ఆఫ్రికన్ బార్బీడాల్ పుట్టుక వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ..

1

ఒక్కోసారి చిన్న పిల్లల సందేహాలు భవిష్యత్తులో సంచలనాలకు దారితీస్తాయి. వాళ్ల అనుమానాలు పెద్దవాళ్లను తీవ్ర మానసిక సంఘర్షణలోకి నెట్టేస్తాయి. ఆఫ్రికన్ బార్బీకథ కూడా అలాంటిదే. ఈ బొమ్మంత అందంగా నేనెందుకు లేను డాడీ అని ఆ పాప అడిగిన ప్రశ్న ఇవాళ లక్షల డాలర్ల బిజినెస్ అయింది. ఈ టాయ్ రంగు నాలా ఎందుకు లేదు పప్పా అని అడిగిన క్వశ్చన్.. ప్రపంచ వ్యాప్తంగా బార్బీ ముఖచిత్రాన్నే మార్చేసింది.

నిజమే. పిల్లలు ఆడుకునే బార్బీ బొమ్మలన్నీ ఆల్మోస్ట్ తెల్లగానే ఉంటాయి. ఏ క్యారెక్టర్ చూసినా మిల్కీ స్కిన్. ఆ మాటకొస్తే ప్రపంచంలో 30 శాతం మంది మాత్రమే తెలుపు రంగులో ఉంటారు. మిగతా 70 శాతం బ్లాక్, బ్రౌన్ స్కిన్. అయినా సరే, థర్టీ పర్సెంట్ వైట్ టోనే భూమండలాన్ని డామినేట్ చేస్తోంది.

నైజీరియాలోని ఒకోయా ప్రాంతంలోని టౌఫిక్ అనే వ్యక్తి, తన కూతురు అడిగిన ప్రశ్నకు స్థాణువైపోయాడు. ఈ టాయ్స్ అన్నీ మనలాగా ఎందుకు లేవు డాడీ అని అడిగింది. ఆ ప్రశ్నకు యథాలాపంగా ఏదో ఒక సమాధానం ఇవ్వచ్చు. కానీ టౌఫిక్ అలా మానిపులేట్ చేయాలనుకోలేదు. నిజమే తన కూతురు అడిగిన ప్రశ్న చాలా తీవ్రమైంది. భిన్న జాతులున్న నైజీరియాలో ఇదొక సున్నితమైన అంశం.

ప్రపంచ వ్యాప్తంగా తెల్లతోలునే ఎందుకు ఆరాధించాలి. ఎందుకు అభిమానించాలి. బొమ్మయినా ఇంకేదైనా..! తమకంటూ ఒక ఐడెంటిటీ ఉండొద్దా? అట్లీస్ట్ నైజీరియన్ కిడ్స్ మాదిరిగా ఒక్క బొమ్మయినా ఎందుకు లేదు? టౌఫిక్ ఆలోచనల్లో అంతర్మథనం మొదలైంది. ఆ సంఘర్షణల్లోంచే క్వీన్ ఆఫ్ ఆఫ్రికా నల్లగా నిగనిగలాడుతూ అద్దాల అల్మరాల్లో నిలబడింది. టాల్, షార్ట్, స్కినీ, కర్వీ, షార్ట్ హెయిర్డ్, లాంగ్ హెయిర్డ్.. సోకాల్డ్ బార్బీ బొమ్మల ముఖచిత్రమే మారిపోయింది.

ఆలోచన అద్భుతం.. ఆచరణ ఇంకా అద్భుతం.. ఆఫ్రికన్ బొమ్మ తమజాతి వారందరికీ కనెక్ట్ అయింది. మిల్కీ స్కిన్ వెల్లువలో పడి కొట్టుకుపోతున్న ప్రపంచానికి కాఫీటోన్ మాంచి కిక్ ఇచ్చింది. 2007లో టాయ్స్ బిజినెస్ మొదలు పెట్టాడు. మొదట్లో అందరూ పెదవి విరిచారు. ఇవేం బొమ్మలు నల్లగా ఉన్నాయి అని షాప్ ఓనర్లు వాటిని తీసుకోడానికి తటపటాయించారు. వాళ్లను కన్విన్స్ చేయడానికి రెండేళ్లు పట్టింది. ఎన్నో రకాల క్యాంపెయిన్లు చేసిన తర్వాత, ప్రాడక్ట్ మార్కెట్లోకి వచ్చింది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

బ్రైట్ వైబ్స్ ఆఫ్రికా లెక్కల ప్రకారం.. ఇప్పుడు క్వీన్స్ ఆఫ్ ఆప్రికా బొమ్మలు ప్రపంచ వ్యాప్తంగా బార్బీ కంటే ఎక్కువ అమ్ముడవుతున్నాయి. అంతెందుకు అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనూ ఆఫ్రికన్ బార్బీదే డామినేషన్. ఏ షాపులో చూసినా బ్లాక్ బార్బీసే ముచ్చట గొలుపుతున్నాయి.

ఇక్కడ ఇంకోమాట.. ఆఫ్రికన్ బార్బీ బొమ్మల తయారీలో స్త్రీలకే పెద్దపీట వేశాడు టౌఫిక్. వాళ్లకు ఆర్ధికంగా చేయూత అందివ్వడం కోసం ప్రత్యేకంగా స్థానిక మహిళలకే అవకాశం ఇచ్చాడు.  

Related Stories