ఉద్యోగం చేస్తూనే వ్యవసాయం చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్

1

ఐదంకెల శాలరీ. వీకెండ్ ఎంజాయ్‌. బిందాస్ లైఫ్. హాయిగా కాలుమీద కాలేసుకుని బతికేయొచ్చు. కానీ ఆ కుర్రాడు అలా ఆలోచించలేదు. వీకెండ్ పబ్బులో ఉండే బదులు, నారుమడిలో బురద కాళ్లతో తిరుగుతున్నాడు. బీచ్‌ లో దోస్తులతో సరదాగా గడపకుండా, సజ్జ చేన్లో నడుస్తూ చీడపీడల నివారణకు మార్గం ఆలోచిస్తున్నాడు. హాలిడేల్లో లగ్జరీ ఫ్లాట్ లో సేదతీరకుండా, పొలంలో కలుపుమొక్కలు పీకేస్తున్నాడు. ఐదు రోజులు ఆఫీస్.. రెండురోజులు అగ్రికల్చర్. రైతు కుటుంబం నుంచి వచ్చినా రైతు జీవితాన్ని మరిచిపోని ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ ఇది.

బెంగళూరు కాగ్నిజెంట్ లో మహేశ్ ఫుల్ టై జాబ్ చేస్తున్నాడు. మంచి జీతం. మంచి లైఫ్. ఏ బాదరబందీ లేదు. అయినా మనసు ఎందుకో ఒక పట్టాన ఉండనీయలేదు. రైతు కుటుంబం నుంచి కుర్రాడు కదా.. మట్టి వాసన మీద మమకారం ఇంకా పోలేదు. రైతన్నా, పంట పొలాలన్నా, వల్లమాలిన అభిమానం. ఆ ప్రేమే వీకెండ్ లో వ్యవసాయం చేసేదాకా తీసుకెళ్లింది. సరదాలు, సంతోషాలు కాసేపు పక్కన పెట్టి, వీకెండ్ రైతుగా మారాడు. శుక్రవారం గుల్బర్గాలోని తన ఊరికి బయల్దేరి, రెండు రోజులుండి పొలం పనులన్నీ చక్కదిద్ది సండే నైట్ బెంగళూరుకి రిటర్న్ అవుతాడు. అంటే వ్యవసాయం కోసం 700 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు.

ఫార్మసీ తర్వాత పై చదువుల కోసం గుల్బర్గాకు షిఫ్టయ్యాడు. అక్కడే బీటెక్ పూర్తి చేశాడు. 2007లో జాబ్ వచ్చింది. కొన్నాళ్ల తర్వాత మనసు సేద్యం మీదకి మళ్లింది. 2016లో మంచిరోజు చూసుకుని, ఉగాది రోజున వ్యవసాయం మొదలుపెట్టాడు. ఊళ్లోని తనకున్న నలభై ఎకరాల పొలానికి ఆసామిలా మారాడు. పెట్టుబడికి, వ్యవసాయ పనిముట్లకు, వేర్ హౌజ్‌లకు ఇతరాత్ర వాటికి డబ్బులు కావాలి కదా. అందుకే ఉద్యోగం కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నాడు.

తన ఊళ్లో చాలామందికి పొలాలున్నాయి. కానీ ఏళ్ల కొద్దీ అదే వ్యవసాయ పద్ధతి. అదే మూస ధోరణి. భూసారం పెరిగి పంట దిగుబడి వచ్చిన దాఖలాల్లేవ్. నేల సారం కళ్లముందు క్షీణించిపోతుంటే ఆవేదన వ్యక్తం చేశాడు. అన్నీ తెలిసిన తాను వ్యవసాయ పద్ధతులు మార్చడంలో తప్పేముంది అనుకున్నాడు..

పొలంలో దాదాపు 30 రకాల పంటలు వేశాడు. పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు పండిస్తున్నాడు. వీటితోపాటు కొన్ని రకాల వాణిజ్య పంటలు కూడా వేశాడు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆదివారం సాయంత్రం వరకు పొలం పనుల్లో నిమగ్నమైపోతాడు. తను లేని సమయంలో పనులు చూసుకోడానికి ఇద్దరిని నియమించుకున్నాడు.

మార్కెట్ మీద ఆధార పడకుండా అన్ని సమకూర్చుకునే స్థాయిలో వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చి దిద్దుకోవాలనేది మహేశ్ ఆలోచన. గ్రామాల్లో నీటి ఎద్దడిపై రైతుల్లో అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వాననీటి సంరక్షణ పద్దతుల గురించి విడమరిచి చెప్తుంటాడు.

అధునాత పద్దతులకంటే పాతపద్ధతే మేలు. ఇదే మహేశ్ నమ్మిన సిద్ధాంతం. అలా చేయడం మూలంగానే దిగుబడి బాగా వస్తుందని నమ్మే వ్యక్తుల్లో మహేశ్ ఒకరు. ట్రాక్టర్లు గట్రా ఏమీలేవు. ఎద్దులు, అరకనే నమ్ముకున్నాడు. మొదట్లో సరిపోయేవి కావు. తర్వాత వాటి సంఖ్యను పెంచాడు.

మహేశ్ చేస్తున్న పని ఊరివాళ్లకు నచ్చింది. మెజారిటీ ప్రజలు శెభాష్ అని వెన్నుతట్టి ప్రోత్సహించారు. సీడ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరున్న రఘువన్షి నుంచి విత్తనాలు సేకరించాడు. అతణ్నే ఆదర్శంగా తీసుకుని వ్యవసాయం చేస్తున్నాను అంటున్నాడు.

కుటుంబ సభ్యులే ప్రోత్సహించకుంటే వ్యవసాయంలో ఓనమాలు కూడా తెలిసేవి కావు అంటున్నాడు మహేశ్. వాళ్ల సపోర్టుతోనే రైతు అవతరాం ఎత్తానని గర్వంగా చెప్పుకుంటున్నాడు. వ్యవసాయ అధికారుల గైడెన్స్ కూడా మరచిపోలేం అని తెలిపాడు. ఫుల్ టైం జాబ్ గా సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. పార్ట్ టైం ప్యాషన్ గా వ్యవసాయం చేస్తున్న మహేశ్ యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గుల్బర్గాలో ప్రతీ రైతు రసాయనాలు, పురుగు మందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తుంటే చూడాలనేది తన లక్ష్యం. 2025 నాటికి ఆ కల సాకారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

Related Stories