సౌరశక్తి మహిమను ప్రపంచానికి చాటిచెప్పిన యువకుడు
ఎవరూ చేయని సాహసం అతడు చేశాడు. పంచభూతాలను ఐక్యం చేసుకుంటూ సాగిపోయాడు. సుదీర్ఘమైనఆకుపచ్చ కలను తనతోపాటే తీసుకెళ్లాడు. ప్రకృతితో మమేకమై గొప్ప సామాజిక బాధ్యతను తలమీద పెట్టుకుని.. బెంగళూరు నుంచి లండన్ దాకా ఆటోలో ఒంటరిగా ప్రయాణించాడు. 12 దేశాలు దాటుకుంటూ 14వేల కిలోమీటర్లు ప్రయాణించి.. సౌరశక్తిని మహిమను ప్రపంచానికి చాటిచెప్పిన ఆ సాహసీకుడే హైదరాబాద్ నవీన్.
నవీన్ పెరిగిందంతా హైదరాబాదులోనే. ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ చేశాడు. తర్వాత రెవా ఎలక్ట్రిక్ కార్ కంపెనీలోకొంతకాలం ఉద్యోగం చేశాడు. ఆ సమయంలోనే సోలార్ టాక్సీలు, ఆటోలు, కార్ల పని తీరపై, వాటి వాడకం వల్ల కలిగేప్రయోజనాలపై అధ్యయనం చేశాడు. సోలార్పవర్, దాని అవసరం గురించి తెలుసుకున్న నవీన్ - సోలార్ పవర్ పట్లప్రజలకు ఏమాత్రం అవగాహన లేదని ఆవేదన చెందాడు. అందుకే ప్రత్యామ్నాయశక్తి వనరు గురించి జనంలో చైతన్యం తేవాలని సంకల్పించాడు.
నవీన్‌కు చిన్నప్పటి నుంచి ఒక డ్రీం ఉండేది. ఇండియా నుంచి లండన్ వరకు రోడ్ జర్నీ చేయాలని! అలా తన స్వప్నానికి ఒక సామాజిక బాధ్యతను జతచేసి- ఒక ఆటో రూపొందించాడు. పూర్తిగా సోలార్ ద్వారా నడిచేలా దాన్ని డిజైన్ చేశాడు. బెంగళూరు నుంచి ప్రయాణం మొదలైంది. ముంబై నుంచి ఇరాన్ వరకు షిప్ లో ప్రయాణించి ఆ తర్వాత ఇరాన్ మీదుగా, టర్కీ, బల్గేరియా, సెర్బియా, హంగేరి, ఆస్ట్రియా, జర్మనీ, పారిస్, లండన్.. చివరికి బకింగ్ హామ్ ప్యాలెస్ ముందు జర్నీ ముగిసింది.
వాస్తవానికి మొదట పది దేశాలే అనుకున్నాడు. కానీ అనుకోకుండా మరో రెండు దేశాలు కూడా టచ్ చేస్తూ వెళ్లాడు. మొత్తం 14,500 కిలోమీటర్లు. మూడు చక్రాల ఆటో. కనీసం తోడుకు మరో మనిషి కూడా లేడు. ఊహకు కూడా అందని ప్రయాణం. రాత్రి పగలు రోజులు నెలలు ఇలా సాగింది ప్రయాణం. సౌరశక్తి మహిమను ప్రపంచానికి చాటిచెప్పాలన్న సంకల్ప బలంతోనే అనేక ఒడిదొడుకులను అధిమించి.. 7 నెలల్లో సాహసయాత్రను దిగ్విజయంగా పూర్తిచేశాడు. కొండలూ గుట్టలూ దాటుతూ, జలపాతాలు తడుముతూ, మైదానాల మీదుగా మంచు శిఖరాల మీదుగా, దట్టమైన అడవులగుండా అంతంతమాత్రమే స్పీడుంటే ఆటోతో అలుపెరుగకుండా సాగిపోయాడు.
2016, ఫిబ్రవరి 8న నవీన్ ప్రయాణం మొదలైతే సెప్టెంబర్ 17న బీబీసీ హెడ్ క్వార్టర్ ముందు ఆటో ఆగింది. కొన్నిదేశాల్లో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. కానీ ఏ దేశంలో కూడా భయపడే అవసరం రాలేదంటాడు నవీన్. పారిస్ లో పర్సు, పాస్ పోర్ట్ ఎవరో కొట్టేశారు. అదొక్కటి మినహా ప్రయాణంలో ఏ ఆటంకమూ రాలేదు. దానిమూలంగా గమ్యం చేరడానికి ఐదు రోజులు ఆలస్యమైంది.
తెలంగాణ టూరిజం శాఖ మద్దతునే ఈ సాహస యాత్ర పూర్తి చేశానంటున్నాడు నవీన్. నిజామాబాద్ ఎంపీ కవిత ఇచ్చిన ప్రోత్సాహం కూడా మరువ లేదనిదంటున్నాడు. ఆటో అడుగుపెట్టిన ప్రతీ దేశంలో జనం అబ్బురపడ్డారని అంటున్నాడు. చాలామంది అభినందించి ఫైనాన్స్ సపోర్ట్ చేశారని, మరికొందరు అన్నం పెట్టి ఆదరించారని చెప్పుకొచ్చాడు. ఇంకొందరు హోటల్ రూం ఫ్రీగా ఇప్పించారని అన్నాడు. ఒకటీ రెండు కంపెనీలు ఆటోకి బ్యాటరీలు ఉచితంగా ఇచ్చాయట. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. సోలార్ పవర్ తో ఫైనల్ ప్రాడక్ట్ రోడ్డుమీదకు తేవాలన్నదే నవీన్ లక్ష్యం. అది ఆటోనా.. కారా అన్నది ఇంకా ఫైనల్ కాలేదంటాడు.
ప్రకృతి పట్ల ప్రేమతోనే, సౌరశక్తిని ప్రపంచానికి తెలియజేయాలన్న తపనతో ఆటోలో సోలో జర్నీ చేసిన నవీన్ నిజంగా సోలార్ సోల్జర్ అయ్యాడు. టుక్ టుక్ యాత్ర గురించి తెలుసుకున్న హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ ట్విట్టర్‌లో అభినందించాడు.
Related Stories
February 21, 2017
February 21, 2017
February 21, 2017
February 21, 2017
February 21, 2017
February 21, 2017
Stories by team ys telugu