రాకెట్ స్టవ్ తయారుచేసి హిమాచల్ వాసుల కన్నీళ్లు తుడిచిన ఆస్ట్రేలియన్

సోనం వాంగ్‌చుక్ స్ఫూర్తితో పెద్ద మనసు చాటుకున్న రస్సెల్

రాకెట్ స్టవ్ తయారుచేసి హిమాచల్ వాసుల కన్నీళ్లు తుడిచిన ఆస్ట్రేలియన్

Thursday January 05, 2017,

3 min Read

హిమాచల్ ప్రదేశ్. పేరుకు తగ్గట్టే ఎటు చూసినా మంచుతో కూడిన కొండలే కనిపిస్తాయి. వేసవిలో కూడా అత్యంత శీతలంగా ఉండే ప్రదేశం. రాష్ట్రం మొత్తం హిమాలయ పర్వత శ్రేణుల నడుమే ఉంటుంది. నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా చాలాచోట్ల దారులన్నీ మంచుతో బ్లాక్ అయిపోతాయి. సో ఓవారాల్‌ గా ఏడాదంతా ఆ ప్రదేశం చల్లగానే ఉంటుంది.

అలాంటి ప్రదేశంలో వేడి అనేమాట నిజంగానే అపురూపమైంది. నిత్యం శీతలగాలుల మధ్య జీవనం సాగించేవారంతా చిన్నపాటి వెచ్చదనానికే మొహంవాచిపోతారు. మారుమూల గ్రామాల్లో ఉండే వారి పరిస్థితి అయితే వర్ణనాతీతం. రూం హీటర్లు పెట్టుకునే స్తోమత లేక, కట్టెల పొయ్యిమీదనే ఆధారపడతారు. వాటికోసం కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ వీపున కర్రల మోపు పెట్టుకుని మైళ్లకు మైళ్లు నడుస్తారు. నిత్యం ఇదొక నరకయాతన. అక్కడి ప్రజల దుస్థితి చూసి చలించిన ఒక ఆస్ట్రేలియన్ టూరిస్ట్- వారికోసం అద్భుత పరికరాన్ని తయారు చేశాడు. లడఖ్ ప్రాంతంలో విద్యాదాతగా పేరొందిన సోనం వాంగ్‌చుక్ అనే సామాజిక కార్యకర్త స్ఫూర్తితో హిమాచల్ ప్రజల కోసం తనవంతుగా చేసిన ఆ డివైజ్ పేరే.. రాకెట్ స్టవ్.

image


రాకెట్ స్టవ్ తయారు చేయడానికి రెండేళ్లు పట్టింది. మొదట్లో అనుకున్నంతగా డిజైన్ సక్సెస్ కాలేదు. అయినా పట్టువదలకుండా ప్రయోగాల మీద ప్రయోగాలు చేశాడు. దానికి సంబంధించిన వీడియోలను యూ ట్యూబులో వెతికాడు. ఈ రకమైన టెక్నాలజీని ప్రపంచంలో చాలామంది వాడుతున్నారని అప్పుడు తెలిసింది. అందరి నుంచి అభిప్రాయాలు సేకరించాడు. ఐడియాలు షేర్ చేసుకున్నాడు.

మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఒక మెటల్ బాక్సులో ఇమిడేలా తయారు చేయడం కోసం- విస్తృతంగా సెర్చ్ చేశాడు. మొత్తానికి హిమాచల్ ప్రదేశ్ వాసుల కోసం అనువుగా ఉండే రాకెట్ స్టవ్ క్రియేట్ చేశాడు.

బేసిక్ మోడల్ ఆవిష్కరించిన తర్వాత దాన్ని పలు రకాలుగా వాడుకోవడం ఎలా అనే దానిపై దృష్టి పెట్టాడు. అంటే రూం హీటింగ్, వంటకు అనుకూలంగా ఉండే సర్ఫేజ్, సెల్ ఫోన్ చార్జింగ్ కోసం యూఎస్‌బీ పోర్టు.. ఇలా అనేక ఉపయోగాలు ఉండేలా ప్లాన్ చేశాడు.

image


అక్కడ వంట చెరకు కోసం నిత్యం చెట్లను నరకడమే పని. చిన్న చిన్న కొమ్మలను కూడా వదలిపెట్టరు. చలితో నిత్యం పోరాటం చేయాలంటే చెట్ల నరికివేత తప్పదు. ఎప్పుడైతే రాకెట్ స్టవ్ వచ్చిందో అప్పటి నుంచి చెట్లు నేలవాలడం తగ్గాయి. ఎందుకంటే రాకెట్ స్టవ్ వెలగాలంటే రెండు మూడు కర్రలు చాలు. డే అంతా వేడికి వేడి.. వంటకు వంట అవుతుంది. అదీగాక వీపున కర్రల మోపుతో ఈడ్చుకుంటూ నడిచే బాధ కూడా తప్పింది.

పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన హిమాలయన్ రాకెట్ స్టవ్ ప్రస్తుతానికి పేద ప్రజలకు, స్కూళ్లకు, వృద్ధులకు అందించాడు. వాళ్లిచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా డిజైన్ ఇంప్రూవ్ చేస్తానంటున్నాడు.

హిమాలయన్ రాకెట్ స్టవ్ ప్రస్తుతానికి ఇది రెండు వెర్షన్లలో ఉంది. చిన్నగా ఉండేది స్టాండర్డ్ రాకెట్ స్టవ్. కాస్త పెద్దగా ఉండేది వాటర్ బాక్స్ రాకెట్ స్టవ్. ఈ రెండూ బేసిగ్గా వంట వండటానికి, రూం హీట్ చేసుకోడానికి ఉపయోగపడాతాయి. కాకపోతే, వాటర్ బాక్స్ వెర్షన్ తో ఫోన్ చార్జింగ్ చేసుకోవచ్చు. లైట్లు కూడా వెలుగుతాయి. ఈ రెండు ఫీచర్లు త్వరలో యాడ్ కాబోతున్నాయి. ఈ రాకెట్ స్టవ్ మూలంగా 85 నుంచి 90 శాతం వంట చెరకును ఆదా అవుతుంది. ఒకటి రెండు కర్రలు సరిపోతాయి.. వంట చేసుకుని రూం హీట్ చేసుకోడానికి.

రాకెట్ స్టవ్ తయారు చేయడానికి చండీగఢ్‌ ప్రాంతంలో ఒక లిమిటెడ్ కంపెనీలాంటిది స్టార్ట్ చేశాడు. అందులో రస్సెల్, ప్రొడక్షన్ మేనేజర్ ఇద్దరే పెర్మనెంట్ ఎంప్లాయీస్. మిగతా వారంతా మాన్యుఫ్యాక్చరింగ్ పార్ట్ నర్స్. వాళ్లు వంద మంది దాకా ఉంటారు.

చిన్న స్టవ్ ఖరీదు రూ. 15వేలు. హాట్ వాటర్ బాక్స్ స్టవ్ రూ. 20వేలు. ఇంకొంచెం పెద్దది కావాలంటే రూ. 30 వేలు అవుతుంది. అదింకా ప్రొడక్షన్ స్టేజీలోనే ఉంది. వచ్చే సెప్టెంబర్ కల్లా మూడోది కూడా రెడీ అయిపోతుందని రస్సెల్ అంటున్నాడు.

image


ఇంతకూ ఎవరీ రస్సెల్

ఆస్ట్రేలియాకు చెందిన రస్సెల్ ఒక కాలేజీ డ్రాపవుట్. 19 ఏళ్లకే ఇకో రాక్ మ్యూజికల్ థియేటర్ ప్రొడక్షన్ విభాగంలో చేరాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా అంతా పర్యటించాడు. ఆ క్రమంలోనే ఇండియాకు వచ్చాడు. ఎన్నోసార్లు స్పితీ వాలీ, కిన్నార్‌లో పర్యటించాడు. అక్కడి గ్రామీణ ప్రాంతాలతో విడదీయరాని అనుబంధం ఏర్పరుచుకున్నాడు. ఇకో హౌజ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం సొంతంగా నిధులు సమకూర్చాడు. స్పితీ వాలీలోని పేద పిల్లల చదువు కోసం కొంత డబ్బు స్పాన్సర్ చేశాడు.

2003లో స్టడీ టూర్ కోసం రెండోసారి లడఖ్ వచ్చిన సందర్భంగా సెక్మోల్ (SECMOL- స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ మూవ్ మెంట్ ఆఫ్ లడఖ్) పరిచయం అయింది. అక్కడ పిల్లల విద్యాప్రమాణాలు మెరుగు పరిచేందుకు సామాజిక కార్యకర్తలు నడిపిస్తున్న ఉద్యమానికి ఇంప్రెస్ అయ్యాడు. విద్యార్ధులకు తనవంతు సాయంగా స్కూళ్ల కోసం సొంతంగా క్రౌడ్ ఫండింగ్ చేసి సోలార్ వాటర్ పంప్ స్పాన్సర్ చేశాడు. అది కూడా తన స్వీయ ఆవిష్కరణే. లడఖ్ ప్రాంతంలో ఇప్పటికీ సరైన తాగునీరు లేదు. ఆ సమస్యను దృష్టిలో పెట్టుకుని సోలార్ వాటర్ పంప్ క్రియేట్ చేశాడు.

రెగ్యులర్ గా హిమాలయాలకు రావడంతో- తానే ఒక ట్రావెల్ కంపెనీ స్థాపించాడు. హిమాచల్ ప్రదేశ్‌, లడఖ్‌ వచ్చేవారికి గైడింగ్ చేయడానికి యాక్ ట్రాక్ పేరుతో 2003లో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా సోలార్ వాటర్ పంప స్పాన్సర్ చేస్తే.. రాకెట్ స్టవ్ కోసం సొంతంగా నిధులు ఖర్చు చేశాడు.

రాకెట్ స్టవ్ తయారుచేసి హిమాచల్ ప్రదేశ్ వాసుల కన్నీళ్లు తుడిచిన ఆస్ట్రేలియన్ నిజంగా అభినందనీయడు. సోనం వాంగ్‌చుక్ స్ఫూర్తితో సమాజానికి పనికొచ్చే ఆవిష్కరణలు చేసిన రస్సెల్ మనసు నిజంగా హిమాచలమే.