంలో సూపర్ సక్సెస్

కార్పొరేట్ ఉద్యోగం వదిలి కూరగాయల వ్యాపారంలో సూపర్ సక్సెస్

Saturday November 07, 2015,

4 min Read

ఢిల్లీకీ కూతవేటు దూరంలో ఉండే గుర్‌‍గావ్‌‌లో తాజా పళ్లు, కూరగాయలను ఫ్రెష్2ఆల్ విక్రయిస్తోంది. పాత కాన్సెప్టే అయినా కొత్త ఆలోచనతో పూర్ణిమా రావ్ దీన్ని నడిపిస్తున్న తీరు మాత్రం అద్భుతమని చెప్పాలి.

తోపుడుబళ్ల మీదా, నెత్తిన ఓ బుట్ట పెట్టుకుని ఇళ్ల వెంట తాజా కూరలు అంటూ అమ్మే రోజులు పోయాయి. అలాగే సందుచివర కనిపించే పళ్లు, కూరలను అమ్మే వ్యాపారాలు కూడా క్రమంగా కనుమరుగైపోతున్నాయి. అయితే తాజా కూరలు, పళ్లకి డిమాండ్ ఏమైనా తగ్గిందా అంటే మాత్రం లేదనే చెప్పాలి. ఆరోగ్యమైన జీవితాన్ని గడిపేందుకు.. ప్రజలు గతంలో కంటే ఎక్కువగా వీటికి ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా, సాంకేతికను అందిపుచ్చుకుంటున్న ప్రజలు.. అన్నిటికీ ఆన్‌లైన్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీనిద్వారా కావలసిన వస్తువులు ఇంటికే వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ఈ తరహా స్థానిక సేవలు అందించే కంపెనీల్లో ఒకటిగా పూర్ణిమా రావ్ ప్రారంభించిన ఫ్రెష్2ఆల్ కూడా వచ్చింది.

image


పంటపొలాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసి.. నేరుగా కస్టమర్ల ఇళ్లకు తాజా కూరగాయలు, పళ్లను అందించే లక్ష్యంతో ఫ్రెష్2ఆల్ ప్రారంభమైంది. తాజా వస్తువులను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చనేది ఈ వెంచర్‌లో కీలకమైన పాయింట్.

కార్పొరేట్ రంగం నుంచి స్టార్టప్ వైపు

పంజాబ్‍లోని పటియాలాలో ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు పూర్ణిమ. అదే ఊరులో పాఠశాల చదువు, ఫరీద్‌‌కోట్‌లో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారామె. డిగ్రీ పూర్తయ్యాక జెన్‌‌ప్యాక్ట్‌‌లో 7 నెలలపాటు పూర్ణిమ విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఈవాల్యూసర్వీస్‌తో సహా పలు కంపెనీల్లో బాధ్యతలు చేపట్టారు. 2004లో పూర్ణిమకు పెళ్లికాగా.. 2007లో మొదటి కూతురు పుట్టేవరకూ ఉద్యోగం చేశారు. 2011లో మరోసారి కార్పొరేట్ ఉద్యోగంలో చేరిన ఆమె.. 2012లో రెండో కూతురు పుట్టిన తర్వాత ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశారు.

“ఇద్దరు పిల్లల కారణంగా రెండు సార్లు కార్పొరేట్ కెరీర్‌‌కు బ్రేక్ పడింది. చిన్న కూతురికి 2ఏళ్ల వయసు దాటాక ఉద్యోగం చేద్దామని మరోసారి భావించాను. అయితే.. దీనికి బదులుగా సొంతగా ఏదైనా చేయాలనే ఆలోచన అంతర్లీనంగా మనసులో ఉంది. ” అని చెప్పారు శ్రావణి.

ఇలా ఉంటే పెళ్లైన కొత్తలో తన భర్త తరఫు బంధువులకు వ్యవసాయంతో ఉన్న అనుబంధం, పొలాల్లో వారు పడుతున్న కష్టం చూశాక.. ఆమెకు ఓ మంచి ఆలోచన తట్టింది.

రైతులను, కస్టమర్లను కలిపేలా ఫ్రెష్2ఆల్‌‌ను 2015 జూలైలో ప్రారంభించారు పూర్ణిమ.

“మాకు హర్యానాలో పంటభూములు ఉన్నాయి. అలాగే హర్యానా, రాజస్థాన్‌, పంజాబ్‌‌లలో నెట్వర్క్ ఉంది. గుర్‌గావ్‌‌లో కూడా చాలామంది తెలుసు. అందుకే వీరందిరినీ కలుపుతూ ఈ రంగంలో ఎవరూ చేయలేని విధంగా అందుబాటు ధరల్లో, రసాయనాలు లేని పదార్ధాలను అందించాలని నిర్ణయించుకున్నాను. మార్కెట్లో కూరగాయలు లభిస్తున్న రేట్లకే.. ఇలాంటి తాజా కూరలు, పళ్లు అందించడం సాధ్యమేనని భావించాను. మొదట మా సొంత పొలాలు, తోటల్లోంచి తీసుకురాగా.. తర్వాత మరికొంతమంది రైతులను కూడా ఇందుకు ప్రేరేపించాను.”అన్నారు పూర్ణిమ.

తేడా ఏమిటి ?

“ఈ రంగంలో లాభదాయకత ఉండాలంటే.. విభిన్నంగా ఉండక తప్పదనే విషయం నాకు స్పష్టంగానే తెలుసు. ఎందుకంటే ఇది విపరీతమైన పోటీ ఉన్న మార్కెట్. ఇప్పటికే అనేక కంపెనీలకు భారీగా ఫండింగ్ కూడా పొంది, మార్కెట్లో సత్తా చాటుతున్నాయి. కొన్నింటికైతే వ్యాపారం ఇంకా ప్రారంభించక మునుపే నిధులు అందిన దాఖలాలు కూడా ఉన్నాయి. అందుకే ఇతరులతో పోల్చితే.. విధానాలు, ఉత్పత్తుల్లో పలు కీలకమైన మార్పులు ఉండాల్సిందేని భావించాను”అంటూ తనకు ఎదురవబోయే సవాళ్లపై పూర్ణిమ వివరించారు చెప్పారు పూర్ణిమ.

గత కొన్ని నెలలుగా ఈ స్టార్టప్ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోంది. అంతేకాదు కస్టమర్ల సంఖ్య కూడా వేగంగా పెరుగుతుండడం విశేషం.

“ప్రతీ అపార్ట్‌మెంట్‍‌‌లోను, ప్రతీ ప్రాంతంలోనూ కొంత మంది మా కస్టమర్లు ఉండాలన్నది మా ప్రాధమిక లక్ష్యం. వీరినుంచి వచ్చిన రిఫరెన్సుల ద్వారా తర్వాత అపార్ట్‌మెంట్, కాలనీల వారీగా మార్కెట్ చేయాలని భావించాం. ఈ వ్యూహం సత్ఫలితాలనే అందించిందని చెప్పాలి. సాధారణ మార్కెటింగ్ కోసం ఖర్చు చేసేందుకు బదులుగా.. ఇప్పటికే ఉన్న కస్టమర్లకు కొంత లాభం పంచాలన్నది నా ఉద్దేశ్యం”అన్నారు పూర్ణిమ.

ప్రభావం

తమ కస్టమర్ల గురించి కూడా వివరించారు పూర్ణిమ. 90శాతం మంది మధ్యతరగతి వారేనని.. వారితో తాను వ్యక్తిగతంగా కూడా కనెక్ట్ అయిఉంటానంటున్నారు ఆమె. తద్వారా వారి ప్రాధాన్యాలు ఏంటో తెలుస్తాయని చెబ్తున్నారు. తమ కస్టమర్లలో 90శాతం మంది ఇతర స్థానిక సర్వీసులకు ఆర్డర్ చేయడం మానేశారని గర్వంగా చెబ్తారు పూర్ణిమ. వారి అంచనాలను అందుకోగలగడమే ఇందుకు కారణమన్నది ఆమె ఉద్దేశ్యం. తన కస్టమర్లకు తగిన ధరల్లో ఉత్తమమైన నాణ్యత గల పదార్ధాలు అందించడమే పూర్ణిమ వ్యూహం.

ఫ్రెష్2ఆల్ టీం

గుర్‍‌గావ్‌లోని తోటల నుంచి రానున్న మొదటి పంట డిసెంబర్‌‌లో చేతికి అందనుంది. ఈ సమయంలో ఇతర మార్కెట్ల నుంచి నాణ్యతగల కూరలు, పళ్లను సేకరించి.. తన కస్టమర్లకు అందిస్తున్నారు పూర్ణిమ. ఇప్పటికి ఆమె టీం చిన్నదే. తరచుగా తనే వెళ్లి స్టాక్ తెచ్చుకుంటారు కూడా. కొంతమంది గ్రామాల్లో తిరుగుతూ వ్యవసాయ కార్యకలాపాలు చూసుకుంటూ ఉంటారు.

image


తనకు ఉన్న చిన్న టీంతోనే ఎంతో హార్డ్ వర్క్ చేశారామె. అత్తవారింటి నుంచి లభించిన మద్దతుతో.. పని, కుటుంబాలను బేలన్స్ చేసేందుకు పూర్ణిమకు అవకాశం లభించింది. తను చేస్తున్న పనికి భర్తనుంచి పూర్తి మద్దతు లభిస్తుండడంతో.. ఆయననే దీనికి మూలస్తంభంగా చెప్తారామె.

కస్టమర్లకే ప్రాధాన్యం

కస్టమర్లతో అనుబంధం కొనసాగాలంటే.. నమ్మకం చాలా ముఖ్యమని పూర్ణిమ నమ్ముతారు. లావాదేవీల కంటే వినియోగదారులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు కూడా.

తన కస్టమర్లు ఇచ్చే ఫీడ్‌‌బ్యాక్‌‌కి ఎక్కువ విలువని ఇస్తారు పూర్ణిమ. తన సర్వీసుల్లో నాణ్యత పెంచేందుకు ఇది మరింతగా తోడ్పడిందని చెప్పచ్చు.

“కస్టమర్లకు తిరిగి ఉపయోగించల బ్యాగ్‌‌లను సరఫరా చేయడంతో.. ప్రతీ ఆర్డర్‌‌కు ₹5 రూపాయల ప్యాకేజింగ్ ఖర్చు తగ్గిపోయింది. ప్రతీ కస్టమర్ దగ్గరకు సరుకు పంపేటపుడు ఖచ్చితంగా ప్రింటెడ్ బిల్ అందిస్తాం. దీనికి వారి సంతకంతో కూడిన అక్నాలెడ్జ్‌‌మెంట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కనీస ఆర్డర్ ధర లేకుండానే.. రిటర్న్, రిఫండ్‌లను అంగీకరించడంతో.. మా సేవలు, ఉత్పత్తుల్లో నాణ్యతను కస్టమర్లకు నేరుగా చెప్పినట్లు అయింది.”

ప్రస్తుతం నిర్వహిస్తున్నదే కాకుండా... బిజినెస్2బిజినెస్ విభాగాన్ని కూడా ప్రారంభించే యోచన ఉంది. గెస్ట్‌హౌజ్‌లు, రెస్టారెంట్లను తమ కస్టమర్లుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇది ప్రారంభమే

తన వెంచర్‌‌ కోసం నిరంతరం తిరుగుతూనే ఉంటారు పూర్ణిమ. ఇందుకోసం ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్ధం అంటారామె.

“కొత్త సరఫరాదారుల కోసం నిరంతరం అన్వేషిస్తూనే ఉంటాం. విభిన్నమైన ఉత్పత్తులు అందించేవారు కనిపించేవరకూ వెతుకుతాం. నమ్మకంగా అనిపిస్తే.. వెంటనే మా కేటలాగ్‍‌లో వారి ఉత్పత్తులనూ జత చేస్తాం. డిసెంబర్ నెల కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నాను. మా సొంత పొలాల్లో పండిన రసాయనాలు లేని కూరగాయలను అందించే ఆలోచన, అప్పటి నుంచి అమలు కానుంది. మేం కొంత లాభాలు ఆర్జిస్తూ మంచి ఆరోగ్యకరమైన ఉత్పత్తులను కస్టమర్లకు అందించగలుగుతామనే ఆలోచనే ఆనందాన్ని ఇస్తోంది”అంటున్నారు పూర్ణిమ.

2015 అక్టోబర్‌లో 2లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జించగా.. ఓ ఏడాదిపాటు 40 నుంచి 50 శాతం వృద్ధిని ఆశిస్తున్నారు పూర్ణిమ. రెండేళ్లపాటు గుర్‌గావ్‌పైనే దృష్టి సారిస్తామని చెప్పారామె.

8 ఏళ్ల వయసులో ఉండగా పూర్ణిమ తండ్రిని పోగొట్టుకున్నారు. తర్వాత పిల్లలను పెంచేందుకు తల్లి ఎంతగా కష్టపడ్డారో ప్రత్యక్షంగా చూశారామె.

“ మా అమ్మ, అత్తగారు ఎంతటి కష్టజీవులో చూశాను. ప్రజల ఆహార అవసరాలు తీర్చడానికి పల్లెల్లో ప్రజల కష్టాన్ని గమనించాను. నాకు ప్రేరణనిచ్చేవి ఇవే.”-పూర్ణిమ.

వెెబ్‌సైట్