వ్యాపారం చేయాలనుకునే గృహిణులూ.. ఈ ఐదుగురూ మీకు రోల్ మోడల్సే !

కేటరింగ్, ట్రావెలింగ్, టైలరింగ్, జ్యూయలరీ మార్కెటింగ్, డ్రెస్‌డిజైనింగ్, బేకరీ...తలా ఒక రంగంలో దూసుకుపోతున్న మహిళా మణులు..భేండీ బజార్ స్వరూపాన్ని మార్చేసిన ఆదర్శ వనితలు..

వ్యాపారం చేయాలనుకునే గృహిణులూ.. ఈ ఐదుగురూ మీకు రోల్ మోడల్సే !

Friday July 03, 2015,

5 min Read

నిత్యం రణగొణ ధ్వనులు, ఇసుకేస్తే రాలనంత మంది జనం, హాకర్ల అరుపులు... రకరకాల వస్తువులు. ముంబైలోని మహ్మద్ అలీ రోడ్డులోని భేండీ బజార్ దృశ్యాలివి. నోరూరించే వంటలు, స్వీట్లతో ఆ ప్రాంతం జనసంద్రంగా ఉంటుంది. దశాబ్దాలుగా మహారాష్ట్ర, గుజరాత్‌లకు చెందిన వేలాదిమంది ముస్లిం ఫ్యామిలీలు అక్కడ వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు.

అదంతా గతం...కానీ ఇప్పుడు అక్కడ రూపుమారుతోంది. సైఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్ ట్రస్ట్ అక్కడ పరిస్థితులను మార్చేందుకు నడుం బిగించింది. చిన్న చిన్న దుకాణాల స్థానంలో షాపులు, వ్యాపారులకు ఇళ్ళు కట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నిర్మాణాలతో భేండీ బజార్ రూపురేఖలే మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడున్న మహిళలు ఎవరికి వారు స్వచ్ఛందంగా తమకు నచ్చిన వ్యాపారాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆ వ్యాపారాలు కూడా ఎంతో హుందాగా షాపుల్లో కూర్చుని కొనసాగిస్తున్నారు. మరికొందరు మహిళలయితే ఇంటర్నెట్ సాయంతో కొత్త కొత్త స్టార్టప్‌లకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ ఐదుగురు వనితలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారి విజయాన్ని సాధించారు.

సకీనా, వాసన్‌వాలా

జ్యూయలరీ మార్కెటింగ్‌లో సకీనా తనదైన రీతిలో ముందుకి దూసుకుపోతున్నారు. వాట్సప్, ఫేస్‌బుక్‌ల సాయంతో క్లయింట్లను పెంచుకుంటూ వ్యాపారం నిర్వహిస్తున్నారు.

సకీనా వాసన్‌వాలా

సకీనా వాసన్‌వాలా


ముంబై రైళ్ళలో తిరుగుతూ తన నెట్‌వర్క్‌ను, సేల్స్‌ని పెంచుకుంటున్నారు సకీనా. ‘‘మహిళలు సాధారణంగా బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లలో ఇతరులతో మాట్లాడడానికి బాగా ప్రయత్నం చేస్తారు. జ్యూయలరీ మోడల్స్ వారికి చూపిస్తే ఖచ్చితంగా వాటిని కొనడానికి ఆసక్తి కనబరుస్తారు. అంతేకాదు వారినుంచి మనకు మంచి పబ్లిసిటీ కూడా దొరుకుతుంది. వారి అడ్రస్‌లు తీసుకుంటే మన సేల్స్ కూడా బాగా పెరుగుతాయి’’అంటున్నారు సకీనా.

39 ఏళ్ళ సకీనాకు ఇద్దరు పిల్లలు. ఓ టీనేజ్ అమ్మాయి, అబ్బాయి. డిగ్రీ చదివాక కంపెనీ సెక్రటరీ కోర్సు ఫౌండేషన్ పూర్తిచేశారామె. ఐటీ సెక్టార్‌లో పనిచేసే భర్తకు చేదోడు వాదోడుగా ఉండాలని.. ఆమె చిన్న చిన్న వ్యాపార ప్రయత్నాలు చేస్తోంది. ‘‘నేను దాహోద్ నుంచి రాకముందు క్లరికల్ జాబ్ చేసేదాన్ని. ఇంకా చదువుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఖాళీ సమయాలను కొత్త కొత్త వ్యాపకాలతో గడుపుతుంటాను’’ అని చెబుతోంది సకీనా.

ఊహ తెలియకముందే 14 ఏళ్ళకే సకీనాకి పెళ్ళయిపోయింది. అంతేకాదు ఆమె పెళ్ళయ్యేనాటికి భర్త తో పాటు ఆయన తోడబుట్టినవారు చాలామంది ఉన్నారు. తనలాగా తన కూతురికి ఇలాంటి పరిస్ధితి రాకూడదని నిర్ణయించుకుంది. ఆమెని బాగా చదివించాలని తానుకూడా బాగా చదవాలని భావించింది. ఒకమ్మాయి బీకాం చదివిందంటే మిగతా అమ్మాయిలు కూడా అదే బాటలో నడుస్తారు. ప్రస్తుత కాలంలో స్కూలు పిల్లలు చాలా చైతన్యవంతంగా ఉంటున్నారు. కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. మా అమ్మాయి కూడా తన ఆశయాలను, లక్ష్యాలను సాధించేందుకు నావంతు సాయం చేస్తా’’ అంటోంది సకీనా.

వ్యాపారంలో తనకు అన్నివిధాలుగా సాయం చేసిన భర్త, తన బంధువులు, మిత్రులకు ఆమె ధన్యవాదాలు చెబుతోంది.

మరియా, జస్‌దన్వాలా

48 ఏళ్ళ మరియా వినూత్నమయిన ఆలోచనతో ముందుకెళుతున్నారు. దేవాలయాలు, మసీదులకు వెళ్ళాలనుకునే వృద్ధులకి తగిన గైడెన్స్ ఇచ్చి ఆమె స్వయంగా తీసుకెళుతున్నారు. తనకు తెలిసిన ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వృద్ధులు, మహిళలకు గైడెన్స్ ఇస్తున్నారు. 58 నుంచి 94 ఏళ్ళ వయసు వరకూ ఇలాంటి ట్రిప్పుల్లో పాల్గొనేందుకు అవకాశం ఇస్తారామె. దూరం ట్రిప్పులయితే ఏడాదికి ఒక ట్రిప్పు, చిన్న ట్రిప్పులయితే ప్రతి రెండునెలలకు ఒకటి చొప్పున ఆమె ప్లాన్ చేస్తుంటారు. ఈమె ఏర్పాటుచేసే ట్రిప్పుల్లో దైవదర్శనాలకు సంబంధించినవే కాదు, అడ్వెంచర్ ట్రిప్పులు కూడా ఉంటాయి.

డబ్బులు తక్కువగా ఉండి ఛార్‌దామ్ యాత్రలు, దైవదర్శనాలు చేసుకోవాలనుకునేవారికి తనవంతు సాయం చేస్తుంటారామె. ‘‘ఈ ట్రిప్పుల్ని నేను వ్యాపారదృష్టితో చూడడడం లేదు. ఇది సేవాదృక్పథంతో చూస్తున్నాను. ఇది నాకు ఎంతో ఆత్మ సంతృప్తిని ఇచ్చే విషయం’’ అంటారు జస్‌దన్వాలా.

మరియా జస్‌దన్వాలా , మొదటివరుసలో ఎడమవైపు నుంచి మూడో వ్యక్తి

మరియా జస్‌దన్వాలా , మొదటివరుసలో ఎడమవైపు నుంచి మూడో వ్యక్తి


‘‘ఇలాంటి ట్రిప్పులు ఎంతో ఆనందాన్ని, అనుభూతినిస్తాయి. అయితే వృద్ధుల విషయంలో మిగతావారికంటే కాస్తంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాదు సాధారణంగా టికెట్ల విషయంలో మేం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ఫ్లైట్ టికెట్లతో పాటు అన్ని రకాల వ్యాధులకు సంబంధించి మందులు కూడా మేం అందుబాటులో ఉంచుతాం. హోటళ్ళ విషయంలోనూ మా జాగ్రత్తలు మాకుంటాయి. అత్యవసర సమయంలో డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు. హోటళ్ళలో లిఫ్ట్‌లు కూడా సరిగా పనిచేయాలని చెబుతుంటాం’’ అని చెబుతున్నారు జస్‌దన్వాలా సోదరి.

బీకాం గ్రాడ్యుయేట్ అయిన జస్‌దన్వాలా... భర్త, అత్తగారితో కలిసి నివసిస్తున్నారు. ఆమెకు ఒంటరితనం అంటే భయం. ఎలాంటి పరిస్ధితులనైనా సమర్ధవంతంగా ఎదుర్కొంటారామె. ‘‘మహిళా పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా ఉండాలి. సవాళ్ళను స్వీకరించి, వాటిని అధిగమించగలగాలి. వారి ప్రవృత్తులు ద్వారా వారు ముందుకెళ్ళాలని భావిస్తున్నాను. వారు ఆలోచించే ఆలోచనలు అన్నీ విజయవంతం అవుతాయని ఆశావహ దృక్పథం కలిగి ఉండాలి. ఎవరు నిరుత్సాహపరిచినా నీరుగారిపోకుండా ముందుకెళ్ళాలి’’ అంటారు జస్‌దన్వాలా ఆత్మవిశ్వాసం నిండిన వదనంతో. రానున్న రోజుల్లో సీనియర్ సిటిజన్స్‌తో కలిసి విదేశాలకు కూడా టూర్‌లకు వెళ్లాలని ఆమె భావిస్తున్నారు.

జమీలా, పేటివాలా

22 ఏళ్ళ జమీలా ఓ చిన్నారికి తల్లి. బీకాం గ్రాడ్యుయేట్ కూడా. 12 ఏళ్ళ వయసునుంచీ ఆమెకి బట్టలు కుట్టడం వచ్చు. కుటుంబసభ్యుల సాయంతో ముందుకెళుతున్నారామె. ‘రిడాస్’ పేరుతో ఓ టైలరింగ్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించారు. పెళ్లిళ్ళకు ట్రెడిషనల్ డ్రెస్‌లు, వెరైటీ ఫ్యాషన్ డ్రెస్‌లు కుడుతుంటారు. అంతేకాదు జమీలా ఇప్పుడు షూస్, వాచీలు, టీ షర్ట్‌లు కూడా మార్కెటింగ్ చేస్తున్నారు. జమీలా వివిధ డ్రెస్‌లు డిజైన్ చేస్తే ఆమె అత్తగారు, మిగిలిన వర్కర్లు వాటిని కుట్టి రెడీ చేస్తారు.

జమీలా పేటివాలా

జమీలా పేటివాలా


సొంత వెబ్‌సైట్

జమీలా స్వంతంగా వెబ్‌సైట్ కూడా నడుపుతోంది. ఆమె భర్త ఫోటోగ్రాఫర్ కూడా కావడంతో ఆయన తీసిన ఫోటోలతో వెబ్‌సైట్ విజయవంతంగా నడుపుతున్నారు. ఆమె డిజైన్ చేసిన డ్రెస్‌లు, ఇతర ప్రొడక్ట్‌లను ఫోటోలు తీసి సోషల్ వెబ్‌సైట్ల ద్వారా అందరిచేత షేర్ చేయిస్తారు. సోషల్ వెబ్‌సైట్ల ద్వారా ప్రతి పొడక్ట్‌ను 500 నుంచి 600 లైక్‌లు వస్తుంటాయి. ముంబైతో పాటు భోపాల్ నుంచి కూడా కస్టమర్ల ఆర్డర్లు వస్తుంటాయి.

‘‘నాకూతురికి ఎన్నో కలలు ఉన్నాయి. ఆ కలల్ని నిజం చేయాల్సిన బాధ్యత తల్లిగా నాపైన ఉంది. ఆమె కోసం నేను మరింతగా కష్టపడాలి’’ అంటోంది జమీలా.

షెహనాజ్

షెహనాజ్ హోం ట్యూషన్లు చెబుతుంది. అలాగే ఉదయం, సాయంత్రం చిన్న టిఫిన్ సెంటర్ కూడా నడుపుతోంది. భేండీ బజార్‌లో కొంతమంది సీనియర్ సిటిజన్లకు, ఫ్యాక్టరీ వర్కర్ల కోసం కేటరింగ్ సర్వీసు కూడా నిర్వహిస్తోంది. పెద్దగా హడావిడి లేకుండా తన పనులన్నీ చాలా నిబ్బరంగా చేసుకుపోతోంది షెహనాజ్. తన వంటలు బాగున్నాయని చెబితే తెగ మురిసిపోతుంది షెహనాజ్. అంతేకాదు తక్కువ బడ్జెట్‌లో కేటరింగ్ చేయడానికి ఆన్‌లైన్‌లో ఆర్డర్లు కూడా తీసుకుంటుంది.

షెహనాజ్ ,ఎలక్ట్రిక్‌వాలా

షెహనాజ్ ,ఎలక్ట్రిక్‌వాలా


విద్య అందరి మైండ్‌సెట్‌ను మార్చేస్తుంది అని బాగా నమ్ముతుంది షెహనాజ్. 48 ఏళ్ళ షెహనాజ్‌కి ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు.

‘‘మాది ఉమ్మడి కుటుంబం. అందరినీ మేనేజ్ చేయడం కష్టం. మా పిల్లలు నా దగ్గర లేనిదే అసలు ఉండలేరు. వారికి మంచి లైఫ్‌స్టైల్ ఇవ్వాలనేది నా ఉద్దేశం’’ అంటోంది షెహనాజ్.

జైనబ్

చాక్లెట్లు, బేకరీ ఐటమ్స్ అంటే అందరికీ ఇష్టమే. జైనబ్‌కి బేకరీ ఐటెమ్స్ తయారుచేయడం వృత్తి. మంచి రుచికరమయిన చాక్లెట్లు కూడా ఆమె తయారుచేస్తుంది. ఇటీవల ఓ వెబ్‌సైట్ కూడా ఆమె ప్రారంభించింది. సోషల్ మీడియా ద్వారా తన బిజినెస్‌ని పెంచుకుంటోంది జైనబ్. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా తన కష్టమర్లను ఆకర్షిస్తోంది. పదిమంది మన ప్రోడక్ట్ ల గురించి మాట్లాడుకోవడం కంటే అంతకు మించిన పబ్లిసిటీ లేదంటారు జైనబ్. కుటుంబసభ్యులు, మిత్రులు, పాతతరం కస్టమర్లు మన ప్రొడక్ట్‌లు రుచికరంగా ఉన్నాయని చెబితే అదే పదిమందికీ చేరుతుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.

జైనబ్, పిపర్‌మింట్‌వాలా

జైనబ్, పిపర్‌మింట్‌వాలా


వివిధ సందర్భాలకు తగ్గట్టుగా జైనబ్ వివిధ ఫ్లేవర్లలో కేక్‌లు తయారుచేస్తుంది. థీమ్ బేస్డ్‌ కేకులకు ఆమె పెట్టింది పేరు. ఇంటర్నెట్ ద్వారా తాను ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని ఆమె చెబుతోంది.

కరస్పాండెన్స్ ద్వారా చదువుకున్న జైనబ్ ఓ కంపెనీలో అకౌంట్స్ డిపార్ట్‌మెంటులో పనిచేసింది. భర్త, ఓ కొడుకు, మామగారు, అంతే ఆమె ఫ్యామిలీ. ఆమెకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. బేకరీలో ఉన్నప్పుడు చాలా బిజీగా ఉండే జైనబ్ ఆ తర్వాత పిల్లాడితోనే ఆమె లోకం. ఏవైనా పెద్ద పెద్ద ఆర్డర్లు వచ్చినప్పుడు ఆమె భర్త సాయం చేస్తాడు. ఆయన సాయం చేయకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటోంది జైనబ్.

ఇంటి దగ్గర నుంచే చిన్న చిన్న వ్యాపారాలు చేయడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందంటోంది జైనబ్. బద్ధకంగా కూర్చుని తినడం మంచిది కాదనే సలహా ఇస్తోంది. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆర్డర్ల కోసం ఆమె ప్రయత్నం చేస్తోంది. కార్పోరేట్ కంపెనీలు కూడా ఆమె ప్రొడక్ట్‌ల పట్ల పాజిటివ్‌గా ఆలోచిస్తున్నాయి.

‘‘సాంకేతిక విప్లవం అంటే నాకేంటో తెలియదు. కానీ ఇంటర్నెట్ లేకపోతే మాత్రం నేను చాలా ఇబ్బంది పడేదాన్నే’’ అంటోంది జైనబ్.

సకీనా వాసన్‌వాలా కానీ,షెహనాజ్, జమీలా పాటివాలా, మరియా జస్‌దన్వాలా , జైనబ్...ఇలా ఎంతోమంది మహిళలు ఇంటర్నెట్‌ను నిచ్చెనగా చేసుకుని కొత్త కొత్త వ్యాపారాలు చేసుకుంటూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు.