స్టార్టప్ కోసం సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వదిలేశారు..!!

Monday February 29, 2016,

4 min Read

అంకిత్ అగర్వాల్, సిమ్మి అగర్వాల్. ఇద్దరూ భార్యభర్తలు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. ఇద్దరికీ ఇంచుమించు ఆ ఫీల్డులో పదేళ్ల అనుభవం ఉంది. ఆరంకెల జీతం. హైదరాబాదులో సొంతిల్లు. లగ్జరీ లైఫ్. వీకెండ్ హంగామా. ఇంతకంటే జీవితానికి కావల్సిందేంటి? కానీ ఇవేవీ వాళ్లిద్దరినీ ఇంప్రెస్ చేయలేకపోయాయి. పైగా ఏంటీ రొటీన్ లైఫ్ అనే అభిప్రాయానికి వచ్చారు. ఇంతకుమించి ఇంకేం లేదా అన్న ప్రశ్న దగ్గర ఆగిపోయారు. కొంత మానసిక సంఘర్షణ తర్వాత సమాధానం కనుక్కున్నారు. ఉన్నపళంగా ఉద్యోగాలకు గుడ్ బై కొట్టారు. ఆ తర్వాత ఏం చేశారు?.. 

కాలం కార్పొరేట్ రెక్కల గుర్రం మీద సవారీ చేస్తున్నది. పొద్దున లేస్తే ఉరుకుల పరుగుల జీవితం. సగటు నగర జీవి యంత్రంతో సమానం. ఏం తింటున్నాడో ఎప్పుడు పడుకుంటున్నాడో తెలియదు. పగలూ రాత్రి షిఫ్టుల్లో నలిగి దుమ్ము కొట్టుకుపోయిన ముఖంతో ఇంటికొచ్చి ఫ్యానుగాలికింద సేదతీరుతున్నాడు. బిజీ లైఫ్ ఆహారపు అలవాట్లనూ మార్చేసింది. వందల వేల కెలరీలను కడుపులోకి తోసేస్తున్నాం. ఫలితంగా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్. అల్సర్ నుంచి కేన్సర్ దాకా. 

సరే, ఎంతో కొంత జనాల్లో హెల్త్ కాన్షియస్ ఉంది. కాదనలేం. అందుకే మార్నింగో ఈవెనింగో జిమ్ టైం సెట్ చేసుకుంటారు. కాసేపు ట్రెడ్ మిల్ మీద పరుగులు పెట్టి బయటకొస్తారు. కాదంటే పొద్దున్నే లేచి ఏ కేబీఆర్ పార్కుకో వెళ్లి, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఐపాడ్ లో పాటలు వింటూ రెండు రౌండ్లు వేసి కారెక్కుతారు. 

వీటిల్లో దేనికీ టైం సెట్ కానివాళ్లు.. ఏ ఆదివారమో నగరంలో జరిగే 2కే రన్ లోనో, 5 కే రన్ లోనో పార్టిసిపేట్ చేస్తారు. అపసోపాలు పడుతూ రెండు మైళ్లు పరిగెత్తి మధ్యలో ప్యాకప్ చెప్పేస్తారు. 

ఇదేదీ వల్లకాదు బాబూ.. యోగా బెటర్ అనుకునేవాళ్లు ఎలాగోలా వీలు చేసుకుని యోగా క్లాసులకు అటెండవుతారు. మూడు పద్మాసనాలు, నాలుగు వజ్రాసనాలు, ఒక శీర్షాసనం వేసి ఒక కేరట్ జ్యూస్ తాగి బయటపడతారు. 

ఇదంతా ఎందుకు గోల.. ఒక సైకిల్ కొనుక్కుని గంటపాటు చక్కర్లు కొడితే పోలా అనుకునేవాళ్లూ లేకపోలేదు. 

అవేవీ వద్దూ.. కేవలం స్విమ్మింగ్ తోనే ఫిట్ నెస్ సాధ్యం అనే అభిప్రాయం ఉన్నవాళ్లు ఏ క్లబ్బుకో వెళ్లి గంటో, రెండు గంటలో ఈత కొట్టి వస్తారు.

జిమ్, రన్నింగ్, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్. ఇవన్నీ ఆయా పద్దతుల్లో ఫిట్ నెస్ పెంచుకునే సాధనాలే. అవన్నీ ఒకేచోట అంటే కొంచెం కష్టమైన పనే. వాటన్నిటికీ వేర్వేరు సెంటర్లు, వేర్వేరు ప్రాంతాలు ఉంటాయి. అలా కాకుండా అన్నీ గుదిగుచ్చి ఒకేచోటు ఉండాలంటే ఏం చేయాలి? సాధ్యమేనా? మిస్టర్ అండ్ మిసెస్ అంకిత్ ఈ ప్రశ్న దగ్గరే ఆగిపోయారు. ఈ ప్రశ్న దగ్గరే సమాధానం కనుక్కున్నారు. 

జిమ్, రన్నింగ్, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్. షార్ట్ కట్ లో చెప్పాలంటే గ్రిక్స్.. GRYCS G(ym)R(unning)Y(oga)C(ycling) S(wimming). ఐదు ఒకేచోట ఉన్న వండర్ ఫుల్ ఫిట్నెస్ సెంటర్ గ్రిక్స్. కాన్సెప్టు కొత్తగా ఉంటే పబ్లిసిటీదేముంది.. సరిగ్గా ఇక్కడే వాళ్లు సగం సక్సెస్ అయ్యారు. కాన్సెప్టే కొత్తగా ఉన్నప్పుడు ఈవెంట్స్ ఇంకెంత వినూత్నంగా ఉంటాయో ఊహించడానికి పెద్దగా తెలివితేటలు అక్కర్లేదు. 

గ్రిక్స్ హబ్ లో ఒక్క ఫిట్ నెస్ ఈవెంట్సే కాదు.. అమేజింగ్ బెల్లీ డాన్సర్స్ మెహర్ మాలిక్, పాయల్ గుప్తా చేత డాన్స్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తారు. అంతర్జాతీయంగా పేరున్న యోగా ఇన్ స్ట్రక్టర్లతో క్లాసులు చెప్పిస్తారు. మారథాన్ రన్నింగ్ ఈవెంట్స్ చేపడతారు. అన్నట్టు కిక్ బాక్సింగ్ లాంటి మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పిస్తారు. కొవ్వును శరవేగంగా కరిగించే జుంబా డాన్స్ క్లాసులు కండక్ట్ చేస్తారు. 

ఇన్ని రకాల ఈవెంట్లు ఉంటాయి కాబట్టే ఫ్లోర్ వైశాల్యం కూడా అంతేపెద్దగా ఏర్పాటు చేశారు. ఆర్టు స్టూడియోతో కలిపి 4వేల స్వ్కేర్ ఫీట్ వైశాల్యంగల పిల్లర్ లెస్ హల్. వుడెన్ ఫ్లోరింగ్. హై డెఫినెషన సౌండ్ సిస్టమ్. పూర్తిగా మిర్రర్ వాల్స్. ఒకవైపు బాల్కనీ వ్యూ. కెఫెటేరియా, లాకర్ ఫెసిలిటీ ఇలా అన్ని రకాల సౌకర్యాలున్నాయి గ్రిక్స్ ఫిట్నెస్ సెంటర్లో. 

గత ఏడాది వీరి ప్రాజెక్టు పట్టాలెక్కింది. వేయి మంది రిజిస్ట్రర్ కస్టమర్లున్నారు. ఏడాది పాటు సబ్ స్క్రిప్షన్ చేసుకున్న యూజర్ బేస్ ఉంది. వీరు చేపట్టే ఈవెంట్స్ కి 100 మందికి తక్కువ కాకుండా జనం వస్తారు.

గ్రిక్స్ ఈవెంట్స్

ఇన్ఫినిటీ యోగా కు హైదరాబాద్ లో గ్రిక్స కేరాఫ్ అని చెప్పాలి. ఇప్పటి వరకూ యోగా, ఫిట్ నెస్ ఈవెంట్స్ వందల్లో చేశారు. హైదరాబాద్ పేజ్ త్రీ క్రౌడ్ నుంచి కార్పొరేట్ ఉద్యోగుల దాకా ఎవరిని అడిగినా గ్రిక్స్ గురించి ఠక్కున చెప్పేస్తారు. ప్రస్తుతం ఈ సంస్థ 91స్ప్రింగ్ బోర్డ్ ఇంక్యుబేషన్ నుంచి తన ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. “భాగ్యనగరంలో స్పోర్ట్స్ అండ్ ఫిట్ నెస్ కి కేరాఫ్ కావాలనేదే మాలక్ష్యం” అంటారు అంకిత్ అగర్వాల్.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో గ్రిక్స్ స్టుడియో ఏర్పాటు చేశారు. ఇందులో కార్పొరేట్ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఫిట్ నెస్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. ప్రతి రోజు యోగా చేయాలనుకునే వారికి కూడా ఈ స్టుడియో అందుబాటులో ఉంటుంది.

గ్రిక్స్ టీం

అంకిత్ అగర్వాల్ గ్రిక్స్ ఫౌండర్. సాఫ్ట్ వేర్ రంగంలో పదేళ్ల అనుభవం. దాంతోపాటు సైక్లింగ్, రన్నింగ్ లాంటి అథ్లెటిక్స్ లో ప్రావీణ్యం ఉంది. జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఈవెంట్స్, కాంపిటీషన్స్ లో పాల్గొనేవారు. అంకిత్ భార్య సిమ్మి కో-ఫౌండర్. నొయిడాలో కంప్యూటర్ సైన్స్ చేసిన సిమ్మి కూడా అథ్లెట్ కావడం విశేషం. వీరితో పాటు మరో ఆరుగురు ఉద్యోగులు పనిచేస్తున్నారు.

పోటీ దారులు

అన్ని స్టార్టప్స్ లాగే వీళ్లకూ హైరింగ్ పెద్ద సవాల్ గా మారింది. ఫిట్ నెస్ సెన్స్ ఉన్న వారిని తీసుకోవాలి. రెమ్యూనరేషన్ లాంటి సమస్యలు ఎలాగూ తప్పవు. దీంతో పాటు కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులను మెప్పించాలి. దానికోసం ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేస్తుంటారు. అవసరమైతే భవిష్యత్ లో మరిన్ని ప్రాడక్టులు తీసుకొస్తామంటున్నారు.

ఇక పోటీ విషయానికొస్తే, రోడ్ పక్కనున్న జిమ్ దగ్గరి నుంచి టాప్ ఎండ్ స్టుడియో దాకా అన్ని పోటీగా ఉంటాయంటున్నారు అంకిత్. అయితే తాము కార్పొరేట్ ఉద్యోగుల కోసమే సెషన్స్ ఇస్తున్నాం కనక దీన్ని ఎదుర్కొంటున్నామని చెప్పుకొచ్చారు.

భవిష్యత్ ప్లాన్స్

1.ఫిట్ నెస్ ప్రాడక్టులు, మానిఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించడం. ప్రస్తుతానికి యోగా మ్యాట్స్ లాంటివి తయారుచేస్తారు. భవిష్యత్ లో షూ, టీ షర్ట్స్ కూడా ప్రొడక్షన్ చేసే ప్లాన్ ఉందంట.

2.పూర్తి బూట్ స్ట్రాపుడ్ కంపెనీ అయిన గ్రిక్స్.. ఫండింగ్ కోసం చూస్తోంది. లేదా అసోసియేట్స్ దొరికినా బెంగళూరు, పుణెల్లో స్టుడియోలను ఏర్పాటు చేస్తామంటున్నారు.

3.ఏరియల్ యోగా, బీచ్ యోగా, బీచ్ ఈవెంట్స్ కు ప్లాన్ చేస్తున్నామని, తమ బ్రాండ్ పై భారీ ఈవెంట్స్ రాబోతున్నాయని అంకిత్ ముగించారు.