సౌరకుటుంబంలో భూమిని పోలిన మరో ఏడు గ్రహాలు  

0

ఎన్నాళ్లుగానో కొత్త గ్రహాల కోసం అన్వేషిస్తున్న శాస్త్రవేత్తల కృషి ఫలించింది. ఏళ్ల తరబడి సాగించిన పరిశోధనల అనంతరం విశ్వంలో అద్భుతాన్ని కనుగొన్నారు సైంటిస్టులు. సుదూర సౌరకుటుంబంలో భూమిని పోలిన ఏడు గ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ గ్రహాలు ట్రాపిస్ట్-1 అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు తెలుసుకున్నారు. భూమికి సుమారు 39 కాంతి సంవత్సరాల దూరంలో సప్తగ్రహ కూటమి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నేచర్ జర్నల్లో ఈ అద్భుత ఆవిష్కరణకు సంబంధించిన నివేదికను శాస్త్రవేత్తలు ప్రచురించారు.

ఒకే నక్షత్రం చుట్టూ టెరస్ట్రియల్ గ్రహాలు భ్రమిస్తున్న తీరు అద్భుతమంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. గతంలో ఎప్పుడూ ఖగోళ ఆవిష్కరణల్లో ఇలాంటి కొత్త అంశాలను గుర్తించలేదంటున్నారు. ట్రాపిస్ట్ నక్షత్రం సమీపంలో ఉన్న మూడు గ్రహాలు నివాస యోగ్యంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ గ్రహాల ఉపరితలంపై నీటి ఛాయలు ఉన్నట్లు కూడా భావిస్తున్నారు. నక్షత్రానికి సమీపంలో ఉన్నందున జీవానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండే అవకాశం లేకపోలేదని చెప్తున్నారు. బెల్జియంలోని యూనివర్సిటీ ఆఫ్ లీగ్కు సంబంధించిన ఎక్సోప్లానెట్ పరిశోధకుడు మైఖేల్ గిల్లాన్ తన నివేదికలో ఈ ఆసక్తికర అంశాలను వెల్లడించారు. విశ్వంపై ఉన్న అవగాహనను మరింత అధ్యయనం చేసేందుకు ఏడు గ్రహాల ఆవిష్కరణ ఉపయోగపడుతుందని ఆయన అంటున్నారు. ఒకవేళ ఆ గ్రహాలపై నీరు ఉన్నా, లేకున్నా, అధ్యయనంలో ఏది బయటపడ్డా అది ఇంట్రెస్టింగే అంటున్నారు.

కొత్త సౌర కుటుంబం కాస్త అటు ఇటుగా మన సౌరకుటుంబం తరహాలోనే ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ట్రాపిస్ట్ నక్షత్రం సరిగ్గా ఆ ఏడు గ్రహాల మధ్యలో ఉంది. నక్షత్రం సైజు సూర్యుడిలో పదో వంతు ఉంటుంది. ఆ నక్షత్రంలో ఉన్న వేడి కూడా సూర్యునిలో ఉండే పావు వంతుకు సమానమని సైంటిస్టులు అంటున్నారు. ట్రాపిస్ట్ నక్షత్రం చల్లగా ఉంది కాబట్టి, దాని చుట్టూ తిరిగే గ్రహాల్లో నీరు వెచ్చగా ఉండొచ్చని భావిస్తున్నారు. భూమి, శుక్రుడు, అంగారక గ్రహాలకు సూర్యుడి నుంచి అందుతున్న వేడి తరహాలోనే ట్రాపిస్ట్ దగ్గర ఉన్న గ్రహాలకు కూడా హీట్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా ఆ ఏడు కొత్త గ్రహాలు జీవానికి అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. భూగ్రహం కాకుండా సౌరకుటుంబంలోని ఇతర గ్రహాల్లో ఏలియన్ల అన్వేషణకు కూడా ఈ ఆవిష్కరణ ఉపయోగపడుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Related Stories

Stories by team ys telugu