భారతదేశంలో ఇ-కామర్స్ ఐపీఓ ఇప్పట్లో ఎందుకు ఉండదంటే..?

0

ఈ-కామర్స్ బిజినెస్ పై విశ్లేషణలు, వార్తాకథనాలు యువ భారతాన్ని ఉత్తేజపరుస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ లాంటి పెద్ద కంపెనీ విలువ లక్ష కోట్ల రూపాయలుంటుంది. ఇలాంటి కంపెనీ బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ లో నమోదై 40 శాతం ఐపీఓకి వెళ్తే కనీసం 40 వేల కోట్ల రూపాయలు పొందొచ్చు. అయితే ఇది ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్స్ నిర్థారించే ధరపై ఆధారపడుతుందన్నది వాస్తవం. ఒకవేళ ఇది జరిగితే... భారతదేశంలో ఇదే అతిపెద్ద ఐపీఓ అన్న దాంట్లో సందేహమేమీ లేదు. కానీ భారతదేశంలో లిస్టింగ్ కు సంబంధించిన వాస్తవాలను కూడా గమనించాలి. అసలు ఈ కంపెనీలు ఐపీఓల కోసం సిద్ధంగా ఉన్నాయా అన్న విషయం తెలుసుకోవాలి.

భారతదేశంలో స్టార్టప్స్, ఇతర కంపెనీలు భారీ ఐపీఓ సాధించడం అంత సులువైన విషయమేమీ కాదు. ఎవరెస్టు ఎక్కినంత కష్టం. భారతదేశంలో అతిపెద్ద ఐపీఓల్లో టెక్నాలజీ కంపెనీలు, ఐటీ సేవలందించే సంస్థలు లేవంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇన్ఫోసిస్ కూడా 1993లో కింది స్థాయి నుంచి మొదలుపెట్టాల్సి వచ్చింది. ఉన్న షేర్ల కంటే తక్కువ దరఖాస్తులొచ్చాయి. 2010లో ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా పొందిన రూ.15,199 కోట్లే భారతదేశంలో అతిపెద్ద ఐపీఓ. గత ఐదేళ్లుగా చూస్తే... టాప్ టెన్ ఐపీఓల్లో మౌలిక వసతుల రంగానిదే ఆధిపత్యం కనిపిస్తుంది(చార్టు చూడండి).

మరి భారతదేశ ఐటీ కంపెనీలకు అతిపెద్ద ఐపీఓ సాధించే సామర్థ్యం ఉందా? ఇప్పటికీ సమాధానం లేదు. చైనాకు చెందిన ఆలీబాబా యూఎస్ లో పాతిక బిలియన్ డాలర్ల ఐపీఓ సాధించడం విశేషం. భారతదేశంలో ఇప్పట్లో కాకపోయినా భవిష్యత్తులో ఆ సంఖ్య సాధించే అవకాశాలున్నాయి.

భారతీయ స్టార్టప్స్: లిస్టింగ్ వైపు బుడిబుడి అడుగులు

"మన కంపెనీల విలువలు గొప్పగా ఏమీ లేవు. టాప్ త్రీ ఇ-కామర్స్ కంపెనీలను అసలు స్టార్టప్స్ గా పిలవలేం" అంటారు ఫారెస్టర్ రీసెర్చ్ లో ఫోర్ క్యాస్ట్ అనలిస్ట్ గా పనిచేసే సతీష్ మీనా. అయితే భారతదేశంలో పలు ఐపీఓలు సాధించే కంపెనీలు ఉన్నాయని అంటారు కొందరు ఆశావాదులు. సరికొత్త ఆవిష్కరణలే ఆ కంపెనీలను వృద్ధిలోకి తీసుకెళ్లి ఐపీఓ దిశగా నడిపిస్తాయని అంటారు దేశ్ పాండే ఫౌండేషన్ వ్యవస్థాపకులు గురురాజ్ దేశ్ పాండే. భారతదేశ విధాన నిర్ణేతలు యువత ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరిస్తున్నారాయన. అయితే దేశం అభివృద్ధిని గుర్తించడానికి మనకు అతిపెద్ద ఐపీఓలే అవసరం లేదు. అయితే టెక్నాలజీ, ఆరోగ్యరంగం, విద్యాసంస్థల నుంచి పలు గౌరవప్రదమైన ఐపీఓలు అవసరం. ఈ లోటును స్టార్టప్స్ తీర్చాలి. భారతదేశంలో ఒకదాని తర్వాత మరో స్టార్టప్ ప్రకటనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే రాజకీయ ప్రకటనల్లా ఇవి ముగియకూడదు. అధికార ప్రతిపక్షాలు ఓట్ల కోసం ప్రకటనలు చేసినట్టు కాకుండా... కావల్సిన లక్ష్యాలు, ఆలోచనలతో గొప్ప వ్యాపారాలు, కఠినమైన పరిశీలన అవసరం అంటారు విశ్లేషకులు.

"భారతదేశంలో గొప్ప టెక్నాలజీ, స్టార్టప్ కంపెనీలు ఐపీఓలు సాధించగలవు. కానీ ఈరోజుల్లో జాతి మొత్తం తమ శక్తియుక్తుల్ని తెలుసుకోవడం ఇప్పుడిప్పుడే ప్రారంభించింది. అయితే ఎప్పట్లోగా ఐపీఓలు సాధిస్తాయన్నది చూడాలి" అంటారు గ్రేహౌండ్ రీసెర్చ్ సీఈఓ సంచిత్ వీర్ గొగియా.

యువర్ స్టోరీ మాట

మా బిజినెస్ జర్నలిస్టులు స్టార్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదన్న ఒప్పందం ఉంది. ఇక స్టార్టప్ ఐపీఓలో పెట్టుబడులు పెట్టడానికి ఈ వ్యాపారంపై అవగాహన, జ్ఞానం ఉన్నవాళ్లు కొన్ని ప్రధాన మెట్రో నగరాల్లో మాత్రమే ఉన్నారు. అందుకే టెక్నాలజీ రంగంలో భారీ ఐపీఓ సాధించలేకపోవడంపై భారతదేశం అసంతృప్తిగా ఉందని మేమూ భావిస్తున్నాం. మరిన్ని సంవత్సరాలు ఈ పరిస్థితి ఉంటుందని మా అంచనా. 2018 వరకు టెక్నాలజీ నుంచి చిన్నచిన్న ఐపీఓలు కూడా ఉండకపోవచ్చు. అప్పుడు ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు, సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపొచ్చు. బహుశా అప్పటికి భారతీయ స్టార్టప్స్ విదేశాల్లో కూడా మంచి ఐపీఓతో లిస్ట్ లో కనిపించే అవకాశం ఉంది. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి సంస్థలు విదేశాల్లో లిస్ట్ లోకి వెళ్లొచ్చు.