ఇంటర్నేషనల్ మార్కెట్‌కు ఇండియన్ వస్త్రాలు అమ్ముతూ రూ.100 కోట్ల మార్కెట్ దాటిన 'సిబజార్'

దేశంలో చీరలను ఆన్‌లైన్‌లో అమ్మిన మొదటి సైట్ చెన్నైబజార్.కాంకాలానుగుణంగా సీ-బజార్‌గా మార్పువిదేశాల్లో నివసిస్తున్న భారతీయులే ప్రధాన టార్గెట్2015లో ₹100కోట్ల టర్నోవర్ అందుకోనున్న సీబజార్

ఇంటర్నేషనల్ మార్కెట్‌కు ఇండియన్ వస్త్రాలు అమ్ముతూ రూ.100 కోట్ల మార్కెట్ దాటిన 'సిబజార్'

Sunday September 06, 2015,

5 min Read

చెన్నై మార్కెట్‌లో దుస్తులు, కూరగాయలు విక్రయిస్తున్న సిబజార్ పుట్టుకకు బీజం 1998లోనే పడింది. పూర్తి పేరు చెప్పాలంటే చెన్నైబజార్.కాం. 20వ శతాబ్దం చివర్లోనే మొబైల్ ఫోన్ ఆధారంగా వ్యాపారం ప్రారంభించినా.. తక్కువ మార్జిన్లు, జనాలకు పెద్దగా తెలియని బిజినెస్ మోడల్, రవాణాలో ఉన్న ఇబ్బందుల కారణంగా అప్పుడు విజయవంతం కాలేదు. దీంతో 1999 మధ్యలో చెన్నైబజార్‌ని ప్రవాస భారతీయుల కోసం... గిఫ్టింగ్ ప్లాట్‌ఫాంగా మారింది.

'2000వ సంవత్సరంలో ప్రారంభమైన సీబజార్... దేశంలో చీరలను ఆన్‌లైన్‌లో విక్రయించిన తొలి ఈకామర్స్ పోర్టల్. భారతీయ సాంప్రదాయ దుస్తులకోసం గ్లోబల్ మార్కెట్లలో విపరీతమైన డిమాండ్ ఉందని మాకు అర్ధమైంది అప్పుడే' అంటున్నారు రాజేష్ నహర్, సీబజార్ సీఈఓ & సహ వ్యవస్థాపకుడు.

భారతీయ సాంప్రదాయ ఫ్యాషన్‌ని ఈకామర్స్ పోర్టల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విక్రయించాలని 2004లో నిర్ణయించుకున్నారు రాజేష్. ఇందుకోసం 'చెన్నైబజార్.కాం'ని.. 'సీబజార్.కాం'గా పేరు మార్చారు. అలాగేై 2005లో ఇతర దేశాల్లో నివసిస్తున్నవారు... ఇండియాలో ఉన్నవారికి బహుమతిగా సాంప్రదాయ దుస్తులను ఇచ్చేలా ప్లాట్‌ఫాంని రూపొందించారు.

చెన్నైలోని ఓ కాలేజ్‌లో ఎంబీఏ క్లాస్‌రూం ప్రోగ్రాంలో.. రాజేష్ నహర్, రితేష్ కటారియాలు పరిచయం అయ్యారు. ఇద్దరికీ ఒకే తరహా ఆలోచనలున్న విషయం వారికి అర్ధం అయింది. తమ ఆలోచనకు ఓ రూపం ఇచ్చి ఈ వెంచర్‌ని ప్రారంభించారు. పాశ్చాత్య మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకుని.. దీన్ని రూపొందించారు. చెన్నై నుంచి ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడ్డవారికి... ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే అవకాశం కల్పించడం... ఈ వెంచర్ ప్రారంభ లక్ష్యం.

2001 చివర్లో మార్కెట్‌ని పరిశీలించేందుకు రాజేష్ బ్రిటన్ వెళ్లారు. ప్రవాస భారతీయులు ఎలాంటి వస్తువులు ఇష్టపడుతున్నారు... ఆన్‌లైన్ మార్కెట్‌కి వారినుంచి ఏ స్థాయిలో ఆదరణ లభిస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఆసియా దేశస్థులు నిర్వహిస్తున్న షాప్‌లలో... తమ కేటలాగ్స్ ఉంచడం ద్వారా.. ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

వ్యాపార తీరులో మార్పు వచ్చిందిలా !

రూ. 12 లక్షలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు... పూర్తిగా సొంత నిధులతోనే మొదలుపెట్టారు వ్యవస్థాపకులు. ఇప్పటికి పదేళ్లకు పైగా సర్వీసులు నిర్వహిస్తున్న సీబజార్... 25వేలకు పైగా డిజైన్ ఆప్షన్లను అందించే స్థాయికి చేరుకుంది. అంతేకాదు.. ప్రపంచంలో ఎక్కడికైనా సరే.. డెలివరీ ఇవ్వగలుగుతున్నారు ఇపుడు.

ప్రారంభమైనపుడు ఈ వెంచర్ కోసం మొత్తం 10మంది పనిచేసేవారంతే. ఇప్పుడు 350మందికి పైగా టీం ఉంది. ఇందులో ప్రతిభావంతులైన ఫ్యాషన్ డిజైనర్స్, డ్రెస్ మేకర్స్, ప్రోగ్రామర్స్, డిజైనర్స్, కస్టమర్ ఎగ్జిక్యూటివ్స్... ఇలా పలు విభాగాలకు చెందినవారు పని చేస్తున్నారు.

సీబజార్ టీం

సీబజార్ టీం


"అంతర్జాతీయ మార్కెట్లలో వ్యాపారం నిర్వహిస్తున్న కంపెనీగానే ఎక్కువ ప్రచారం పొందింది సీబజార్. ప్రపంచవ్యాప్తంగా 188దేశాల్లో లక్షమందికి పైగా కస్టమర్స్ ఉన్నారు మా కంపెనీకి. సాంప్రదాయ దుస్తులు, ఫ్యాషన్‌కు వన్ స్టాప్ షాప్‌గా పరిణతి చెందడంలో.. ఎంతో కృషి ఉంది. ఇది భారతీయ ఫ్యాషన్ సాధించిన విజయం" అంటున్నారు రాజేష్.

గత ఐదేళ్లుగా ఏటా సగటున 60శాతం చొప్పున పెరుగుతోంది సీబజార్ మార్కెట్. ఈ కంపెనీకి సగటు ఆర్డర్ విలువ ₹13వేలు. దేశవ్యాప్తంగా అత్యుత్తమ డిజైనర్స్, బ్రాండ్స్, రిటైలర్స్, గ్రామీణ కళాకారులతో కలిపి... మొత్తం 450మంది సరఫరాదారులున్నారు సీబజార్‌కి.

"మాకు బయటనుంచి నిధుల సేకరణ చేసే ఉద్దేశ్యం ఏ మాత్రం లేదు. అందుకే వ్యాపారం పెంచుకుని లాభాలు పెరిగేలా చర్యలు తీసుకున్నాం. 2005 నుంచి పన్ను తర్వాత లాభం 3నుంచి 5శాతం మధ్య వస్తోంది మాకు"అని చెప్పారు రాజేష్.

సాంప్రదాయంలో విభిన్నత

సొంత డిజైనింగ్ టీం రూపొందించిన ఎక్స్‌క్లూజివ్ డిజైనర్ దుస్తులను కూడా విక్రయిస్తోంది సీబజార్. కోల్కతాలో అనుభవజ్ఞులైన పనివారు వీటిని రూపొందిస్తున్నారు. డిజైన్లను, దుస్తులను కస్టమైజ్ చేసి అందించడంలో మాకు పోటీ కూడా లేదు. ప్రతీ రోజూ 3వేల కొత్త డిజైన్లను అందించగలుగుతున్నాం' అన్నారు రాజేష్. అలాగే తయారీదారుల నుంచి నేరుగా కొనుగోలు చేసి విక్రయిస్తుండడంతో... కస్టమర్లకు మార్కెట్ కంటే 10 నుంచి 30శాతం తక్కువకే అందించగలుగుతున్నాం అని చెప్పారు.

సాంప్రదాయ వివాహ దుస్తులను ఆన్‌లైన్ మార్కెట్ చేసే పోర్టల్... హోమ్ఇండియా.కాంను 2007లో కొనుగోలు చేసింది సీబజార్. ఈ డీల్ ద్వారా ఫ్యాషన్ పోర్ట్‌ఫోలియోను పెంచుకునేందుకు... హైఎండ్ వెడ్డింగ్ వేర్ సహా ఇతర విభాగాలపై పట్టు సాధించేందుకు అవకాశం చిక్కింది. నిజానికి ఫ్యాషన్ ఫ్యాక్టరీ స్థాయికి సీబజార్ ఎదగడంలో... ఈ డీల్‌ది కీలకపాత్ర.

ఇండియన్ మార్కెట్‌ ఇలా

రాబోయే కొన్నేళ్లపాటు పాశ్చాత్య దేశాల మార్కెట్లపైనే దృష్టి సారించబోతోంది సీబజార్. భారతీయ వారసత్వ కళాత్మక దుస్తులను.. అంతర్జాతీయంగా విక్రయించడం ద్వారా.. ఇండియన్ వేర్‌కు ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ పొందాలన్నది ఈ కంపెనీ ఆలోచన.

మనదేశంలో తరతరాలుగా వస్తూ.. ఎక్కువగా ప్రాచుర్యం పొందని వస్త్రాలను ప్రపంచానికి తెలియచేస్తున్న రితు కుమార్ వంటి డిజైనర్లతో కలిసి.. భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునేందుకు సీబజార్ కృషి చేస్తోంది. వీటన్నిటి కంటే భారత ప్రధాని మోడీ ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కేంపెయిన్ కారణంగా... భారతీయ దుస్తులకు పశ్చిమ దేశాల్లో విపరీతమైన క్రేజ్‌ తెచ్చిపెట్టింది.

భారత్‌లో విదేశీ దుస్తులకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో, హైఎండ్ లైఫ్ స్టయిల్ విషయంలో ఫారిన్ కల్చర్ ఎలా ఫాలో అవుతున్నారో... అలాగే వెస్ట్రన్ కంట్రీస్‌లో భారతీయ సాంప్రదాయ దుస్తులకు డిమాండ్ ఉంది. అయితే.. ఇలాంటి దుస్తులను విక్రయించే కంపెనీలు అంతగా లేకపోవడం గమనించదగ్గ విషయం.

"భారతీయ సాంప్రదాయ దుస్తులను పలు కేటగిరీలుగా విభజించి విక్రయాలు ప్రారంభించాక.. మాకు గణనీయంగా ఆర్డర్స్ పెరిగాయి. అక్కడి మార్కెట్లలో ఉన్న కొరత కారణంగా.. ఇలాంటి దుస్తులకు డిమాండ్ విపరీతంగా ఉందని చెప్పాలి. భారతీయ వస్త్రసంపదను.. గ్లోబల్ బ్రాండ్‌గా మార్చగలిగేంతటి మార్కెట్ ఉంది" అంటున్నారు రాజేష్.

2014నవంబర్‌లో ఫోరమ్ సినర్జీస్ నుంచి ₹50 కోట్ల ప్రైవేట్ ఈక్విటీ ఫండింగ్ పొందాం. ఇన్వెంటస్ కేపిటల్, ఓజాస్ వెంచర్స్.. ఇతర పెట్టుబడిదారులు. ఈసారి చేయబోయే ఫండింగ్ విలువ ₹150కోట్లు" అని చెప్పారు రాజేష్.

మార్కెట్‌లో ఎదుగదల

సీబజార్ మొత్తం అమ్మకాల్లో 90శాతం విదేశాల నుంచే రావడం విశేషం. భారత ప్రభుత్వం ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కేంపెయిన్ మూలంగా.. ఈ కంపెనీ గ్లోబల్ అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకోవడం విశేషం.

ఇక ఇండియన్ మార్కెట్‌ని పరిశీలిస్తే... ప్రస్తుత బాలీవుడ్ ఫ్యాషన్ ఆధారిత స్టైల్స్, డిజైన్ వేర్‌కు.. అమ్మకాలు బాగున్నాయి. బాలీవుడ్ సినిమాల్లో నటులు ధరించిన సాంప్రదాయ దుస్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఈ మార్కెట్‌ని మరింత విస్తృతంగా పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు సీబజార్ నిర్వాహకులు.

మొత్తం అమ్మకాల్లో లెహంగాస్, అనార్కలీస్, వెడ్డింగ్ కలెక్షన్‌లే టాప్ సెల్లర్స్‌గా ఉంటున్నాయి. కాస్మోపాలిటన్ లైఫ్ స్టైల్‌కు అనుగుణంగా.. భారీగా ఉన్న వస్త్రాలకు ఎక్కువ సేల్స్ నమోదవుతున్నాయి. దీపావళి, ఈద్ లాంటి పెద్ద పండుగల టైంలో.. డిమాండ్‌ని అందుకోవడం కష్టంగా మారుతోందని చెబ్తున్నారు సీబజార్ నిర్వాహకులు.

మౌత్ పబ్లిసిటీ, విపరీతమైన డిజిటల్ ప్రచారం, బాలీవుడ్ సినిమాలతో ఫ్యాషన్ భాగస్వామ్యం కారణంగా.. ప్రతీ నెలా సైట్‌లో న్యూ అరైవల్స్ పేజ్‌లను చూడ్డం ఓ అలవాటుగా మారిపోయింది పాశ్చాత్య దేశాల్లో.

అంతర్జాతీయంగా సాంప్రదాయ దుస్తుల మార్కెట్ విలువ ₹15వేల కోట్లుగా అంచనా. ఇంతటి విస్తృతమైన మార్కెట్ కావడంతో.. అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటోంది సీబాజర్. ఇండియన్ టెక్స్‌టైల్స్‌కు ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా ఎదగడంలో.. ప్రస్తుతానికి తమ ప్రయాణం ప్రారంభంలో ఉన్నట్లే అంటారు రాజేష్.

"ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర కోట్లమంది విదేశాల్లో నివసిస్తున్నారు. వీరి సగటు కనీస వార్షిక వేతనం 25 నుంచి 35 లక్షల రూపాయలుగా లెక్కకట్టచ్చు. కొనుగోలు శక్తి ఎక్కువ కావడంతో.. ఈ మార్కెట్‌పై దృష్టి పెట్టాం. మారిషస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, మధ్య ఆసియా, ఆగ్నేయ ఆసియా దేశాల కోసం ప్రత్యేక అమ్మకాలు చేయబోతున్నాం త్వరలో"అంటూ భవిష్యత్ వ్యూహాలు వివరించారు రాజేష్.

2015-16ఆర్థిక సంవత్సరంలో సీబజార్ ఆదాయం ₹100 కోట్ల రూపాయల మార్క్‌ని టచ్ చేస్తుందని నమ్మకంగా ఉన్నారు నిర్వాహకులు. ఇప్పుడు 100శాతానికి చేరిన వార్షిక వృద్ధి రేటు.. భవిష్యత్తులో 200-300శాతానికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబ్తున్నారు.

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టేవారికి ప్రోత్సాహకరమైన సూచనలు చేస్తున్నారు రాజేష్. “ ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా మారడానికి మీ దగ్గర తగిన కారణం ఉందో లేదో తెలుసుంకోండి. రిస్క్ తగ్గించుకుంటూ.. సహ వ్యవస్థాపకులను తెలివిగా ఎంచుకోవాలి. మీ లక్ష్యాలపై తప్ప.. అవరోధాలపై దృష్టి ఉండకూడదు. ప్రస్తుతం మీకున్న సమయంలో 90శాతం అవకాశాలపై వెచ్చించండి. నిన్నటి సమస్యలను వీలైనంత త్వరగా మర్చిపోయే ప్రయత్నం చేయండి"-రాజేష్.

వెబ్‌సైట్

యువర్‌స్టోరీ పరిశీలన

ఇండియా రిటైలింగ్ వెబ్‌సైట్ ప్రకారం... సాంప్రదాయ దుస్తులపై 2013లో ప్రవాస భారతీయులు వెచ్చించిన మొత్తం 13,100 మిలియన్ డాలర్లు. ఏటా 8శాతం క్రమానుగత సగటు వృద్ధిరేటుతో 2018నాటికి ఇది 19,600మిలియన్ డాలర్లకు చేరనుంది.

ఈ తరహా స్టార్టప్స్ గురించిన మరిన్ని వివరాల కోసం అలెక్సా ట్రాఫిక్ ఉపయోగించిన పోల్చి చూసింది యువర్‌స్టోరీ.

అలెక్సా స్క్రీన్‌షాట్

అలెక్సా స్క్రీన్‌షాట్


పైన ఉన్న అలెక్సా డీటైల్స్ ప్రకారం.. మార్కెట్లో ఉత్సవ్ ఫ్యాషన్‌ చాలా బలంగా ఉంది. అయితే.. సీబజార్ అత్యంత వేగంగా పెరుగుతోందనే విషయం అర్ధమవుతుంది. దేశంలో ఉన్న నెట్వర్క్ దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇండియన్ రూట్స్ స్థిరంగా ఉంది.

2013లోనే ఉత్సవ్ ఫ్యాషన్ 100 కోట్ల టర్నోవర్ అందుకోగా... సీబజార్, ఇండియన్ రూట్స్‌లు.. ఈ ఏడాది ఈ స్థాయిని అందుకోనున్నాయి. సాధారణ ఈకామర్స్ కంపెనీల మాదిరిగా కాకుండా... ప్రవాస భారతీయులను టార్గెట్ చేసిన కంపెనీల సగటు లావాదేవీ విలువ ఎక్కువగా ఉంటోంది(₹5వేలకు పైగానే). వేగంగా అభివృద్ధి సాధించడానికి ఇది కూడా కారణమే.

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2.3 కోట్ల మంది భారతీయులు.. దేశం వెలుపల జీవిస్తున్నారు. దేశంలో నివసిస్తున్నవారితో పోల్చితే.. వీరి కొనుగోలు శక్తి చాలా ఎక్కువగా ఉంటోంది. అందుకే ఉత్సవ్ ఫ్యాషన్, సీబజార్, ఇండియర్ రూట్స్ వంటి కంపెనీలు కెనడా, అమెరికా, బ్రిటన్‌లలో మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాగే ఆస్ట్రేలియాతోపాటు యూఏఈ, ఒమన్ వంటి మధ్య ఆసియా దేశాల్లోనూ భారతీయుల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.

సాంప్రదాయ ఫ్యాషన్ విషయంలో ఈ దేశాల్లో అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కొత్త మార్కెట్లలో ప్రవేశించడానికి ఉవ్విళ్లూరుతున్న ఈ కంపెనీల భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది.

  • నోట్ - అలెక్సా గణాంకాలు కేవలం ఈ కంపెనీల ట్రాఫిక్ తీరుతెన్నులపై అవగాహన కోసం మాత్రమే.