చేనేత పరిశ్రమలో ఈ యువ స్టార్టప్ సక్సెస్ స్టోరీ

చేనేత పరిశ్రమలో ఈ యువ స్టార్టప్ సక్సెస్ స్టోరీ

Friday August 21, 2015,

2 min Read

చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్న సంస్థ.

హంగు, ఆర్భాటాలకు దూరం.

దళారుల ప్రమేయాన్ని నిర్మూలించిన మాకూ.

నేరుగా నేత కార్మికులకే ప్రయోజనాలు.

ఇటీవలికాలంలో స్టార్టప్స్‌ క్రేజ్ పెరిగింది. కాలేజీ చదువులు అయిపోగానే నేరుగా సొంత వ్యాపారాలు మొదలుపెడుతున్నారు. ఇంటర్నెట్ యుగంలో ఎంతో మంది యువకులు తమ సొంతకాళ్లపై నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని తపన పడ్తున్నారు. మీడియా కూడా ఈ రంగంపై అధిక శ్రద్ధ చూపిస్తోంది. ఈ క్రమంలో వాళ్లు చేస్తున్న బిజినెస్ మరుగునపడిపోయి ..వాళ్లు మాత్రమే వెలుగులోకి వస్తున్నారు.

సంతను దాస్, చిరాగ్ గాంధీ

సంతను దాస్, చిరాగ్ గాంధీ


అలాంటి ఒక ఉదాహరణే మాకు టెక్స్ టైల్స్ (Maku Textiles). చేతి వృత్తులకు మద్దతుగా ప్రారంభమైన ఓ ఉద్యమంతో పురుడుపోసుకున్న సంస్థ ఇది. చేనేత ఓ అరుదైన కళ. దీన్ని బతికించేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కానీ ప్రజల నుంచి సరైన స్పందన లేకపోవడంతో చేనేత కార్మికుల ప్రయత్నాలన్నీ వృధా అవుతున్నాయి.

అహ్మదాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో చదువుకున్న సంతను దాస్... చేనేత కార్మికుల దుస్థితిపై చలించిపోయాడు. వీళ్లకు నేరుగా ఏమైనా చేయాలని భావించాడు. నిర్మా యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్న చిరాగ్ గాంధీ, సంతను దాస్‌‌తో కలిసి మాకు ను స్టార్ చేశారు. ఇప్పుడు సంస్థ ప్రారంభమై మూడేళ్లు అయింది.

వస్త్రం నేస్తున్న కార్మికుడు

వస్త్రం నేస్తున్న కార్మికుడు


వాళ్లేం చేశారు...?

ఎలాంటి దుస్తులు కావాల్లో వీళ్లు డిజైన్ చేసి చేనేత కార్మికులకు చెప్పేవారు. వాళ్ల చేత నేయించి వాటిని కొనుగోలు చేసి మార్కెట్లో అమ్మేవారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్‌లోని కచ్ లో వీళ్లు మొదట ఈ పని మొదలు పెట్టారు. అయితే.. ఈ కథ ఇంతటితో అయిపోలేదు.

దళారుల రాజ్యం

టెక్స్ టైల్ ఇండస్ట్రీ విలువపరంగా చాలా పెద్దది. కానీ ఇది కొందరు వ్యక్తుల చేతుల్లో బందీగా ఉంది. పెట్టబడి పెట్టేవాడు ఎక్కడో ఉంటాడు. బట్టలు తయారు చేసే వాళ్లు ఇంకెక్కడో ఉంటారు. వీళ్ల మధ్యలో దళారులే పెత్తందారులు. చేనేత పరిశ్రమను ప్రారంభించింది చేనేత కార్మికులే. కానీ స్థానిక దళారుల చేతుల్లో వీళ్లంతా పావులుగా మారిపోయారు. వీళ్లు నేసిన దుస్తులను కొనాలన్నా.. అమ్మాలన్నా దళారులదే పెత్తనం. చివరకు ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించుకోవాలన్నా వీళ్ల అనుమతి తప్పనిసరి. వాస్తవానికి వీళ్లు బహిరంగ మార్కెట్లో అమ్మే ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో కేవలం 5శాతం మాత్రమే ఆ బట్టలు తయారు చేసిన చేనేత కార్మికులకు అందుతోంది.

ఇదీ మార్పు

మాకు తో పాటు మరికొంతమంది ఈ పరిస్థితిని చక్కదిద్దాలనుకున్నారు.

“ ఈ పరిస్థితిని చక్కదిద్ది ఒక మంచి వ్యవస్థను రూపొందించాలని మేం ప్రయత్నించాం. దీని ద్వారా కార్మికుల శ్రమ వృధా కాదు. ఈ పరిశ్రమలో భాగస్వాములైన అందరికీ మేలు జరిగేలా చూడాలనుకున్నాం. కార్మికుడి నుంచి కస్టమర్ వరకూ.. మధ్య దళారి వరకూ అందరికీ మంచి జరగాలి” అన్నారు వీరిద్దరూ.! టెక్స్ టైల్ పరిశ్రమలో చాలా బ్రాండ్స్ ఇలా పుట్టుకొచ్చినవే.. అయితే వాటికి మాకు చాలా తేడా ఉంది.

ఫ్యాషన్ ప్రపంచానికి దూరంగా తమ మార్కెట్ ను విస్తరించుకోవాలనేది సంతను, చిరాగ్ ల కోరిక. ఫ్యాషన్ షోలలో తమ ఉత్పత్తులను ప్రదర్శించడం, ఎక్కువ రేట్లకు అమ్మడం వీరి ఉద్దేశం కాదు. కార్మికుల పక్షాన నిలవాలనేది వీరి ఏకైక లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ఇంకా శ్రమిస్తూనే ఉన్నారు. వాళ్లు కూడబెట్టుకున్న డబ్బులతో పాటు కొంత తల్లిదండ్రుల నుంచి తీసుకుని ఈ సంస్థను ప్రారంభించారు. ఇప్పడు నెలకు లక్ష రూపాయలకు పైనే ఆదాయం కూడా వస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలలో చేనేత ప్రదర్శనలు ఇవ్వడం, స్టోర్లకు అందించడం.. ఫేస్ బుక్ ద్వారా ఆన్ లైన్లో ఆర్డర్లు తీసుకోవడం... లాంటి మార్గాల ద్వారా వీళ్లు మార్కెటింగ్ చేస్తున్నారు.

image