17 ఏళ్లకే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన కృతి

అతిచిన్న వయసులోనే అరుదైన ఘనత17 ఏళ్లకే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన కృతి జైన్శ్రద్ధ, ఆసక్తి, క్రమశిక్షణే విజయానికి దారులన్న కృతి

17 ఏళ్లకే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన కృతి

Sunday July 05, 2015,

6 min Read

దేశంలోని అన్ని ప్రాంతాల్లో సాధారణంగా నిర్మాణ రంగం అనగానే పురుషులే గుర్తుకొస్తారు. ఫ్లాట్లు, ఇళ్ల నిర్మాణాలు, వాటి క్రయ విక్రయాలు పురుషుల వ్యాపారంగానే చెలామణీ అవుతోంది. అందుకే రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో పురుషులదే హవా. కానీ ఈ సాంప్రదాయానికి తెరదించారు పుణేకు చెందిన కృతి జైన్. అతి చిన్న వయసులోనే నిర్మాణ రంగంలో ఆరితేరిన వ్యాపారవేత్తగా ఆమె గుర్తింపు పొందారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని శరవేగంగా దూసుకుపోతున్నారు.

image


పూణెలో నిర్మాణరంగంలో ఎంతో పేరుగాంచిన కుమార్ బిల్డర్స్ కు ఆమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ . ఇప్పుడు కృతి జైన్ వయసు కేవలం 28 ఏళ్లు. 17 ఏళ్ల వయసులోనే ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. ఎవరూ సాధించలేని విధంగా చిన్న వయసులోనే ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్నారు. కృతి జైన్ పదేళ్లగా కుమార్ బిల్డర్స్‌ను నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలబెట్టారు. అతి చిన్న వయసులో అతి తక్కువ సమయంలోనే తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగిన కృతి జైన్‌ను అనేక అవార్డులు వరించాయి. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే కృతికి టాప్ మేనేజ్‌మెంట్ కన్సార్టియమ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. 2004-05లో మహారాష్ట్ర గవర్నర్ ఎస్ ఎం కృష్ణ చేతులు మీదగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ఎన్డీటీవీ తన కార్యక్రమం యంగ్ గన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ లో మాట్లాడాల్సిందిగా 2012లో కృతిజైన్‌ను ఆహ్వానించింది. అన్ని బిజినెస్ పత్రికలు ఆమెపై ప్రత్యేక కథనాలు రాశాయి.

వ్యాపారవేత్తగా తన ఎదుగుదల అంత ఈజీగా జరగలేదంటారు కృతి జైన్. తాను సకల సౌకర్యాలతో పుట్టినప్పటికీ తనకేదీ అయాచితంగా లభించలేదన్నారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే వ్యాపార పాఠాలు నేర్చుకున్నానన్నకృతి జైన్ తన ఈ ప్రయాణంలోని ప్రతీ అడుగు వెనకా ఎంతో శ్రమ దాగి ఉందని చెప్పారు.

కృతి జైన్ తండ్రి లలిత్ కుమార్ జైన్ తీరిక లేకుండా గడిపే వ్యాపారవేత్త. తన పదమూడేళ్ల వయసులో వేసవి సెలవుల్లో తండ్రితో కలిసి కాస్తంత సమయం గడుపుదామని ఆయన వెంట ఆఫీసుకు, కన్‌స్ట్రక్షన్ సైట్లకు వెళ్లిన కృతి అక్కడే వ్యాపార ఓనమాలు నేర్చుకున్నారు. వ్యాపార పనులు నుంచి కాసేపు తండ్రిని బయటకు తీసుకవచ్చి ...ఆయన వెకేషన్ గడిపేలా చేద్దామనుకున్న కృతి...చివరకు తన వెకేషన్‌ను వ్యాపార పాఠాలు నేర్చుకోటవటానికి వినియోగించాల్సి వచ్చింది. అలా అతి చిన్నవయసులోనే ఆమె వ్యాపార ప్రస్థానం మొదలయింది. నేను ఆయన్ను వ్యాపారం నుంచి బయటకు తీసుకురావాలనుకుంటే...ఆయన నన్ను వ్యాపార పనుల్లో దించారు అని నవ్వుతూ చెబుతారు కృతి జైన్.

నిర్మాణ రంగానికి సంబంధించి లలిత్ కుమార్ జైన్ అనేక మీటింగుల్లో పాల్గొంటుండేవారు. ఆ మీటింగ్ నుంచి ఆయన్ను బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో కృతిజైన్ తండ్రి కంప్యూటర్ సీటును ఆక్రమించుకుని పెయింటింగ్ వేస్తూ కూర్చునేవారు. అలా ఆమె మీటింగ్ విశేషాలు వింటుండేవారు. అంతేకాకుండా ఆ చర్చల్లో పాల్గొంటూ అవి అర్థం చేసుకోవటానికి నోట్స్ కూడా రాసుకునేవారు. అలా ఒకసారి కృతిజైన్ లీగల్ కౌన్సిలింగ్ మీటింగ్‌లో కూర్చున్నారు. సొలిసిటర్ న్యాయపరమైన విషయాలు వివరిస్తున్నారు. తర్వాత రోజు జరగబోయే మీటింగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతలో హఠాత్తుగా కృతి వారంతా చర్చించకుండా మర్చిపోయిన ఓ అంశం గురించి ప్రస్తావించారు. అంతే...అక్కడ ఐదు సెకన్ల పాటు నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. తర్వాత మీటింగ్ లో ఉన్న వాళ్లందరూ ఆమెను చూస్తూ నవ్వారు. ఆమె దాని గురించి చాలా సేపు మాట్లాడారు. మీటింగ్‌లో చర్చిస్తున్న అన్ని అంశాలపైనా తనకు కచ్చితమైన అభిప్రాయాలున్నాయని వారితో చెప్పారు. సొలిసిటర్ ఆమెను ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ మెచ్చుకోలుతో తాను ఆర్కిటెక్చర్ అవ్వాలన్న లక్ష్యాన్ని వదిలిపెట్టి లాయర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు ఆనాటి విషయాలను నవ్వుతూ గుర్తుతెచ్చుకున్నారు కృతిజైన్.

కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టు కోసం తండ్రి లావాదేవీలు నిర్వహిస్తున్న ఫస్ట్ సొసైటీ హాండోవర్ మీటింగ్ కు ఎనిమిదేళ్ల వయసులో హాజరయ్యారు కృతి జైన్. వ్యాపార పరంగా అదే ఆమె తొలి అడుగు. పదో తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే పదిహేనేళ్ల వయసులో కృతి జైన్ అధికారికంగా వ్యాపారంలో ప్రవేశించారు. కుటుంబ వ్యాపారమైనప్పటికీ ఆమెను తొలిరోజుల్లోనే అందలం ఎక్కించలేదు తండ్రి. రెండేళ్ల వ్యవధిలో కృతి 23 విభాగాల్లో ఓ సాధారాణ ఉద్యోగిగా విధులు నిర్వర్తించారు. విధుల్లో భాగంగా ఎంతోమందికి జవాబుదారీగా వ్యవహరించారు. కంపెనీలో ప్రస్తుతం ఆమెకు రిపోర్టు చేస్తున్న వారందరికీ తొలినాళ్లలో కృతి జవాబుదారీగా ఉండేవారంటే ఆమె ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఆమెకు తండ్రి అనేక లక్ష్యాలు నిర్దేశించారు. సంబంధాలను బలోపేతం చేయాల్సిన బాధ్యతను కట్టబెట్టారు.

బాస్ కూతురు అన్న హోదా నిజానికి మన మీద మరింత ఒత్తిడి పెంచుతుందంటారు కృతి జైన్. ఈ హోదా వల్ల తాను మరింత క్రమశిక్షణగా ఉండాల్సి వచ్చిందంటారు. అయితే సిల్వర్ స్పూన్ తో పుట్టటమన్నది తనకు ఒక విషయంలో మాత్రం లాభించిందని అంగీకరిస్తారామె. నిర్మాణరంగంలో అత్యంత ప్రజ్ఞావంతులు, పేరుపొందిన వారితో తనకు చిన్నవయసులోనే పరిచయాలు ఏర్పడ్డాయని తెలిపారు. తండ్రి విస్తృత వ్యాపార పరిధి వల్ల నిర్మాణ రంగంలోని ఉత్తమమైన పద్ధతులు మొదలు...వాస్తు, వెంటిలేషన్ వంటి అనేక సందేహాలకు చిన్న చిన్న ఫోన్ కాల్స్ తో సమాధానాలు దొరికాయన్నారు. దీనివల్ల తక్కువ సమయంలోనే ఎంతో నేర్చుకోగలిగానన్నారు.

రెండేళ్ల శిక్షణ తరువాత ఆమెకు కుమార్ బిల్డర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది. బహుశా నగరంలోని అతి చిన్న ఎగ్జిక్యూటివ్ ల్లో ఒకరిగా ఆమె ప్రస్థానం అలా మొదలయింది. అదే సమయంలో కృతి జైన్ బీబీఎ ఎల్ ఎల్ బీ డిగ్రీ కూడా అత్యంత విజయవంతంగా పూర్తిచేశారు.

చాలా చిన్న వయసులోనే వ్యాపారవేత్తగా ప్రయాణం ప్రారంభించిన కృతి జైన్ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. వ్యాపారంపై ఎంతో శ్రద్ధ, ఆసక్తి కనబర్చేవారు. ఆమెకు లింగవివక్ష గురించి ఆలోచించాల్సిన అవసరం ఎన్నడూ కలగలేదు. టామ్ బాయ్ లాగా పెరిగిన కృతి నిర్మాణ ప్రదేశంలో కానీ, అంతర్జాతీయ టూర్ లో గానీ. తొంభై మంది డెవలపర్ల మధ్య ఆమె ఒక్కతే మహిళ అయినా ఏనాడూ ఎలాంటి ఇబ్బందికీ గురికాలేదు. ఈ సందర్భంగా ఐదేళ్ల క్రితం 200 మందితో ఏర్పాటయిన ఒక డెవలపర్స్ మీటింగ్ లో జరిగిన ఓ విషయాన్ని ఆమె నవ్వుతూ గుర్తు తెచ్చుకున్నారు. క్రెడాయ్ పూణె చైర్మన్ మీటింగ్ ను ఉద్దేశించి సంబోధిస్తూ ప్రియమైన డెవలపర్స్ అండ్ లేడీ అన్నారని...తనను ఆయన అలా ప్రత్యేకంగా సంబోధించటం నవ్వు తెప్పించిందని చెప్పారు. నిజానికి ఓ మహిళ ఏం చెబుతోందో తెలుసుకోటానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు కనక మహిళలు ప్రత్యేకత కనబర్చాలన్నది కృతి ఉద్దేశం.

నిర్మాణ రంగంలోని అనుభవాలనే కాదు...తనకు స్ఫూర్తినిచ్చిన వారి గురించి, తన స్నేహితుల గురించీ ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. తనకు స్ఫూర్తి తన తండ్రేనని ఆమె ఎంతో ఉద్వేగంగా చెప్పారు. ఎన్నో తరాలుగా కృతి కుటుంబం వ్యాపార రంగంలోనే ఉంది. ఓ రకంగా చెప్పాలంటే కృతి రక్తంలోనే వ్యాపారం ఉందన్నమాట. తన తండ్రి గురించి క్రుతి ఎంతో గర్వంగా చెప్తారు. ఆయన్ను తనకో మార్గదర్శకుడిగా, గురువుగా, ఎంతో అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణిస్తారు కృతి. పెద్ద కలలు కనేలా తండ్రి ఆమెను ప్రోత్సహిస్తారు. కాలత్రవ, జహా హదిద్ వంటి కట్టడాల నుంచి స్ఫూర్తి పొందాలని,లలిత్ జైన్ కుమార్తెకు సూచిస్తారు. భారత్ లో అంత అనుకూలంగా లేని సమయంలో కూడా ఆయన పారామెట్రిక్ భవనాల గురించి ఆలోచించేవారని కృతి తెలిపారు. చాలా చిన్న వయసులోనే కృతి జైన్ కు వ్యాపార రంగంలో ఆసక్తి కలిగేలా.. ఓ లక్ష్యం రూపొందించుకునేలా ఆయన క్రుషిచేశారు. డిన్నర్ సమయంలో ఆయన కొత్త వ్యాపార భాగస్వామ్యాల గురించి, భూ ఒప్పందాల గురించి చర్చించేవారని ఆమె గుర్తుచేసుకున్నారు.

వ్యక్తిగత జీవితంలో కానీ, వృత్తి జీవితంలో కానీ శ్రద్ధ, క్రమశిక్షణ విజయాన్ని మన దరికి చేరుస్తాయంటారు కృతి జైన్. చిన్న వయసులోనే వ్యాపారంలో ప్రవేశించటం వల్ల ఆమె మిగిలిన రంగాల్లో వెనకబడి ఉన్నారనుకుంటే పొరపాటే. వ్యాపారంలో శిక్షణ పొందుతూనే బిబిఎ ఎల్ఎల్బీ డిగ్రీ పూర్తిచేసిన కృతికి ఆటల్లోనూ ప్రావీణ్యముంది. 11 ఏళ్ల వయసులో ఆమె జాతీయస్థాయిలో హాకీ ఆడారు. ఆమె బాల్యం నుంచే ఎంతో క్రమశిక్షణ కనబరిచేవారు. 13 ఏళ్ల వయసులో తండ్రితో కలిసి వెకేషన్ కు వెళ్లాలని నిర్ణయించుకున్న కృతి ఎప్పుడూ బిజీగా ఉండే తండ్రిని దొరకబుచ్చుకునేందుకు, ఆయన వెంట ఆఫీసుకు వెళ్లేందుకు ప్రతిరోజూ ఉదయం 7.30 సమయానికే బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర రెడీగా కూర్చునేవారు. 15 ఏళ్ల టీనేజీ వయసులో స్నేహితులు సాధారణ కార్యక్రమాల్లో మునిగి ఉన్న సమయంలో కృతి మాత్రం కష్టమైన వర్క్ ట్రైనింగ్ షెడ్యూల్ లో మునిగి తేలారు. 17 ఏళ్ల వయసుకే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినా కృతి ఎన్నడూ క్రమశిక్షణ తప్పలేదు. ముందురోజు రాత్రి ఎన్ని పనులతో ఎంత ఆలస్యంగా నిద్రపోయామన్నదానితో సంబంధం లేకుండా ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటలకే ఆమె తన పని ప్రారంభిస్తారు.

image


నిర్మాణరంగంలో తనో వ్యాపారవేత్తగా ఎదగటంలో స్నేహితుల పాత్ర ఎంతో ఉందంటారు కృతి. తన చుట్టూ ఉన్న స్నేహితులకు ఆమె ఎంతగానో కృతజ్ఞతలు చెబుతారు. సాధారణంగా 17 ఏళ్ల వయసులో ఎక్కువమందిలో ఉండని విధంగా... తొలినాళ్లలో కెరీర్లో ఎదగటానికి ఆమె ఎంతో శ్రద్ధ, ఆసక్తి, నిబద్ధత కలిగిఉండటంతో ఆమె స్నేహితులకున్న సందేహాలన్నీ తొలగిపోయాయి. తరువాత వారంతా ఆమెను అన్నివిధాలుగా తన బలీయమైన లక్ష్యాన్ని చేరుకునేలా ఎంతగానో ప్రోత్సహించారు. చదువు, ఆమె భవిష్యత్ ప్రణాళికలకు ఎంతగానో మద్దతుగా నిలిచారు. చిన్న వయసులోనే వ్యాపారంలోకి ప్రవేశించటం వల్ల గానీ...కష్టపడి పనిచేయటం వల్ల కానీ..ఏదో కోల్పోయినట్టుగా స్నేహితులను చూసి నిజంగా తానెప్పుడూ భావించలేదంటారు కృతి. తన స్నేహితుల్లో కొందరు వ్యాపారం గురించి ఆలోచించేలా చేయగలగటంపై సంతోషంగా ఉందంటారు ఆమె. తన స్నేహితుల్లో అన్ని వయసుల వారూ ఉన్నారంటారు క్రుతి. 13 ఏళ్ల వయసువారూ, 70 ఏళ్ల వయసు వారూ తనకు స్నేహితులే అని తెలిపారు. 17 ఏళ్లకే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ బాధ్యతలు చేపట్టటం వల్ల ఓ చిక్కు ఎదురవుతుందని నవ్వుతూ అంటారు కృతి. తన వయసున్న వారెవరైనా తనకు కొత్తగా స్నేహితులవటం కష్టంగా ఉందట. ఎందుకంటే...వారి తల్లిదండ్రులు ఇప్పటికే ఆమెకు స్నేహితులైఉన్నారట.

చిరుప్రాయంలోనే నిర్మాణరంగంలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన కృతి జైన్ విజయగాథ ఎందరికో స్ఫూర్తిదాయకం.