పోస్టాఫీసే కదాని లైట్ తీసుకుంటే లూటీ చేశారు..!!  

హిమాయత్ నగర్ పోస్టాఫీసులో భారీ అవినీతి

0

పెద్దనోట్ల రద్దుతో పోస్టాఫీసులు దోపిడీకి తెరతీశాయి. రూ. 500,వెయ్యి నోట్లను దొడ్డిదారిన తరలిస్తూ సిబ్బంది లక్షలు వెనకేసుకుంటున్నారు. ఒకపక్క నోట్ల మార్పిడి కోసం సామాన్యులు నానా అగచాట్లు పడుతుంటే.. సందట్లో సడేమియాలా బ్యాంకులు, పోస్టాఫీస్ సిబ్బంది మాత్రం పెద్దనోట్లను బ్యాక్ డోర్ నుంచి తరలించి లక్షలు సామ్ముచేసుకుంటున్నారు. హిమాయత్ నగర్ పోస్టాఫీసులో జరిగిన సీబీఐ దాడుల్లో బయటపడిన అవినీతే అందుకు ఉదాహరణ.

ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం నోట్లు మార్చుకునే ఖాతాదారులు ఐడీ ప్రూఫ్ చూపించాలి. ఆ నిబంధనను అధికారులే తుంగలో తొక్కుతున్నారు. కమిషన్‌కు కక్కుర్తిపడి కొందరు పోస్టాఫీస్ ఉద్యోగులు బడాబాబులకు జేబు సంస్థలుగా మారారు. ఎలాంటి ఆధారాలు లేకుండా లక్షల రూపాయల బ్లాక్ మనీని వైట్ చేసిచ్చారు. ఈ ఆరోపణలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన సీబీఐ హైదరాబాద్ సికింద్రాబాద్ వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల పై దాడులు నిర్వహించింది. ఇప్పటిదాకా జరిగిన రైడ్‌ లో దాదాపు 36 లక్షల రూపాయల అవకతవకలు జరిగాయని సీబీఐ విచారణలో తేల్చింది. ముఖ్యంగా హిమాయత్ నగర్ పోస్టాఫీసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. సీనియర్ సూపరింటిండెంట్ సుధీర్ బాబు, సబ్ పోస్ట్ మాస్టర్ రేవతి, ఆఫీస్ అసిస్టెంట్ రవితేజ ఈ దందాలో కీలక పాత్ర పోషించారని సీబీఐ నిర్ధారించింది. నిందితులపై సెక్షన్ 120బీ, 406, 409, 420, 477ఏ కింద కేసు నమోదు చేశారు.

హిమాయత్ నగర్ పోస్టాఫీసులో నవరంబర్ 8 నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలను సీబీఐ బయటకు తీసింది. నగదు మార్పిడి కోసం ఆర్బీఐ హిమాయత్ నగర్ పోస్టాఫీసుకు 70 లక్షలు కొత్త నోట్లను పంపింది. అయితే అందులో 36లక్షలు రూపాయలను 30 శాతం కమిషన్ ఒప్పందం మీద గుట్టుచప్పుడు బయటకు కాకుండా తరలించారు. హవాలా బ్రోకర్లతో కలిసి పోస్టాఫీసు సిబ్బంది ఈ దందాకు నడిపినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే దానిపై సీబీఐ దృష్టి సారించింది. నగరంలో ఉన్న మిగతా పోస్టాఫీసుల్లో కూడా ఇదే తరహా దాడులు ఉంటాయని, తేడావస్తే తొక్కి నారతీస్తామని సీబీఐ హెచ్చరించింది. పోస్టాఫీసుల్లో సీబీఐ రైడ్ చేయడంతో దేశంలోని అన్ని మెట్రోనగరాల పోస్టాఫీసులు అలర్టయ్యాయి.