మహిళలు సోషల్ ఆంట్రప్రెన్యూర్లుగా మారడానికి అవసరమైన పాలసీలు రావాలి- ఎంపీ కవిత  

0

ఆర్థిక స్వావలంబనతోనే మహిళల వికాసం సాధ్యమవుతుందన్నారు ఎంపీ కల్వకుంట్ల కవిత. మెయిన్ స్ట్రీమ్ పరిశ్రమలతోపాటు సోషల్ ఆంట్రప్రెన్యూర్ షిప్లోకి కూడా మహిళలు రావాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లోని తాజ్కృష్ణ హోటల్లో జరిగిన బ్రిటిష్ కౌన్సిల్-డయాజియో సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాయి. సెలెబ్రేటింగ్ ది యంగ్ విమెన్ సోషల్ ఆంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్రిటిష్ కౌన్సిల్ సౌత్ ఇండియా డైరెక్టర్ ఎం.కె బార్కర్, డయాజీఓ గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ మిచెల్లీ డిసౌజా, కర్నాటక స్టేట్ స్పెషల్ సెక్రటరీ కె.రత్నప్రభ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.

నిరుద్యోగ సమస్య తీరాలంటే కేవలం ప్రభుత్వాల వల్లనో, కార్పొరేట్ సంస్థల వల్లనో కాదన్నారు ఎంపీ కవిత. స్వయం ప్రతిపత్తి కలిగిన మహిళల వల్ల, మహిళా సహకార సంఘాల వల్లనే నిరుద్యోగ సమస్య అంతం అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలకు శిక్షణ ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాల్సిన అవసరం ఉందని కవిత అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి ద్వారా ఉపాధి శిక్షణ ఇస్తున్నామని, ఇప్పటి వరకు ఆరువేల మందికి శిక్షణ ఇస్తే.. వారిలో మూడు వేల మంది మహిళలే కావడం విశేషమన్నారు. ఉద్యోగ కల్పనతో పాటు ఉపాధిని కల్పిస్తున్నట్లు కవిత తెలిపారు. రాజకీయంగా తనలాంటి ఒకరిద్దరికి అవకాశాలు కాకుండా ఇంకా అనేక మందికి రావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కేబినెట్లో మహిళా మంత్రి లేకపోయినంత మాత్రాన మహిళలకు ప్రభుత్వం ఏం చేయడం లేదనడం సరికాదన్నారు.

సోషల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ మన దేశానికి కొత్త కాదన్నారు ఎంపీ కవిత. జాతిపిత మహాత్మాగాంధీ ప్రజలందరూ కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఖాదీ కేంద్రాలను ప్రోత్సహించారని అన్నారు. అలా మనం ఏర్పాటు చేసుకున్న కేంద్రాల్లో కొన్ని కో ఆపరేటివ్ సొసైటీలు బాగా పనిచేస్తున్నాయని కవిత తెలిపారు. కేరళ లాంటి రాష్ట్రాలో బలమైన వ్యవస్థలు ఉన్నాయన్న కవిత.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలో అంత చురుగ్గా లేవన్నారు. మహిళలు సోషల్ ఆంట్రప్రెన్యూర్లుగా మారడానికి అవసరమైన పాలసీలు రావాల్సిన అవసరం ఉందన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను ఆంట్రప్రెన్యూర్ షిప్ దిశగా సరైన ప్రోత్సాహ అందంచడం లేదని కవిత అభిప్రాయ పడ్డారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం- మహిళా శక్తిని ఉపయోగించుకుంటే మన దేశ జీడీపీ 4.2 శాతం పెరుగుతుందని అమె తెలిపారు. మహిళలను వర్క్ ఫోర్స్ లోకి తీసుకురావడానికి సోషల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ సులభమైన మార్గమని అన్నారు. 2013 ర్యాంకింగ్స్ లో 128 దేశాల జాబితాలో ఇండియా 115వ స్థానంలో ఉండటాన్ని బట్టి.. వ్యాపార రంగంలో మహిళలను ప్రమోట్ చేయడంలో మన దేశం ఎంత వెనకబడి ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. సోషల్ ఆంట్రప్రెన్యూర్ కు సంబంధించి ఇప్పటివరకు సీఎస్ఆర్ ఫండింగ్ మాత్రమే ఉంది.. అందులో స్పెషల్ ఫండింగ్ రావాలని ఆమె అభిలషించారు. మహిళా సోషల్ ఆంట్రప్రెన్యూర్లు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఎంపీ కవిత ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Related Stories

Stories by team ys telugu