108 అత్యవసర సేవలకు అదనపు బలం ఈ ‘కాల్ అంబులెన్స్’

108 అత్యవసర సేవలకు అదనపు బలం ఈ ‘కాల్ అంబులెన్స్’

Tuesday November 10, 2015,

3 min Read

ఎలాంటి ప్రమాదం జరిగినా, అత్యవసర పరిస్థితి ఎదురైనా మనకు టక్కున గుర్తొచ్చేది 108. ఇప్పుడా 108తో ఇంటిగ్రేట్ చేయబడిన ఓ మొబైల్ అప్లికేషన్ ఎలా ఉంటుంది ? కాల్ అంబులెన్స్ పేరుతో ఇప్పటికే ప్లేస్టోర్ లో తన సేవలను అందిస్తోన్న ఈ హైదరాబాద్ స్టార్టప్ వేల డౌన్ లోడ్స్‌తో దూసుకుపోతోంది. దేశంలోనే అత్యంత ప్రఖ్యాత ఎమర్జన్సీ సర్వీసైన 108తో కలసి పనిచేయడం మొదలు పెట్టింది. హెల్త్‌కేర్ స్టార్టప్ అయిన డాక్టర్జ్ డాట్ కామ్ రెండో ప్రాడక్టుగా కాల్ అంబులెన్స్ జనం ముందుకొచ్చింది. ఇన్ఫోసిస్ సీనియర్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ దీనికి ఫౌండర్లుగా ఉన్నారు.

“ 108 వాహనంలో ఎక్కించుకున్నప్పుడు పేషెంట్ కండిషన్ డాక్టర్‌కు ఈ యాప్ ద్వారా తెలుస్తుంది. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత పేషెంట్ పరిస్థితిని త్వరగా విశ్లేషించి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది.” ఉమాశంకర్ కొత్తూరు.

ఉమాశంకర్ కాల్ అంబులెన్స్ ఫౌండర్, సిఈఓ. హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మొబైల్ ఇతర టెక్నాలజీతో సర్వీసు అందించే ప్లాట్ ఫాం మొదటగా ప్రారంభించింది తామేనని అన్నారాయన. గాయపడిన వారికి మరింత మెరుగైన చికిత్స ఇవ్వడంతో పాటు అత్యంత వేగంగా ఎమర్జెన్సీ సేవలను అందించడానికి ఈ కాల్ అంబులెన్స్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.

image


ఈ తరహా సేవలందించడం ఇదే ప్రధమం

'కాల్ అంబులెన్స్' అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని జగదీష్ బాబు విశ్వనాధం అన్నారు. ఆయన ఫౌండర్ సీఓఓ. దేశంలోనే ఎమర్జెన్సీకి కేరాఫ్‌గా ఉన్న 108తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల తమ సేవలు పేషెంట్లకు మరింత చేరువ కానున్నాయన్నారు. పేషెంట్‌కి సంబంధించిన విషయాలు కుటుంబ సభ్యులకు చేరవేయడం సాధ్యపడుతుంది. కుటుంబ సభ్యులు కంగారు పడాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు సమాచారం మొబైల్ యాప్‌లో అప్ డేట్ అయిపోతుంది. యాప్ ఆన్ చేస్తే జీపిఎస్‌తో దగ్గర్లో ఉన్న 108కి సమాచారం అందించడం ఇందులో ఉన్న మరో అద్భుత మైన ఫీచర్. ఇన్సూరెన్స్ లాంటి వివరాలు కూడా ఒకే సింగిల్ బటన్‌తో యాక్సెస్ చేయొచ్చు. ఇలాంటి ఎన్నో రకాల సేవలను 108 ఈఎంఆర్ఐతో అనుసంధానించడం వల్ల మరింత కచ్చిత, విశేషమైన సేవలను అందించడానికి అవకాశం ఉందంటున్నారు విశ్వనాధం.

కాల్ అంబులెన్స్ టీం

ఉమాశంకర్ కొత్తూరు, జగదీష్ బాబు విశ్వనాధం లు దీని వ్యవస్థాపకులు. వీరిద్దరు డైరెక్టర్లుగా ఉన్నారు. వీరితో పాటు ఆన్ రోల్,ఆఫ్ రోల్ లో చాలా మంది పనిచేస్తున్నారు. మరికొన్ని సంస్థల నుంచి దీని కోసం పనిచేసే వారు కూడా ఉన్నారు. ఇదొక సమీకృత వ్యవస్థలా పనిచేయడం వల్ల దేశంలోనే అతిపెద్ద ఎమర్జెన్సీ మొబైల్ సర్వీసు అందించే సంస్థగా అవతరించిందని నిర్వాహకులు చెబ్తున్నారు.

కాల్ అంబులెన్స్ సేవలు

రోడ్ యాక్సిడెంట్, కార్డియక్ అరెస్ట్, న్యూరో స్ట్రోక్, ప్రెగ్నెన్సీ, ఇన్ఫాంట్ కేర్‌లు దేశంలో ఎమర్జెన్సీ సేవల కిందకు వచ్చే సేవల్లో ప్రధానమైనవిగా గుర్తించారు. వీటిని అందించడానికి కాల్ అంబులెన్స్ అవసరం ఎంతైనా ఉందని ఫౌండర్లు చెబుతున్నారు. గోల్డెన్ అవర్‌గా చెప్పే ఆ అత్యంత ఆవశ్యకత కలిగిన గంట సమయం చాలా ముఖ్యమైనది. యాక్సిడెంట్ జరిగిన గంటలోపు పేషెంట్‌ను ఆసుపత్రికి తీసుకెళితే ప్రాణాపాయం నుంచి కాపాడొచ్చు. ఈ సేవలను అందించడానికి ఈ యాప్‌లో జిపిఎస్‌తో దగ్గర్లో ఉన్న 108కి సమాచారం అందుతుంది. దీంతో పాటు ఆసుపత్రులకు కూడా సమాచారం అందిస్తుంది. సాధారణంగా ఏదైనా హెల్త్ సేవ అవసరం అనుకున్నా కాల్ అంబులెన్స్‌ను ఉపయోగించుకోవచ్చు.

image


అవార్డులు

దేశంలోనే అత్యంత ప్రభావశీలమైన యాప్‌గా కాల్ అంబులెన్స్ ను హైసియా(HySEA - హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్) గుర్తించింది. 108 సంస్థ కూడా తనతో ఇంటిగ్రేట్ చేయడానికి ముందుకొచ్చిందంటే అది కూడా ఓ గొప్ప మైలురాయిే. దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్య పదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, అసోం, హిమాచల్ ప్రదేశ్ , చండీఘడ్, రాజస్తాన్, కేరళాతోపాటు డయూడామన్, దాద్రానగర్ హవేలిలో 108 సేవలకు ఈ యాప్ సేవలు ఇంటిగ్రేట్ చేశారు. స్థానిక ప్రభుత్వాలచే గుర్తింపు లభించింది.

కాల్ అంబులెన్స్ ఎకో సిస్టమ్

స్కూళ్లు, కాలేజీలు, కార్పోరేట్ ఆఫీసులు, ఆసుపత్రులను కలసి కాల్ అంబులెన్స్ ఫర్ గ్రూప్స్‌ని ఏర్పాటు చేసింది. వీళ్లతో కమ్యూనిటీని ఏర్పాటు చేసి ఎమర్జెన్సీ సర్వీసులో భాగస్వామ్యం చేస్తున్నారు. తమతో కలసి పనిచేయాలనుకునే వారంతా హెల్త్ ఎట్ కాల్ అంబులెన్స్ డాట్ ఇన్‌లో లాగిన్ అయిపోతే సరిపోతుందని వివరించారు ఉమాశంకర్. భవిష్యత్తులో మరిన్ని కమ్యూనిటీలు ఏర్పాటు చేయడంలో తాము తోడ్పడగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

“ఇంటిగ్రేటెడ్ సర్వీసును తయారు చేసే క్రమంలో కాల్ అంబులెన్స్ భాగస్వామి కావడం ఆనందంగా ఉందని ఫౌండర్లు ముగించారు.”