ఆహారం పడేయకండి.. పేద‌ల కడుపు నింపుదాం రండి.. హైద‌రాబాదీ సంస్థ 'గ్లో టైడ్‌'

ఆహారం పడేయకండి.. పేద‌ల కడుపు నింపుదాం రండి.. హైద‌రాబాదీ సంస్థ 'గ్లో టైడ్‌'

Wednesday June 24, 2015,

2 min Read

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆక‌లి చావులు పెరుగుతున్నాయి. ఈ స‌మ‌స్య 98% అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉంది. గ్లోబ‌ల్ హంగ‌ర్ ఇండెక్స్ రిపోర్ట్-2013 ప్ర‌కారం ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఆక‌లితో బాధ‌ప‌డుతున్న‌వారిలో నాలుగో వంతు ఇండియాలోనే ఉన్నారు. భార‌త్‌లో 21 కోట్ల మంది ప్ర‌జ‌లు ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు. ప్ర‌పంచవ్యాప్తంగా వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు పెరుగుతున్నాయి. ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంద‌రికీ కావాల్సినంత ఆహారం స‌ర‌ఫ‌రా చేసే ఉత్ప‌త్తి జ‌రుగుతోంది. కానీ ద‌శాబ్ద‌కాలంగా ఆక‌లి కేక‌లు త‌గ్గుతున్న దాఖ‌లాలు మాత్రం క‌నిపించ‌డంలేదు. ఇందుకు రాజ‌కీయ‌, ఆర్థిక‌ప‌ర‌మైన కార‌ణాలు ఎన్నో ఉన్న‌ప్ప‌టికీ, పేద‌రికం, ఆహార వృథా కూడా ఆక‌లి కేక‌ల‌కు మరో ప్ర‌ధాన కార‌ణం.

వృథా అవుతున్న ఆహారం

ఓవైపు దేశ‌వ్యాప్తంగా ప్ర‌తీరోజు ఎంతో ఆహారం వృథా అవుతోంది. పార్టీలు, క్యాంటీన్లు, పెళ్లి విందులు, బ‌ఫె పార్టీలు, రెస్టారెంట్ల‌లో ఆహారం విప‌రీతంగా వేస్ట్ చేస్తున్నారు. మ‌రోవైపు ఎంతో మంది ప్ర‌జ‌లు ఆహారం దొర‌క్క‌, ఆక‌లితోనే క‌డుపుమాడ్చుకుంటూ నిదుర‌లేని రాత్రులు గ‌డుపుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌ను ముస్త‌ఫా హ‌స్మీ ఓ రోజు ప్ర‌త్య‌క్షంగా అనుభ‌వించారు. "ఓ రోజు నేను శాండ్‌విచ్ కొనుక్కునేందుకు వెళ్లాను. అదే స‌మ‌యంలో ఓ వ్య‌క్తి డ్రైనేజీ ద‌గ్గ‌ర నీళ్లు తాగి క‌డుపు నింపుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. అత‌నితో మాట్లాడిన‌ప్పుడు, 14 రోజులుగా ఖాళీ క‌డుపుతో ఉంటున్న‌ట్టు తెలిసింది. క‌నీసం ఓ గ్లాస్ మంచి నీళ్లు కూడా అత‌ని దొర‌క‌ని ప‌రిస్థితి" అని హ‌ష్మీ అప్ప‌టి ఘ‌ట‌న‌ను గుర్తుచేసుకున్నారు.

image


ప‌రిష్కారం

ఆ ఘ‌ట‌న‌తో మ‌న‌సు చ‌లించిపోయింది హ‌ష్మీకి. పేద‌ల కోసం ఏదైనా చేయాల‌ని ఆ రోజే నిర్ణ‌యించారు. హైద‌రాబాద్‌లోని వీఐఎఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ (జేఎన్టీయూ)లో బిటెక్ చదివిన హ‌ష్మీ గ్లోటైడ్‌ను నెల‌కొల్పారు. పెళ్లిళ్లు, పార్టీల్లో వృథాగా మిగులుతున్న ఆహారాన్ని తీసుకొచ్చి, ఆక‌లితో అల‌మ‌టిస్తున్న వారికి అంద‌జేస్తున్నారు. రెస్టారెంట్లు, ఫంక్ష‌న్‌హాల్స్‌, కార్పొరేట్ క్యాంటీన్ల‌లో వృథాగా మిగిలిన ఆహారాన్ని సేక‌రించి, వాటిని ప్యాక్ చేసి ఆక‌లితో అల‌మ‌టిస్తున్న‌వారికి, ఇళ్లులేని పేద‌ల‌కు పంచుతున్నారు. దాదాపు రెండేళ్లుగా వారు వృథా ఆహారాన్ని పేద‌ల‌కు అంద‌జేస్తున్నారు. ప్ర‌తీ రోజూ 125-150 మంది పేద‌ల‌కు భోజ‌నం పెడుతోందీ సంస్థ‌. హష్మీతోపాటు మ‌రో ఆరుగురు కూడా స‌మాజ‌సేవ చేసేందుకు ముందుకు వ‌చ్చారు.

image


విస్త‌ర‌ణ‌

సేవ చేసేందుకు ఎంతోమంది యువ‌కులు ముందుకు వ‌స్తుండ‌టంతో గ్లోటైడ్ ప‌ని సులువ‌వుతోంది. వృథా అవుతున్న ఆహారాన్ని ఇచ్చేందుకు ఒప్పుకునే రెస్టారెంట్ల‌ను గుర్తించ‌డం, ఆహార ర‌వాణాను ప‌ర్య‌వేక్షించ‌డం, ఆహార పంపిణీ కోసం వాలంటీర్ల‌ను వెత‌క‌డం వంటి స‌మ‌స్య‌లు గ్లోటైడ్ ముందున్నాయి. ప్ర‌స్తుతానికైతే ప‌ర్స‌న‌ల్ వెహికిల్స్‌, ఆటో రిక్షాల‌ను ఆహార త‌ర‌లింపు కోసం ఉప‌యోగిస్తున్నారు. అలాగే మ‌రిన్ని రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని తీసుకొచ్చేందుకు వాలంటీర్ల కోసం అన్వేషిస్తున్నారు. త‌మ సేవ‌ల‌ను మ‌రింత విస్తృతప‌రచాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్నారు హ‌ష్మీ. గూడులేని పేద‌ల‌కు ఆశ్ర‌యం క‌ల్పిస్తున్న ఎన్జీవోల‌తో క‌లిసి మ‌రిన్నిక్యాంటీన్లు, రెస్టారెంట్ల‌తో ఒప్పందం కుదుర్చుకోవాల‌ని గ్లోటైడ్ భావిస్తోంది. "వ‌న్ కాయిన్ డొనేష‌న్‌" క్యాంపైన్‌ను కూడా మొద‌లుపెట్టింది. "వ‌చ్చే రెండేళ్ల‌లో 20వేల మందికి ఆహారం అంద‌జేయాల‌నుకుంటున్నాం" అని హష్మీ తెలిపారు. పేద‌ల‌కు క‌డుపునింపుతున్న హ‌ష్మీ చేస్తున్న‌స‌మాజ‌ సేవ‌లో ఎవ‌రైనా పాలుపంచుకోవ‌చ్చు. ఇంట్లోగానీ, సంస్థ‌ల‌లో కానీ, విందుల్లో గానీ, రెస్టారెంట్‌ల‌లో గానీ మిగిలిపోయిన ఆహారాన్ని గ్లోటైడ్‌కు ఇవ్వాల‌నుకుంటే [email protected]కు మెయిల్ చేయండి.

website