డెస్క్‌టాప్ పీసీల్లో రెవల్యూషన్‌ మాదే అంటున్న స్టార్టప్ 'చిప్‌స్టర్'

కంప్యూటర్ రంగంలో కొత్త ఎరా సృష్టిస్తారా ?డెస్క్‌టాప్ పీసీలను తలదన్నే ఉత్పత్తులను సృష్టించడం సాధ్యమేనా ?ఫ్యాషన్ జ్యూవెలరీ లోనూ ఎలక్ట్రానిక్స్ రానున్నాయా ?సైజ్‌లో చిన్నగా ఉంటూ పెర్ఫామెన్స్‌లో అదరగొట్టే డివైజ్‌లు అందిస్తామంటున్న చిప్‌స్టర్

0

"చిప్‌స్టర్ టెక్నాలజీస్... మా కంపెనీ పేరు అందరికీ ఇప్పుడు తెలిసుండకపోవచ్చు. కానీ త్వరలో ప్రతీ ఒక్కరికీ తెలుస్తుందంటారు" చిప్‌స్టర్ టీం సభ్యులు. ప్రతీవాళ్లూ బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ అయ్యేందుకే ప్రయత్నించడం సరికాదు. వాళ్ల నుంచి నేర్చుకుని... వారిని మించిన వ్యక్తులుగా ఎదగాలనే లక్ష్యం ఉండాలని చెప్తారు. హార్డ్‌వేర్ రంగంలో వినూత్నమైన మార్పులు తీసుకొస్తామని ఢంకా బజాయించి చెబ్తున్న ఈ కంపెనీ... ఒక కంప్యూటింగ్ డివైజ్‌తో మార్కెట్లోకి అడుగుపెడ్తోంది. వైర్‌లెస్ డిస్‌ప్లే, మౌస్, కీబోర్డ్ మాత్రమే అందులో ఉంటాయి. అయితే ఇవన్నీ సమగ్రమైన వైర్‌లెస్ టెక్నాలజీతో అనుసంధానించడం విశేషం. ప్రస్తుతం ఉపయోగిస్తున్న డెస్క్‌టాప్ పీసీలకు ముగింపు పలకడమే ఈ కంప్యూటింగ్ డివైజ్ లక్ష్యం.

మార్పు మంచి చేసేది మాకే !

ఒక డెస్క్‌టాప్‌లే కాదు... గేమింగ్ కన్సోల్స్, హోం ఎంటర్టెయిన్మెంట్ హబ్‌లను కూడా పూర్తి స్థాయిలో రీస్ట్రక్చర్ చేసేయాల్సిందే అంటోంది చిప్‌స్టర్. క్యూబికల్ డిజైన్‌తో వీరు రూపొందించిన మోడల్ ఇప్పటికే లక్షలాది మందిని ఆకట్టుకుంది. అనేక రివార్డులు అందుకుంది. అదే సమయంలో ప్రామిసింగ్ స్టార్టప్‌గా ఖ్యాతి కూడా గడించింది. తమ పీసీలను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునేవారు.. చిప్‌స్టర్‌కి ఛేంజ్ అయ్యేలా చేయడమే ఈ కంపెనీ లక్ష్యం. సాధారణంగా కనిపించే భారీ కంప్యూటర్లతో పోల్చితే... ఎంతో సౌకర్యవంతగా ఉన్న ఈ కంప్యూటింగ్ డివైజ్... పూర్తిస్థాయి కమర్షియల్ రిలీజ్ అయితే సంచలనాలు సృష్టిస్తుందనే అంచనాలున్నాయి.


చిన్న పెట్టుబడి, పెద్ద లక్ష్యం

2013 ఏప్రిల్‌లో చిప్‌స్టర్ టెక్నాలజీస్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా భారత్‌లో రిజిస్టరయింది. లక్ష రూపాయల షేర్ కేపిటల్, లక్ష రూపాయల పెయిడప్ కేపిటల్‌తో మొదలైన ఈ కంపెనీ... ఎన్నో సంచలనాలకు నాంది కాబోతోందనే అంచనాలున్నాయి.

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది చిప్‌స్టర్. నెక్స్ట్ జనరేషన్ హార్డ్‌వేర్ ప్లాట్‌ఫాంలు తయారు చేసే రంగంలో ఉంది. దీనికి డైరెక్టర్లుగా నచికేత్ గోపాలరావు, నవనీత్ గోపాలరావు వ్యవహరిస్తున్నారు.


ఇద్దరూ ఇద్దరే

నవనీత్ గోపాలరావు- ఈయన చిప్‌స్టర్ వ్యవస్థాపకులు. ఈయన కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. పదిహేనేళ్ల సుదీర్ఘ అనుభవం గల నవనీత్.. ఎంబెడెడ్ మాడ్యూల్స్, ఆర్‌టీఓఎస్ డెవలప్మెంట్ రంగాల్లో సేవలందించారు. భారత్, అమెరికాలకు చెందిన పలు ఆర్థిక సంస్థల్లోనూ విధులు నిర్వహించారు. ఇక సహ వ్యవస్థాపకులు నచికేత్ గోపాలరావు కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరే. బెంగళూరులోని పలు ఐటీ కంపెనీల్లో 9ఏళ్ల పాటు సేవలందించిన అనుభవం ఉందీయనకు. ఈ సంస్థ సాలిడ్ వర్క్స్, ప్రోఈ, క్యాడ్ కేమ్ రంగాల్లో ఇంటర్న్ షిప్‌లు కూడా ఆఫర్ చేస్తూండడం విశేషం.


ఫ్యూచర్ మాదే

2013లో ప్రారంభమైన చిప్‌స్టర్.. టెక్నాలజీ ఆధారిత పరికరాల తయారీ, పరిశోధన, రూపకల్పనలు చేసే సంస్థ. అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ విషయంలో... సైజులో చిన్నవిగానూ, పర్‌ఫార్మెన్స్‌లో అదరగొట్టేవిగానూ ఉండాలంటుంది చిప్‌స్టర్. వేరబుల్ డివైజ్‌లను కూడా డిజైన్ చేస్తున్నారు. అవసరమైతే భవిష్యత్తులో అప్‌గ్రేడ్ చేసుకునేందుకు వీలుగా అన్ని పరికరాలు తయారు చేయాలంటారు చిప్‌స్టర్ టీం. కార్ ఇన్ఫోటెయిన్మెంట్ నుంచి... హైఎండ్ ఎలక్ట్రానిక్ ఫ్యాషన్ జ్యూవెలరీ వరకూ... అనేక రకాల కాన్సెప్ట్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు చెబ్తున్నారు వీరు. స్థానిక మార్కెట్లలో రిటైల్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేసుకోగలిగే స్థాయికి చేరుకుంటే.. అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నది చిప్‌స్టర్ ఐడియా. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలోనూ తమ సత్తా చాటుతామని ధీమాగా చెబ్తున్నారు.