రూ.500 కోట్ల ఖర్చుతో గాలి కూతురి పెళ్లి ఇలా జరిగింది...  

ఇప్పటికైతే ఇదే బ్లాక్ బస్టర్ వెడ్డింగ్

0

ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెది మరో దారి అన్నట్టు.. దేశమంతా కరెన్సీ కష్టాల్లో ఉంటే గనుల ఘనుడు గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాడు. అవలీలగా రూ. 500 కోట్లు మంచినీళ్ల కంటే అధ్వాన్నగా ఖర్చు పెట్టేశాడు. ఇప్పటికైతే ఇదే బ్లాక్ బస్టర్ వెడ్డింగ్. టాక్ ఆఫ్ ద నేషన్.

ఒకరోజు కాదు.. రెండ్రోజులు కాదు. ఐదు రోజుల పెళ్లి. అట్టహాసంగా, అత్యంత వైభోగంగా, మహా డాబుసరిగా జరిగింది. కళ్లు చెదిరే సెట్టింగులు. మరులు గొలిపే మండపాలు. ఆకాశంలో తారలన్నీ నేలకు దిగివచ్చాయా అన్నట్టు మిరుమిట్లుగొలిపే విద్యుత్ దీపకాంతుల ధగధగలు. రంగురంగుల నీళ్లను వెదజల్లే ఫౌంటెయిన్లు. ఎక్కడ చూసినా ఆర్నమెంటల్ ఫ్లవర్స్. చందన సౌగంధిక పరిమళాలు. సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనాలు. పుణ్యభాగీరథీ నదీ జలాలు. సుస్వరంగా మోగే మంగళ తుడియారాలు. పెళ్లి వేదిక ఆద్యంతం మలయమారుతాలు.

నగల షాపే నడిచొస్తున్నదా అన్నట్టుగా పెళ్లికూతురి ముస్తాబు. కుటుంబ సభ్యుల ఒంటిమీద మోయలేనన్ని నగలు. దిగేసుకున్న వజ్ర వైఢూర్యాలు. భూదేవంత అరుగు. ఆకాశమంత పందిరి. హంపిలోని విజయ విఠల టెంపుల్ నమూనాలో పెళ్లి సెట్టింగ్. తిరుమల తిరుపతి వేదపండితుల మంత్రోచ్ఛరణలు. కళ్లముందు గతకాలపు విజయనగర సామ్రాజ్య వైభవం. ఇలా ఒకటా రెండా విశేషాలు. ఇన్విటేషన్ కార్డు మొదలుకొని, రిటర్న్ గిఫ్టులు, స్వీట్లు, ఆఖరికి నమిలి ఊసే కిళ్లీ దాకా... పెళ్లంటే ఇదేరా అనిపించాయి.

పెళ్లికి ముందు జరిగిన వేడుకలు కూడా అహో గనుల భోజా అనిపించాయి. దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు, డాన్సర్లంతా గాలివారింట సందడి చేశారు. బ్రెజిల్ నుంచి ప్రత్యేకంగా సాంబా డాన్సర్లను రప్పించారు. ఒక రాత్రంతా వాళ్లదే షో.

పెళ్లికి బంధుమిత్రగణం, వీఐపీలు, వ్యాపారులు, సినీ రాజకీయ ప్రముఖులు వేలమంది హాజరయ్యారు. సుమారు 50వేల మందికి ఆహ్వానాలు పంపాడట బళ్లారి బాబు. కన్నడ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హాజరైంది. కర్నాటక గవర్నర్ వజూభాయ్ వాలా, హోం మంత్రి పరమేశ్వర, మరో మంత్రి శివకుమార్, రవాణా శాఖమంత్రి రామలింగారెడ్డి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ యెడ్యూరప్ప సహా అనేక మంది రాజకీయ ప్రముఖులు వచ్చారు.

పాత కరెన్సీ రద్దు చేసిన నేపథ్యంలో గాలి కూతురు పెళ్లికి హాజరైతే ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని బడాబాబులు భయపడుతున్నారని, బీజేపీ నేతలైతే పెళ్లికి వెళ్లకుంటేనే బెటరని అనుకుంటున్నారని.. రోజుకో వార్త సోషల్ మీడియా కోడై కూసింది. కానీ అలా ఏం జరగలేదు. విచిత్రం ఏంటంటే, రిపబ్లిక్ ఆఫ్ బళ్లారి అని ప్రకటించి, గాలి బ్రదర్స్ మీద పెద్ద యుద్ధమే చేసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా వచ్చి తిని బ్రేవ్ మాన్నారు.

దేశమంతా కరెన్సీ కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంటే గనాఘనులవారింట కళ్యాణం రాజవైభోగంతో తులతూగింది. కూతురు బ్రహ్మణి వివాహం నభూతో నభవిష్యత్ అన్న రేంజిలో జరిపించాడు.