హిందీలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్ తీసుకొచ్చిన కాన్పూర్ కుర్రాళ్లు..!!

హిందీలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్ తీసుకొచ్చిన కాన్పూర్ కుర్రాళ్లు..!!

Wednesday April 20, 2016,

3 min Read


హిందీ! దేశ అధికార భాష! ప్రపంచం మొత్తమ్మీద హిందీ మాట్లాడే వాళ్లు 50 కోట్ల మంది! వీళ్లందరికీ ఒక కామన్ ప్లాట్ ఫామ్ ఉంటే ఎలా ఉంటుంది? హిందీ ప్రజలు తమ అభిప్రాయాలను షేర్ చేసుకోవడానికి ఒక వేదిక ఉంటే తప్పేంటి? ఆ ముగ్గురు స్నేహితులు కూడా ఇదే ఆలోచించారు. హిందీ మాట్లాడే వారి కోసం ఏకంగా ఒక సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైటే సృష్టించారు.

శబ్దనగరి! ఇదొక హిందీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్! యాప్ కూడా ఉంది. గత జనవరిలో లాంఛ్ అయింది. అమితేశ్ మిశ్రా, కల్పనేశ్ గుప్తా, నిఖిల్ తివారీ. ఈ ముగ్గురే ఫౌండర్లు. హిందీ నెటిజన్లను ఆకర్షిస్తే బిజినెస్ ఎక్కడికో వెళ్తుందన్న వీళ్ల ఐడియా నూటికి నూరు పాళ్లు వర్కవుట్ అయింది.

నిజమే. ఇంటర్నెట్ అంతా ఇంగ్లిష్ తో నిండిపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో హిందీ బ్లాగ్ వర్కవుట్ అవుతుందా? ఇదే డౌట్ ఫౌండర్లకూ వచ్చింది. అయితే ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటివి సక్సెస్ అయినప్పుడు హిందీ సోషల్ సైట్ ఎందుకు వర్కవుట్ కాదని అనుకున్నారు. ముందుగా కాన్పూర్ లోని కాలేజీలు, స్కూళ్ల ముందుకు శబ్దనగరి కాన్సెప్ట్ ను తీసుకెళ్లారు. స్టూడెంట్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఐఐటీ కాన్పూర్ లోని సిడ్బీ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ లో శబ్దనగరి వెబ్ సైట్ ను తయారు చేశారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఏర్పాటు చేయడానికి కాన్పూర్ ఐఐటీ కొంత లోన్ ఇచ్చింది. కాన్పూర్ కు చెందిన ఏంజిల్ ఇన్వెస్టర్లు, ఇతర పెట్టుబడిదారుల నుంచి శబ్దనగరి రూ.1.2 కోట్ల నిధులు సేకరించింది. కాన్పూర్ నుంచి మొదలయ్యే స్టార్టప్ లను ప్రోత్సహించడానికి కాన్పూర్ ఏంజిల్స్ కంపెనీ రూ.10 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. అందులో నుంచి తొలి ఫండ్ ను శబ్దనగరి అందుకుంది.

ఆ మధ్య ఢిల్లీలో జరిగిన భారతీయ భాషా ఉత్సవంలో శబ్దనగరి కాన్సెప్ట్ ను ప్రదర్శించారు. భారత సాంస్కృతిక శాఖ హిందీ సోషల్ నెట్ వర్క్ కాన్సెప్ట్ ను సపోర్ట్ చేసి ప్రోత్సహించింది.

శబ్దనగరి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ టీం

శబ్దనగరి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ టీం


ముగ్గురూ ముగ్గురే..

అమితేశ్‌ ఐఐటీ బాంబే స్టూడెంట్. నిఖిల్ ఘజియాబాద్ విశ్వేశ్వరయ్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్‌ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి పట్టా పుచ్చుకున్నాడు. ఇక కల్పనేశ్ మార్కెటింగ్ రంగంలో ఎక్స్ పర్ట్. ఒక కంపెనీ నడవడానికి ఈ మాత్రం టాలెంట్ ఉంటే చాలు. మార్కెటింగ్ అండ్ యాడ్స్ బాధ్యతలు కల్పనేశ్ చూసుకుంటాడు. అమితేశ్ బిజినెస్ ఆపరేషన్స్, నిఖిల్ ప్రోడక్ట్ డెవలప్ మెంట్ మీద దృష్టి పెడుతుంటారు.

ఇంటర్నెట్ అంటే ఇంగ్లీషే అన్న మైండ్ సెట్ తో పెరిగాం. డిజిటల్ వరల్డ్ కు కనెక్ట్ కావాలంటే ఇంగ్లిష్ తప్ప మార్గం లేదన్న అభిప్రాయంతో బతుకుతున్నాం. అలాకాకుండా జనానికి తమ సొంత భాషల్లో కూడా ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఉండాలన్నదే మా ఆలోచన. అందుకే శబ్దనగరిని తీసుకొచ్చాం- అమితేశ్


ఇంతింతై..

ప్రస్తుతం శబ్దనగరి వెబ్ సైట్, యాప్ కు 20 వేల మంది రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. ఇందులో హిందీ ఆర్టికల్స్ పోస్ట్ చేయొచ్చు. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇకపోతే మెసెజింగ్, ఛాటింగ్ కామనే! ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఫ్రెండ్ లిస్టులో జాయిన్ అయిపోవడమే.

హిందీ టైపింగ్ కూడా పెద్ద కష్టమేమీ కాదు. హిందీ పదాలను ఇంగ్లిష్ లో టైప్ చేస్తే చాలు. అవే ఆటోమేటిగ్గా హిందీలోకి ట్రాన్స్ లేట్ అయిపోతాయి. ఒకే ఒక్క సంవత్సరంలో యావరేజ్ గా 7.5 లక్షల మంది యూజర్లు శబ్దనగరి సైట్ ను విజిట్ చేశారు. ఇందులో 80 శాతం వెబ్ సైట్ ట్రాఫిక్ ముంబై, ఢిల్లీ నుంచి వస్తుంది. 10 శాతం అమెరికా, యూఏఈ, కెనడా యూజర్లు ఉన్నారు. గత సెప్టెంబర్ లోనే శబ్దనగరి ఆండ్రాయిడ్ యాప్ తీసుకొచ్చారు. ఇప్పటికే 2,000 మంది యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారు.

నేటి తరం ఇంగ్లీష్‌ లోనే మునిగిపోతోందన్న జనరల్ ఒపీనియన్ ఉంది. కానీ మా యూజర్లలో 50 శాతం మంది 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు వారే. 35 ఏళ్ల లోపు వారు 25 శాతం మంది ఉన్నారు. మిగతా వాళ్లంతా 35 ఏళ్లు పైబడిన యూజర్లు- అమితేశ్
నిఖిల్ తివారీ, అమితేశ్ మిశ్రా, కల్పనేశ్ గుప్తా

నిఖిల్ తివారీ, అమితేశ్ మిశ్రా, కల్పనేశ్ గుప్తా


కత్తిలాంటి టీం..

శబ్దనగరికి మొత్తం 15 మంది సభ్యుల టీం ఉంది. వారిలో ఆరుగురు డెవలపర్లు, ముగ్గురు డిజైనర్లు. మిగతా వాళ్లు మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్ చూసుకుంటారు. త్వరలోనే ముంబై, బెంగళూరు, లక్నో నగరాల్లో బ్రాంచిలు తెరవాలని ఫౌండర్లు భావిస్తున్నారు. వచ్చే ఆరు నెలల్లో నాలుగైదు లక్షల మందికి చేరువ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2018 కల్లా 15 లక్షల మంది యూజర్లను సంపాదిస్తామంటున్నారు.

కంపెనీ ప్రస్తుతం ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే వచ్చే నెలలో శబ్దనగరి కొత్త వెర్షన్ ను లాంఛ్ చేయనుంది. అందులో అడ్వర్టైజ్ మెంట్లు, బిజినెస్ ప్రమోషన్లు, హిందీ పుస్తకాల విక్రయం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. యాప్ కు సరికొత్త ఫీచర్లను కూడా యాడ్ చేయనుంది.

ఆన్ లైన్ లో హిందీకి ఆదరణ..

ఆన్ లైన్ లో హిందీ భాషకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. హిందీ కంటెంట్ వెతుకుతున్న నెటిజన్ల సంఖ్య 94 శాతంగా ఉందని గూగుల్ ఇండియా అంచనా. అంతెందుకు! తమ యాడ్ సెన్స్ ఆప్షన్ ఇక నుంచి హిందీ కంటెంట్ ను కూడా సపోర్ట్ చేస్తుందని సాక్షాత్తూ గూగులే ఇటీవల ప్రకటించింది.

నాన్ ఇంగ్లిష్‌ స్పీకర్స్ ను దృష్టిలో పెట్టుకొని.. స్టార్టప్ లు బీ2బీ, బీ2సీ కస్టమర్లకు హిందీ కంటెంట్ ను అందుబాటులోకి తేవడం శుభపరిణామం. ప్రాంతీయ భాషల్లో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు, యాప్స్ కోరుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే..!

శబ్దనగరి