డోనాల్డ్ ట్రంప్ ని మూడు చెరువుల నీళ్లు తాగించిన ఓ సాధారణ గృహిణి  

ఓ ఇల్లాలి ఆత్మాభిమానం ముందు తలవంచిన ట్రంప్

0

ముంబైలో ఉన్న ఓ సాధారణ గృహిణి.. ఎక్కడో అమెరికాలో ఉండే ట్రంప్ ని ముప్పు తిప్పలు పెట్టడమేంటి? హిల్లరీనే ఓడించిన అతను ఓ సగటు ఇల్లాలి ముందు తలవంచడమేంటి? మేటర్ ఎక్కడా మ్యాచ్ కావడం లేదే..? అని బుర్ర గోక్కుంటున్నారా? అసలు విషయం తెలియాలంటే ఐదేళ్ల వెనక్కి వెళ్లాల్సిందే.

అది సౌత్ ముంబైలోని ఖరీదైన చౌపట్టీ ప్రాంతం. అక్కడొక పురాతన భవంతి. అందులో ఫస్ట్ ఫ్లోర్ లోని స్మితా పన్వాల్కర్, ఆమె భర్త, కొడుకు, సోదరుడు వుండేవాళ్లు. వీళ్లతో పాటు మరో 25 కుటుంబాలు అద్దెకుండేవి. లైఫ్ హాపీగా సాగిపోతోంది. అంతలో అనుకోని ఉపద్రవం ట్రంప్ రూపంలో వచ్చిపడింది. 87 ఏళ్లనాటి ఆ భవంతిమీద ట్రంప్ కన్నుపడింది.

ఇండియాలో వ్యాపారాన్ని విస్తరించాలనుకునే క్రమంలో ముంబైలో తొలి వెంచర్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. 65 అంతస్తులతో 50 అల్ట్రా లగ్జరీ అపార్టుమెంట్లతో టవర్ కోసం ప్లాన్ వేశాడు. లోకల్ బిల్డర్లతో మాట్లాడి ఇండియాలోనే మొట్టమొదటి ట్రంప్ టవర్ కోసం స్కెచ్ గీశాడు. స్మితా ఉన్న భవంతితో పాటు పక్కన మరో బిల్డింగును కొనేసి, ఆ ప్లేసలో టవర్ కట్టాలనేది ట్రంప్ ఆలోచన.

సాధారణంగా ముంబైలో కొత్త నిర్మాణాలకు లాండ్ దొరకడం కష్టం. పాతవాటినే కూల్చేసి కొత్తవి కడుతుంటారు. వాళ్లకు నష్టపరిహారం ఇస్తుంటారు. అలా స్మిత ఉన్న బిల్డింగును కొంటామని ట్రంప్ ప్రతిపాదించాడు. అందులో ఉన్న 25 కుటుంబాలు తిరస్కరించాయి. కొంత బేరసారాలు జరగడంతో అందరూ బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్లిపోయారు. కానీ స్మిత దంపతులు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. నష్టపరిహారం కాదు.. కట్టే బిల్డింగులోనే ఒక ఫ్లాట్ ఇవ్వాలనేది ఆమె డిమాండ్. కొన్నాళ్లపాటు ఈ పంచాయితీ నడిచింది. 

బిల్డింగులో వీళ్లు తప్ప ఎవరూ లేరు. బావురుమంటోంది. మెయింటెనెన్స్ లేక నానాటికీ అధ్వాన్నంగా తయారవుతోంది. అసలే 80 ఏళ్ల క్రితం నాటి అపార్టమెంట్. గోడలకు పెచ్చులూడిపోతున్నాయి. వాటర్ లీక్ అవుతోంది. ఒకసారి అగ్నిప్రమాదం జరిగి కరెంటు సరఫరా నిలిచిపోయింది. 45 రోజులపాటు చీకటి. కొవ్వత్తుల వెలుగులోనే వంట చేసుకునేవారు. భయంకరమైన ఉక్కపోత. అయినా పట్టువదల్లేదు. స్మిత అప్పటికే డయాబెటిక్ పేషెంట్. ఇంటి టెన్షన్ లో పడి సమయానికి ముందులు కూడా వేసుకోలేదు. అయినా సరే, స్మిత ఫ్యామిలీ భయపడలేదు. ఇల్లు వదులుకోదల్చుకోలేదు. వెళ్లిన వాళ్లంతా డబ్బుకు ఆశపడి వెళ్లారు. అది వాళ్లిష్టం. నేను వెళ్లను. ఇది నా ఇష్టం. అని బేషరతుగా చెప్పింది.

కోర్టులూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి బిల్డర్లు అలసి పోయారు. పైగా నిర్మాణ పరమైన అనుమతులు కూడా కష్టమయ్యాయి. పంచాయితీ ఎంతకూ తెగకపోవడంతో ట్రంప్ ఆ ప్రాజెక్టును విరమించుకున్నాడు. వేరే వెంచర్ చూసుకున్నాడు. ఖాళీ చేసి వెళ్లిపోయిన వాళ్లంతా తిరిగి వచ్చేశారు. ఆమె పోరాటాన్ని స్థానిక మీడియా హైలైట్ చేసింది. అప్పటికే స్మిత శరీరం బాగా శుష్కించి పోయింది. మందులు సరిగా వేసుకోకపోవడంతో బీపీ అమాంతం పెరిగిపోయింది. స్ట్రెస్ ఎక్కువ కావడంతో తీవ్రమైన గుండెపోటు వచ్చి చనిపోయింది.

ఆ తర్వాత కొంత కాలానికి లోకల్ బిల్డర్ ఒకతను వచ్చాడు. బిల్డింగ్ కొనుగోలు గురించి మాట్లాడాడు. అతను ఇస్తానన్న పరిహారం స్మిత భర్తకు రీజనబుల్ అనిపించింది. ఆ ప్లేసులో కట్టబోయే 22 అంతస్తుల భవనంలో 12వ ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ వీరికి ఇస్తానన్నాడు బిల్డర్.

పవర్ ఫుల్ లేడీ హిల్లరీ క్లింటన్ నే ఎదుర్కొని అమెరికన్ ప్రెసిడెంట్ పీఠాన్ని అధిరోహించిన ట్రంప్- ముంబైలోని ఒక సాధారణ గృహిణి చేతిలో ఓడిపోయాడంటే నమ్మశక్యంగా లేదు కదా. ఈ సంఘటన ఐదేళ్ల క్రితం జరిగినా.. ఇప్పుడు జరిగినా.. కనిపించే మోరల్ లైన్ ఒక్కటే. సామాన్యుడు తలుచుకుంటే ఆగర్భ శ్రీమంతుడైనా, అమెరికా ప్రెసిడెంటయినా తోకముడవాల్సిందే.

అన్నీ డబ్బుతో కొనలేం. అందులో ఆత్మగౌరవాన్ని అస్సలు కొనలేం.  

Related Stories

Stories by team ys telugu