ప్రత్యేకమైన పిల్లలకు పెద్ద దిక్కు ఈ 'స్వీకార్'

స్పెషల్ చైల్డ్‌కు ఏదో ఒకటి చేయాలనే తాపత్రయం..ఆర్ఎంపిల కుటుంబం నుంచి వచ్చి ఎంతో మందికి ఆత్మబంధువయ్యారు..గ్యారేజీలో మొదలైన చిన్న సంస్థే ఇప్పుడు శాఖోపశాఖల స్థాయి..58 లక్షల మందికి వైద్యాన్ని అందించిన స్వీకార్..

0

వైద్యో నారాయణో హరి.. అని ఇప్పటికి ఎన్నోసార్లు వినే ఉంటాం. కానీ మీరు ఇప్పుడు తెలుసుకోబోయే వైద్యుడు మాత్రం నిజంగా దేవుడే. గాడ్ గిఫ్టెడ్ చిల్డ్రన్ పాలిట సాక్షాత్తూ భగవంతుడే. వాళ్లను మామూలు మనుషులను చేయలేకపోయినా.. కనీసం వాళ్ల పనులైనా వాళ్లు చేసుకునే స్థాయికి పిల్లలను తీర్చిదిద్దడంలో ఆయన చేసిన.. చేస్తున్న కృషి అనిర్వచనీయం. బుద్ధి వికాసం లేని పిల్లలు, మెదడు పూర్తిస్థాయిలో పరిణతి చెందకుండా పుడ్తే వారిని సమాజానికి చూపించడానికి తల్లిదండ్రులు సిగ్గుపడ్తున్న రోజుల్లో వారినీ హుందాగా స్వీకరించి.. అనారోగ్యాన్ని తగ్గించడానికి పుట్టిందే స్వీకార్ సంస్థ. డాక్టర్ చదువుకోవడానికే నానా కష్టాలూ పడి.. చివరకు ప్రత్యేక పిల్లల కోసం తన ఆనందాన్ని, ఆస్తిని తాకట్టుపెట్టి మరీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు స్వీకార్ - ఉపకార్ వ్యవస్థాపకులు డాక్టర్ హనుమంతరావు. ఇప్పటివరకూ 58 లక్షల మందికి వైద్యం చేసి భారత దేశ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు హనుమంతరావు. ప్రత్యేకమైన వ్యాధులతో ఇబ్బంది పడ్తున్న పిల్లలకు ఆసరాగా నిలుస్తూ.. వాళ్ల తల్లిదండ్రుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు డాక్టర్ రావు.

అప్పటి రాష్ట్రపతి కలాం నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్న డాక్టర్ హనుమంతరావు- స్వీకార్ వ్యవస్థాపకులు
అప్పటి రాష్ట్రపతి కలాం నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్న డాక్టర్ హనుమంతరావు- స్వీకార్ వ్యవస్థాపకులు

రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల ఇంట్లో పుట్టి డాక్టర్ చదువు చదివినా.. ఈ పిల్లల వైద్యంపై ఎందుకు మొగ్గుచూపారు ? ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా స్ధాపించారు ? ఇన్ని లక్షల మందికి వైద్యం చేయడం ఎలా సాధ్యపడింది ? అప్పుల్లో కూరుకుపోయినా, ప్రైవేట్ వడ్డీలు తీసుకుని మరీ ఈ వ్యవస్థ నడపడం వెనుక ఉన్న కారణాలేంటో ఆయన యువర్ స్టోరీతో పంచుకున్నారు.

డాక్టర్ హనుమంతరావు కుటుంబానిది హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతం. ఆయన 1945 సెప్టెంబర్ 16వ తేదీన జన్మించారు. అప్పట్లోనే వాళ్ల కుటుంబం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లుగా మంచి పేరు సంపాదించింది. ఎక్కడెక్కడో నుంచి వచ్చి వాళ్ల దగ్గర వైద్యం చేయించుకునే వారు. వందల మంది రోగులను ఇంటి దగ్గర చూడడం, నిత్యం వాళ్లతో మాట్లడడంతో తనూ ఓ మంచి డాక్టర్ కావాలనే తపన ఆయనలో పెరిగింది. అయితే తమతో పాటే ఆర్ఎంపిగా పనిచేయాలని తండ్రి ఒత్తిడి చేసినప్పటికీ ఆయన మాత్రం వినలేదు. ప్రొఫెషనల్‌గా చదువు నేర్చుకుని పట్టా సంపాదించాలనే భీష్మించుకు కూర్చున్నారు. చేసేది లేక తల్లిదండ్రులు కూడా ఎంబిబిఎస్ చదివేందుకు అనుమతినిచ్చారు. అనుకోకుండా అప్పుడు ఆస్తి సమస్యలు చుట్టముట్టడంతో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి అతికష్టం మీద చదువు పూర్తైంది. అయినా సరే ఇంకా పై చదువులు చదవాలన్న తపనతో ఎం.డి. చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సారి కుటుంబం నుంచి మరింత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. ఇప్పటికి చదివింది చాలు, ఇక ప్రాక్టీస్ మొదలుపెట్టమని తల్లిదండ్రులు తెగేసి చెప్పేశారు. అయితే కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యతను విస్మరించకుండా తనకు వచ్చే స్టైఫండ్ మొత్తాన్ని కుటుంబానికి ఇచ్చేశారు. 'జీవితంలో చాలా సుఖంగా, సంతోషంగా గడిపిన సమయం ఏదైనా ఉందీ అంటే.. అది కేవలం బాల్యం మాత్రమేనంటారు' రావు.

అమాయకత్వం ఉట్టిపడే గిఫ్టెడ్ చైల్డ్
అమాయకత్వం ఉట్టిపడే గిఫ్టెడ్ చైల్డ్

మామూలు పిల్లల డాక్టర్‌ అయితే సరిపోతుందా ?

హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో ఎండి చేస్తున్నప్పుడు ఎంతో మంది పిల్లలకు ఆయన వైద్యం చేసేవారు. ఎక్కడెక్కడి నుంచి అక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే వారిని చూసి మనసు చలించిపోయేది. అనేక కారణాల వల్ల కొంత మంది పిల్లల్లో మానసిక అభివృద్ది ఆగిపోయేది. బయటకు మామూలుగానే కనిపించినా వాళ్ల ప్రపంచంలో వాళ్లు బతికేవారు. కొంత మంది పుట్టిన వెంటనే ఆ విషయాన్ని గ్రహిస్తే, మరికొందరు ఒకటి రెండేళ్ల తర్వాత కానీ తమ పిల్లలతో ఏదో ఇబ్బంది ఉందని గ్రహించరు. ఇలాంటి ఎన్నో కేసులు చూసిన తర్వాత తాను మూమూలు డాక్టర్ కాకూడదని అప్పుడే నిర్ణయించుకున్నారు హనుమంతరావు. గిఫ్టెడ్ చిల్డ్రన్ కోసం ఏదైనా చేయాలని బలంగా నిశ్చయించుకున్నారు.

ముంబై వెళ్లి ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్‌లో రిహాబిలిటేషన్ మెడిసిన్‌లో పూర్తిచేశారు. హైదరాబాద్ వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో సైకాలజీ మీద పిహెచ్.డి. కూడా చేశారు. చివరకు ఒక రోజు 1977లో ఒక చిన్న గ్యారేజీలో ఐదు మంది పిల్లలు, ఇద్దరు సిబ్బందితో ప్రత్యేకమైన చిల్లల కోసం క్లినిక్ ప్రారంభించారు.

సికింద్రాబాద్‌లో ఉన్న స్వీకార్ హెడ్ ఆఫీస్
సికింద్రాబాద్‌లో ఉన్న స్వీకార్ హెడ్ ఆఫీస్

స్వీకార్ పేరు ఎందుకు ?

''ఇప్పుడు సికింద్రాబాద్‌లోని జూబ్లిబస్టాండ్ ఎదురుగా ఉన్న సంస్థకు అంత సులువుగా స్వీకార్ మారలేదు. గారేజ్‌లో ప్రారంభమైన క్లినిక్ ఆ తర్వాత ఓ అపార్ట్‌మెంట్‌కు మారింది. అక్కడి స్థానికులకు, ఇతర ఫ్లాట్ల వాళ్లకు ఎవరికీ ఇది ఇష్టం లేదు. ఒక్కోసారి పై నుంచి కొంత మంది పిల్లలపైనా, మా పైనా నీళ్లు పోసేవారు. కారణం లేకపోయినా ఏదో విధంగా గొడవకు దిగేవారు'' అంటూ పాతరోజులను గుర్తుచేసుకుని బాధపడ్డారు డా. హనుమంతరావు. అంతే కాదు ఆ రోజుల్లో మనోవికాసం లేని పిల్లలు పుట్టారంటే తల్లిదండ్రులు కూడా బిక్కచచ్చిపోయేవారు. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్లను చూపించేవారు కాదు. వాళ్లను ఎవరితోనూ కలవనిచ్చేవాళ్లు కాదు. సమాజం కూడా వాళ్లను వెలేసినట్టు చూసేది. అందుకే అలాంటి గిఫ్టెడ్ చైల్డ్‌ను స్వీకరించాలనే ఆలోచనతోనే 'స్వీకార్' అనే పేరును పెట్టినట్టు చెప్తారు. ఎక్కువ చదివి డాక్టర్‌కు పిచ్చిపట్టిందని, పిల్లల వైద్యం చేసుకోకుండా ఇలాంటి పిచ్చోళ్లకు ట్రీట్మెంట్ ఇస్తున్నాడేంటి అంటూ కొంత మంది డాక్టర్ మిత్రులు, సన్నిహితులు కూడా గేలిచేశావరని ఆయన తన పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు.

స్వీకార్‌లో చికిత్స పొందుతున్న పిల్లలు
స్వీకార్‌లో చికిత్స పొందుతున్న పిల్లలు

డిఫెన్స్ వాళ్ల అనుమతి తీసుకుని 1981లో స్వీకార్ భవనానికి భూమి పూజ జరిగింది. ఏ ముహూర్తంతో శంకుస్థాపన జరిగిందో కానీ అప్పటి నుంచి స్వీకార్ ఇక వెనుదిరిగి చూడలేదు. చిన్న గ్యారేజ్‌లో మొదలైన ఆ సంస్థే ఇప్పుడు నాలుగు క్యాంపస్‌లు, నాలుగు ఇన్‌స్టిట్యూట్లుగా 224 మంది సిబ్బందితో రోజుకు రెండు వేలకు పైగా కేసులను ట్రీట్ చేస్తున్న సంస్థగా శాఖోపశాఖలుగా విస్తరించింది. మెంటల్లీ హ్యాండీకాప్డ్ (మనో వైకల్యం), ఫిజికల్లీ డిజేబుల్డ్ (శారీరక వైకల్యం), మూగ - చెవిటి, మత్తుపదార్థాల బానిసలకు ఇప్పుడు ట్రీట్మ్‌మెంట్ ఇస్తోంది స్వీకార్. ఇప్పటి వరకూ ఆశ్చర్యకరంగా 58 లక్షల మంది పిల్లలకు వైద్య సేవలు అందించింది స్వీకార్. అయితే పిల్లలను స్వీకరించగానే సరిపోదు.. వాళ్లను ఉపకారం కూడా చేయాలనే ఉద్దేశంతో 'ఉప్‌కార్', ఆశ్రయం కల్పించేందుకు 'ఆశ్రయ్', రక్షణ కోసం 'సురక్ష' అనే నాలుగు సంస్థలనూ ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఈ రంగంలో శిక్షణనిచ్చేందుకు 30 ప్రత్యేకమైన, విభిన్నమైన బిఇడి, మెఇడి సహా పిహెచ్.డి. కోర్సులను కూడా ఒకే గొడుగు కింద నడుపుతోంది స్వీకార్.

తాండూరులో ఏర్పాటైన స్వీకార్ రిహాబిలిటేషన్ సెంటర్
తాండూరులో ఏర్పాటైన స్వీకార్ రిహాబిలిటేషన్ సెంటర్

విస్తరణతోనే చిక్కులు

ఎక్కడో శ్రీకాకుళం, కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకుని హైదరాబాద్ వస్తున్న వాళ్లను చూసి ఆయనకు ఎందుకో కాస్త ఇబ్బంది అనిపించేది. ఇక్కడ వాళ్లకు వసతి సౌకర్యాలు కల్పించినా వాళ్లు పడ్తున్న అవస్థలతో చలించిపోయారు. అందుకే గుంటూరు, కడప, తాండూరులో మరో మూడు క్యాంపస్‌లూ ప్రారంభించారు. అయితే ఇక్కడే సమస్య మొదలైంది. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేకున్నా, దేశ- విదేశాల నుంచి పెద్దగా గ్రాంట్ల రూపంలో ఏవీ రాకపోయినా ఆయన చేసిన ధైర్యమే ఇబ్బందుల్లోకి నెట్టింది. అప్పుల భారం పెరిగిపోయింది. దాదాపు 25 బ్యాంకులు, 117 మంది నుంచి అప్పులు తీసుకుని మరీ ఇంత పెద్ద వ్యవస్థను ఆయన ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. చివరకు తన ఇంటిని కూడా ఈ వ్యవస్థ కోసం తాకట్టుపెట్టారు హనుమంతరావు.

''రాజకీయ నాయకులతో మంచిగా ఉండడం, ఎవరినో మచ్చిక చేసుకునేందుకు ఏదిపడ్తే అది చేయడం, సరైన మార్కెటింగ్ చేసుకోకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని'' ఆవేదన వ్యక్తం చేశారు. ''అందరికీ నచ్చినట్టు ఉండడం కుదరదు, మనం మనలా ఉంటేనే మనగలుగుతాం, మనషుల్లా ఉంటాం'' అనేది ఫిలాసఫీ. వ్యక్తిగతంగా సక్సెస్ అయినా ఇప్పుడు ఇబ్బందులు పడేందుకు ఆయన ముక్కుసూటితనం కూడా కారణమే అని చెప్పొచ్చు.

ఎవరైనా తీసుకుంటే స్వీకార్‌ను ఇచ్చేస్తారా ?

అప్పట్లో కొంత మంది స్వీకార్ చేస్తున్న పనిని గుర్తించారు. రావు ఇబ్బందులను చూసి చేజిక్కించుకోవాలనీ చూశారు. పరిస్థితులకు లొంగి ఆయన కూడా పునరాలోచనలో పడిన సందర్భాలూ ఉన్నాయి. కానీ తీసుకున్న వాళ్లు ఆ తర్వాత ఇదే ధృక్పదంతో వ్యవస్థను నడిపిస్తారా ? తన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లగలరా ? అనే అపనమ్మకమే ఆయనను వెనక్కి లాగింది. ఎన్ని కష్టాలకు ఓర్చైనా.. ఎంత భారం పెరిగినా.. 70 ఏళ్ల వయస్సులోనూ ఒంటరిపోరాటం చేస్తున్నారు డాక్టర్ రావు. ఇంత కష్టపడిన తర్వాత ఇప్పుడు ఎవరి చేతిలోనూ తన సంస్థను పోయడం ఇష్టం లేదంటారు ఆయన. తన ఇద్దరు కూతుర్లు బాగా చదువుకుని సెటిల్ అయిపోయారని, తన భార్య కూడా డాక్టర్‌ కావడం వల్ల సమస్యల్లేవని ముక్తాయిస్తారు ఆయన.

''గాడ్ గిఫ్టెడ్ చైల్డ్రన్ చేష్టలు, వాళ్ల అమాయకు మొహాలు, తల్లిదండ్రుల సంతృప్తే తనకు ఈ వయస్సులోనూ ఛార్జింగ్ ఇస్తోందని, ఎంత కాలమైనా ఈ బూస్టింగ్ ఒక్కటే తనను నడిపిస్తుంది'' అంటారు డాక్టర్ హనుమంతరావు.

ఆత్మసంతృప్తి ముందు అవార్డులు ఏపాటివి ?

జాతీయ ఐక్యతా అవార్డ్

ప్రియదర్శిని ఇందిరాగాంధీ అవార్డ్

జెమ్ ఆఫ్ ఇండియా అవార్డ్

భారత్ జ్యోతి అవార్డ్

రాష్ట్ర్రపతి ప్రత్యేక ప్రశంసా అవార్డ్

మ్యాన్ ఆఫ్ ఏషియా (లండన్ పీస్ ఫౌండేషన్ నుంచి)

వంటివి కొన్ని ప్రస్తావించుకోవాల్సిన అవార్డులు.

రచయిత - నాగేంద్ర సాయి